ఆంధ్రప్రదేశ్‌

అనంత.. సూపర్ పవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన, సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే టాప్ గ్రిడ్‌కు మూడో వంతు వాటా అనుసంధానం
జిల్లా నుంచి 2,600 మెగావాట్లు సరఫరా భవిష్యత్తులో మరింత విద్యదుత్పత్తికి అవకాశం

అనంతపురం, ఫిబ్రవరి 23: పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిలో అనంతపురం జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. జిల్లాలో ఈ రెండు వ్యవస్థల ద్వారా ఉత్పత్తవుతున్న విద్యుత్‌లో సింహభాగం రాష్ట్రానికి సరఫరా చేస్తుండటం విశేషం. జిల్లా అవసరాలకు వాడుకుంటూనే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పవన (విండ్), సౌర (సోలార్) విద్యుత్‌లో రికార్డు స్థాయిలో మూడో వంతును విద్యుత్‌శాఖ గ్రిడ్‌కు సరఫరా చేస్తూ ముందంజలో ఉంది. ఏపీ ట్రాన్స్‌కో నివేదిక మేరకు.. జిల్లాలో ఇప్పటికి వరకు 40 దాకా వివిధ కంపెనీలు పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీకి అనుబంధంగా నంబులపూలకుంటలో 2000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
కాగా జిల్లాలోని రామగిరి ప్రాంతంలో 1995లో పవన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అనంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విండ్‌మిల్స్ ఏర్పాటయ్యాయి. వాటిలో రామగిరి నుంచి 100 మెగావాట్లు, తాడిపత్రిలో 2,600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన విండ్‌మిల్స్ పనిచేస్తున్నాయి. అలాగే సౌర విద్యుదుత్పత్తికి 2010లో బీజం పడింది. ఇందులో రాయదుర్గంలో 100 మెగావాట్లు, నాగలాపురంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2,761 మెగావాట్లు, సోలార్ ద్వారా 500 మెగావాట్లు చొప్పున మొత్తం 3,261 మెగావాట్లు ఉత్పత్తవుతోంది. ఇందులో దాదాపు 881 మెగావాట్ల విద్యుత్ జిల్లాలో వివిధ ప్రజావసరాలకు వినియోగమవుతోంది. మిగతా 2,380 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నారు. ఇది రాష్ట్రంలో మూడో వంతు కావడం గమనార్హం. జిల్లాలో గాలివేగం అధికంగా ఉండటంతో పవన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే ఏడాదిలో సుమారు 8 నెలల పాటు ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంటోంది. వాయువేగం అయితే 80 కిలోమీటర్లు ఉంటోంది. దీంతో జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వాయుపీడనాన్ని, వేగానికి సంబంధించి సుమారు 10 నుంచి 20 ఏళ్ల రికార్డును విండ్‌మిల్స్ సంస్థలు సంబంధిత ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్ సంస్థల ద్వారా సేకరించి ప్రస్తుత పరిస్థితులకు బేరీజు వేసుకుని జిల్లాకు వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు కంపెనీలు విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వస్తున్నాయి. అలాగే సోలార్ పవర్ వినియోగం కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్య, వైద్య సంస్థలు, వివిధ కార్యాలయాలు, గృహోపయోగానికి వినియోగిస్తూ విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందుతున్నాయి. మరోవైపు పెరుగుతున్న జనాభా, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వస్తున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ వినియోగ స్థాయి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన, సౌర విద్యుత్ జిల్లా అవసరాలకు ఉపయోగపడుతోంది. దీంతో హైడల్, ధర్మల్ విద్యుత్ వినియోగంపై భారం తగ్గుతోందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ వినియోగానికి సోలార్ సిస్టమ్స్‌ను వాడుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ అంతరాయాలు, వేసవి వస్తే చాలు అధికారిక, అనధికారిక కోతలు తప్పడం లేదు. వ్యవసాయానికి కూడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తే, ఇపుడున్న కరెంటు కోతల నుంచి ఉపశమనం లభించడంతో పాటు నిరంతర విద్యుత్ సోలార్ ద్వారా లభిస్తుందని గ్రామీణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు జిల్లాలో పవన విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరింత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

chitram...
అనంతలో సోలార్ విద్యుత్ ప్లాంట్