చిత్తూరు

నేటి నుంచి జిల్లాలో మంజునాథ్ కమిషన్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 17: కాపులను బిసి కులాల్లో చేర్చడానికి జస్టిస్ కె ఎల్ మంజునాథ్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన కమిషన్ ఆదివారం నుంచి 4 రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె ఎల్ మంజునాథ్ తోపాటు సభ్యులు ప్రొఫెసర్ శ్రీ వేంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, మెంబర్ సెక్రటరీ ఎ.కృష్ణమోహన్, స్పెషలాఫీసర్ సి.రమేష్‌కుమార్, సీనియర్ ఆఫీసర్ ఎస్.గిరిధర్‌లతో పాటు 7 మంది సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి భవనంకు చేరుకుంటారు. 6 గంటలకు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతారు. అక్కడ నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకొని ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. 9నుంచి 10 గంటల వరకు టిటిడి ఇ ఓ, ధర్మకర్తల మండలి సభ్యులతో సమావేశమై బిసి రిజర్వేషన్లపై చర్చిస్తారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మునిసిపల్ కార్పొరేషన్‌లో బలిజ కాపుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పద్మావతి అతిథిభవనం చేరుకొని జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా పోలీసు అధికారులతో సమావేశమై కుల ధ్రువీకరణపత్రంకు సంబంధించి సమస్యలపై చర్చిస్తారు. అలాగే స్మార్ట్ సర్వేపై కూడా చర్చచేయనున్నారు. 20వ తారీఖు తిరిగి తిరుపతి మునిసిపల్‌కార్యాలయ సమావేశ మందిరంలో బలిజ కాపుల నుంచి వినతులను స్వీకరిస్తారు. సాయత్రం 5.30కు తిరుపతి పద్మావతి అతిథి భవనం చేరుకొని రాత్రి బసచేస్తారు. 21న ఫీల్డు విజిట్ చేస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
* జె ఇ ఓ శ్రీనివాసరాజు వెల్లడి
తిరుమల, సెప్టెంబర్ 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అక్టోబర్ 3నుంచి ప్రారంభంకానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశం నలుమూలల నుంచి వాహనాల్లో వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు జె ఇ ఓ శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం టిటిడి ఇంజనీరింగ్, నిఘా, భద్రతాధికారులతో కలిసి ఆయన తిరుమలలోని బాట గంగమ్మ గుడి, నిర్మాణంలో ఉన్న సేవా సధన్, ఇతర పార్కింగ్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సులను జి ఎన్ సి టోల్‌గేట్ నుంచి రింగ్‌రోడ్డుమీదుగా ఇతర వాహనాలను ఎడమవైపురోడ్డులోకి మళ్లిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న శ్రీవారి సేవాసదన్ ప్రాంగణంలో, సేవాసదన్ -2 పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చదునుచేసి వాహనాల పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. బాట గంగమ్మగుడి దారిని శుభ్రంచేసి ఆ మార్గంలో వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు పంపుతామన్నారు. అన్న ప్రసాద భవనం ముందుబాగంలో ఓవైపు నుంచి వాహనాలను రింగ్‌రోడ్డుకు మళ్లించి తిరుపతికి వెళ్లేలా చర్యలు చేపడుతామన్నారు. శిలా తోరణం, రాం భగీచ బస్టాండ్ వద్ద ఉన్న క్వార్టర్స్ సమీపంలో ఆక్టోపస్ భవనం కోసం కేటాయించిన స్థలంలో పార్కింగ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలను పరిశీలించి గతంలో కన్నా ఎక్కువ వాహనాలను నిలిపేవిధంగా చర్యలు చేపడతున్నామన్నారు. 4 మాడ వీధుల్లో 5 చోట్ల మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. గరుడ సేవ నాడు గ్యాలరీల్లో అన్నప్రసాదం, తాగునీరును అందజేస్తామని, అయితే వాటిని వృధా చేయకుండా భక్తులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. అయన వెంట టిటిడి ఎస్ ఇ - 2 రామచంద్రారెడ్డి, వి ఎస్ ఓ రవీంద్రారెడ్డి ఉన్నారు.

