కడప

డ్వాక్రాబజార్లు సక్సెస్ అయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 10: జిల్లాలో ప్రారంభించిన, ప్రారంభించనున్న డ్వాక్రా బజార్లు ఖచ్ఛితంగా అమలయ్యేనా అనే అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. పట్టణంలోని గాంధీబజారులో జనవరి నెలలో ఏర్పాటుచేసిన డ్వాక్రా బజార్లు గత వారం రోజులుగా అడ్రస్సు లేవు. షాపులకు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఆ షాపుల ముందు ఇతర వ్యాపారులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా బజారులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ డ్వాక్రా బజారులను ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న వెలుగు సంఘాల సభ్యులు తయారు చేసిన దుస్తులు, అలంకరణ వస్తువులు, అగరబత్తులు, తృణ ధాన్యాలు, పాలతో తయారుచేసిన తినుబండారాలు మొదలగునవి ఈ డ్వాక్రా బజారుల ద్వారా విక్రయాలు చేయించి, తద్వారా డ్వాక్రా మహిళా సంఘాలను ప్రభావితం చేయించాలనే సత్‌సంకల్పంతో జిల్లా ఉన్నతాధికారులు ఓ మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. అందులో భాగంగానే ప్రొద్దుటూరులోని గాంధీబజారులో గతనెలలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారులలో మొదట బాగానే జరుగుతున్నా వాటిని నిర్వహించడంలో సంబంధిత సభ్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వస్తోంది. రోజుకు వేలాదిరూపాయల వసూలు జరుగుతోందని అధికారులు చెబుతుండగా అక్కడి పరిస్థితులు మరో రకంగా వున్నాయి. డ్వాక్రా బజార్ల నిర్వహణకు సంబంధించి రవాణా ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో వుంచుకొని అక్కడికక్కడే తయారుచేసే వస్తువులను డ్వాక్రా బజారులలో ఏర్పాటుచేసినట్లయితే ఎక్కువ ఆదాయం వనగూర్చుకోవచ్చుననే అభిప్రాయం అధికారులలో వుండేది. పట్టణంలో ఏర్పాటుచేసిన నెలలోపే వారాలకు వారాలు షాపులు మూతవేయడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన స్టాల్స్ తరహాలోనే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో డిఆర్‌డిఎ ప్రాజెక్టు ఆఫీసర్ అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ డ్వాక్రా బజారుల నిర్వహణకు సంబంధించి ఇద్దరు మహిళలకు శిక్షణనిచ్చి ఆ బజారుల బాధ్యతలను వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే డ్వాక్రా బజారులలో తయారుచేసిన తినుబండారాలు ఎక్కువభాగం కొనుగోలుచేసే ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో వాటికి సంబంధించి మధుమేహం, ఊబకాయం, బిపి లాంటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యం మనం తీసుకొనే ఆహారంలో సమతుల్యత లేకపోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ వ్యాధులను దృష్టిలో వుంచుకొని చిరు ధాన్యాలతో తయారుచేసిన పదార్థాలు అందుబాటులోకి తెస్తే బాగా అమ్ముడవుతాయని అధికారుల అంచనా. ఎక్కువశాతం జొన్న రొట్టెలు, రాగిరొట్టెలు లాంటి పదార్థాలను అందుబాటులోకి తెచ్చారు, తెస్తున్నారు. ఇందులో భాగంగానే స్వయంసహాయక సంఘాలలోని సభ్యుల్లో కొంతమంది చిరు ధాన్యాలతో తినుబండారాల తయారీపై కృషీ విజ్ఞాన కేంద్రంలో శాస్తవ్రేత్తల ఆధ్వర్యంలో శిక్షణనిచ్చి ఆహార పదార్థాలను తయారుచేయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇప్పటికే శిక్షణ పూర్తిచేసిన, దానిపై మక్కువ చూపుతున్నవారెవరైనా వున్నా వారికి కూడా శిక్షణ ఇప్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వున్న డ్వాక్రా బజారులకు ఇప్పటివరకైతే చిరుధాన్యాలతో తయారుచేసిన పదార్థాలు 75శాతం కడప నుంచి వివిధ డ్వాక్రా బజారులకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా చార్జీలు పెరగడం వలన అనుకున్నంత ఆదాయాన్ని అందుకోలేకపోతున్నామనే విషయంతో స్థానికంగా తయారుచేసే విధంగా మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇవ్వడం వలన అక్కడే తయారుచేసుకొని డ్వాక్రా బజారులకు అందించవచ్చుననే ఉద్దేశ్యంతో అధికారులు వున్నారు. అదేవిధంగా గత కొనే్నళ్లుగా ప్రభుత్వ పరంగా పాల కేంద్రం లేకపోవడం వలన ఇతరులకు చెందిన పాలశీతలీకరణ కేంద్రాల నుంచి అధికారులు ఒప్పందం కుదుర్చుకొని పాలతో తయారుచేసిన పదార్థాలను డ్వాక్రా బజారుల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా వీటిని నేర్చుకోదలచిన వారు కృషీ విజ్ఞాన కేంద్రానికి వెళ్లి పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని డి ఆర్‌డి ఎ జిల్లా ఉన్నతాధికారులు వెల్లడి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ డ్వాక్రా బజారులు సక్సెస్ అయితే మహిళా సంఘాల సభ్యులు అభివృద్ధి చెందేందుకు అవకాశం లేకపోలేదు.

