డైలీ సీరియల్

బంధహేతువు సంసారం? (ప్రహ్లాదుడు -7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రహ్లాదుడిని హింసిస్తున్నవారు, ఆ హింసను చూస్తున్నవారు అందరూ ఇది ఏమి ఈ బాలకుడు కాస్తకూడా భయపడడం లేదు. కొట్టవద్దు, హింసించవద్దని కూడా అడగడం లేదు. చిరునవ్వుతో చూస్తునే ఉన్నాడు అని విభ్రాంతి చెందారు. మహారాజుకు ఈవిషయం చెప్పారు. మరింత ఆశ్చర్యపడి ఇది ఏమి నాకొడుకు ఇలా తయారు అయ్యాడు. వీనిని ఎంత బాధిస్తున్నా కాస్త కూడా మార్పు లేదాఅంటూ తానే స్వయంగా నిలబడి మరీ కొట్టించాడు. నానారకాలుగా హింసించమని ప్రోత్సహించాడు. అపుడు కూడా ప్రహ్లాదుని నోటివెంట హరీ, మురారీ ,నారాయణా, పాపహరణా, లోకపావనా, సర్వసృష్టినియంతా అంటూ హరినామాన్ని వదలలేదు. ఆశ్చర్యమూ దుఃఖమూ రెండూ ఏకకాలంలో హిరణ్యకశిపుడికి కలిగాయి. ఎంతో ఖేదంతో ఏకాంతంగా కూర్చుని పూర్వం శునశే్శపుడు అను పిల్లవాడిని వాని తండ్రి యాగపశువుగా ఇచ్చినా కూడా అతడు తండ్రిపై ద్వేషం పెంచుకోలేదట. అట్లాగే వీడు కూడా ఇంత హింసించినా నాపై క్రోధం ఉన్నట్టుకనబడడు. పైగా చిరునవ్వును వీడడు. ఇంత చిన్నపిల్లవానికి ఇంత నిబ్బరం ఎక్కడ నుంచి వస్తోంది.
అసలేమీ చేస్తే నా శత్రువు కీర్తన ఆపుతాడు వీడు. సమయానికి శుక్రాచార్యులుకూడా లేరే అని చింతించసాగాడు. భగభగ మండే మంటల్లో వేసినా కాలడం లేదు. గొంతునులిమి సముద్రంలోకి విసిరి వేసినా కొట్టుకు వస్తున్నాడు. కదలకుండా గట్టిగా కట్టివేసినా కంటిలో నీటిచుక్క రావడంలేదు. ఏదో బ్రహ్మానందంలో ఉన్నట్టు ఆ ముఖం ఎంతో ప్రశాంతంగా ఎలా ఉంటోంది. తండ్రీ ఇక ఈబాధలు భరించలేను. ఆ నారాయణ నామాన్ని వదిలేస్తాను అని చెప్తాడేమో అని ఎదురుచూస్తుంటే అసలు వీడు క్షణ మాత్రం కూడా భయపడడం లేదేమి. అసలు వీడు నాకొడుకేనా? అని దిగులు చెందాడు హిరణ్య కశపుడు.
అపుడు చండామార్కులు వచ్చారు. ‘రాక్షసరాజా! మీబాధ మాకు అర్థమైంది. ఈప్రహ్లాదుడు చాలా గట్టివాడు. స్థిర నిశ్చయమున్న బాలకునివలె వ్యవహరిస్తున్నాడు. ఇతడిని ఇలా బాధపెట్టి కాక మెల్లమెల్లగా కామశాస్త్రాన్ని , వివిధ వస్తువుల పట్ల ఆకర్షణను కలిగించేలా చేయగలిగితే సంసారం పట్ల అనురక్తిని కలిగించగలిగితే ఆ మురారి నామాన్ని వదిలేవేసి ముదిత వెంట పడుతాడు. మెల్లమెల్లగా ఇంద్రుని పై ద్వేషాన్ని కలిగించే మాటలను మేము నేర్పిస్తాము. మీరేమీ చింతించకండి ’ అని వారు చెప్పారు. వాటినంతా విని ఇదీ బాగుంది నిజమే. సంసారంలో పడిన వారికి ఏ ఒక్కక్షణమూ మరొక ధ్యాస ఉండదు. సురాపానం చేసినవారివలె ఆ సంసారమనే మత్తులోనే ఉండిపోతారు. అంతేకాదు కుడితిలో పట్ట ఎలుక వలె దానినుంచి పైకి రావాలన్నా కూడా వారు రాలేరుసుమా. ఇదే మంచిది అని వెంటనే సంసార విషయాల పట్ల ఆసక్తి కలిగించడానికి తిరిగి గురువుల దగ్గరకు ప్రహ్లాదుడిని పంపించాడు.
గురువుల దగ్గరకు వచ్చిన ప్రహ్లాదుడు ఎప్పటిలాగే ఉన్నాడు కానీ చింత కానీ ఆనందాన్ని కానీ వ్యక్తం చేయలేదు.
గురువులు మహారాజుకిచ్చిన మాట ప్రకారం ప్రహ్లాదుడికి సంసారానికి పనికి వచ్చే ధర్మార్థ కామపురుషార్థాలను బోధించసాగారు. నానావిధమైన కోరికలు జనించడానికి కారణాలను చెప్పసాగారు. అవి అన్నీ విని ప్రహ్లాదుడు మనసున అయ్యో నా తలంపులను మార్చడానికి వీరు ఇవన్నీ చెబుతున్నారు. తేనె రుచి చూచిన వారెవరైనా తిరిగి బెల్లం పాకాన్ని రుచి చూస్తారా.. అసలైన అమృత పానం చేసిన వారు సురాపానం కోసం వెర్రెత్తుతారా.. ఏమిటీ జనులు. ఎందుకీ భ్రమలో కొట్టుకు పోతున్నారు. కానీ నేను మాత్రం ఆ సర్వసృష్టికి కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని సేవను మాత్రమే కోరుకుంటాను. నాకీ అశాశ్వతాలైన విషయభోగాలు అక్కర్లేదు అని అనుకొన్నాడు. అంతేకాదు గురువులు స్నానానికని, సంధ్యావందనాలకని వెళ్లిన సమయం గమనించాడు. తన తోడి బాలకులను ఒక్క చోట చేర్చాడు. వారితో చక్కగా ఆటలాడుతూ పాటపాడుతూ వారిలో ఒక్కడై మెలిగాడు. వారిలో మహారాజు కుమారుడన్న జంకును దూరం చేశాడు. అందరూ ప్రహ్లాదుడంటే ఇష్టాన్ని పెంచుకున్నారు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804