డైలీ సీరియల్

అమ్మానాన్నకు - 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ వెళ్లి కాలేజీలో చేరా.. నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో నాన్నకు రెండుసార్లు మాత్రమే ఫోన్ చేశా, డబ్బుకోసం.. ఏ పండగలకూ, ఏ లీవులకూ ఇంటికి వెళ్లలేదు. వెళ్లానిపించలేదు.
నేను పెరిగిన వాతావరణం, నేను చదువుకున్న చదువు, నా ఆలోచనలు పూర్తిగా భిన్నం. ఊరికి వెళ్లినా అమ్మా నాన్నతో ఒక్క రోజు కూడా ఉండలేననిపించింది. నాన్న మాత్రం ఎవరిదో బంధువుల పెళ్లికని ఒక్కసారి వచ్చి చూసి వెళ్లారు.
ఇక్కడ అన్ని సెమిస్టర్‌లలో నేనే ఫస్ట్..
ఇక నాలుగు నెలల్లో చదువు ఐపోతుంది. ప్రముఖ కంపెనీలు మా క్యాంపస్‌కు వచ్చి సెలక్షన్ నిర్వహించాయి. నాకు సంవత్సరానికి 18 లక్షలతో ప్లేస్‌మెంట్ దొరికింది.
మళ్లీ అన్ని పేపర్లలో, టీవీల్లో నా గురించి.. నా జీతం గురించి.. అమ్మా నాన్న త్యాగం గురించి కథనాలు ప్రసారం అయ్యాయి.
నాకు నెలకు ఒకటిన్నర లక్షల రూపాయల జీతం అనగానే అమ్మా నాన్న చాలా సంతోషించారు. నా సంతోషాన్ని పణంగా పెట్టిన చదువుకు లభించిన ఆ జీతం నాకెందుకు సంతోషాన్నిస్తుంది.
చదువు అయిపోతూనే నేరుగా ఢిల్లీ వెళ్లి ఉద్యోగం చేరిపోయా. ఉద్యోగంలో చేరిన మొదటిరోజు ఎలాంటి ఉద్వేగానికీ లోను కాలేదు. తర్వాత రోజు కూడా.. ఇక్కడ ఉద్యోగానికీ, ఇంతకాలం చదువుకూ పెద్ద తేడా లేదనిపించింది.
అయితే, అక్కడ ఎవరో రాసిన దానిని అందరితోపాటు చదివేవాడిని. ఇక్కడ నా సొంత ఆలోచనలతో పని చేస్తున్నా. ఇంతే తేడా. ఒత్తిడి, అశాంతి, అభద్రత మామూలే.
మొదటి నెల జీతం అందుకున్నా.. ఒకటిన్నర లక్ష.. ఏం చేయాలి ఇంత డబ్బు?
ఇంత డబ్బు ఖర్చు చేసే విధానం నాకు ఇంతవరకూ ఎవ్వరూ నేర్పలేదు. ఇంత డబ్బు చేతికి వచ్చినా ఆనందం అనిపించలేదు. ఇది అమ్మా నాన్న కోరుకున్న డబ్బు.
నేను కోరుకుంది కాదు.
నేను ఆశించింది నాకు రెండు లక్షలు వచ్చినా ఆనందం ఉండదు.
నేను ఆశించింది ఒక్క రూపాయే అయినా, అది దొరికితే చాలా ఆనందం...
అమ్మా నాన్నకు బట్టలు కొనాలనిపించలేదు.. మళ్లీ ఎందుకో వెళ్లి కొన్నాను.బట్టలు తెచ్చి ఫ్లాట్‌లో పెట్టాను.. వాటిని పంపించలేదు. వాటిని పంపించాలి అనుకుంటూనే నాలుగు నెలలు గడిపేశాను. ఆ బట్టలు చూసినపుడంతా నాకు అమ్మా నాన్న మీద కోపం వచ్చేది.. వాటిని ఎదురుగా పెట్టుకుని వాళ్లను తిట్టేవాడిని. చిన్నప్పటినుంచీ నేను పడ్డ మానసిక హింసను చెప్పుకునేవాడిని.
ఇంతలో నాన్న దగ్గర నుంచి ఫోన్.. ‘అమ్మ చనిపోయింది’ అని..
ఈ వార్త నాలో ఎలాంటి ఉద్వేగాన్నీ కలిగించలేదు. బాధ కలగలేదు.. నాకు తెలిసిన ఒక మనిషి చనిపోయింది.. అంతే. ఇంటికి కూడా పోవాలనిపించలేదు.. రానని చెప్పేశాను. మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంటే స్విచ్ఛ్ఫా చేశాను. కానీ అశాంతిగా అనిపించింది.
ఇక్కడ నాతోపాటు పనిచేస్తున్న నలుగురైదుగురు అడిగారు ‘‘ఎందుకు అలా ఉన్నావే’’ అని.
విషయం చెప్పాను. వారు నాకు సానుభూతి చూపించారు.. వెంటనే బయలుదేరి వెళ్లమని చెప్పారు.
నా మనసులో ఇప్పటికీ అమ్మ అంటే రెండే రూపాలు కనిపిస్తాయి..
ఒకటి.. నాకు జ్వరం వచ్చినపుడు నా దగ్గర కూర్చుని తడి గుడ్డ పెడుతున్న అమ్మ...
రెండు... ఊర్లోని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే, ఎండిన సన్నజాజి చెట్టు పక్కన రంగు వెలసిన గోడకు ఆనుకుని ఉన్న అమ్మ.
- ఇంకా ఉంది

-సుంకోజి దేవేంద్రాచారి