కల్పవృక్షవాహనంపై దర్శనమిచ్చిన అనంతభూపాలుడు
కడప (కల్చరల్), ఫిబ్రవరి 12: శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన శుక్రవారం శ్రీవారు కల్పవృక్ష వాహనంపై కొలువుదీరాడు. భక్తులు అడుగడుగునా స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామోత్సవం సాగిన వీధుల్లో మహిళలు వారు పోసి స్వామివారికి సాంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంతోపాటు మాడవీధులన్నీ విద్యుత్ దీపాలంకరణతో కాంతులు వెదజల్లాయి. భక్తులు గోవిందనామస్మరణలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమించారు. తొలుత స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు మంగళహారతులు ఇచ్చి స్వామివారిని దేవునికడప మాడవీధుల్లో ఊరేగించారు. ఈగ్రామోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, చెక్క్భజన బృందాలు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అలరించాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఊంజల్ సేవ కమనీయంగా జరిగింది. కాగా ఆలయ ప్రాంగణంలో టిటిడి అన్నమయ్య ప్రాజెక్టు నుంచి వచ్చిన కళాకారులు అన్నమాచార్య కీర్తనలు విన్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు జరుగుతున్న విశేష పూజలు, స్వామివారి గ్రామోత్సవం చూసేందుకు జిల్లానుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శనివారం శ్రీవారి కల్యాణోత్సవం ఉదయం 10గంటల నుంచి 11 గంటల మధ్య వైభవోపేతంగా జరగనుంది. స్వామివారి కల్యాణం అనంతరం ఉదయం 11 గంటల నుంచి 11.45 గంటల మధ్య గ్రామోత్సవం, ఊంజల్ సేవ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 7.30గంటలకు గజవాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

గ్రామపంచాయితీలకు నీటిగండం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,్ఫబ్రవరి 12: మరో నెలరోజుల్లో వేసవి సమీపిస్తుండటంతో గ్రామపంచాయతీల నిర్వహణలో ఉన్న రక్షిత నీటి పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులు నిర్ణయించారు. 680 గ్రామపంచాయతీల్లో 24 రక్షిత నీటి పథకాలకు సంబంధిత గ్రామపంచాయతీలు రూ.20కోట్లమేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సివుంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు బకాయిలు చెల్లించాలని గ్రామపంచాయతీలకు నోటీసులు పంపినా స్పందన లేదు. ఈ నేపధ్యంలో విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులతో నీటి పథకాలకు బిల్లులు చెల్లించాల్సివున్నా గ్రామపంచాయతీల సర్పంచ్‌లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కింద రూ.25 కోట్ల 69 లక్షల 94వేల 200, గ్రాంట్ కింద రూ.17,89,900, సీనరైజ్ గ్రాంట్ కింద రూ.16లక్షల 56వేలు మంజూరయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు ప్రోత్సహక నిధుల కింద రూ.10 కోట్ల 15లక్షల రూపాయలు విడుదలయ్యాయి. గ్రామపంచాయతీల్లో నిధులున్నా పలువురు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తమకు ఆదాయం చేకూర్చే పనులకు మాత్రమే నిధులు ఖర్చు చేస్తూ నీటి పథకాలకు బిల్లులు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 24 నీటి పథకాలకు వచ్చేనెల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని సిద్దవటం, బోయనపల్లి, కొత్తమాధవరం, బి.మఠం, చక్రాయపేట, ముద్దనూరు, మైలవరం, పార్నపల్లె, వేంపల్లె, మైదుకూరు, పొందనూరు, లక్కిరెడ్డిపల్లె, వల్లూరు, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో 24 నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. నిధులున్నా సర్పంచ్‌లు విద్యుత్ బకాయిలు చెల్లింపుల్లో ససేమిరా అంటున్నారు. సంబంధిత గ్రామపంచాయతీలకు చెందిన గ్రామకార్యదర్శులు కూడా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ సర్పంచ్‌లకే వత్తాసుపలుకుతున్నారు. లింగాల మండలం పార్నపల్లెలో ప్రతినిత్యం నీటి కోసం అవస్థలు పడుతూ పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తరచూ విద్యుత్ కనెక్షన్లు తొలగింపుతో తిరిగి విద్యుత్ అధికారులను బతిమాలి కనెక్షన్లు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. ఈమారు అక్కడక్కడ జిల్లాలో వర్షాలు కురిసి భూగర్భ జలవనరులు పెరిగినా నీరుసమృద్దిగా ఉంది. డిపిఓగా బాధ్యతలు స్వీకరించిన సిఇఓ సర్పంచ్‌లకు పలుమార్లు విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశించినా వారు ఖాతరు చేయడం లేదు. దీంతో వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చే అవకాశం కన్పిస్తోంది.

శిథిలావస్థకు చేరిన పాఠశాలలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 12: నిరక్షరాస్యత నిర్మూలన, బడిఈడు పిల్లలందర్నీ బడులకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఏటా కోట్లరూపాయలు ఖర్చు చేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 90 పాఠశాలలు శిధిలావస్థకు చేరుకున్నాయి. అయితే సంబంధిత శాఖ అధికారులు ఇంతవరకు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత రెండేళ్లుగా రూ.36కోట్లు ఖర్చుపెట్టి మరుగుదొడ్లు , అదనపు తరగతి గదులు,కొత్తగా ప్రాధమికపాఠశాలల భవనాలు నిర్మించారు. స్వచ్చ్భారత్, స్వచ్చ విద్యాలయాల పేరిట రూ.9కోట్ల 55లక్షలు ఖర్చుచేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు 90పాఠశాలల పైకప్పులు, ప్రహరీగోడలు, తరగతి గదులు దెబ్బతిన్నాయి. తరచూ బిల్డింగ్ శ్లాబ్‌ల పైపెచ్చులూడి విద్యార్థుల మీద పడుతున్నాయి. రాయచోటి , రైల్వేకోడూరు, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల పరిధిలోనే అధికశాతం పాఠశాలలు శిధిలావస్థకు చేరుకున్నాయి. ప్రతినిత్యం సంబంధిత అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో 4లక్షలమందికి పైబడి మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను తయారుచేస్తామని చెబుతోంది. ఎండలు ఎక్కువైనా కూడా విద్యార్థులకు కష్టాలు తప్పేలాలేవు. కేంద్రప్రభుత్వం నుంచి జిల్లాకు నిధులు అందలేదని, ఈ పరిస్థితుల్లో ఈ పాఠశాలలకు మరమ్మతులు చేయలేమని సర్వశిక్ష అభియాన్ అధికారులు చేతులెత్తేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భక్త్భివంతో సంకల్పసిద్ధి
రామాపురం, ఫిబ్రవరి 12: భక్త్భివంతో ఎంతటి సంకల్పమైనా సిద్ధిస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని హసనాపురం పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లె సమీపంలో వెలిసిన శ్రీ ఇరుగులమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరికి ఆలయ చైర్మన్ పప్పిరెడ్డి సహదేవరెడ్డి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరు ఆలయ ధ్వజస్తంభానికి పూజలుచేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఆలయంలో ప్రతిష్టించిన ఇరుగులమ్మ మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ కృషివల్ల మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం నిర్మించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇరుగులమ్మ దేవాలయానికి రూ.45 లక్షలు మంజూరు చేశానన్నారు. చాలా ఆలయాలకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా పూర్తి కాలేదని, శ్రీ ఇరుగులమ్మ ఆలయం త్వరగా పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ రమేష్‌రెడ్డి, గాజుల ఖాదర్‌బాష, సంబేపల్లె జడ్పీటీసీ నరసారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, రాజు విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్‌మోహన్‌రాజు, మాజీ జడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి, సర్పంచ్ రాజారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వై.శేఖర్, ఉపాధ్యక్షులు బసిరెడ్డి, రమణరావు, ప్రధాన కార్యదర్శి చాన్‌బాష, ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్ దాడులతో డీలర్ల గుండెల్లో గుబులు
చాపాడు, ఫిబ్రవరి 12: మండలంలోని ప్రభుత్వ చౌకదుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఏకధాటిగా దాడులకు దిగడంతో డీలర్ల గుండెల్లో గుబులు పుట్టుకువస్తోంది. వరుసగా రెండురోజుల్లో రెండుషాపులను సీజ్‌చేసి మరికొన్ని షాపులపై విజిలెన్స్ అధికారులు కనే్నసినట్లు తెలుస్తోంది. ఏ షాపులను ఏ సమయంలో తనిఖీచేసి దాడులు చేస్తారోనని డీలర్లు బెంబేలెత్తుతున్నారు. మండలంలో 32 చౌకదుకాణాలు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో 17,728 రేషన్‌కార్డు దారులు ఉన్నారు. ప్రతినెలా 1696.22 క్వింటాళ్ల బియ్యం, 55.6 క్వింటాళ్ల చెక్కెర, 129 క్వింటాళ్ల గోధుమలు, 127 క్వింటాళ్ల పామాయిల్, 120 క్వింటాళ్ల