మెదక్

వివాహిత అనుమానస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 22 : సిద్దిపేటలో వివాహిత మహిళ అనుమాన స్పదంగా మృతిచెందటం పట్టణంలో చర్చనీయంశంగా మారింది. వివాహిత సూసైట్ నోట్ వ్రాసి మృతిచెందటం సంచలనం సృష్టించింది. తమ కూతూర్ని అల్లుడే కనకచంద్రం కొట్టి హత్య చేశారని మృతిరాలు తల్లిదండ్రులు కనకవ్వ, కావటి ఎల్లయ్యలు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి కావటీ ఎల్లయ్య, కనకవ్వ కూతురు రేణుకను కొండపాక మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన కనకచంద్రంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సిద్దిపేట శివాజీనగర్‌లో కనకచంద్రం, రేణకలు నివాసముంటున్నారు. కనకచంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. వీరి ఇద్దరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రేణుక బుధవారం సాయంత్రం శివాజీనగర్‌లోని ఇంట్లోనే అనుమాన స్పద స్థితిలో మృతిచెందింది. రేణకు వ్రాసిన సూసైట్ చర్చనీయంశంగా మారింది. రెండురోజుల క్రితం ఇటీవల ప్రారంభించిన మాంగళ్య షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన రేణుక వెళ్లింది. ఒక చీరకు ధర ఉన్న లెబుల్‌ను మరో చీరకు పెట్టి బిల్ చేయాలని కోరగా షాపు వారు గుర్తించి మందలించినట్లు సమాచారం. ఆనంతరం డబ్బులు కట్టి చీరను కొనుగోలు చేసింది. బుధవారం సాయంత్రం రేణుక ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక తల్లిదండ్రుల కావటి ఎల్లయ్య, కనకవ్వలు అల్లుడు కనకచంద్రం కొట్టి హత్య చేశాడనిపోలీసులకుఫిర్యాదు చేశారు.
మాంగల్య షాపు యజమాన్యం అవమానించటం వల్లనే ఆత్మహత్య-్భర్త
రెండు రోజుల క్రితం మాంగళ్య షాపుకు షాపింగ్‌కు వెళ్లిన రేణుకకు షాపు యాజమాన్యం వారు దొంగతనం చేశావని అవమానించరని భర్త కనకచంద్రం తెలిపారు. షాపు యజమాన్యం అవమానించటం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు కనకచంద్రం తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం- ఏసీపీ రామేశ్వర్
ఎసీపీ రామేశ్వర్, ఎస్.ఐ రాజేంద్ర ప్రసాద్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. రేణుక అనుమాన స్పదస్థితిలో మృతిచెందిన విషయాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. రేణుక వ్రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సూసైడ్ నోట్‌లో వ్రాసిన అక్షరాలను, రేణుక గతంలో వ్రాసిన పుస్తకాల్లోని అక్షరాలను పోల్చీ చూస్తున్నట్లు తెలిపారు. సూసైడ్ నోట్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. బంధువులను అడిగి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా కేంద్ర ఆసుపత్రిని తరలించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు, భర్త ఇచ్చిన ఫిర్యాదులపై స్వీకరించి దర్యాపు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

ఎమ్మెల్యేలకు సిద్ధమవుతున్న ప్రగతి భవనాలు!
* నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలు * నారాయణఖేడ్‌లో ప్రారంభమైన భవనం * మెదక్‌లో పిల్లర్లకే పరిమితం * ఒక్కో భవనానికి
రూ. కోటి* అన్ని నియోజకవర్గాల్లో త్వరలోనే ప్రారంభాలు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మొదలుకని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు సిద్దమవుతున్నాయి. నారాయణఖేడ్‌లో ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకోగా ఇటీవలే మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ప్రారంభించారు. రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి కోసం ప్రగతి భవనం నిర్మించినట్లుగా నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయం ఉండానే దృక్కోణంలో ఒక కోటి రూపాయల ప్లాన్ గ్రాంట్ నిధులతో అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్క మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవన నిర్మాణ పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. మిగిలిన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కొత్త బస్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న భవనానికి రంగులు సైతం పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం విద్యుదీకరణ పనులు కొనసాగుతుండగా, అవసరమైన ఫర్నీచర్ నిర్మించిన అనంతరం భవనాన్ని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు సిద్దమవుతున్నారు. సంగారెడ్డిలో మార్చి 15వ తేదీలోగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొంటున్నారు. సిద్దిపేటలో ఎంపీపీ కార్యాలయం ప్రక్కన బైపాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న పనులు దాదాపుగా 90 శాతం పూర్తి కావచ్చాయి. అందోల్ ఎమ్మెల్యే కోసం అందోల్ గ్రామ శివారులోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహం సమీపంలో గుట్టపైన భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా సాధ్యమైనంత త్వరగా భవనాన్ని ప్రారంభింపజేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలో కోర్టుకు ఎదురుగా ఉన్న ప్రదేశంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులు దాదాపు 70 శాతం పూర్తికావచ్చాయి. పటన్‌చెరులో బ్లాక్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న పనులు 85 శాతం పూర్తి కావచ్చాయి. గజ్వేల్‌లో హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. నర్సాపూర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా దాదాపుగా 90 పనులు పూర్తి చసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా శంఖుస్థాపన చేసిన దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనులు ప్లాస్టింగ్ దశలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సకల సదుపాయాలతో క్యాంపు కార్యాలయాల నిర్మాణం కొనసాగుతుంది. ఈ యేడాదిలో పది నియోజకవర్గాల్లో నిర్మాణం కానున్న క్యాంపు కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు త్వరలోనే ఆశీనులు కానున్నారు. ఇదిలావుంటే ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పడిన పార్లమెంటు సభ్యులకు మాత్రం క్యాంపు భవనాలు లేకపోవడమేమిటన్న చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లోనే ఎంపీలకు ఏదైనా స్థానం కల్పించవచ్చన్న అభిప్రాయం నెలకొంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే కోసం నియోజకవర్గ కేంద్రాల్లో స్వంత భవనాలను నిర్మించకపోగా తమ ప్రభుత్వం మాత్రం శాశ్వత భవనాన్ని నిర్మింపజేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
* కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేయాలి
* వీడియోకాన్ఫరెన్స్‌లో కమిషనర్ అశోక్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 22: ఇంటర్మీడియేట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియేట్ కమిషనర్ డాక్టర్ అశోక్ అధికారులకు సూచించారు. ఈ నెల 28నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణపై గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు, సలహాలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేసి మాస్ కాపింగ్‌కు పాల్పకుండ చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డిఐఇఓ కిషన్, డిఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బస్సు యాత్ర విజయవంతం చేయాలి
* ఎమ్మెల్యే గీతారెడ్డి
జహీరాబాద్, ఫిబ్రవరి 22: ఈ నెల 28న జహీరాబాద్ చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాచైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం రాత్రి పార్టీ నాయకులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు, ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. యాత్ర బహిరంగ సభను పట్టణ పరిధిలోని జేజే కన్‌స్ట్రక్షన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి రానున్న యాత్రకు బైక్‌ర్యాలీ ద్వారా పట్టణంలోకి స్వాగతించనున్నారు. బైక్ ర్యాలీ, బోనాలు, గిరిజనుల నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలతో భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా బజంత్రిలు, కళాకారుల ఆటపాటలతో యాత్రను సంపన్న చేసేందుకు అవసరమగు చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించాలి
కళాశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం పిలుపు
పటన్‌చెరు, ఫిబ్రవరి 22: ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఫలితాలు సాధించాలని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలలో చదువుతున్న బాలిబాలికలకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతమైన సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరము రాబోయె విద్యా సంవత్సరము నుండి విద్యార్థిని విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందచేస్తామని హామి ఇచ్చారు. కేవలం చదువుపై శ్రద్ధ పెట్టిమంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.
నియోజకవర్గానికి మీ మూలంగానే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉందన్నారు. ప్రైవేటు పరిశ్రమల ఆర్థిక సహాయ సహకారాలతో పట్టణంలో ఇప్పటికే డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి చేసామని, ఇంటర్ కళాశాల నిర్మాణంలో ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాల మేరకు కెజి టూ పిజి వరకు నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించామన్నారు. ఇదే ఆవరణలో పిజి కళాశాల మంజూరు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసామని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మురళీ కృష్ణ పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు
* అనుమతి పొందిని ఇళ్ల నిర్మాణాల పరిశీలించి నివేదిక ఇవ్వాలి * మున్సిపల్
అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలి * కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట, ఫిబ్రవరి 22 : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాల్టీ పరిధిలో గత మూడు నెలల నుండి అనుమతి పొందిన 120 ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ పద్మాకర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, టీపీఒ స్వామినాయక్‌తో కలసి మున్సిపల్ అభివృద్ధిపై సమీక్షించారు. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ద్వారా ఎన్ని అనుమతులు ఇచ్చారని, వాటిలో ఎన్ని డీవిఎషియన్లు ఉన్నాయో ఆరాతీశారు. ఈమేరకు 633 అనుమతులు ఇచ్చామని, ప్రతి నెల డీవిషియన్లు ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 114 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో 120 అనుమతులు ఇచ్చినట్లు కమిషనర్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలల నుండి ఇచ్చిన అనుమతులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. డీవిషియన్స్ ఉన్న భవనాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. మున్సిపాల్టీలో నిర్మించే ఇళ్లు నిబంధనల మేరకు లేకుంటే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. మున్సిపల్ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. జిల్లాలో 20 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించి క్షేత్ర స్థాయిలో ఆరా తీసి నివేదికలు తెప్పించుకుంటానన్నారు. ప్రతి వారం మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానన్నారు. అనుమతులు లేకుండ భవననిర్మాణాలు చేపడితే కూల్చివేయాలని, భవనం నిర్మించే యజమానిపై చర్యలు తీసుకోవాలని టీపీఓను కలెక్టర్ ఆదేశించారు. ఈసమీక్షలో వైస్‌చైర్మన్ అత్తర్‌పటేల్, టీపీఎస్ హాబీబున్నిసా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
- 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
-* కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా మండల విద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లాలోని మండల విద్యాధికారులు, డీఈఓ రవికాంత్‌రావుతో సమీక్షించారు. మార్చి 15 నుండి జరుగనున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటు చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల నుండి విద్యార్థుల హాజరు శాతం 95 శాతం ఉందన్నారు. విద్యార్థుల ప్రత్యేక తరగతుల సందర్భంగా అల్పహారం కోసం ప్రతి విద్యార్థికి 5రూపాయలు వెచ్చిస్తూ టీ,స్నాక్స్ అందచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని డీఈఓ రవికాంతరావుకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని ఆదేశించారు. 10తరగతి పరీక్షలకు డీఆర్‌ఓ చంద్రశేఖర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా నియామకమైన డీఈఓ కాంతారావు కలెక్టర్‌కు కలసి పుష్పగుచ్చం అందచేశారు.
ఓటరు గుర్తింపుకార్డుతో ఆధార్ అనుసంధానం
- జాతీయ ఎలక్షన్ కమీషన్ కార్యదర్శి నజీంఅహ్మద్
గజ్వేల్, ఫిబ్రవరి 22: ఓటరు గుర్తింపు కార్డుతో ఆదార్‌కార్డు నెంబర్‌ను అనుసందామిస్తామని జాతీయ ఎలక్షన్ కమీషన్ కార్యదర్శి నజీంఅహ్మద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల పోలింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు జాతీయ ఎన్నికల కమీషన్ కఠినంగా వ్యవహరిస్తోందని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కులను 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓటరు గుర్తింపు కార్డుకు ఆదార్ అనుసందానంతో ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలుగుతాడని, అర్హులైన యువతీయువకులు ఆన్‌లైన్‌లో, లేదా తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఓటరుగా నమోదుతో అత్యుత్తమమైన నాయకులను ఎన్నుకోవడానికి వీలు కలుగుతుందని, నిస్వార్థంతో సేవచేసే నేతలను ఎన్నుకుంటే గ్రామాలు, రాష్ట్రాలు, దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాదిస్తుందని తెలిపారు. కాగా ఓటరుగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు త్వరగా ఓటరు గుర్తింపుకార్డులు అందజేస్తామని, లేని పక్షంలో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్‌లు నిర్మల, రవీందర్‌రెడ్డి, నాగమణి పాల్గొన్నారు.
సిపీఎస్ రద్దుకు తనవంతు సహకారం అందిస్తా
* ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 22: తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడిన ఉద్యోగ, ఉపాద్యాయుల తీవ్ర సమస్య అయిన సీపీఎస్ రద్దు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రద్దు చేసేందుకు తనవంతు కృషి సల్పుతానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట మండల పీఆర్‌టీయూ గురువారం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మండల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి జిల్లా అధ్యక్షులు రాందాస్ నేతృత్వంలో వినతి పత్రం సమర్పించగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాన్ని క్రమశిక్షణగా నడిపించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు నేడు సీపీఎస్ విధానం పట్ల కలత చెందుతున్నారన్నారు. ఇది తమ ప్రభుత్వం చేసింది కాదని, 2004లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారు చేసిన నిర్ణయానికి నేడు తమపై అబండాలు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి సీపీఎస్ రద్దు కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ సంగమేశ్వర్‌తో పాటు జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షులు రాందాస్, మండల అధ్యక్షులు రాంచంద్రాచారి, టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు రామకృష్ణాగౌడ్, పీఆర్‌టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి కెవి.రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోమ్యనాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.