డైలీ సీరియల్

తల్లిగా మారిన ప్రేయసి! (ప్రద్యుమ్నుడు -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చేపను మహారాజు గారికి ఇస్తే పెద్ద బహుమానం ఇస్తాడు. దానితో మనకు లాభం ఉంటుంది అనుకొన్నారు. అంతే జాలర్లు అందరూ కలసి ఆ చేపను పట్టుకొని శంబరాసురుడి దగ్గరకు వెళ్లి ఆయనకు బహుమతిగా ఇచ్చారు.
ఆయన వారికి వారు కోరుకున్నట్టు బహుమానం ఇచ్చి పంపించి వేసారు. ఆతరువాత ఆ చేపను వంటశాలను పంపించాడు.
***
వంటవాళ్లు చేపను వండడానికి కోశారు. వారికి అందులో అందాలలొలికే బాలుడు కనిపించాడు. దేవునిలాగా అందంగా ఉన్నాడని అనుకొన్నారు. ఈ విషయాన్ని అక్కడే పనికి కుదిరిన మాయావతికి చూపారు. ఆమె మహారాజును తాను నిస్సంతునని తనకు బిడ్డలు లేరని ఈ బాలుడిని నేను పెంచుకోవడానికి అనుమతి నివ్వమని అడిగింది. శంబరాసురుడు మాయావతిగా ఉన్న రతీదేవికి అనుమతిచ్చాడు.
***
విధి చిత్రం.
శంబరాసురుని గృహంలోనే ప్రద్యుమ్నుడు దినదినప్రవర్థమానమవుతున్నాడు. మాయావతి పాలుపట్టి, అన్నం పెట్టి తన నాథుడిని యవ్వన వంతుడిని చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. అతి తక్కువ కాలంలోనే ప్రద్యుమ్నుడు పెద్దవాడు అయ్యాడు. మన్మథుని వలె ఉన్నాడని అతడిని చూసిన వారంతా అనేవారు. మాయావతిగా ఉన్న రతీదేవి మన్మథుని లాగా కాదు మన్మథుడు ఇతడే అని అనుకొనేది.
***
యవ్వనవంతుడైన ప్రద్యుమ్నుడిని చూసి రతీదేవికి తాపం కలిగింది. సిగ్గుకలిగింది. అతడిని చూసి యవ్వనంలోని పడచు వలె ప్రవర్తించసాగింది. విషయం తెలియక ప్రద్యుమ్నుడు ఆమె దగ్గరకు వచ్చి ‘తల్లీ! నీవు నాకు జన్మనిచ్చిన తల్లివి కదా. మరి నాదగ్గర ఎందుకీవిధంగా ప్రవర్తిస్తున్నావు? నీకు నాపై ప్రేమ కల్గడం తప్పు కదా తల్లీ’ అన్నాడు.
***
ఆమె మరింత కుంచించుకుని పోయి ‘‘ప్రద్యుమ్నా నీకు అసలు విషయం తెలియక నన్ను తప్పు పడుతున్నావు. నీ జీవితం గురించి నీకు చెబుతాను విను. నీవు మహావిష్ణువు అవతారమైన రుక్మిణీ కృష్ణుల కుమారునివి. అంతకుముందు నీవు నా భర్తవైన మన్మథునివి. దేవతల కోసం పరమశివుని నేత్రాగ్నిలో దగ్ధం అయినావు. నేను నిన్ను విడిచి ఉండలేక పరమశివుని ఎంతోవేడుకోగా ఆయన నిన్ను తిరిగి ప్రద్యుమ్నుడిగా, రుక్మిణీదేవి కొడుకుగా పుట్టించాడు.
కానీ నీ వల్ల తనకు మృత్యు భయం ఉందని ఈ శంబరాసురుడు నిన్ను మీ అమ్మ పొత్తిళ్లల్లో ఉండగానే తీసుకొని వచ్చి సముద్రంలో పడవేశాడు. ఆ సంగతి నాకు ముందే నారదుడు చెప్పాడు.
సముద్రంలోని చేప నిన్ను మింగింది. దైవ మాయ వల్ల నీవు ఈ శంబరాసురుని దగ్గరకే వచ్చావు. నీకోసం నేను మాయావతి అన్న పేరుతో ఇక్కడ వంటలుచేసే దానిగా పనిచేయడానికి వచ్చాను. నిన్ను చేప కడుపులోంచి బయటకు తీయగానే శంబరాసురునితో నేను పెంచుకుంటానని అడిగి వాని అనుమతితో ఆనాటి నుంచి నిన్ను నేను పెంచుకుంటున్నాను.
ఎపుడెప్పుడు నీవు యవ్వనవంతుడివి అవుతావా అని ఎదురుచూస్తున్నాను. నీవే నా ప్రాణేశ్వరుడివి’’ అని చెప్పింది.
తన జన్మ రహస్యాన్ని తెలుసుకొన్న ప్రద్యుమ్నుడు తన పూర్వజన్మను తెలుసుకోవాలని పరమేశ్వరుని పూజించాడు. తపస్సు చేశాడు.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి