రాష్ట్రీయం

దిగివచ్చిన హెచ్‌సియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దిగివచ్చింది. గురువారం నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. దళిత విద్యార్థులు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్నలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే హైకోర్టు తీర్పును బట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అప్పారావు ప్రకటించారు. తరగతులు, పరిశోధనలకు అడ్డంకులు లేకుండా సహకరించాలని వర్శిటీ యాజమాన్యం కోరింది. సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకుందామని, వర్శిటీలో ప్రశాంతత నెలకొనేలా చూడాలని విసి కోరారు. ఏబివిపి విద్యార్థిపై దాడి చేశారనే ఆరోపణలపై ఐదుగురు విద్యార్థులను పాలక మండలి సస్పెండ్ చేసింది. రోహిత్ ఆత్మహత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హెచ్‌సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా సస్పెండ్‌కు గురైన విద్యార్థులు విసి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విధితమే. కాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హెచ్‌సియులో దళిత విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హెచ్‌సియు పరిపాలనా బాధ్యతల నుంచి పది మంది దళిత ప్రొఫెసర్లు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పరిపాలనా విభాగం నుంచి తాము తప్పుకుంటున్నామని పదవులకు రాజీనామా చేశారు.
రోహిత్ చేసిన తప్పేంటి: రాధిక
యూనివర్శిటీలో తన కొడుకు రోహిత్ చేసిన తప్పేంటో వైస్ చాన్సలర్ అప్పారావు చెప్పాలని విద్యార్థి రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేసింది. రోహిత్ చనిపోయాక వైస్ చాన్సలర్ తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపింది. విసి తన తప్పులేకుంటే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా వచ్చి తమను ఎందుకు కలిసేందుకు ప్రయత్నించారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. విసి అకారణ చర్యల వల్లే తన కొడుకు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించింది.