డైలీ సీరియల్

వ్యూహం-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్త చెయ్యి పట్టుకుని బాత్‌రూము వైపు తీసుకెళ్లింది.
‘‘మీ ఉపన్యాసాలు తరువాత.. ముందు స్నానం చెయ్యండి’’ అందామె.
‘‘నేను మాట్లాడితే ఉపన్యాసం.. నువ్వు మాట్లాడితే తేనెలూరే తియ్యటి మాటలు!’’ వెక్కిరిస్తూ అన్నాడాయన.
బాత్‌రూములోనుంచి వాళ్ళ మాటలు విన్పిస్తూ వున్నాయి.
‘‘వీపు రుద్దు’’ అన్నాడు మాధవ.
తలుపు మూసేసింది రాధమ్మ.
***
కారులో ద్రాక్షారామం చూడటానికి బయల్దేరారు.
‘‘ఎప్పుడో చిన్నప్పుడు అమ్మా నాన్నలతో కలిసి వెళ్లి చూడటమే! మళ్లీ ఇప్పుడు నీతో కలసి చూసే అవకాశం కలుగబోతోంది.. వచ్చేవారం అంతర్వేది వెళ్దాం... ఆ డ్రైవ్ చాలా బాగుంటుంది... కోనసీమ అందాలు తనివితీరా చూడొచ్చు! ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్లినా అద్భుతమైన చారిత్రక కట్టడంలా, శిల్ప విన్యాసంతో ఉట్టిపడే దేవాలయంలా, కంటికి ఇంపుగా కన్పించే ప్రకృతి దృశ్యాలు.. రియల్లీ ఇండియా ఈజ్ ఇన్‌క్రెడిబుల్!’’ అన్నాడు నిశాంత్ సావేరితో.
ఆలయం దగ్గర కారు పార్క్ చేసి ఆలయ ప్రాకారం వైపు నడిచారు వాళ్ళిద్దరూ.
రోడ్డుమీద కారులో వెళ్తున్న చార్లెస్ వాళ్ళిద్దరి చూశాడు.
సడన్‌గా కారు రోడ్డు పక్కన ఆపాడు.
‘‘ఆ అమ్మాయే! వాడే నన్నుకొట్టింది’’ పెద్దగా అరిచాడు చార్లెస్, చేతితో వాళ్ళిద్దరినీ చూపిస్తూ.
ఛార్లెస్ పెద్దగా అరిచేసరికి వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరూ విండో గ్లాసు కిందకు దించి ఆలయంలోకి వెళ్తున్న నిశాంత్, సావేరిని చూశారు.
‘‘మన బాస్ చెప్పాడని నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి బలాత్కారం చెయ్యబోయాను. ఆ కుర్రాడు వచ్చి నామీదపడి వొళ్ళు హూనం చేశాడు. పోలీసులకు అప్పగించాడు.
కారులో కూర్చున్న స్నేహితులకు వాళ్ళు ఎవరో చెప్పాడు.
ఛార్లెస్‌ను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్తుంటే అతను తప్పించుకుని పారిపోవడానికి సహకరించింది వాళ్లిద్దరే.!
‘‘ఇప్పుడు ఏం చేద్దాం?’’’ అడిగాడు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి.
ఓ స్కెచ్ వేశాడు ఛార్లెస్.
‘‘వాళ్ళిద్దరూ ఆలయంలో నుంచి బయటకు వచ్చారు.. మీ ఇద్దరిలో ఒకడు ఆ అమ్మాయి భుజం గట్టిగా రాసుకుంటూ వెళ్తాడు.. ఆ అబ్బాయికి కోపం వచ్చి మీ మీద తిరగబడతాడు.. ఈ గందరగోళం మధ్య ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్ళి కారు ఎక్కించుకుని ఇక్కడనుంచి ఉడాయిస్తాను’.
ఆ ప్లాను వాళ్ళకు నచ్చలేదు..
‘‘మేం ఆ కుర్రాడితో గొడవ పడుతున్నప్పుడు యాత్రికులకు కోపం వచ్చి మా ఇద్దరిని చుట్టుముట్టి చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. మరో స్కెచ్ వెయ్యి!’’ అన్నాడు ఛార్లెస్ స్నేహితుడు.
రెండు నిముషాలు ఆలోచించాడు.