యాళి వాహనంపై విహరించిన గణనాథుడు
ఐరాల, సెప్టెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం వరసిద్ధి వినాయకుడు యాళి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈకార్యక్రమానికి కీర్తి శేషులు నరసింహారెడ్డి అండ్ సన్స్ అగరంపల్లి, సుబ్బారెడ్డి అండ్ సన్స్, దేవస్థానం వారిచే ఉభయదారులుగా వ్యవహరించారు. ఈసందర్భంగా ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకంచేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా అలంకార మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు పూజలు చేసారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకు వచ్చి యాళి వాహనంపై ఉంచి భాజా భజంత్రీలతో కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని వారివారి మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమంలో ఇఒ పూర్ణచంద్రరావు, ఎసి వెంకటేష్, ఎఇఒ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా విఘ్ననాథుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్నారు. ఈ కార్యక్రమానికి కీర్తిశేషులు రాజమ్మ, రాజశేఖర్‌నాయుడు కుమారులు ఇంద్రసేననాయుడు అండ్ బ్రదర్స్ బొమ్మసముద్రం వారు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

విదాదాల జోలికి వెళ్లకండి
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 17: వివాదాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు సామరస్య ధోరణితోవ్యవహరించాలని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టిడిపి కార్యకర్తలకు హితవు పలికారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు సీనియర్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని, అందువల్ల వివాదాల జోలికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఏవైనా సమస్యలు ఎదురైతే నాయకుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల్లాగా వివాదాల జోలికి వెళ్తే పార్టీకి చెడ్డపేరువస్తుందని తెలిపారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని అమలుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరికొన్ని పథకాలు త్వరలో ప్రారంభమవుతాయని, వాటిని కూడా పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకొని ప్రజల సానుభూతిని పొందడానికి ప్రయత్నించాలని తెలిపారు. వివాదాలు రాకుండా నాయకులు కూడా చొరవతీసుకోవాలని, పరిష్కారాన్ని వెంటనే చూపాలని సూచించారు. వివాదాలకు పాల్పడే వారిపై పార్టీ నాయకులు చర్యలు తీసుకుంటారని, అటువంటి అవకాశాన్ని రానివ్వద్దని చెప్పారు. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, పనులపై దృష్టిపెట్టాలే తప్ప వివాదాల జోలికి వెళ్లకూడదన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీల అధ్యక్షులు కామేష్, మురళినాయుడు, పాలసొసైటీ అధ్యక్షుడు మునిరాజ నాయుడు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చెంచయ్యనాయుడు, మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా
మొక్కలు నాటిన బిజెపి నాయకులు
తిరుపతి, సెప్టెంబర్ 17: తిరుపతి రూరల్ మండలం, శెట్టిపల్లి పంచాయతీలోని మంగళం గ్రామంలో స్థానిక పద్మావతి నగర్ నందు బిజెపి నాయకులు దండు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు కె.శాంతారెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు చంద్రారెడ్డి విచ్చేశారు. శాంతారెడ్డి మాట్లాడుతూ నేడు చిన్నాచితక నాయకులు సైతం పెద్ద ఎత్తున ఆర్భాటంగా ఫ్లెక్సీలు కట్టుకొని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే దానికి భిన్నంగా మన భారత ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా కాకుండా కేవలం సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువ కావాలని కోరుకోవడం మన బిజెపి కార్యకర్తలకు గర్వకారణమన్నారు. చంద్రారెడ్డి మట్లాడుతూ చెట్లునాటడమే కాకుండా ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సక్రమంగా పెంచాలని కోరారు. ఈకార్యక్రమంలో లక్ష్మణ్, విశ్వనాథ్, కట్టమంచి చంద్రబాబు, విజయ్‌కుమార్, సుబ్రహ్మణ్యం గౌడ్, సుబ్రహ్మణ్యం యాదవ్, పొనగంటి భాస్కర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నగర కమిటీ ఆధ్వర్యంలో
ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా భారతీయ జనతాపార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు సేవా దివస్ కార్యక్రమం చేయమని ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నవజీవన్ ట్రస్టు అధ్యక్షులు శ్రీ్ధరాచారిని, ప్రభుత్వ ఉద్యోగి, ప్రముఖ సేవాతత్పరుడైన కోటేశ్వరరావును సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి కమిటీ ఆధ్వర్యంలో బిజెపి సీనియర్ నాయకులు ఎం. ఆర్ రాజ నవజీవన్ ట్రస్టుకు రూ.5వేలు విరాళం ప్రకటించారు. రాబోవురోజుల్లో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సామంచి శ్రీనివాస్, కె. అజయ్‌కుమార్, ఎం. ఆర్ రాజ, మోహన్, శ్రీనివాస యాదవ్, సుబ్బుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై విహరించిన కలిగిరి వేంకటేశ్వరస్వామి
పెనుమూరు, సెప్టెంబర్ 17: మండలంలోని స్వయంభువుగా కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకన్న ఆలయంలో పెరటాసి ఉత్సవాల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటి శనివారం స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు ఘనంగా చేపట్టారు. దీంతో నూతన పాలక మండలి చైర్మన్ ఈశ్వర్‌ప్రసాద్ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణ సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలకు వేధికను కూడా ఏర్పాటు చేసారు. తొలుతగా స్వామివారికి ఆలయ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొదటి శనివారం భాగంగా 12గంటల ప్రాంతంలో ఆలయ మూలవిరాట్ శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి భక్తులు తెచ్చిన వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకన్న గరుడ వాహనంపై ప్రతిష్టించి మేళ తాళాల మధ్య బాణా సంచా పేల్చుతూ ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఉభయదారులుగా పూతలపట్టుకు చెందిన సుబ్బారెడ్డి, శ్రీరాములశెట్టి, మొరకండిగకు చెందిన మునస్వామినాయుడు, చిన్నస్వామినాయుడు, రామచంద్రనాయుడు, వెంకటప్పనాయుడు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఘనంగా ఊంజల్ సేవ
పెరటాసి ఉత్సవాల్లో భాగంగా కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి ఘనంగా ఊంజల్ సేవ కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసారు. అనంతరం 2గంటల ప్రాంతంలో స్వామివారికి ఊంజల్ సేవ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా మొదటి శనివారం కావడంతో కలిగిరి కొండ సమీపంలో ఉన్న లంకిపల్లి, మఠంపల్లి, వాసుదేవాపురం, సిఆర్ కండిగ గ్రామస్థులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరితోపాటు ఎంపిపి హరిబాబునాయుడు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసారు. వీరికి ఆలయ సాంప్రదాయబద్దంగా ఆలయ చైర్మన్ ఈశ్వరప్రసాద్, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందచేసారు. ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్ నాయుడు, హేమాద్రి, పాలక మండలి సభ్యులు ఆనందనాయుడు, కేశవులు, కార్యనిర్వహక అధికారులు శంకరయ్య, జయరామిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యశర్మ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఘోరమైన పరిపాలన
* పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ధ్వజం

పుంగనూరు, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ఘోరమైన పరిపాలన కొనసాగుతూ ఉందని రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజంమెత్తారు. శనివారం ఆయన పుంగనూరు మున్సిపాలిటి, మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేతగాని పరిపాలన సాగిస్తున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చారని, 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీలు గుప్పించడంతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రుణాలు మాఫీ చేస్తారని ప్రజలు నమ్మి ఓట్లువేస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. రైతులకు ఉపయోగపడే ఒక పథకం కూడా ప్రవేశ పెట్టలేదన్నారు. చిత్తూరు జిల్లాలో ఎండిపోతున్న వేరుశెనగ పంటకు రెయిన్‌గన్స్‌తో నీరు అందించింది ఇన్‌పుడ్ సబ్సిడి ఎగవేత కోసమేనన్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. చంద్రబాబు చేతగాని తనంతో తమ పార్టీపై నిందలు మోపడం సరికాదన్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల ప్రజలకు రాజధాని నిర్మాణం జగన్‌మోహన్‌రెడ్డికి ఇష్టంలేదని తమ నాయకునిపై నిందలు మోపడం సబబుకాదన్నారు. రాజధాని నిర్మాణం చంద్రబాబుతో కాదని అదేప్రాంతంలో నీతి,నిజాయతీతో రాజధాని నిర్మాణం చేపడుతామని తెలిపారు. ప్రస్తుతం భూములు కొనుగోలుకు పాసుపుస్తకాలు లేకున్నా రిజిస్ట్రేషన్ అవుతాయని జీవో విడదల చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి బాబు రూ. 3వేలతో చేతులు దులుపుకున్నారన్నారు. రైతులకు బంగారంపై రుణాలు ఇవ్వదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాట ధర లేక పెట్టుబడులకు నగదు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. 2019లో తమ పార్టీకి రాష్ట్ర ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు. ఈకార్యక్రమంలో నేతలు పెద్దిరెడ్డి, వెంకటరెడ్డియాదవ్, నరసింహులు, రామచంద్రారెడ్డి, నాగభూషణం, రెడ్డెప్ప, షరీప్, వరదారెడ్డి, ముత్యాలు, రాజేష్, హేమంత్, కుమార్ పాల్గొన్నారు.

విద్యార్థి ఆత్మహత్య
మదనపల్లె, సెప్టెంబర్ 17: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మదనపల్లెలో చోటుచేసుకుంది. రెండవ పట్టణ ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు కథనం మేరకు కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా చింతామణి తాలూకా గౌనిపల్లె మండలం బైరగానిపల్లెకు చెందిన నరసింహులు, పుష్పలతకు జోష్న, ఇహిత, వేణుగోపాల్ సంతానం. మదనపల్లె పట్టణంలోని ప్యారానగర్‌లో ఓగదిలో ఉండి చదువుకుంటున్నారు. జోత్స్న ఇంటర్ మొదటి సంవత్సరం, ఇహిత 8వ తరగతి హోప్ హైస్కూల్, వేణుగోపాల్ 9వ తరగతి జడ్‌పి హైస్కూల్‌లో చదువుతున్నారు. వేణుగోపాల్ గత 15రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. ఈనేపథ్యంలో శనివారం అక్కచెల్లెళ్లు పాఠశాలకు వెళ్లగానే ఇంటికొచ్చిన వేణుగోపాల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన రెండవ పట్టణ ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

భరతముని ఆర్ట్స్ 29వ ఫిల్మ్ అవార్డ్స్ ఫెస్టివల్
*ఉత్తమ చిత్రం కంచె, క్రిష్ - ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్
