డైలీ సీరియల్

వరాల ప్రభావం.. అమరావతిముట్టడి (Iవామనుడు - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిభక్తుడైన ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండ ఇచ్చినాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. విశ్వజిద్యాగానితో రత్నకచిత సువర్ణకంకణాలు, ఖడ్గమూ లభించాయి.
యాగానికి వచ్చిన విప్రులకు భూరీ విరాళాలను ఇచ్చారు. వారంతా బలిచక్రవర్తిని వేయ్యేండ్లు సంతోషంతో జీవించమని దీవించారు. నిండు భక్తితో ఇలవేల్పుతో పూజించాడు. బలిచక్రవర్తికి గురు అనుగ్రహం లభ్యమైందని రాక్షసులంతా ఎంతో సంతోషించారు. శుక్రుడు దగ్గర నుండి నూరు అశ్వమేధ యాగాలను బలిచక్రవర్తి చేత చేయించాడు. ఆవిధంగా బలి బలిష్టుడైనాడు. బలి శుక్రాచార్యుని అనుమతి తీసుకొని జైత్రయాత్రకు బయలుదేరాడు.
ఎన్నో యేండ్లుగా ఉన్న ఇంద్రుని జయించాలన్న కాంక్ష బలిలో ఉదృతమైంది. వెంటనే తన రథానికి గుఱ్ఱాలను పూన్చి బయలుదేరాడు. స్వర్గలోకానికి సమీపించాడు బలి. స్వర్గలోకం పుణ్యాత్ముల నివాస స్థానం. ప్రశాంత వాతావరణముండే ఆ స్వర్గలోకంలో గాలికి దేవతల జెండాలు రెపరెపలాడుతున్నాయి. పవిత్రమైన ఆకాశగంగా జలాలు నిర్మలంగా ప్రవహిస్తూ ఉన్నాయి. విరగకాసిన పూలతో నిండిన వృక్షాలపైన గండు తుమ్మెదలు వాలి మకరందాన్ని తనవితీరా తాగుతూ ఝంఝం అనే రాగాలు తీస్తున్నాయి. గున్నమామిడి చెట్లల్లో వసంతుణ్ణి ఆహ్వానిస్తూ చిగురులు వేసిన చిటారకొమ్మన కోయిల జంటలు నిలబడి యుగళగీతాలను ఆలపిస్తున్నాయి. చిలుక గుంపులు పక్వంగా పండిన పండ్లపై వాలి తన ముక్కులతో పొడుచుకుని తింటూ వాటి పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాయి. రాయంచలు, హంసలు అన్నీ సంతోషంతో నీటికొలనుల్లో తిరుగాడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లల్లో దూడలతో కలసి కామధేనువులు తిరుగాడుతున్నాయి.
పండ్లుపూలతో నిండిన చెట్ల కొమ్మరెమ్మల వల్ల ఉత్పన్నమైన వాయువు పరిమళభరితమై చల్లదనాన్ని ఇస్తోంది. మకరతోరణాలను రాసుకుంటూ మదపుటేనుగులు విహరిస్తున్నాయి. చల్లని కొలనుల్లో దిగి ఒకదానిపై మరొకటి నీటిని విరజిమ్ముకుంటూ ఆట్లాడుతున్నాయి. కొంతమంది దేవతలు దివ్యమైన పవిత్రమైన విమానాల్లో తిరుగుతున్నారు. అంతటా సంతోషం వెల్లివిరుస్తూన్న ప్రదేశమే స్వర్గసీమకదా కనుచూపుమేరలో కనిపించే స్వర్గాన్ని తలుచుకున్నాడు బలి.
