Others

నీ నడుము పైన చేయి వేసి నడువనీ... (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

22-07-1967న విడుదలైన అన్నపూర్ణా వారి ‘పూలరంగడు’ చిత్రంలోని ‘నీ నడుముపైన చేయి వేసి నడువనీ..’ అనే యుగళగీతం నేనెన్నటికీ మర్చిపోలేని పాటలలో ఒకటి. ఈ పాట రాసిన కవి డా. సి.నారాయణరెడ్డి, చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, నట సామ్రాట్ నాగేశ్వరరావు, జమునలపై నయనమనోహరంగా చిత్రీకరించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఘంటసాల, శ్రీమతి సుశీల. ‘పూలరంగడు’ రజతోత్సవం జరుపుకోవడమే కాదు అక్కినేనికి మరో విజయసోపానమైంది.
కథానుసారం నాయకుడు రంగడు (నాగేశ్వరరావు) మంచి మనసున్న రబ్బరుబంతి వంటి మనిషి. ప్రత్యర్థులు నేలకేసికొడితే అంత ఎత్తుకు ఎగిరి ఢీకొనగలిన సాహసి. జీవనోపాధికి కిరాయికి గుర్రబ్బండి తోలుకుంటూ పూలరంగడిగా చెలామణి అయ్యే అతని సంస్కారాన్ని చూసి అతనికన్ని విధాలా సమఉజ్జీ అయిన గడ్డికోసుకునే వెంకటలక్ష్మి (జమున) అతనికి మనసిచ్చి పుచ్చుకొంటుంది. ఆ ప్రేమికులు ఒక రోజు సినిమాకు వెళ్లి తెరమీది నాయికా నాయకుల్లో తమను చూసుకొని ఊహాలోకంలో విహరించడం ఈ గీత సందర్భం.
చిత్రంలోని మిగిలిన పాటలన్నింటినీ తెలుపు నలుపుల్లో చిత్రీకరించగా- ఈ ఒక్క పాటనూ రంగుల్లో చిత్రించడం-చెప్పుకోదగిన విశేషం. అలాగే చిత్రం పొడవునా పల్లెటూరి వేషధారణలో కనిపించిన నాయికా నాయకులు ఈ పాటలో మాత్రం ఆధునికమైన ఆడంబరమైన దుస్తుల్లో కనిపించడం అభిమానులకు కనుల పండుగ అవుతుంది. అన్నిటికీ మించి అంతవరకూ వచ్చిన సాంఘిక చిత్రాల్లోని తన పాత్రలకు భిన్నంగా ఏఎన్‌ఆర్ అభిమానులు పరవశించేలా నూతనమైన స్టెప్స్‌తో అలరించడం ఈ పాటలోని ప్రత్యేకత.
సాహిత్యపరంగా సినారె భావుకత ఈ పాట పొడవునా పరిమళిస్తుంది. సన్నని నవ్వులతో సంపెంగలేరుకోవడం, గులాబీ పెదవుల లావణ్యాన్ని తదేకంగా చూడ్డం, వెచ్చని వెనె్నలలో ముచ్చటలాడుతూ మురిసిపోవడం.. నాయికా నాయకులతో పాటు ప్రేక్షకులనూ ప్రణయలోక విహారం చేయించారు కవి. జిలుగు పైట నీడ, మబ్బుల వాడ, మల్లెల మేడ మొదలైన అందమైన సినారె పదబంధాలు రసహృదయాల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఇలా ఆహ్లాదకరమైన చిత్రీకరణ, శ్రావ్యమైన సంగీతం, అద్భుతమైన నటన, మల్లెలు జల్లినట్టున్న పద సౌకుమార్యం- అన్నీ కలిసి ఈ పాటను అజరామర ప్రణయగీతంగా రూపొందించాయి.

-మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు, తూ.గో.జిల్లా