గోధుమపిండి, 20వేల లీటర్లు కిరోసిన్ సరఫరా అవుతోంది. ఇ-పాస్ యంత్రాలను వినియోగించినప్పటి నుంచి డీలర్లకు ఆదాయం లేదని చాలామంది స్వచ్ఛందంగా మానుకుంటున్నారు. అయితే ప్రభుత్వం డీలర్లకు జీతాలు ఇచ్చే దశలో వుందనే కారణంగా కొందరు డీలర్లు యధావిధిగా కొనసాగుతున్నా సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతనెల సంక్రాంతి కానుకలను వినియోగదారులకు సక్రమంగా డీలర్లు అందివ్వలేదని, వ్రాత మూలకంగా తహశీల్దార్‌కు ఫిర్యాదులు అందాయి. అలాగే ఉన్నతాధికారులకు కూడా లేఖలు వెళ్లాయి. కందిబేడలు కచ్ఛితంగా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ చాలామంది డీలర్లు కందిబేడలకు డిడిలు చెల్లించడం లేదని తహశీల్దార్ డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. మండలంలోని 11 చౌకదుకాణాలలో ఈనెల కందిబేడలు పంపిణీ కాకపోవడం విశేషం. ఇలా ఎన్నో విమర్శలు డీలర్లు ఎదుర్కొంటన్న సమయంలో ఏకంగా విజిలెన్స్ అధికారులు చౌకదుకాణాలపై దాడులకు దిగారు. సోమాపురం, అనంతపురం గ్రామాలలోని దుకాణాలలో దాడులు చేయగా సరుకులు సక్రమంగా పంపిణీ కాలేదనే విషయాన్ని కనుగొన్న విజిలెన్స్ అధికారులు ఆ రెండు షాపులను సీజ్ చేయడం జరిగింది. కొందరు రాజకీయంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని విమర్శిస్తుండగా అధికారులు మాత్రం డీలర్ల తప్పిదాలను బయట పెట్టడానికే దాడులు చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకేసారి రెండుషాపులను సీజ్‌చేసి మరికొన్ని షాపులను సీజ్ చేయడానికి విజిలెన్స్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షిస్తున్నారు.

31మంది ఎర్రకూలీల అరెస్టు
రాయచోటి/వీరబల్లి, ఫిబ్రవరి 12: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 31 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలను అరెస్టు చేసినట్లు ఓఎస్డీ సత్యయేసుబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు వీరబల్లి మండలం గడికోట ప్రాంతంలో తమ సిబ్బంది నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఈ నిఘాలో మొదటగా ఒక తెల్ల కారు వెళ్లిందని, ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా రెండు లారీలు, ఒక స్కూటర్, తమిళనాడుకు చెందిన కూలీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కానీ ఎర్ర కూలీలు తమ సిబ్బందిపై రాళ్లు రువ్వగా, ఈ ప్రమాదంలో వీరబల్లి ఎస్‌ఐ భక్తవత్సలం, పోలీసులు సంతోష్‌రెడ్డి, పురుషోత్తంలు గాయపడ్డారన్నార. వెంటనే మిగతా సిబ్బంది అప్రమత్తమై 31 మంది తమిళనాడుకు చెందిన ఎర్ర కూలీలను, 37 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. రెండు లారీలు, ఒక స్కూటర్‌ను కూడా సీజ్‌చేసినట్లు చెప్పారు. ఈ ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.50 లక్షల మేర ఉంటుందని వివరించారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా రిమాండు విధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ప్రభాకర్, వీరబల్లి ఎస్‌ఐ భక్తవత్సలం, సుండుపల్లె, చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వీరజవాన్ హనుమంతప్పకు ఘన నివాళి
రాయచోటి, ఫిబ్రవరి 12: రోటరీక్లబ్ ఆధ్వర్యంలో సియాచిన్ పర్వతశ్రేణిలో విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుడు లాన్స్‌నాయక్ హనుమంతప్ప, ఇతర వీర సైనికుల సంతాపసభ రాయచోటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ అధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్‌కుమార్ మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన వీరసైనికుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. అనంతరం వీరజవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ కార్యదర్శి సయ్యద్ అషఫ్‌అ్రలీ, సహ కోశాధికారి బాలాజీరావు, సహాయ కార్యదర్శి షబ్బీర్, మెంబర్‌షిప్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ షఫి, సభ్యులు క్రిష్ణం గిరీష్, మాజీ అధ్యక్షులు డాక్టర్ కెవి ఎస్ నాయుడు పాల్గొన్నారు.