మదనపల్లె, సెప్టెంబర్ 17: భరతముని ఆర్ట్స్ అకాడమీ 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులకు, సాంకేతిక వర్గానికి అవార్డులను శనివారం వ్యవస్థాపకులు ఆర్ మునిక్రిష్ణారెడ్డి వివరించారు. స్థానిక భరతముని ఆర్ట్స్ కార్యాలయంలోవారు స్థానిక విలేఖరులతో మాట్లాడారు. కేవలం రన్నింగ్, బాక్సాఫీస్ హిట్ మొదలైన విషయాలనే కాకుండా చక్కని కళాత్మక విలువలు, సహజ చిత్రాలు, సామాజిక శ్రేయస్సు, తెలుగు సంప్రదాయం, జాతీయ సమైక్యత మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకుని అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. అకాడమీ సభ్యులతో కూడిన కమిటీ న్యాయనిర్ణేతలుగా, కమిటీ ఛైర్మన్ విశ్రాంత హోంశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ పివి నాయుడు, సభ్యులుగా అంబికాక్రిష్ణ, పి ప్రభాకర్‌రెడ్డి, మండలికి సీతారాఘవరావు, కె మద్దిరెడ్డి, టి సిద్ధారెడ్డి, బి సతీష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. ఉత్తమ చిత్రం కంచె, క్రిష్, ఉత్తమ సందేశాత్మక చిత్రం దాగుడుమూతల దండాకోర్, ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం సూర్య వర్సెస్ సూర్య, ఉత్తమ హస్య చిత్రం భలేభలేమగాడివోయ్, ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి, ఉత్తమ విశేష ప్రజాదరణ చిత్రం బాహుబలి, ఉత్తమనటుడు రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంశా నటుడు వరుణ్‌తేజ్, ఉత్తమ నటి అనుష్క, ఉత్తమ విలన్ తనికెళ్ళ భరణి, ఉత్తమ హాస్య కథానాయకుడు నాని, ఉత్తమహస్య నటుడు బ్రహ్మానందం, ఉత్తమ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ గాయని చిత్ర, ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఉత్తమ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్‌రావు, ఉత్తమమాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ఉత్తమ గేయరచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, ఉత్తమ బాలనటుడు మాస్టర్‌ప్రేమ్, ఉత్తమ బాలనటి బేబిసారాఅర్జున్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలలో సినీనటుడు శివారెడ్డి మిమిక్రీ ప్రదర్శన, శ్రావణి సిస్టర్స్, వౌనికా బృందంచే సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కాలినడకన వెళ్లే భక్తులకు ఓలిని నొప్పి మందులు పంపిణీ
తిరుపతి, సెప్టెంబర్ 17: తిరుమల శనివారాలు ప్రారంభం కావడంతో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఓలిని మందుల సంస్థ శనివారం టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎస్ ఐ శ్రీనివాసులు చేతుల మీదుగా భక్తులకు మందులు పంపిణీ చేసింది. ఈకార్యక్రమంలో తిరుపతి 41వ వార్డు అధ్యక్షుడు సోంపల్లి నిరంజన్, 42వ వార్డు అధ్యక్షుడు గురవయ్యయాదవ్ పాల్గొన్నారు. సుమారు 10వేల మంది భక్తులకు మందులు పంపిణీ చేసినట్లు ఆసంస్థ నిర్వాహకులు తెలిపారు.

అస్తవ్యస్తంగా ప్రజాసాధికార సర్వే
* 26లోగా వేలి ముద్రల పక్రియ పూర్తికావాలని కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, సెస్టెంబర్ 18: మానవ వనరులు సక్రమంగా వినియోగించుకొని, అవినీతి రూపుమాపి సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రజాసాధికార సర్వే అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో పలుచోట్ల ఎన్యుమరేటర్ల వల్ల ఈ సర్వే తీరే మారిపోతోంది. ముందస్తు ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల కొందరు ఎన్యుమరేటర్లు రచ్చబండల వద్దనే ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోతోంది. ఎన్యుమరేటర్లు ప్రజాసాధికార సర్వే కోసం ట్యాబ్‌తో గ్రామాలకు వెళ్లి అక్కడ కుటుంబ యజమాని నుంచి వివరాలు సేకరించి ట్యాబ్‌లో నమోదు చేసుకొని, అతని వేలిముద్రలు తీసుకొని వాటిని ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయడం పలుచోట్ల జరిగింది. వాస్తవంగా కుటుంబంలోని యజమాని నుంచి అందరి వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి వేలిముద్రలు, పలు రకాల గుర్తింపుకార్డుల నెంబర్లను సేకరించి ఆ కుటుంబం మొత్తం వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అయితే అనేకచోట్ల ఎన్యుమలేటర్లు కుటుంబలోని ఒకరిద్దరి వేలిముద్రలు మాత్రమే సేకరించి సర్వే కానిచ్చారు. దీంతో