అమరావతి పట్టణానికి సువర్ణంతో చేసిన తలుపులున్న పెద్ద పెద్దగోపురాలున్నాయి. ఆ ద్వారాల పక్కనే రత్నాల కాంతులను వెదజల్లే ఇంద్రనీల స్తంభాలున్నాయి. ఆ పట్టణ ద్వారబంధాలకు తోరణాలుగా ఉన్న పద్మరాగ వర్ణాలున్న మణులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ద్వారాల దగ్గర ఉన్న చావిళ్లల్లో ఆయుధాలు ధరించిన ద్వారపాలకులు అప్రమత్తులై ఉన్నారు.
వారంతా దేవదానవ యుద్ధాల ముచ్చట్లు చెబుకుంటున్నారు. ఆ పోరుల్లో పురుషోత్తముడైన మహావిష్ణు పౌరుషాన్ని, పరాక్రమాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.అది గమనించిన బలి మహారాజు కోపావేశానికి గురైయ్యాడు. యుద్ధసంగతులు గుర్తుకు వచ్చి మరింత బలి ఆవేశపరుడైయ్యాడు. స్వర్గలోకంలో ఉన్న కోటలకు తాపడం చేసిన వజ్రవైడూర్యాల కాంతి బలి చక్రవర్తి కనులకు మెరుపుల వలె తాకాయి. బలిచక్రవర్తి అమరావతిని తేరిపార చూద్దామనుకొని తన దృష్టిని పొడవు చేశాడు. మరకతమణులతో నిర్మించిన ఋరుజులు ఆయనకు కనిపించాయి.
మేడలన్నీ ఆకాశాన్ని తాకడానికి పోటీ పడుతున్నట్టుగా ఎత్తుగా సాగి ఉన్నాయి. వాటిపైన శత్రువులను చీల్చి చెండానికి తయారుగా శతఘు్నలు అమర్చి ఉండడం బలిచక్రవర్తి కంట పడింది.
రహదారుల్లో వీరాధివీరులవలె తమకెవరూ పోటీ లేరన్నట్టుగా తిరుగుతున్నారు. అందమైన ఉద్యానవనాల్లో, సరోవరాల్లో ముత్యాలు ధరించిన స్ర్తిలు వయ్యారాలు ఒలకబోస్తూ విహరిస్తున్నారు. వారి నడకలను మేమే నేర్పామన్న పొగరుతో నెమళ్లు పురివిప్పి ఆడుతున్నాయి. సమస్తదిక్పాలకుల గుంపులతో నిండి ఉన్న భవనాన్ని చూసి అది తప్పక ఇంద్రునిదై ఉంటుంది. ఇంద్రుని దర్శనం కోసం వీరంతా ఎదురుచూస్తున్నారని బలిచక్రవర్తి గ్రహించాడు.
ఇక జాగు చేయకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. తన వెంట సాగి వచ్చిన తన సైన్యానికి దేవలోకాన్ని ఆక్రమించమని ఆజ్ఞ ఇచ్చాడు. అసలే కొవ్విడి ఉన్న కొత్త రాక్షస సైన్యం దేవలోకంపైకి విజృంభించింది. విజయశంఖారావాలు దద్దరిల్లాయి. ముల్లోకాలు బలి నిర్వాకాన్ని తెలుసుకొని ఆశనిపాతులైయ్యారు.
ఈ సంగతి దేవరాజుకు తెలిసింది. వెంటనే కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు. దేవతావీరులతో కలసి దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లాడు. తమకు వచ్చిన ఆపద గురించి చెప్పాడు.
ప్రళయాగ్ని వలె మండిపడుతూ క్రూరులైన రాక్షసులతో చేరి నాడు ఓడిపోయి నేడు మరలా విర్రవీగుతూ వచ్చాడంటే ఏ బలాన్ని నమ్ముకుని ఇటు వచ్చాడు? ఏ తపస్సు వల్ల బలికి ఇంతటి శక్తి లభ్యమైంది. ఈ బలి ఎవరు సాయాన్ని పొందాడు? వీనిని గెలిచే ఏ ఉపాయమేదైనా ఉందా?2 అని అడిగాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804