డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే..4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలాగే పదండి. సంతులన స్వామిని చూద్దాం’’ అంటూ లేని భక్తి నటిస్తూ పార్థు, గోడ్బోలే వెంట ఆశ్రమంలోనికి వచ్చాడు.
అక్కడ వాతావరణమంతా ప్రశాంత సుందరంగా ఉంది. ఎవరో భక్తుడు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. మరొకాయన ఆవుకు గడ్డి తినిపిస్తున్నాడు. సూర్యుని సంజుకెంజాయలు ఆశ్రమంలో పసుపును పండిస్తున్నట్లుగా మెరుస్తున్నాయి.
అక్కడి కార్యదర్శి ‘‘ఎవరు?’’ అని ప్రశ్నించాడు.
‘‘నా పేరు విశ్వనాథ్ గోడ్బోలే. ఈయన మా సేట్‌గారి కుమారుడు పార్థు.’’
‘‘ఎక్కడి నుండి వస్తున్నారు?’’
‘‘హైదరాబాద్ బేగంబజార్ నుండి’’
‘‘అక్కడ దీపక్‌చంద్ అని ఒక భక్తుడు ఉండాలి’’
‘‘ఔను, నేను వారి సుపుత్రుణ్ణే’’
వెంటనే కార్యదర్శి గౌరవంగా వారిరువురినీ లోనికి తీసుకుపోయాడు.
అక్కడ నలుగైదుగురు భక్తులు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.
కార్యదర్శి వీరిరువురినీ గురువుగారికి పరిచయం చేశాడు.
‘‘ఈ అబ్బాయి దీపక్‌చంద్ గారి కుమారుడు’’ అని చెప్పాడు.
నిరీక్షణానంద వారిని కూర్చో వలసిందిగా సంజ్ఞ చేశాడు.
కార్యదర్శిని కంటితోనే ఆజ్ఞ నిచ్చాడు.
మరికొద్ది సేపట్లో చల్లటి మంచినీరు, రెండు కప్పులలో జున్ను వచ్చింది.
వాటిని తీసుకోవలసిందిగా స్వామీ జీ వారిరువురినీ కోరాడు.
ఇద్దరూ ఆనందంగా జున్ను తిన్నారు.
‘‘ఇది మా ఆశ్రమ ప్రసాదం. ఆవు ఈనింది’’ అని చెప్పాడు కార్యదర్శి.
‘‘దీపక్‌చంద్ మా భక్తుడు. సత్పురుషుడు’’ అన్నాడు స్వామీజీ.
‘‘స్వామీ! మీ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని వచ్చాము’’ అన్నాడు గోడ్బోలే.
‘‘అది కొంతవరకే నిజం స్వామీ! మేం వచ్చింది ఫాంహవుస్ బేరం కోసం’’ అన్నాడు పార్థు.
స్వామి చిరునవ్వు నవ్వాడు.
కొంచెం సేపు అయిన తర్వాత స్వామీజీ వారిరువురినీ ఆశీర్వదించి బొట్టు పెట్టి ఇక వెళ్ళవలసిందిగా అనుమతి నిచ్చారు.
గోడ్బోలే, పార్థు ఆ గదిలో నుండి బయటకు వచ్చారు.
‘‘స్వామీజీ ఆశీస్సు లభించింది. ఇక మా ప్రయత్నం ఫలిస్తుంది’’ అన్నాడు గోడ్బోలే.
‘‘ఆయన ఏమీ మాట్లాడలేదు కదా!’’ అన్నాడు పార్థు.
‘‘వౌనమే వారి భాష’’ అన్నాడు కార్యదర్శి.
‘‘రండి ఇక్కడ కూర్చుందాం’’ అని కార్యదర్శి వారిని తమ ఆఫీసు రూములోకి తీసుకొనిపోయాడు.
‘‘దీపక్‌చంద్ మాకు విరాళాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా పండుగలప్పుడు అన్నదానానికి ధాన్యం పంపుతూ ఉంటాడు’’
‘‘స్వామి ఆశీస్సులతో ఈ ఫాంహవుస్ కొనుక్కోవాలని వచ్చాము’’ అన్నాడు విశ్వనాథ్ గోడ్బోలే.
‘‘నిజమే! కాని ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలున్నాయి. అందుకే ఫాంహవుస్ కొనడానికి ఎవరూ రాలేదు’’ అన్నాడు కార్యదర్శి.
గోడ్బోలే ప్రశ్నార్థకంగా చూచాడు.
‘‘ఇక్కడ రాత్రివేళల్లో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని ప్రతీతి. అందుకే ఈ భూమిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.’’
పార్థు భయపడ్డాడు.
‘‘అలాంటి దయ్యాలకొంపను మాకు అంటగడతారా?’’ అన్నాడు.
‘‘అందుకే కదా! నేను వివరాలు చెపుతున్నాను. మీరు మాకు కావలసినవారు. అందుకని ముందే హెచ్చరించాను’’
గోడ్బోలే నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
‘‘ఆ దయ్యాలు ఎక్కడ ఉంటాయి?’’ ప్రశ్నించాడు పార్థు.
‘‘దయ్యాలు ఒక చోట ఉండవు. అవి గాలిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడైనా వాలుతాయి’’ అన్నాడు గోడ్బోలే.
కార్యదర్శి నవ్వి ‘‘నిజమే కావచ్చు. ఆ ఫాంహవుస్ దగ్గర్లో ఒక శిథిలగృహం ఉంది. అందులో ఎవరికీ కనపడకుండా దయ్యాలు పగలంతా దాక్కొని రాత్రివేళల్లో వచ్చి తోటల్లో విహరిస్తూ ఉంటాయని చెబుతారు’’ అన్నాడు కార్యదర్శి.
‘‘ఆ దయ్యాలు మగవా? ఆడవా?’’ పార్థు ప్రశ్నించాడు.
‘‘నేను చూచానా ఏమిటి? మీకు చెప్పడానికి?’’
‘‘చూడకుండానే దయ్యాలు ఉన్నాయని మీరు భయంగా ఎలా చెప్పగలుగుతున్నారు?’’ అని పార్థు ప్రశ్నించాడు.
‘‘నలుగురూ అనుకుంటున్న మాటలు మీకు చెప్పాను. దీపక్‌చంద్‌తో ఈ విషయమే చెప్పండి’’ అన్నాడు కార్యదర్శి.
గోడ్బోలే లేచి నిలబడ్డాడు.
కార్యదర్శి నమస్కరించాడు.
ఆ తర్వాత ఇరువురూ బయటకు వచ్చారు. కార్యదర్శి వారిని గుమ్మం వరకు వచ్చి సాగనంపాడు.
అక్కడ ఎవరో పాములను ఆడించుకుంటూ తిరిగేవాడు కనపడ్డాడు.
గోడ్బోలే డ్రైవరు సీట్లో కూర్చున్నాడు. అతని పక్కనే పార్థు కూర్చున్నాడు.
బండిని హైదరాబాద్ వైపు మళ్ళించారు.
‘‘గోడ్బోలే! బండి ఆపు’’ అన్నాడు పార్థు.
‘‘ఎందుకు?’’ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూచాడు గోడ్బోలే.
‘‘మరేం లేదు. నాకు ఆ దయ్యాలను చూడాలని ఉంది. వెనుకకు మళ్లించు. ఫాంహవుస్ వెళ్దాం’’ అన్నాడు పార్థు.

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి