దక్షిన తెలంగాణ

ఆంతర్యం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరంధామయ్య గారికి అర్చన ఒక్కగానొక్క కూతురు. చాలా గారాబంగా పెంచాడు. అర్చనకు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. ఏదో ఆలోచనలో పడ్డ పరంధామయ్య భార్య జానకి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
‘ఏమయిందండి ఏదో ఆలోచిస్తున్నారు’ అంది జానకి. ‘అమ్మాయిలో అల్లరి ఎంతమాత్రం తగ్గలేదు అత్తారింట్లో ఎలా మసలుకుంటుందో ఏమో అని కంగారుగా ఉంది’ అన్నాడు పరంధామయ్య. ‘మీకా దిగులేమి అవసరం లేదు పెళ్లయితే అమ్మాయిలో అణుకువ దానంతటదే వస్తుంది’ అని చెప్పింది జానకి. చూస్తుండగానే అర్చన పెళ్లయిపోయింది. అత్తారింట్లో కూడా అర్చన సరదాగా ఉండేది. ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్. అర్చనకి తన పుట్టిల్లు గుర్తుకొచ్చి ఆలోచనల్లో పడింది. అర్చన వాళ్ల అమ్మవాళ్లు అపార్ట్‌మెంట్లో మూడవ అంతస్తులో ఉండేవాళ్లు. అక్కడ ప్రొద్దునే్న మున్సిపాలిటీ ట్రాలీ అబ్బాయి రాగానే మూడుసార్లు విజిల్ ఊదేవాడు. దానితో అందరూ చెత్తబుట్టలతో కిందికి దిగి చెత్తను ట్రాలీలో వేసేవారు. ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ అర్చన అపార్ట్‌మెంటులో ఉన్నవాళ్లందరినీ ఫూల్ చేయాలనుకుంది. విజిల్ తీసుకొని మూడుసార్లు ఊదింది. దానితో అందరూ చెత్తబుట్టలతో కిందికి పరుగెత్తారు. కిందికి వెళ్లగానే అర్చన ఏఫ్రిల్ ఫస్ట్ అంటూ నవ్వేసరికి అందరూ విషయం తెలిసి నవ్వుకున్నారు. ఇంతలో వంటింట్లో నుండి కుక్కర్ విజిల్ రావడంతో ఆలోచనల్లోంచి బయటకొస్తుంది అర్చన.
ఈ ఏప్రిల్ ఫస్ట్‌కు కూడా తన అత్తారింట్లోవారిని ఫూల్ చేయాలనుకుంది అర్చన. వంటింట్లో బిందెలోని నీళ్లన్నీ కిందపోసి తన చీరకూడా తడుపుకొని ఖాళీ బిందెను కిందపడేసి తను కాలుజారి కిందపడ్డట్టుగా నటించింది. వంటింట్లో శబ్దం వినగానే అర్చనవాళ్ల మామగారు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అర్చనను అలా చూసేసరికి అతనికి నోటమాటరాలేదు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇదంతా గమనించిన అర్చన భర్త సుధీర్ తండ్రిని లోపలికి తీసుకెళ్లి ఓదార్చాడు. కాసేపటికి అర్చన వద్దకు వచ్చి ‘ఇదిగో అర్చన రేపటి నుండి నీవల్లకాని పనులేవీ చేయకు చూసావుగా నీకేమయిందోనని నాన్న ఎంత కంగారు పడ్డారో ఒక్క నిమిషం ఆయన గుండె ఆగినంత పనయింది తెలుసా’ అంటూనే కష్టమయిన పనులు చేయొద్దు అని చెప్పి వెళ్లిపోయారు.
అర్చన వాళ్ల అత్తగారయితే ఏమైనా దెబ్బతాకిందేమోనని కంగారుపడి అర్చనకు సపర్యలు చేయడం మొదలు పెట్టింది. ఇదంతా గమనించిన అర్చనకు పెద్దవాళ్లు ఎంత నిస్వార్థంగా పిల్లలను ప్రేమిస్తారో, వాళ్ల ఆంతర్యం ఎంత గొప్పదో అర్థమయింది. పెద్దవాళ్లు తమ పిల్లలపైనే ప్రాణాలు పెట్టుకొని జీవిస్తారని ఎన్నోసార్లు విన్నది కానీ మొదటిసారిగా చూసింది. అప్పుడనిపించింది అర్చనకు ఇంట్లోవాళ్లందరినీ ఫూల్ చేయడం కాదు తనే ఫూల్ అయ్యిందనీ! అప్పుడే నిర్ణయించుకుంది అర్చన తన వాళ్లందరినీ ప్రేమగా చూసుకోవాలని అప్పుడే తను తిరిగి రెట్టింపు ప్రేమను పొందగలుగుతుందని. అప్పటి నుండి అర్చనలో చాలా మార్పు వచ్చింది. ఇది గమనించిన పరంధామయ్య అర్చన వాళ్ల కుటుంబ సంస్కారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేశాడు.