‘‘సర్లే.. ఓ పని చెయ్యండి! నేనే ముందు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాను. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ‘‘ఈ అమ్మాయి మా మేనకోడలు. పెళ్లిపీటలమీద నుండి ఈ కుర్రాడు లేపుకు వచ్చాడు.. మా అమ్మాయిని వీడు పెళ్లిచేసుకుంటానని మాతో ఒక్కమాట చెప్పలేదు.. ఆ కుర్రాడిని గూర్చి మేం విచారించాం! వాడికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లిచేసుకున్న ముగ్గురిని వ్యభిచార గృహాలకు అమ్మేశాడు.. ఈ అమ్మాయికి ఎవరితో పెళ్లిచేయాలో తల్లిదండ్రులే నిర్ణయిస్తారు!’’ అని చెబుతాను. నా మాటలు అందరూ నమ్ముతారు.. ఆ పిల్లను తీసుకెళ్లడానికి మనకు సహకరిస్తారు.. నా మాటలకు మీరు వంత పాడండి!’’
రెండో ప్లాను వాళ్ళిద్దరికీ నచ్చింది.
కార్లోనే కూర్చుని నిశాంత్, సావేరి ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూస్తూ ఉండిపోయారు వాళ్ళ ముగ్గురు.
అదే సమయంలో నాలుగు పోలీస్ వ్యాన్‌లు, జీప్‌లు అక్కడకు వచ్చి ఆగాయి.
పదిహేను మంది పోలీసులు వెహికిల్స్ దిగి బూట్లు టకటకలాడిస్తూ లాఠీలు జుళిపిస్తూ హడావుడి చెయ్యడం మొదలుపెట్టారు.
జిల్లా ఎస్పీ చార్లెస్ దగ్గరకు వచ్చాడు.
‘‘ఎవర్రా మీరు? కారు ఇక్కడ ఎందుకు ఆపారు?’’ అన్నాడు ఎస్పీ చేతిలోని స్టిక్‌తో కారు అద్దాన్ని మోదుతూ.
‘‘మా బంధువులు ఆలయంలోకి వెళ్లారు సార్.. వాళ్ళను ఎక్కించుకుని వెళ్లిపోతాం!’’ అన్నాడు చార్లెస్.
కారులో వున్న ముగ్గురినీ పరీక్షగా చూచాడు.
‘‘ఇది ఏ ఆలయమో తెలుసా నీకు?’’ అడిగాడు ఎస్పీ.
నీళ్ళు నమిలారు కార్లో కూర్చున్న ముగ్గురూ.
వెనుక కూర్చున్న ఇద్దరికి ఛార్లెస్‌మీద గొంతు వరకు కోపం వచ్చింది. కొబ్బరి నీళ్ళకోసమో, సిగరెట్ల కోసం ఆగామని చెబితె సరిపోయేది. అనవసరంగా ఏదో మాట్లాడి ఇరుక్కుపోయాం! పోలీసువాళ్ళకు తమ వైపు పరీక్షగా చూడటానికి ఎక్కువ సమయం ఇవ్వగూడదు. ఆ పోలీసు ఆఫీసర్ని చూడగానే కారు స్టార్ట్ చేసి వెళ్లిపోయి వుంటే బాగుండేది’’ అనుకున్నాడు.
సమాధానం చెప్పకుండా వౌనంగా వుండిపోయిన వాళ్ళవైపు తదేకంగా చూశాడు ఎస్పీ! పెరిగిన గడ్డాల, వాళ్ళు వేసుకున్న గళ్ళ చొక్కాలు, నోరు విప్పగానే వచ్చిన బ్రాంతీ వాసన ఎస్పీ అనుమానాలను బలపరిచాయి.
కనుసైగ చేయగానే సర్కిల్ ఇన్స్‌పెక్టర్, పోలీసులు దగ్గరకు వచ్చి నిలబడ్డారు.
‘‘వీళ్ళను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి మర్యాదలు చెయ్యండి! వాళ్ళ బంధువులు ఆలయంలో వున్నారని చెబుతున్నారు. వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు తీసుకోండి. నిజంగానే వాళ్ళ బంధువులు ఆలయంలో వుంటే వచ్చి విడిపించుకుని తీసుకు వెళతారు. ముందు లాకప్‌లో తోసెయ్యండి’’ అన్నాడు ఎస్‌పి స్టిక్ ఊపుతూ.
వాళ్ళ ముగ్గురిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. కారు చెక్ చేస్తుంటే కొకైన్ ప్యాకెట్లు దొరికాయి.
* * *
- ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