డైలీ సీరియల్

విలువల లోగిలి-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనూహ్యంగా పాతిక అంకె అయిదు వందలకిచేరింది. ఇక అడ్మిషన్సన్స్ తీసుకోమని ప్రకటించేసింది. మధ్య మధ్యలో ఎవరినీ చేర్చుకునే ఉద్దేశ్యం కూడా లేదు. అందరూ తన శిక్షణలో ఒకేరకంగా పెరిగినవారయితేనే తను అనుకున్నది సాధిస్తుంది. వారిమధ్య ఒక్క కలుపుమొక్క చేరినా తన ప్రయత్నం మొత్తం విఫలవౌతుంది. అంతకంటే సంఖ్యను పెంచుకుంటే వారికి తాను పూర్తి న్యాయం చేయలేననుకుంది. ఒకపెద్ద స్కూలుకి ఉండే సంఖ్య తన ఒక ఒకటవ తరగతికే లభించటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది నిజమేనా కల కాదుగా అంటూ చందూని ప్రశ్నించింది.
ఆ రోజు వెబ్‌సైట్ వద్దని ఎంత గొడవ పెట్టావు. ఇపుడు బ్లాగ్స్, ట్విట్టర్స్, ఫేస్‌బుక్స్‌లు హవా నడుస్తుంది డియర్. వాటిని మంచికి ఉపయోగించుకోవటంలో తప్పులేదు.
నిజమే కదా అనుకుంది జరుగుతున్నదంతా చూసి. అమృతకి, విశ్వకి క్షణం ఖాళీ దొరకటం లేదు. కర్తవ్యానే్న ఊపిరిగా భావించే వారిద్దరికీ తీరిక సమయం కావాలని కూడా కోరుకోవటంలేదు.
ఎన్నో జెండాలు ప్రక్క ప్రక్కనే రెపరెపలాడుతున్నట్లు పిల్లలంతా ఒకచోట చేరి జాతీయ గీతం ఆలపిస్తుంటే తన రెండు కనులూ చాలవనిపిస్తోందామెకు. ప్రతిరోజూ ఆ సమయానికి ఆమె అక్కడుండాల్సిందే. ఆ దృశ్యాన్ని తనివితీరా చూడాల్సిందే.
వారంతా తన కలల పంటలు.
విలువల లోగిలిలో పెరుగుతున్న చిట్టి చిట్టిమొక్కలు. రేపు వీరే మహావృక్షాలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలబడే గురువులుగా మారతారు. అపుడు మన దేశ సంస్కృతి ప్రపంచ దేశాలలో మరింతగా ప్రాకుతుంది. భారతదేశానికి ప్రపంచమంతటా ఉన్న కీర్తి చిరస్థాయిగా మిగిలిపోవాలన్నదే తన కోరిక.
ఇది ఇంతగా ఎందుకు ప్రబలిందంటే ఈమధ్య తరచుగా విదేశీ వనితలు మనవారితో అత్యాచారం చేయబడటం భరించలేకపోయింది. స్ర్తిలను గౌరవంగా చూసే మన దేశంలో ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలంటే పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, బాధ్యతలు, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏవి చేయకూడదు అనేది స్పష్టంగా తెలియపరచాలనుకుంది. అందుకే తను చేసేది పెద్ద సాహసమే అని తెలిసినా ధైర్యంగా ముందుకు నడిచింది. ఇంత పెద్ద ప్రోత్సాహం ఎవరికీ రాదేమో! ఇక ముందు కూడా! ట్రస్ట్ తరఫున చేసిన అతి పెద్ద కార్యక్రమం ఇదే అవుతుంది. తన పేరు పెట్టినందుకు ఈ మాత్రం సార్థకత లభిస్తేచాలు అనుకుంది ఆమె. కానీ చరిత్ర సృష్టించింది అని కొన్నాళ్ళలో ఆమెకే తెలుస్తుంది.
ఎందుకంటే ఈ అంశం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ పరిశీలించటం ప్రారంభించింది. ఏ నిముషాన్ననయినా విశ్వ గిన్నీస్‌లోకి ఎక్కవచ్చు. ప్రపంచ ఖ్యాతి గడించవచ్చు.
విశ్వ ఇలాంటివాటిని పట్టించుకునే మనస్తత్వం కాదు. ఎంతసేపూ తన ప్రేమను అందరికీ అందించాలి. అందరి ప్రేమను తను పొందాలి, అంతవరకే.
స్కూలులో ప్రతి పాపను, ప్రతి బాబును నవ్వుతూ పలకరిస్తుంది. ఆమె పెదాలు విచ్చుకుంటే గులాబీ వికసించటాన్ని చూసిన అనుభూతి కలగాల్సిందే. అందుకే ఆ అనుభూతిని అందరూ కావాలని కోరుకుంటారు.