- బి.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్
సెల్.నం.9133293384

అంతరంగం

కవిత్వంలో కవిత్వాంశ
కొరవడుతోంది

ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పల్లేరు వీరాస్వామి

డాక్టర్ పల్లేరు వీరస్వామి
3-35 కవితానిలయం
పోస్టు: పరకాల
జిల్లా : వరంగల్-506164
సెల్.నం.9441602605

సృజనాత్మక సాహిత్యం పండించడంలో సాహితీ సంస్థల పాత్ర కీలకం అని భావించే ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పల్లేరు వీరాస్వామి, సాహితీ సంస్థలు గ్రంథావిష్కరణలు..పురస్కార ప్రదానాలకు మాత్రమే పరిమితం కాకూడదని అభిలషిస్తారు. వృత్తిరీత్యా సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా పనిచేస్తున్న కాలంలోనే..తెలంగాణ శతక సాహిత్యం’పై పరిశోధన చేసి..పిహెచ్‌డి పట్టాను స్వీకరించారు. అనేక ప్రక్రియల్లో సాహిత్య సృజన చేసిన అనుభవమున్న ఆయన పలు గ్రంథాల రూపకల్పనలో క్రియాశీలకంగా పాల్గొని సంపాదకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. తాను ఏడో తరగతి చదివే రోజుల్లోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించడం విశేషం! కవిత్వం రాసే ఈతరం కవులు అధ్యయనంపై మక్కువ చూపాల్సి వుందని భావించే ఆయన ప్రస్తుతం ఓ ప్రముఖ తెలుగు దినపత్రిలో సబ్ ఎడిటర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. మన ప్రాంత సంచార జాతుల సాహిత్యం వెలుగులోకి రావాలని గట్టిగా కోరుకునే ఆయనతో ‘మెరుపు’ జరిపిన ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే...

ఆ మీరు రచనా వ్యాసంగాన్ని ఎన్నో యేట
ప్రారంభించారు?
నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు పుస్తకంలోని వేమన పద్యాలను చదివి, వాటిని అనుకరిస్తూ పద్యాలు రాశాను. వాటిని చూసిన మా తెలుగు మాస్టారు నన్ను ప్రోత్సహించారు. కాస్త ఛందస్సు పోకడలను సూచించారు. క్రమంగా రాస్తూ పోయాను. 1970లో మచిలీపట్నం నుండి వెలువడిన ‘అదృశ్యవాణి’ అనే పత్రికలో నా పద్యాలు మొదటిగా అచ్చయ్యాయి.

