మెదక్

దాహం..దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 26: ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తుండగా మరోవైపు తాగునీటి తంటాలు శృతి మించిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో నీరు కావాలంటూ ఖాళీ బిందెలను పట్టుకుని మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితులు దాపురిస్తున్నాయి. వర్షాలు సంవృద్దిగా కురిసి జలాశయాల్లో పుష్కళమైన నీరు ఉన్న సమయంలోనే తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొనే నారాయణఖేడ్ ప్రాంతంలో ఈ సారి మరిన్ని కష్టాలు తలెత్తనున్నాయి. ఎక్కడ కూడా నీరు లేదనే మాట వినిపించకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించిన మూడు రోజులకే నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్‌పేటలో మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని ప్రధాన రహదారిపై బైఠాయించడం గమనార్హం. ఒక్క నారాయణఖేడ్ పట్టణంమే కాకుండా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా అత్యంత దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా ఇక్కడ మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు దాహర్తి తీర్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో చేతి పంపులు, వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుని దప్పిక తీర్చుకునే వెసులుబాటు ఉండగా పట్టణాల్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భూగర్భ జలం కలుషితం కావడంతో బోర్లు, చేతి పంపుల్లోని నీటిని తాగలేకపోతున్నారు. దీంతో పిల్టర్ వాటర్ డబ్బాలను రోజుకు 30 రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. సదాశివపేట, జహీరాబాద్, మెదక్, సంగారెడ్డి మున్సిపాలిటీలతో పాటు జోగిపేట, దుబ్బాక, చేగుంట నగర పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలైన నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, నర్సాపూర్ రామాయంపేట, తూప్రాన్, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. భూగర్భ జలమట్టం సైతం గణనీయంగా పడిపోవడంతో అధికారులు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. వ్యవసాయ బోర్లలో కూడా నీటి మట్టం పడిపోతుండటంతో కొత్తగా బోర్లు తవ్విస్తేనే వేసవి గండాన్ని అధిగమిస్తామని లేనిపక్షంలో పరిస్థితి భయానకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిరిజన తండాల్లో పరిస్థితి మరింత జటిలంగా ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నా ఎంత వరకు సత్ఫలితాన్ని ఇస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే ఎండల ఉగ్రరూపం దాల్చుతుండటంతో ముందు ముందు ఎంతగా ఉంటుందో పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. గత యేడాది వడ దెబ్బ, వేడి భరించలేక అనేక మంది మృత్యువాత పడ్డారు. ఈ సారి ఎండల తీవ్రత 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోనక్కరలేదని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కరెంటు సరఫరా మెరుగ్గా ఉండటంతో వేసవి తాపం అంతగా కనిపించకపోయినా తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి అధికారులు రేయింబవళ్లు శ్రమించక తప్పదని చెప్పవచ్చు.
బకాయ సొమ్ములు చెల్లించాలంటూ
బెల్లం రైతుల ఆందోళన

మెదక్, ఫిబ్రవరి 26: ఖరీదు చేసిన బెల్లంకు డబ్బులు చెల్లించాలని, నిలువ ఉన్న బెల్లంను ఖరీదు చేయాలని శుక్రవారం నాడు మెదక్ ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయాన్ని బెల్లం రైతులు ముట్టడించారు. ఈ రైతులకు మెదక్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కసిరెడ్డి మాణిక్యరెడ్డి, రైతు నాయకులు భీమరి శ్రీనివాస్ నాయకత్వం వహించారు. ఎక్సైజ్ సూపరిండెంట్ కురేష్, టిఎస్‌బిసిఎల్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి, ఎక్సైజ్ సిఐ ప్రభావతి, ఎక్సైజ్ సిబ్బంది రైతులను ఓదార్చే విషయంలో కృషి చేశారు. రైతుల నుండి బెల్లం ఖరీదు చేసి 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆ బిల్లులు ఎందుకు చెల్లించలేదని అధికారులను నిలదీశారు. ఈ విషయంలో పిఎస్‌బిసిఎల్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10లోగా మెదక్‌లో ఖరీదు చేసిన 6 వేల క్వింటాళ్ల బెల్లంలో 1.80 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. మీ మాటలు మేము నమ్మబోమని రైతు నాయకులు భీమరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం రెట్టింపు అయ్యాయి, రైతుల విషయంలో మాత్రం కనికరం చూపడం లేదని ఆయన వాపోయారు. బెల్లం వండటానికి ఒక రాత్రి, ఒక పగలుకు ఒక కూలీకి 500 రుపాయలు చెల్లిస్తున్నాం, దాన్ని బట్టి క్వింటళుకు బెల్లం ధరను ఖరారు చేయాలని రైతులు కమిటీ సభ్యుడైన టిఎస్‌బిసఎస్ జియం సంతోష్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. క్వింటళుకు ఎంత ధర ఖరారు చేస్తే రైతులకు ఉపయోగపడుతుందని సంతోష్‌రెడ్డి రైతులను కోరారు. క్వింటళు బెల్లంకు 3500 రుపాయలు చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఒక మాజీ సర్పంచ్ వివరించారు. ఈ విషయాన్ని మీరు వ్రాతపూర్వకంగా విజ్ఞాపన పత్రం అందజేస్తే ఈ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేసి చర్చిస్తామని ఆయన తెలిపారు. ఎక్సైజ్ అధికారులు గిరిజన తండాలపై, గ్రామాలపై దాడులు చేస్తూ బెల్లం కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నారని భీమరి శ్రీనివాస్, మాణిక్యరెడ్డి ఆరోపించారు. ఈ దాడులను విరమించుకోకపోతే ఎదురుదాడికి సిద్దమని రైతులు హెచ్చరించారు. రైతుల నష్టపోకుండా దళారుల వ్యవస్థను కనిపెట్టడానికే దాడులు చేస్తున్నామని ఎక్సైజ్ సూపరిండెంట్ కురేష్ రైతులకు వివరించారు. డిసెంబర్‌లో ఖరీదు చేసిన బెల్లంకు 2600 రుపాయలు క్వింటళుకు జిల్లా కలెక్టర్ నిర్ణయించిన విషయాన్ని సంతోష్‌రెడ్డి వివరించారు. బెల్లం నిలువలున్న ఉన్న రైతులు సర్వే నంబర్లు, పట్టా పాసుబుక్‌తో వస్తే ఉన్న బెల్లంను ఖరీదు చేస్తామని హామి ఇచ్చారు. జిల్లాలో కరువు పడింది, వేసవిలో పెళ్లి సమయాలు ముందుకు వచ్చాయి, 3 నెలల క్రింద బెల్లం అమ్ముకున్నాము, ఇప్పటి వరకు ఆ డబ్బులు చెల్లించలేదు, మేము ఎలా బ్రతకాలని రైతులను అధికారులను నిలదీశారు.
బెల్లం కొన్న వెంటనే డబ్బు చెల్లించాలి: టిఎస్‌బిసిఎల్ జిఎం సంతోష్‌రెడ్డి
ఇకనుండి కౌంటర్లలో బెల్లం అమ్ముకున్న రైతులకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయడానికి కమిటి సిఫారసు చేయబోతుందని టిఎస్‌బిసిఎల్ జియం సంతోష్‌రెడ్డి ఆంధ్రభూమితో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బెల్లం రైతులకు సంబంధించిన కమిటిలో షుగర్‌కేన్ కమీషనర్, మార్క్‌ఫెడ్ జియం, తాను ఉన్నట్లు ఆయన తెలిపారు. దళారులు బెల్లం రైతులను మోసపుచ్చకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012-13, 2014-15లో నిజామాబాద్‌లో 33 వేల క్వింటళ్లు బెల్లం ఖరీదు చేసి 9 కోట్లు బెల్లం రైతులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ బెల్లంను టెండర్ల ద్వారా ఇతర దేశాలకు అమ్మగా ప్రభుత్వానికి 5 కోట్లు నష్టం వచ్చినట్లు సంతోష్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లో 50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కామారెడ్డిలో 6 వేల క్వింటళ్లు, మెదక్‌లో 6 వేల క్వింటళ్ల బెల్లం ఖరీదు చేసినట్లు తెలిపారు. అయితే నిజామాబాద్‌లో 1.20 కోట్లు బెల్లం రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. ఇవి పోగా 50 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని సంతోష్‌రెడ్డి తెలిపారు. మెదక్‌లో 6 వేల క్వింటాళ్ల బెల్లంను ఖరీదు చేశామని, ఇందుకుగాను బెల్లం రైతులకు 1.80 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇంకా 12 వేల క్వింటళ్లు బెల్లం ఉన్నట్లు రైతుల చెబుతున్నారని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేస్తామని కూడా సంతోష్‌రెడ్డి తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన 2 వేల 600 రుపాయలు కాకుండా ఇప్పుడున్న 12 వేల క్వింటళ్ల బెల్లానికి 3500 రుపాయలు చెల్లించాలని రైతులు చేసిన డిమాండ్‌ను జిల్లా కలెక్టర్ దృష్టికి తెస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ కురేష్, ఎక్సైజ్ సిఐ ప్రభావతి, ఎక్సైజ్ ఎస్సై యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తాగుడుకు బానిసై
కుమార్తెపై హత్యాయత్నం

* ఐదేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయ తండ్రి

సిద్దిపేట, ఫిబ్రవరి 26: తాగుడుకు బానిసైన భర్త.. మద్యం సేవించేందుకు డబ్బులు అడిగితే భార్య ఇవ్వకపోవడంతో కోపంతో కన్న కుమార్తెనే ఎత్తి నేలకేసి కొట్టి హత్యాయత్నం చేసిన సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ సిఐ సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం.... సిద్దిపేటలోని గాంధీనగర్‌కు చెందిన మోతె రాజు తాగుడుకు బానిసై తరచుగా భార్య శ్రావణిని డబ్బుల కోసం వేధించేవాడు. డబ్బుల కోసం నిత్యం భార్యను కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున 5గం.కు తాగుడుకు డబ్బులు కావాలని భార్య శ్రావణితో గొడవపడ్డాడు. తన దగ్గర డబ్బులు లేవనడంతో కొట్టాడు. సమీపంలోని పిన్ని వాళ్లింట్లో డబ్బులు అడిగి ఇస్తానని నచ్చచెప్పింది. భర్తను తీసుకొని వారి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకొని పోయింది. రాజు భార్య శ్రావణి ఎటు పోయిందని అడిగాడు. కుమార్తె కీర్తి(5)ను అడగగా తెలియదని సమాధానం చెప్పడంతో కోపంతో ఉన్న రాజు కీర్తిని మీదికి ఎత్తి కింద కొట్టాడు. దీంతో కీర్తి తలకు, చేతులకు తీవ్ర గాయాలైనాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వన్‌టౌన్‌లో భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

వాసవి, వనితా క్లబ్‌ల గోసేవ

మెదక్, ఫిబ్రవరి 26: వాసవి, వనితా క్లబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం గోసేవ నిర్వహించాయి. స్థానిక శ్రీ కోదండ రామాలయంలోని గోశాలలోని ఆవులకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి దాణా, పండ్లు సమర్పించారు. ఉభయ క్లబ్స్ అధ్యక్షులు ముత్యం పుండరీకం, కొత్త పద్మలు మాట్లాడుతూ హిందూ సంప్రదాయ బద్దమైన గోసేవ వలన చాలా తృప్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల మల్లేశం, శివనంది నారాయణలు ఆర్దిక సహకారం అందించినట్లు వారు తెలిపారు. రామాలయం ప్రధాన అర్చకులు భాష్యం మధుసూదనాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా మునిగ్యాల శ్రీనివాస్ దంపతులు, చికోటి శేఖర్ దంపతులు, శీర్న శారద, బూర్ల నాగేందర్, కోటగిరి శ్రీరాంలు, నవీన్, పెండల నాగయ్య, గంగాపురం యాదగిరి, శివనంది నారాయణలు పాల్గొన్నారు.

ఖేడ్‌లో తీవ్ర తాగునీటి ఎద్దడి
ఖాళీ కుండలతో మహిళల ఆందోళన
తహశీల్దార్ ఎస్‌ఐ జోక్యంతో ఆందోళన విరమరణ
నారాయణఖేడ్ ఫిబ్రవరి 26: నారాయణఖేడ్ పట్టణంలోని మంగల్‌పేట గ్రామంలోని మహిళలు శుక్రవారంనాడు 300 మంది ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయంచి అర గంట పాటు తాగునీళ్ల కోసం ఆందోళన చేశారు.
ట్యాంకర్ల ద్వారా తాగునీరు పంపిణీ చేస్తున్న మంగల్‌కు నిత్యం రావడంలేదని వారు రోపించారు. రోడ్డుపై వారు కుర్చోవడంతో వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎస్ ఐ అశోక్ జోక్యం చేసుకుని గ్రామ పంచాయతీ సిబ్బందితో చర్చించి వెంటనే మూడు ట్యాంకర్లు వాటర్‌ను పంపించడంతో ఆందోళన విరమించారు.