Others

దేశభక్తిలేని సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్రాలలో స్వాతంత్య్రం రాకముందు నుండి దేశభక్తిని చక్కగా పాటల రూపంలోనూ, మాటల రూపంలో చెప్పేవారు. స్వతంత్రం రాకముందు అయితే అన్ని చిత్రాల్లో దాదాపుగా దేశ స్వాతంత్య్రం గురించే ఏదోక చర్చ ఉండేది. జానపదాలు, పౌరాణికాలు తప్పితే అన్ని సాంఘిక చిత్రాల్లో దేశభక్తి ప్రబోధం సాగేది. తరువాత స్వాతంత్య్రం సిద్ధించిన ఆనందంతో అనేక చిత్రాల్లో స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రతి మనిషి అందుకోసం ఏం చేయాలి? కేవలం హక్కులు అడగటమే కాదు విధులను కూడా నిర్వర్తించాలని ప్రతి మనిషి తన వంతు జాతి నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పే అనేక ఇతివృత్తాలతో పాటలు, చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా 50వ దశకం నుండి 80వ దశకం వరకు ఇలాంటి దేశభక్తి నేపథ్య చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అందుకు తగ్గట్టు ప్రేక్షకులు ఆయా చిత్రాలను ఆదరించి, విజయవంతం చేశారు. నేను నా దేశం/ పవిత్ర భారత దేశం, సాటిలేనిది ధీటురానిది అంటూ సాగే పాటలో ప్రేక్షకుడు మమేకమై తాను ఆ పాటని పాడుకున్నాడు. భారత జాతి యావత్తూ సినిమా పాటకు దగ్గరైన సందర్భంలో ఆయా దర్శక నిర్మాతలు, కవులు చక్కని దేశభక్తి గీతాలను అందమైన బాణీలలో అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదంతా గతం. దేశభక్తికి సంబంధించిన ఒక్క పాటగానీ, సన్నివేశంగానీ ఇప్పటి చిత్రాల్లో మచ్చుకైనా కనబడటం లేదు. జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ అన్న మాటను బొబ్బిలిపులి చిత్రంలో బాలు అద్భుతమైన భావనతో ఆలపిస్తే మనమందరం తలలూపాం. ఒకనాటి తెలుగు సినిమాల్లో దేశభక్తికి సంబంధించిన సంభాషణలు, పాటలు ఇప్పటికీ అవే వినాల్సి వస్తోంది. దేశభక్తికి సంబంధించిన చిత్రాలను నిర్మించడంలో కూడా తెలుగు పరిశ్రమ నిర్లక్ష్యం చేస్తోంది. అప్పట్లో వందేమాతరం, దీనబంధు, ఒకరోజు రాజు, తహశీల్దార్, ప్రజారాజ్యం, సర్వాధికారి, కాడెద్దులు ఎకరం నేల, పెద్దమనుషులు, పదండి ముందుకు, దేశద్రోహులు, సత్తెకాలపు సత్తెయ్య, వెలుగునీడలు, తల్లా పెళ్లామా, మరో ప్రపంచం, మంచిరోజులొచ్చాయి, రోజులు మారాయి, గాంధీపుట్టిన దేశం, డబ్బుకు లోకం దాసోహం, నేనూ నా దేశం, అల్లూరి సీతారామరాజు, నాకూ స్వతంత్రం వచ్చింది, చలి చీమలు, సమాధికడుతున్నాం చందాలివ్వండి, ఈచరిత్ర ఏ సిరాతో, నాపిలుపే ప్రభంజనం, ఈనాడు, మహాప్రస్థానం, ఆంధ్రకేసరి, ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు, మార్చండి మన చట్టాలు, నేటి భారతం, దేశంలో దొంగలుపడ్డారు, ఓటుకు విలువివ్వండి, అర్ధరాత్రి స్వతంత్రం, కులాల కురుక్షేత్రం, మండలాధీశుడు, స్వతంత్రానికి ఊపిరిపోయండి, సత్యాగ్రహం, నవభారతం, నేటి గాంధీ, ఎర్రమట్టి లాంటి చిత్రాలు ఏదో విధంగా దేశ స్వాతంత్య్రం గురించి, ప్రజలలో పెరగాల్సిన దేశభక్తి గురించి చెప్పిన చిత్రరాజాలు. అవన్నీ ఇప్పుడు చరిత్రలాగ చెప్పుకోవాల్సి వస్తోంది.
కమర్షియల్ హిట్లకోసం, కాంబినేషన్ల సెటప్పుల కోసం తాపత్రయపడే తెలుగు సినిమా స్వాతంత్య్రం గురించి, దేశభక్తి గురించి చెప్పడం దండగ అనుకుంటోంది. గాంధీపుట్టిన దేశమా ఇది/ నెహ్రూ కోరిన సంఘమా అని పవిత్రబంధం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు స్వాతంత్య్ర యోధులను గుర్తుకు తెస్తారు. వెలుగునీడలు చిత్రంలో పాడవోయి భారతీయుడా పాటలో రాబోయే భవిష్యత్ భారతం ఎలా వుండబోతోందో, దానికి నివారణోపాయం ఏమిటో కవి శ్రీశ్రీ ఆనాడే చెప్పారు. కృష్ణ అల్లూరి సీతారామరాజులో అచ్చమైన దేశభక్తిని చాటారు. కమల్‌హాసన్ భారతీయుడులాంటి చిత్రాల్లో నటించి భారతదేశంలో ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? పౌరులు ఎలా తమ దేశాభివృద్ధికి పాటుపడాలి అన్న విషయాలను చర్చించారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలు దేశభక్తికి సంబంధించిన ఒక్క చిత్రంలో కూడా నటించకపోవడం, మన తెలుగు చిత్ర పరిశ్రమ డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ఆమధ్య వచ్చిన వెంకటేష్ ‘సుభాష్ చంద్రబోస్’ చిత్రంలో దేశభక్తిగురించి చెప్పబోయి, మళ్లీ కమర్షియల్ ఫార్మాట్‌లోకి వెళ్లిపోయారు. దాంతో ఆ చిత్రం ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల దృష్టి అంతా కోట్లు ఖర్చుపెట్టి వంద శాతం లాభాలను లాగడంపైనే ఉంటోంది. దేశ సంస్కృతి గురించి, సంప్రదాయాల గురించి, దేశభక్తి గురించి ఆలోచించే ఓపిక తీరిక నిర్మాతలకు, దర్శకులకు, కథలు రాసేవారికి లేకపోవడం దురదృష్టకరం. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, పది కామెడీ సీన్లులాంటి కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాలను రూపొందించిన అప్పటికప్పుడే ఇనిస్టెంట్‌గా లాభాలను లెక్కవేసుకునే ధోరణిలోనే సాగుతున్నారు. ఇక దేశభక్తి అనే అంశం ఎక్కడుంది? ప్రజల్లో అలాంటి చిత్రాలకు ఆదరణ ఉంటే తాము రూపొందించే ప్రయత్నం చేస్తామని, అలాంటి ఆదరణ లేకపోవడంవల్లే ఆలోచించాల్సి వస్తుందని కొంతమంది దర్శక నిర్మాతలు చెప్పటమూ సత్యదూరం కాదు. భవిష్యత్ తరాలకు దేశ స్వాతంత్ర సమర దీప్తులను, దేశభక్తి ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో చిత్రాలు రూపొందించడం ఆయా కాలాలకు ఎప్పటికీ అవసరమే. ఆ దిశగా తెలుగు సినిమా సాగాలని కోరుకుందాం.

-జి రాజేశ్వర రావు