ఆ రచనా వ్యాసంగం వైపు రావటానికి
మీకు ప్రేరణ ఇచ్చిందెవరు?
ఖచ్చితంగా మా ప్రాథమిక పాఠశాలలో పాఠం చెప్పిన తిరునగరు రమణయ్య గారే. వారు మా పాఠశాలలో ప్రతి శనివారం మధ్యాహ్నం పూట మాతో వివిధ రకాలైన సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు నిర్వహించేవారు. చిన్న చిన్న నాటికలు కూడా వేయిస్తుండేవారు. స్వయంగా తానే పాటలు, పద్యాలు రాసి మాతో పాడించేవారు. ఇక్కడ మరో సంఘటన కూడా చెప్పాలి. ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే గంజి లక్ష్మణస్వామి అనే హరికథకుడు మా గ్రామానికి (నాగారం) వచ్చి హరికథలు చెప్పేవాడు. ఆయన గొప్పనటుడు, కథకుడు, కవి, రచయిత. ఆయన హరికథలో పాడే పాటలను మననం చేసుకొని తెల్లవారి అదే మూసలో స్వంతంగా పాటలు కట్టేవాన్ని. అట్లా వారిద్దరూ నన్ను చిన్ననాడే ప్రభావితం చేసి సాహిత్యానికి చేరువ చేసిన మహానీయులు.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
నేను సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్‌గా ఉద్యోగిస్తున్న కాలంలో (ఆ శాఖలో ప్రప్రథమునిగా) ‘తెలంగాణ శతక సాహిత్యం’పై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా స్వీకరించాను. దానినే అనంతర కాలంలో పుస్తక రూపంలో తెచ్చాను. అట్లా మొదట తెలంగాణ శతక సాహిత్యం తరువాత వ్యాసప్రభ, కళారామం, మన మడత కాళిదాసు నా స్వీయ రచనలు. ఇంకా పది పుస్తకాలను సంపాదకత్వం, చాలా కవితా సంకలనాలలో, అనేక పత్రికలలో, దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలలో కవితలు, వ్యాసాలు, సమస్యాపూరణాలు వచ్చాయి.

ఆ మీ పరిశోధనా అంశం గురించి
క్లుప్తంగా చెబుతారా?
తీరిక లేకుండా ఉద్యోగ జీవితం గడుపుతున్న నన్ను పరిశోధనవైపు మళ్లించిన వారు డాక్టర్ టి.శ్రీరంగస్వామి, డాక్టర్ లింగంపల్లి రామచంద్రగారలు. వారి స్ఫూర్తితో ఆ రంగం వైపు యత్నించిన నాకు నా పర్యవేక్షకులు డాక్టర్ బన్న అయిలయ్య గారు, పద్యం మీద నాకున్న ఆసక్తిని గమనించారు. తెలుగులో అప్పటి వరకు డాక్టర్ కె.గోపాలకృష్ణ రావు మాత్రమే 1964 శతక సాహిత్యంపై పరిశోధన చేశారు. అనంతర కాలంలో ఆ వైపు ఎవరూ పోలేదు. మీరు తెలంగాణ శతక సహిత్యం (1975-2000)పై పరిశోధించడ’ని సూచించి ఉద్యుక్తున్ని చేశారు. అప్పటి తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించి, కొన్ని ఉత్తరాల ద్వారా, కొందరు మిత్రుల ద్వారా శతక కావ్యాలను సేకరించాను. శతకం తెలంగాణ పొత్తిళ్లలోనే ఉద్భవించిందని, ప్రథమ శతక కర్త పాల్కురికి సోమనాథుడేనని నిరూపించాను. మహా కావ్యాల్లో కానరాని వినూత్నాంశాలు, మనిషి గవేషణకు అవసరమైన అనేక మార్గదర్శక సూత్రాలు, కళాత్మక విలువలు శతకాలు మనకందించాయనే వాస్తవాలను వెలికి తీశాను.

ఆ ఇప్పుడు వస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
వీధి వీధికో కవి పుట్టి.. వచన కవిత్వాన్ని విరివిగా పండిస్తున్నారు. అనేకంగా కవితాసంపుటలు వస్తున్నాయి. మంచిదే, కానీ కవిత్వం రాసేవాళ్లు బాగా చదివి, మధించి, అనుభవంతో రాయడం లేదు. అందువల్ల కవిత్వంలో కవిత్వాంశ కొరవడుతోంది!
ఆ మీకు నచ్చిన గ్రంథం?
బమ్మెర పోతనగారి శ్రీమదాంధ్ర భాగవతం.

