డైలీ సీరియల్

తపోమహిమతో జాతివైరం దూరం (శకుంతల - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురు వంశంలోని రైభ్యుడనువానికి దుష్యంతుడు అను కుమారుడు కలిగాడు. దుష్యంతుడు చిన్నప్పటి నుంచి మంచి పరాక్రమశాలి. సుందరుడు. వేటాడడంలో నేర్పరి. రాజ్యాధికారం పొందినా కూడా తన రాజ్య రక్షణకే కాక వేట నిమిత్తము కూడా తన ఆయుధసంపత్తిని ఉపయోగించేవాడు. వేటాడటమేకాక క్రూర జంతువులను మచ్చిక చేయటంలోకూడా అందెవేసిన చేయి కలవాడు. కనుక సమయం చిక్కడం కాదు తానే సమయాన్ని కలిగించుకుని మరీ వేటాడడానికి పరుగులెత్తేవాడు.
ఒకనాడు దుష్యంతుడు తన పరివారంతో వేటకు బయలుదేరాడు. రోజంతా క్రూర మృగాలను వేటాడాడు. దారిలో ఆయనకు ఓ వింత ఎదురైంది. పాము ల జంటలు, నెమళ్లజంటలు, ముంగిసలు, పులులు, జింకలు, కుందేళ్లు, అడపి దుప్పులు, పునుగు పిల్లులు, ఇలా చిన్న పెద్ద జంతువులే కాదు జాతివైరం ఉన్న జంతువులు కూడా కలసిమెలసి తిరుగుతున్న ప్రదేశాన్ని చూశాడు. చాలా ఆశ్చర్యం వేసిందా దుష్యంతునకు.
వాటికి మరింత దగ్గరగా వెళ్లాడు. అవి ఆ మనిషిని పట్టించుకోకుండా తమ ఆటపాటల్లో మునిగి ఉన్నాయి. అక్కడి ప్రశాం త వాతావరణం అబ్బురంగా ఉంది. మల్లెలు, పొగడలు, జాజు లు, మరువం ఇట్లాంటి సువాసనలిచ్చే రంగురంగుల పూపొదరిండ్లు,గుబురుగా పెరిగిన పొదలు, పెద్దగా ఏపుగా పెరిగిన టేకు, బూరుగు, దేవదారు వంటి పొడవాటి చెట్లు, మర్రి, రాగి, మారేడు, వృక్షాలు చిక్కటి అడవిని తలపిస్తూనే చక్కగా పనికట్టుకుని పెంచుకున్న నందనోద్యానంలాగా అనిపించింది. ఇది ఎవరి ఆశ్రమం అయి ఉంటుంది అనుకొంటూ ముందుకెళ్తున్న దుష్యంతునికి అతని పరివారంలోని మంత్రులు ఆ ఆశ్రమం కణ్వమహర్షి దని చెప్పారు. కణ్వుడు మహాశాంతమూర్తి. ఎడతెగని తపస్సు ఆచరించేవాడు. పరమేశ్వరుడు మెచ్చిన మునిపుంగవుడు అని కణ్వుని గురించిన వివరాలు మహారాజు తన పరివారం ద్వారా తెలుసుకొన్నాడు.
‘సరే. అంతా బాగుంది. ఎలానూ ఇక్కడి దాకా వచ్చాం కదా. మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఒక్కడినే ముందుకు వెళ్లి ఆ కణ్వమహర్షిని ఒకసారి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాను’ అని దుష్యంతుడు తన పరివారానికి చెప్పాడు.
వేటపై మక్కువ ఎంతో ఉందో అదేవిధంగా మహర్షులు సేవ చేయడమూ మహారాజుకు అత్యంత ప్రియాతి ప్రియమైన పనే అని తెలుసున్న దుష్యంతుని పరివారం మహారాజు చెప్పిన దానికి తలలూగించింది. వారితో చెప్పి దుష్యంతుడు మనసుకు ప్రీతికలిగించే చోటుకు వెళ్లాడు.
***
తండ్రి కణ్వుడు దేశాంతరం వెళ్లాడు. శంకుతల తన చెలులతో ఉంది. కానీ చుట్టూ ఎవరూ లేనట్టుగా దిగాలుగా ఉంది. చెలులంతా ఆడుకోవడానికి వెళ్తుంటే తాను తనకిష్టంగా పెంచుకున్న పూమొక్కలతో మాట్లాడుతూ వాటికి సేవ చేయడానికి వచ్చింది.
ఆ పూలమొక్కలకు తండ్రి ఇంకా ఆశ్రమానికి రాలేదన్న విషయాన్ని విషాదంగా చెబుతూ వాటి కుశలం కనుక్కొంటూ వాటికి నీరు అందిస్తున్నది. అద్భుత సౌందర్యరాశి తన నెచ్చెలియై తమ పోషణను చూస్తున్నది అనే ఆనందంలో ఆమె చెప్పే కబుర్లు అన్నీ వింటున్నట్టు పూలన్నీ తలలూపుతున్నాయి. బాధపడకు త్వరలో తండ్రి వచ్చేస్తాడులే అని అవి నచ్చచెబుతున్నట్లు ఊగుతున్నాయి.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి