డైలీ సీరియల్

వ్యూహం- 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘విష్‌యు హాపీ జర్నీ సార్’’ అంది లోహిత.
‘‘ఈ ప్రయాణాలు నాకు మామూలే! ముంబై, పాట్నా తరచుగా వెళ్తూనే వుంటాను.. నీ పెళ్లి కుదిరితే నాకు ఫోన్ చేసి చెప్పు!’’ అన్నాడు అరవింద్ కారు ఎక్కుతూ.
నవ్వుతూ అక్కడే వుండిపోయింది కారు స్టార్ట్ అయ్యేదాకా.
డాక్టర్ అరవింద్ వెళ్ళేక పెద్దగా నిట్టూర్పు విడిచింది.
***
ఎయిర్‌పోర్టులో కారు డిపార్చర్ వింగ్ దగ్గర ఆగింది.
బ్రీఫ్‌కేసు భద్రంగా పట్టుకుని కారుదిగాడు. డ్రైవరు డిక్కీలో వున్న ట్రావెలర్ బ్యాగ్ తీసి ఇచ్చాడు. ఆ బ్యాగ్‌లో అతని బట్టలు, షేవింగ్ సెట్, మందులు వుంటాయి. అతను ఎప్పుడు ప్రయాణమైనా ఆ బ్యాగ్ సిద్ధంగా ఉంచుతాడు డ్రైవర్.
ట్రావెలర్ బ్యాగ్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఇచ్చేశాడు.
సెక్యూరిటీ చెక్ అయ్యేక లోపలికి వెళ్ళాడు.
ఫ్లయిట్‌కు ఇంకా అరగంట టైముంది.
చేతిలోని బ్రీఫ్ కేసు వెయిట్ తక్కువగా వున్నట్లు అన్పించింది.
బ్రీఫ్‌కేసు నిండా డాక్యుమెంట్లు పెట్టాడు.. తన ఛాంబర్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం బరువుగానే అన్పించింది.
ఇప్పుడు తేలిగ్గా వుందేమిటి?
అనుమానం వచ్చింది.
లాంజ్‌లో కూర్చుని బ్రీఫ్‌కేసు ఓపెన్ చేశాడు. దాన్నిండా పాత వారపత్రికలు వున్నాయి.. వారపత్రికలు చదివే తీరిక తనకు ఎక్కడుంది?
కాశీ కూడా చదవడు.. మరి ఎవరు తన బ్రీఫ్‌కేసులో పెట్టారు.. బ్రీఫ్‌కేసువైపు పరీక్షగా చూశాడు.. ‘హష్‌పప్పీస్’ కంపెనీవాళ్ళ బ్రీఫ్‌కేసు. ఆరునెలల క్రిందట ఢిల్లీలో కొన్నాడు రెండు బ్రీఫ్‌కేసులు. ఒకటి కాశీకి ఇచ్చాడు. రెండోది తన దగ్గరవుంది.
కాశీకి ఫోన్ చేశాడు.
‘‘నా బ్రీఫ్‌కేసు మారిపోయింది.. నువ్వేమన్నా మార్చావా? డాక్యుమెంట్లు వున్న బ్రీఫ్‌కేసు ఏమయింది?’ అడిగాడు.
‘‘మీ బ్రీఫ్‌కేస్‌లో మీరే సర్దుకున్నారు. పెద్ద ట్రావెల్ బ్యాగ్ మాత్రం నేనూ డ్రైవర్ కలిసి మీ బట్టలు సర్దాం.. మీ బ్రీఫ్‌కేసు సంగతి నాకు తెలియదు’’ సమాధానమిచ్చాడు కాశి.
పిచ్చెక్కినట్లుగా వుంది అరవింద్‌కు. తల పట్టుకుని కూర్చున్నాడు. వచ్చేటప్పుడు బ్రీఫ్‌కేసును చెక్ చేశాడు. అందులో డాక్యుమెంట్లు వున్నాయి..
మధ్యలో ఏమైనట్లు?
తను ఎవరికీ ఇవ్వలేదు.
అప్పుడు గుర్తుకు వచ్చింది.
... ఛాంబర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డాక్టర్ లోహిత ఎదురుపడింది.. తనతోపాటు లిఫ్ట్ ఎక్కింది.. ఆమె చేతిలో కూడా బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేసుంది.. అచ్చం తన బ్రీఫ్‌కేసులాగే వుంది.
నెక్ టై, కోట్ బటన్లు సరిచేసుకుంటూ బ్రీఫ్‌కేసు కిందపెట్టాడు. ఆమె లిఫ్ట్ ఆపరేట్ చేస్తూ తన బ్రీఫ్‌కేసు ప్రక్కనే ఆమె బ్రీఫ్‌కేసు పెట్టింది.. అక్కడ మారిపోయిందేమో! పొరపాటున మారిపోయిందా?
ఆమె ఊరికి వెళ్తున్నట్లు చెప్పింది. మరి బ్రీఫ్‌కేసులో పాత వారపత్రికలు ఎలా వస్తాయి? కాశీ దగ్గర వుండాల్సిన హష్ పప్పీస్ బ్రీఫ్‌కేసు ఆమె దగ్గరకు ఎలా వచ్చింది?
వాళ్ళిద్దరూ కలిసి డాక్యుమెంట్లు మాయం చేసి వుంటారేమో
కాశీకి తెలియకుండా అతని దగ్గర వున్న బ్రీఫ్‌కేసు కాజేసిందా?
డాక్టర్ లోహితకు ఫోన్ చేశాడు. స్విచ్‌ఆఫ్‌లో వుంది ఆమె ఫోన్. అరిఫ్‌కు ఫోన్ చేసి డాక్యుమెంట్లు గల్లంతు అయిన సంగతి చెప్పాడు అరవింద్.
‘‘సర్లే! నువ్వు ముంబై వచ్చెయ్యి.. కొన్ని లీగల్ డాక్యుమెంట్లు మీద సంతకాలు పెట్టాలి! మనవాళ్ళకు చెబుతాను.. డాక్టర్ లోహితను నిర్బంధించి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టిందో తెలుసుకుంటారు.. కాశీ సంగతి తరువాత ఆలోచిద్దాం..!’’
ఫ్లయిట్ టెర్మినల్‌కు చేరుకున్నట్లు, బయలుదేరడానికి సిద్ధంగా వున్నట్లు ఎనౌన్స్‌మెంట్ వచ్చింది.
***
ముంబై సెకెండ్ లార్జెస్ట్ సిటీ ఇండియాలో.
ఇంద్రభవనంలా వుండే పెద్ద భవంతుల్లో వుండేవాళ్ళు వుంటారు. రోడ్డుప్రక్కన రేకుల షెడ్డులో వుండేవాళ్ళూ వుంటారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వున్నారు. దేశాన్ని నాశనం చేసే మాఫియా గ్యాంగులకు నిలయంగా వుంటుంది ముంబై.
చర్చిగేటు ప్రాంతంలో అరిఫ్ భవనం వుంది. విశాలమైన ఆవరణలో వుంది. చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. సెక్యూరిటీ గార్డులు అనుమతి లేనిదే ఎవరిని వెళ్ళనివ్వరు. వందమంది పనివాళ్ళు వున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు జరుగుతూ వుంటాయి అక్కడ. గవర్నమెంటు ఫైల్స్ అక్కడకు చేరుకుంటాయి.
దుబాయినుంచి అరిఫ్ వచ్చేడంటే మరింత కోలాహలంగా వుంటుంది అక్కడ.
అరిఫ్ ఛాంబర్‌లోకి అడుగుపెట్టాడు డాక్టర్ అరవింద్.
‘‘వారం రోజుల్నుంచి స్కంద ఇక్కడే వుంటున్నాడు.. ఏం పనిమీద వచ్చాడో? సిటీ పోలీసు కమిషనర్‌తో కలిసి తిరుగుతున్నాడట. ఏ వ్యవహారం చక్కబెట్టడానికి ఇక్కడకు వచ్చాడో అర్థంకావడంలేదు’’ అన్నాడు అరిఫ్ తెల్లటి గడ్డం నిమురుకుంటూ.
అరిఫ్‌తో ఏం మాట్లాడినా చిక్కే!

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