ఆ మీకు నచ్చిన కవి?
శ్రీరంగం శ్రీనివాస రావు

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
‘కదిలేది - కదిలించేది - పెను నిదుర వదిలించేది’ అన్న శ్రీశ్రీ మాటలే నాకు స్ఫూర్తి.

ఆ సాహిత్యానికి ఇప్పుడు పత్రికలు ఇస్తున్న
ప్రాధాన్యతపై మీ అభిప్రాయం?
పత్రికలు సాహిత్యానికి చోటు కలిగిస్తున్నాయి. కానీ, రచయితలు - కవులు మేలైన రచనలు చేయడం లేదు. పూర్వం ‘్భరతి’ వంటి పత్రికలలో ఉత్తమ రచనలతో పాటు రసవత్తరమైన మేధో సంబంధిత సాహితీ చర్చలు జరుగుతుండేవి. కవిత్వం గూడ కండగలదిగా ఉండేది. ఇప్పుడు వస్తున్న సాహిత్య వ్యాసాలలో ఉపన్యాస ధోరణలు, కవిత్వంలో వింత పోకడలు ఎక్కువవుతున్నాయనేది నా అభిప్రాయం.

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా
పని చేయాలంటే ఏం చేయాలి?
సృజనాత్మక సాహిత్యం పండించడంలో సాహితీ సంస్థల పాత్ర ప్రధానమైంది.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
సాహితీ పురస్కారాలు ఆహ్వానించదగినవే. సాహిత్యకారులపై మరింత బాధ్యత పెరుగుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. ఉత్తమ సాహిత్యం వస్తుంది.

ఆ కవులు-రచయితలకు శిక్షణ అవసరమంటారా?
సామాజిక బాధ్యతతో రచనా వ్యాసంగం రావటానికి కవులు-రచయితలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
తెలంగాణలో కవులు - రచయితలు పూజ్యం అన్న అపవాదు నుండి బయటపడ్డాం. ఇంకా మన జానపద సాహిత్యం, తెలంగాణ సంస్థానాలలో నాడు వెల్లివిరిసిన సాహిత్యం, ముఖ్యంగా మన ప్రాంత సంచార జాతుల సాహిత్యం వెలుగులోనికి రానిది యెంతో ఉంది. విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు వాటికై విశేష పరిశోధనలు చేయించాలి.

ఆ కొత్త కవులు-రచయితలకు మీరిచ్చే సలహాలు?
మన ప్రాచీన సాహిత్యాన్ని మధించాలి. ఆంగ్ల భాషలో సహా వివిధ భాషల్లోంచి వచ్చే ఆధునిక సాహిత్యాన్ని పరిశీలించాలి. శ్రమజీవికి, అణచివేయబడిన వర్గాలకు సంబంధించి, ప్రధానంగా మనిషిని మనిషిగా నిలబెట్టే సాహితీ సృజనకై శ్రమించాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

పుస్తక పరిచయం

తడి ఆరని కవిత్వం ‘నిర్నిద్ర గానం’

ఇటీవలి కాలంలో తరచుగా సంఘటనలపై స్పందిస్తూ, అనుభూతుల్ని అందిస్తూ కవిత్వం రాస్తున్న కవయిత్రులలో డాక్టర్ కొండపల్లి నీహారిణి ఒకరు. అర్ర తలుపులు కవిత్వ పుస్తకంలో సాహితీవనంలో ప్రవేశించి నిర్నద్రగానం ఆలపిస్తున్న నిరంతర లేఖిని వీరిది! ప్రతి విషయం వస్తువుగా మారి వీరి కలం నుండి కవిత్వంగా జాలువారుతుంది. కుటుంబ జీవనం, సామాజిక అశాంతి, సంఘవిద్రోహం, మనుషుల జ్ఞాపకాలు, ఆకాంక్షలు, ప్రాంతీయత, స్పందనలు, పర్యావరణం విధ్వంసం, నోస్టాల్జియా ఇలా ఒకటేమిటి అనేక విషయాలు ఆమె కవిత్వంలో నిండి ఉన్నాయి.
ఆడతత్వం జాలితో ప్రతిఘటిస్తుంది
చదువుల బడిని మించిన జీవిత బడిలో
ఆమె శిష్యురాలు, ఆమే బోధకురాలు
వారసత్వ వెలుగులకై మగతనాన్ని గొప్ప చేసే అమాయక చేష్టలను
ఎత్తి చూపి కోటి ఆశలను కాలరాసే
కుటుంబ పద్ధతులను తప్పనిసరై ప్రతిఘటిస్తుంది
కౌటుంబిక జీవనంలో స్ర్తి ఏ విధంగా నడవాలో ఈ కవిత్వంలో ఉంది. ప్రతిఘటన తప్పదని అంటూనే, అది హింసాయుతం కాకుండా జాగ్రత్త చెబుతుంది. ఈమె వాస్తవిక దృష్టిని పట్టించే చాలా కవితలు నిర్నద్రగానంలో కానవస్తాయి!
‘నువ్వు సీసాలు ఖాళీ చేస్తుంటే
కన్నీటితో నింపుతుంది ఆమె’
సంఘజీవనంలో జరుగుతున్న తతంగాన్ని పై రెండు ఫంక్తుల్లో విప్పి చెప్పారు. సమస్త జీవరాశికి జన్మనిచ్చే మూర్తి అమ్మ. అలాంటి అమ్మ సాదకంలో కురిపించే ప్రేమ సమస్త ప్రకృతిలో నిండి ఉందని చెపుతూ
‘సముద్రమంత విశాల హృదయం
భూదేవికున్నంత సహనం
విశ్వమంతా వ్యాపించిన అమ్మకు మరణం లేదు / అమ్మ ప్రేమకు మరణం లేదు’ అని సూత్రీకరించారు.
దుస్సుముడి, కటికముడి, మార్జాల పథకం లాంటి అనేక పదాలు కవితల్లో కొలువుదీరి వాటికి నిండుదనాన్నిచ్చాయి. నవ్వులు నువ్వులు గావద్దని, దృశ్యంద్రష్ట, ఖేల్‌కతమ్ దుకునం బంద్, ఎట్లా నమ్మాలి? వర్ణమాల వగరుస్తుందా లాంటి కవితా శీర్షికలు పాఠకులను ఆకర్శిస్తాయి.
‘నేరాసే కవితా పంక్తులే
నేవేసే పాదముద్రలు
నా భావనా తంత్రులే
నా జీవన పథాలు’
అని చెప్పుకున్న రచయిత్రి డాక్టర్ కొండపలి నీహారిణి కలం నుండి మరిన్ని మంచి కవితలు జాలువారాలి. సహృదయుల మనస్సులకు శాంతిని కూర్చాలి. కఠిన హృదయాలకు తడిని అందించాలి.

- డాక్టర్ బి.వి.ఎన్.స్వామి
కరీంనగర్
సెల్.నం.9247817732

మనోగీతికలు

నాన్చివేత - దాటవేత

చెప్పేదేదో నాన్చినాన్చి
సేసేదేదో పక్కకు బెట్టి
పెకలని మాటల్తో.. ఏలుకని పదాల్తో
సతమతమయే బదులుకు
కుండబద్దలు కొట్టినట్టుగా
ఘంటాపథంగా చెబితే, రాస్తే
నీ ముల్లేం బోతుందట!?
మాయాచుర్మం లౌక్యం
కిటుకులు చిక్కులూ తెలియని
బడ బడగాడంటారనే గదా
నీ భయం?!
గుండెల్లో దాచుకునేదేదీ
గుండెల్ని బాధించక మానదు
నీ గుండెపోటుకి కారణ భూతం కాకపోదు
మేలోర్వని ఎదుటి వాళ్ల మాటలు
అలాంటప్పుడు వినకపోవడమే మంచిది!
విమర్శల జడివానకు జడిసే
రచనైనా మాటైనా నిలబడదు
కాల పరీక్షకు ఎదురొడ్డి నిర్భయంగా
అందుకే
నాన్చివేత దాటవేత కట్టిపెట్టి
ముక్కుసూటిగా ముక్కు తిమ్మనలా అందంగా
చెప్పడం రివాజు చేసుకో
నిలబడతావు నిటారుగా సాహితీలోకంలో!!