చాలావరకు వివరాలను సమోదు చేయకనే ప్రక్రియను పూర్తిచేశారు. మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉంటే, ఇళ్ల వద్దనే ఉన్న వారితోనే సర్వే పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 9.63 లక్షల కుటుంబాలు సర్వే చేస్తే, అందులో 1.37 లక్షల మంది కుటుంబాల నుంచి మాత్రమే పూర్తి వివరాలతో పాటు వేలిముద్రలను సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన సుమారు ఏడులక్షల కుటుంబాల నుంచి మరోమారు అందరి వేలి ముద్రలతోపాటు ఇతర వివరాలు సేకరించాల్సి ఉంది. అలాగే సుమారు లక్ష కుటుంబాలకు సంబంధించి అసలు వేలిముద్రలే సేకరించలేదు. దీంతో తిరిగి అందరి వేలిముద్రలతో పాటు సమగ్ర వివరాలనే సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ సర్వే వల్ల రానున్న రోజుల్లో మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులందరూ విధిగా ఈ నెల 26వ తేదీలోగా వేలిముద్రలు సమోదు చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. తమ పరిధిలోని ఎన్యుమలేటర్ వద్ద ప్రతిఒక్కరూ వేలిముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలని తెలిపారు. అందరూ ఈ సర్వేలో పాలుపంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఉత్పత్తులకు హక్కులు పొందితేనే విలువ
* మహిళా పారిశ్రామికవేత్తలకు మంత్రి బొజ్జల సూచన
తిరుపతి, సెప్టెంబర్ 18: మహిళలు తాముచేసే ఉత్పత్తులకు హక్కులు పొందినపుడే వాటి విలువలు పెరుగుతాయని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ ఇండస్ట్రీస్ ఆఫ్ చిత్తూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో కేంద్ర సూక్ష్మ, మధ్య ఔత్సాహిక వ్యాపారస్తుల సహకారంతో అవగాహన సదస్సు సావేరి సెమినార్ హాల్‌లో జరిగింది. ఈ ఒక్కరోజు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బొజ్జలగోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని, మహిళా సాధికారత సాధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పం అన్నారు. ఈ క్రమంలో మహిళలు తాము చేసే ఉత్పత్తులకు ఐపి ఆర్ హక్కులు పొందాలన్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మనం ఎన్నో కొత్త విషయాలను కనుగొని వాటిని వ్యాపారంగా మలచుకొంటున్నాం కానీ దాని మీద హక్కులు తెచ్చుకోవడం తెలియక పోవడం బాధాకరమన్నారు. ఈక్రమంలో అలాంటి విషయాల మీద అవగాహన కల్పించడానికి మహిళా విశ్వవిద్యాలయం కృషి అభినందనీయమని తెలిపారు. ఇంటలెక్చువల్ ప్రొపర్టీ రైట్స్ ( ఐ పి ఆర్) అనుమతి పొందడం వ్యవసాయ, పారిశ్రామిక రంగ ఉత్పత్తులకు ఎంతో అవసరమని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య దుర్గ్భావాని అన్నారు. ఉపకులపతి ఆచార్య వి. దుర్గ్భావాని ఇంటిలెక్చువల్ ప్రొపర్టీ రైట్స్ గురించి మహిళా వ్యాపారవేత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పసుపు, మన తులసి మీద విదేశీయులు పరిశోధనలు చేసి పేటెంట్లకు అనుమతులు పొంది అవి తమ ఉత్పత్తులుగా ముద్ర వేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా జరగకుండా ఉండాలంటే మనకు ఐ ఆర్ ఆర్ మీద అవగాహన చాలా అవసరమని, అందుకు సహకరించిన ఎం ఎస్ ఎం మిసిస్ట్రీని, బిజినెస్ డిపార్ట్‌మెంట్ వారిని అభినందించారు. రిజిస్ట్రార్ ఆచార్య పి. విజయలక్ష్మి మనం ఎన్నో పరిశోధనలు, పరిష్కరణలు చేస్తాం కానీ దాని డాక్యుమెంటేషన్‌పై జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఐపి ఆర్ అనుమతులు కోల్పోతున్నామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ప్రతి చిన్న దానికి అనుమతి పొందితే మంచిదన్నారు. డాక్టర్ శ్రీలక్ష్మి ఐపి ఆర్ పాత్ర గురించి వివరించారు. ఈకార్యక్రమంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన మహిళావ్యాపారవేత్తలు పాల్గొన్నారు.