డైలీ సీరియల్

విలువల లోగిలి-76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేదంటే ఈ భూమిమీద కూర్చోవటానికి కూడా స్థలం ఉండదు. అందరూ నిల్చొనే జీవితం గడపాలి.
అందుకే ఈ జనన, మరణాల తతంగాలు.
***
కాల చక్రంలో రెండేళ్ళు కదిలిపోయాయి.
సూర్య ఇంజనీరింగ్ కాలేజీ, సూర్య మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యాయి. లోగిలి విద్యార్థులు గడప దాటవల్సిన అవసరం లేకుండాపోయింది.
ఎవరి ఆసక్తిని బట్టి వారు ఆ ఆ కాలేజీల్లో చేరిపోయారు.
మరో నాలుగేళ్ళలో వాళ్ళంతా రెక్కలొచ్చిన పక్షులులా ఎగిరిపోతారు. కానీ ‘విశ్వాస్’మాత్రం అలా వెళ్ళనంటాడు. మెడిసిన్ అయిపోయాక మన హాస్పిటల్‌లోనే ఉంటాను. చిన్నతనం నుంచీ సొంత పిల్లల్లా మమ్మల్ని పెంచి పెద్దజేశారు. మీ పిల్లలు ఉంటే దగ్గరుండి మిమ్మల్ని చూసుకోరా? అందరినీ మీరు చూసుకుంటే మిమ్మల్ని చూసుకునే వాళ్ళుండాలిగా అంటారు ఎప్పుడు మాట వచ్చినా. ససేమిరా వదిలి వెళ్ళనంటాడు.
‘‘నీకు బయటనుంచి భవిష్యత్తు ఉంటుంది విశ్వాస్’’ అంటుంది విశ్వ.
అయినా ఒప్పుకోడు. అమ్మ ప్రేమ ముందు అదంతా తక్కువే అని సమాధానమిస్తాడు.
ఇలాంటివి వింటుంటే ప్రేమ ఎంత గొప్పది అనిపిస్తుంటుంది విశ్వకు.
***
‘‘హలో! మేడమ్ గారూ! కాస్త ఈ దీనుడిని కరుణిస్తారా?’’ ఎప్పుడు వచ్చాడో తను గమనించనే లేదు.
‘‘మేమనాలామాట’’.
ఈమధ్య సూర్యచంద్ర బిజీగా ఉంటున్నాడు మరి.
‘‘ఎంత బిజీగా వున్నా శనివారం, ఆదివారం దేవిగారి సన్నిధిలోనేగా వాలిపోయేది’’.
‘‘ఏయ్! ఏమిటా మాటలు? ఎవరైనా వింటే’’
‘‘ఏమనుకుంటారు? వీళ్ళు ముసలోళ్ళు అయినా ఇలాగే మాట్లాడుకుంటారు అనుకుంటారు. అంతకన్నా ఏముంది అనుకోటానికి?’’
‘‘నిజమే. నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. జీవన తీరం చేరేదాకా మనం ఇలాగే ఉంటామా చందూ’’
‘‘ఎందుకొచ్చింది నీకా డౌట్?’’
‘‘వయసు పెరిగేకొద్దీ చాదస్తాలు ఎక్కువవుతాయంటారుగా’’
‘‘అదా నీ భయం. ఇంకా ఏమిటో అనుకున్నాను’’.
‘‘నువ్వేమనుకున్నావ్?’’
‘‘అందరి భార్యాభర్తల్లా మనమూ గొడవపడతాం అని అనుకుంటున్నావేమోనని’’.
‘‘నేనయితే నీతో గొడవ పెట్టుకోను’’.
‘‘నేను పెట్టుకుంటాగా’’
‘‘దేని గురించి’’
‘‘విశ్వ గురించి’’
‘‘ఏదో చెబుతావనుకుంటే మరేదో చెబుతావు చందూ నువ్వు’’.
‘‘మరి నువ్వు మాత్రం బట్టలు కొనటానికి బయటకు వెళ్లినా అక్కడ ఎవరు ఎలా ఉన్నారని గమనించటం. పాపమని తీసుకురావూ. అలాగే ఇదీనూ’’
‘‘ఎక్కడినుంచీ ఎక్కడికో తీసుకువెళ్లిపోతావు?’’
‘‘నేనా! నువ్వా?’’