- డాక్టర్ దామెర రాములు, నిర్మల్, సెల్.నం.986422494

వృద్ధాశ్రమం

ఇది మానవ నిర్మిత పురాతన భవనం కాదు
మానవుల కోసం నిర్మించిన పురావస్తు భవనం
చరిత్రలోంచి వెలికి తీసిన వస్తువులు కాదు
చరిత్ర నుండి విసిరేసిన మనుషులుంటారు
అనుబంధాల చరిత్ర నుండి నా అనుకున్న వాళ్లు
విసిరి పారేసిన బతుకులుంటాయిక్కడ
నవమాసాలు మోసి కన్నందుకు
కనుపాపలా చూసి పెంచి పోషించినందుకు
కొందరికి, వారి పిల్లలిచ్చిన కానుక ఇది
గుండెల్లో పెట్టుకుని వారిన మోసినందుకు
అరచేతులతో కూడా సాకలేని రాతి గుండెలు
ఈ పాత మనుషులకు చూపించిన దారి ఇది
కడుపు కోసుకుని కన్నందుకు పిడికెడు ప్రేమనివ్వని
వారసులు, పాత గుండెలకిచ్చిన విడిది ఇది
అనురాగాలు ఆత్మీయతలు ఇంకా ఉన్నాయనుకుని
మోసపోయి కూలిన మనసున్న అస్తిపంజరాల ప్రదర్శనశాల
వారసత్వపు దాడిలో గాయపడిన శిథిల హృదయాల వేదిక
మనుషుల నిర్లక్ష్యానికి గురైన మానవత్వపు సమాధి
ఈ పురాతన సౌధానికి ముద్దుపేరు.. వృద్ధాశ్రమం

- కొత్త అనీల్ కుమార్
కరీంనగర్, సెల్.నం.9395553393

చిల్లర గవ్వలు

కూలీ పని వదులుకొని క్యూలల్ల నిలబడుతున్నరు
రెక్కాడితేగానీ డొక్కాడని రోజు కూలీ కెల్లెటోళ్లు
తాళం తీయకముందే
బ్యాంకుల ముందు నిలబడుతున్నరు
కాళ్ల నొప్పులొచ్చి అక్కడనే కూలబడుతున్నరు
పైసలుతీయ నిలబడితే కూలీపైసలు కూడా పోబట్టే
నల్ల కుబేరులను నడిబజార్లకీడ్సుడేమోగానీ
నగదు లేక జనాలంతా
లైండ్లల్ల నకనకలాడుతున్నరు
సామాన్యుల బతుకు బ్యాంకుల ముందే తెల్లారిపోతున్నది
చిన్న వ్యాపారులు చిల్లర కోసం బెంగటిలుతున్నరు
దేశం ముందుకు పోతుందట కొత్త ఊపిరిపోసుకొని
నల్లపైసలు నల్లనయ్యలు నవ్వుకుంటనే ఉంటున్నరు
బక్క పాణం బడుగు జీవులే బతుకు పోరు చేస్తున్నరు
వందలే ఏటిఎంలల్ల వంద ఏమాత్రం వందేమాతరం
వందలతోనే ‘జియో’ భారత్ కొత్త కట్టలొచ్చేదాక!

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల
సెల్.నం.9948748982

ఎవడు పేద!?

ఎవడు పేదరా ఓరన్నా..ఎవడు ధనికుడు
దయాగుణం ఉన్నవాడే మహాధనికుడు
పేరాశగలవాడే పేదవాడురా..పెద్ద పేద వాడురా
పేద-్ధనిక బేధం వట్టిబోగస్‌రా..
బీదరికం అంటే లేమి తనము కాదురా
ధనికం అంటే ఉన్న తనము కాదురా
మంచి గుణం కలవాడే ఉన్నవాడురా
చెడ్డవాడెపుడూ అధముడేరా
ధనముతోనే గొప్ప పేరు రాబోదురా
మన మానవతే గొప్పవారిగ నిలుపుతుందిరా
స్వార్థ చింతనెపుడు నీకు పనికి రాదురా
పది మందికి పనికివస్తే నువ్ పెద్ద గొప్పరా
ప్రయత్నించకుండా ఏ ఫలితం రాదూ
సాధన లేకుండా ఏదీ సాధ్యం కాదు
లోపం లేకుండ నువ్ ప్రయత్నించరా
ఈ లోకమే నీకు తోడవునురా!

- అడప రాజు
సీతారాంపురా, వరంగల్ జిల్లా
సెల్.నం.9177825265

ప్రకృతి కారుణ్యం
తల్లి గర్భము నుండి తరలివచ్చిన వాని
కాధారమై నిల్చునవనిమాత
దాహమ్ముతో గొంతు తహతహలాడగ
వానలు కురిపించు వారిదమ్ము
చలికోర్చుకోలేక సాగిలబడువాని
వెచ్చని మంటతో పిలుచునగ్ని
స్వేదమ్ముతో మేను చెమ్మగిల్లినవాని
గాలితో నిమురును గంధవహుడు
తలదాచుకోలేక తల్లడిల్లెడువాని
కై గొడ్గుపట్టును గగనవిభుడు
కలల విహరించువానిని కరములనిడి
మేలుకొల్పును సూర్యుడు మేలుతోడ
పొద్దు పొద్దంత పనిచేసి పొగలువాని
నిద్రబుచ్చును జాబిల్లి భద్రకాంతి
భవ్య దేవతలీరీతి పగలురేలు
మానవాళిని గాపాడి మసలుచుండ
వాని దలపక గర్వమునూని నరుడు
ప్రకృతి విధ్వంసమును జేయపాడియగునె?
శుభ్రతను రక్షసేయుడు సుజనులార!

- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557

విషాద అందం
ఆనందం ఘనీభవించిన మనసులో
నేనొక పూలరెక్కనై
నేల రాలుతుంటాను
ఎంత వెదికాను సౌందర్యం కొరకు
ఎంత తిరిగాను అందం కొరకు
నా పూర్వ కవుల పుణ్యమా అని
అందం సౌందర్యమంటే
ఆడబొమ్మనే ఉదాహరణగా మార్చారు
అక్కడ నాకు తల్లే కనిపించింది
సౌందర్యం కనిపించలేదు
ప్రేమ సౌందర్యం
ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా?
తల్లి ప్రేమ ముందు ఏ అందం ఎంత?
సహజ సౌందర్యాన్ని నా కన్నుల్లో ఆవిష్కరించాలని
ఉదయానికి ముందే లేచి
విచ్చుకొంటున్న తూర్పు రేఖలు చూచాను
నిటారుగా నిల్చిన గడ్డి పోచలో ఎంత అందముంది
గులాబీ ఆకు మీద నిల్చిన మంచుచుక్క
అందంగానే వున్నా
శ్రామికుని చెమట చుక్కముందు అదెంత?
ఇక్కడ శ్రమలో ఆనందం కనిపిస్తుంది
అందం ఎక్కడుంది?
రైతు ముఖంలో వుంది
రాళ్లను రత్నాలను ఏరలేని
ప్రపంచీకరణ జాతరలో
దోపిడి అందంగా కనిపించటం
విచిత్రం కాదు విషాదం!

- సిహెచ్.మధు
నిజామాబాద్, సెల్.నం.9949486122

email : merupuknr@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- బి.హరిప్రియా గిరిధర్ రావు