****
ఒక ఆదివారం ‘‘చెల్లీ!’’ అంటూ ఫ్యామిలీతో వచ్చింది భీమేశ్వరి.
‘‘రా అక్కా రా!’’ అంటూ ఆహ్వానించింది నవ్వుతూ విశ్వ.
‘‘చెల్లీ! మరీ నల్లపూసవైపోతున్నావ్. మేం వస్తేనే కనిపించటం, ఒక్కసారి కూడా మళ్లీ రాలేదు’’
అవును. తనకసలు ఖాళీ ఉండటం లేదు. ఒకసారి ‘గ్రేస్’ పుట్టినరోజు అంటే కుటుంబం అంతా కలిసి వెళ్లివచ్చారు. మళ్లీ వెళ్లటానికి కుదరలేదు. మాతో పంతాలు పెట్టుకోండా మీకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వచ్చెయ్యండి అని పదే పదే చెబుతుంది విశ్వ.
నీ దగ్గర అలాంటి పట్టింపులు మాకు లేవు అంటూ మధ్య మధ్యలో వాళ్ళే వస్తున్నారు.
‘‘స్కూలులో కాస్త బిజీగా ఉంటున్నాను. తప్పకుండా వస్తాం నేనూ, చందూ’’ అంది ఆమె ప్రశ్నకు సమాధానంగా.
‘‘మీవన్నీ నెట్‌లో చూస్తున్నాం. చాలా బాగా చేస్తున్నారు’’ అన్నాడు జార్జ్, అభినందిస్తూ.. కళ్ళతో ఆ భావాన్ని ప్రస్ఫుటపరుస్తూ.
‘‘్థంక్స్’’ అంది గ్రేస్‌ను తన ఒళ్ళోకి తీసుకుంటూ.
గ్రేస్ వచ్చాడంటే అమృత, సుగుణలకు పండుగే.
శివ, గంగ, ఆలి కూడా వాళ్ళకు తోడవురు.
ఇక ఇల్లంతా సందడే సందడి.
విశ్వ అయితే తన పనులన్నింటికీ కాసేపు బ్రేక్ ఇస్తుంది వాళ్ళంతా వెళ్ళేంతవరకూ. ఎక్కువగా వాళ్ళూ వచ్చేది హాలీడేస్‌లోనే కాబట్టి అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు.
గ్రేస్ అయితే నరేంద్రనాధ్ మీసాలు పట్టుకొని వదలనంటాడు. సూర్యచంద్రని మాత్రం ముద్దులతో ముంచెత్తుతాడు. ఇంకెంతమంది అడిగినా ముద్దు ఇవ్వనుగాక ఇవ్వనంటాడు.
అంత స్పెషల్ ఏముందని గ్రేస్‌ని ఏడిపిస్తుంది విశ్వ.
ఇక్కడకు వస్తే గంటలు క్షణాలుగా గడిచిపోతాయి అంటుంది భీమేశ్వరి.
అలా వాళ్ళు నాలుగు సార్లు వచ్చి వెళ్లారో లేదో ఫోనులో యుద్ధం ప్రకటించాడు ధర్మేంద్ర.
‘‘ఏమిటి దాన్ని మీ ఇంట్లోకి రానిస్తున్నారు?’’ అంటూ.
‘‘అదేమిటిరా అలా అంటావ్? తను వెతుక్కుంటూ మా ఇంటికి వస్తే ఎలా రావద్దని చెప్పమంటావ్? నువ్వయితే అలా చేస్తావా?’’
గట్టిగా అడిగాడు సూర్యచంద్ర.
‘‘ఆ! నేనయితే గడప త్రొక్కనివ్వను’’ అన్నాడు కచ్చితంగా.
‘‘నేనలా అనలేనురా.. శత్రువయినా నా ఇంటి తలుపు తడితే నవ్వుతూనే ఆహ్వానిస్తాను. ఈ విషయంలో నన్ను పట్టించుకోవద్దు’’.
‘‘అయితే మీరూ మాకు వద్దు’’ అనేసాడు ఖరాఖండీగా.
ఎక్కడయినా కనిపించినా ముఖం తిప్పేసుకుంటున్నారు.
తను ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబం అంతా.
విశ్వకిదంతా చాలా బాధను కలిగిస్తోంది. అయినా చందూనే సమర్థిస్తోంది.
‘‘చిన్నప్పటి నేస్తం, అత్తాకొడుకు బంధం అంతా ఒక్క చిన్న మనస్పర్థతో కొట్టుకుపోయిందా? బంధం ఎంతో గట్టిది అంటారే. ఇలా పుటుక్కున తెగిపోయేదాన్ని బంధం అంటారా? ప్రేమకు అర్థం ఇదేనా? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టేవి. అలా విడిపోయిన వాళ్ళు మళ్లీ కలవనేలేదు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206