‘‘నువ్వే! నన్ను ప్రశాంతంగా ఒక పని చేసుకోనివ్వవు కదా! విశ్వ ఎలా ఉందో అనే బెంగ. అందరినీ విశ్వ చూసుకుంటుంది. మరి నేనే కదా విశ్వను చూసుకోవాలి. సరిగ్గా చూసుకోలేకపోతున్నానమోనని దిగులు. ఈమధ్య నా డ్రెస్సులు కూడా లూజ్ అయిపోయాయి తెలుసా’’
ఏదో సరదాగా మాట్లాడుతున్నాడనుకుంది అంతవరకూ.
అతని కళ్ళల్లో నిజంగా దిగులు కనబడటంతో కలవరపడింది.
‘చందూ’ అంది ఆర్తిగా.
‘‘నిజం విశ్వా. అందరినీ పలకరించటం, రోజూ వారి బాగోగులు చూడటం, వారి బాధలకు ఓదార్పునివ్వటం. ఆరోగ్యం బాగోకపోతే వారికి తగ్గేదాకా వదలకపోవటం. ఇలా ఇంకెన్నో.. చేస్తున్నావా లేదా? చూస్తున్నావా? చూడటంలేదా?’’
‘‘వాళ్ళంతా లేనివాళ్ళను మనలో చూసుకుంటూ, వదిలేసి వచ్చినవాళ్ళను మన ప్రేమలో మరిచిపోతూ ఆనందంగా గడుపుతున్నారు కదా! దానికోసం మనమీమాత్రమన్నా చేయకపోతే ఎలా? అయినా ఈ పుణ్యమంతా నీదే చందూ! సౌకర్యాలు అన్నీ నువ్వు కల్పిస్తే నేను సేవ చేస్తున్నానంతే! అవే లేకుంటే నేనూ అందరిలాగే ఉండిపోయేదానే్నమో!’’
‘‘బండి రివర్స్ రూట్‌లో వస్తోంది. తప్పుకోండి. తప్పుకోండి’’ చందూ మాటల హడావిడికి నవ్వుకుంది విశ్వ.
తన దిగులు తనే పోగొట్టుకుని తనని నవ్విస్తున్న చందూని అలాగే చూస్తుండిపోయింది విశ్వ.
***
‘‘విశ్వమ్మగారూ! విశ్వమ్మగారూ!’’ ఆలీ గొంతు విని బయటకు వచ్చింది విశ్వ.
ఎదురుగా రక్తం మడుగులో ఓ యువతి.
‘‘ఏమయింది అలీ?’’ అంది ఆదుర్దాగా ఆ అమ్మాయిని చూస్తూ.
‘‘ఏమోనమ్మా! మన గేటు దగ్గర ఎవరో పడేసి వెంటనే వెళ్లిపోయారట’’
‘‘అయ్యో! ముందు మన డాక్టరుగారిని పిలువు. ఫస్ట్‌ఎయిడ్ చెయ్యమను. నేను ఈలోపు అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాను’’ అంటూ సెల్ కోసం లోపలికి వెళ్లింది. ఫోను చేసి బయటకు వచ్చింది.
ఇంజనీరింగ్ కాలేజీ కట్టేప్పుడు అందరికీ ఉపయోగపడుతుందని హాస్పిటల్ కోసం ఒక బిల్డింగ్ కట్టించి, అందులో 24 గంటలు ఎవరో ఒకరు డాక్టరు ఉండేట్లుచూసుకోవటంతో చాలా సమస్యలకి పరిష్కారం చూపినట్లవుతోంది. ఏ నిముషాన ఎవరికి ఏ ఆపద వచ్చినా డాక్టరు అందుబాటులో వుండటంతో అపాయాలనుంచీ తొందరగా బయటపడుతున్నారు. పెద్దవయసు వారిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉండాలిగా.
తన ఆలోచనల్లో తను కొట్టుకుపోతుండగానే డాక్టర్ రమేష్ ఆమె దగ్గరికి వచ్చాడు.
‘‘ఏమైనా ప్రాబ్లమా డాక్టర్?’’
‘‘మేడమ్.. ఆమెను ఎవరో అత్యాచారం చేసి ఇక్కడ పడేసి వెళ్లినట్లున్నారు’’ అన్నాడు.
హతాశురాలయ్యింది విశ్వ.
ఈ అత్యాచారాలు మరీ ఎక్కువయిపోతున్నాయి.
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