డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగిరాల శ్రీరామశర్మ వైదిక ప్రార్థన చేశాడు. పార్థు ఒక దేశభక్తి గీతం పాడాడు.
‘‘మేరే దేశ్‌కి ధర్తీ సోనా ఉగ్‌లే’’ అంటూ ఓ సినిమా పాట పాడాడు.
పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అక్కడికి పత్రికా విలేఖరులు వచ్చారు. వారందరికీ దీపక్‌చంద్ పారి తోషికాలు ఇచ్చాడు.
సంస్థ చరిత్ర చేసిన కార్యకలాపాలు విలేఖరులు విశ్వనాథ్ నుండి తీసుకున్నారు.
‘‘చాలా బాగుంది. ఎంతో ఆనందం కలిగించింది’’ అన్నారు విలేఖరులు.
విశ్వనాథ్ నిట్టూర్చి -
‘‘మీరు రాజ్‌కపూర్ పేరు విన్నారు కదా’’ అన్నాడు.
‘‘ఔను’’
‘‘ఆయన ఒక సినిమా తీశాడు. అందులో అతడు దుఃఖపడుతూ విషాదంలో కూడా ఇతరులను నవ్విస్తూ ఉంటాడు’’ అని చెప్పాడు.
‘‘ఔనౌను - మేరానామ్ జోకర్’’
విలేకరులను వెంట బెట్టుకొని ఒక పిల్లవాడి దగ్గరికి తీసుకు పోయాడు. అతడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఓ కుక్కను దగ్గర కూర్చోబెట్టుకొని దానితో మాట్లాడుతున్నాడు.
‘‘చూచారా ఈ పిల్లవాణ్ణి! ఇతని తల్లిదండ్రులిద్దరూ పాతబస్తీలో జరిగిన మతకల్లోలాల్లో మరణిం చారు. ఈ పిల్లవాడు అనాథగా మిగిలాడు. ఇతని ఆలనాపాలనా దీపక్‌చంద్ గారే చూస్తున్నారు. ఇతనికి జీవితంలో ఏదో అభద్రతా భావం, తీరని వెలితి. అందుకని మానసికంగా కుంగిపోయాడు. అందరు పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడడు. ఒంటరిగా ఏవేవో దృశ్యాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ విషాదగాథ ఏ పత్రికకూ ఎక్కలేదు. ఇలాంటి కథలు ఎనె్నన్నో ఉన్నాయి’’ అన్నాడు విశ్వనాథ్.
విలేకరులు వెళ్లడానికి సిద్ధపడ్డారు.
వారికి దీపక్‌చంద్ వెండి గ్లాసులు బహూకరించాడు. గ్లాసులో చందనం (షాండల్ పౌడర్) ఉంది.
దీపక్‌చంద్ ఇలా చెప్పాడు -
‘‘నేనేమీ గొప్ప పనులు చేయడం లేదు. మా తల్లిదండ్రుల ఋణం తీర్చుకుంటున్నాను. మంచి పనులు చేయటం వలన మనలో సత్వశక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రచోదితమవుతుంది. తెల్లని బట్టలు వేసుకొని తెల్లని భావాలు కలిగి ఉండడం శే్వతాంబర సంప్రదాయం. ఇదే ఇందలి మానసికశాస్త్ర రహస్యం’’
విలేకరుల వెళ్లిపోయాక గోడ్బోలే కార్యక్రమం ముగింపు ఏర్పాట్లు చూచుకుంటూ ఉన్నాడు.
కరెంట్ డెకరేషన్, స్నాక్స్ బిల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలవారి మేకప్, మ్యూజిక్ వగైరా...
అప్పుడొక కార్మిక నాయకుడు వచ్చాడు.
‘‘మీ దీపక్‌చంద్ తన పేరు ప్రఖ్యాతుల కోసం డబ్బును మంచినీళ్లలాగా ఖర్చు పెడుతున్నాడు. మరి ఇక్కడి కార్మికులకు ఏమిచ్చాడు? వారి కన్నీళ్లు తుడిచాడా? వారి రక్తంతోనే ఈయన సంపదలు పెరుగు తున్నాయి. వర్ధమాన మహావీరుని ఊరేగింపు చేస్తున్నాడు. ఊరేగింపులో పల్లకీ మోసే బోరుూల కాయకష్టం మాటేమిటి?’’
‘‘అయ్యా! ఈ నెల కార్మికులందరికీ బోనస్ ఇచ్చాము’’ అన్నాడు గోడ్బోలే.
‘‘ఏదో కంటితుడుపు చర్య! ఈ పార్థు విలాస జీవితం గడుపుతాడు. బాలీవుడ్ సినిమాలల్లో శ్రీదేవితో డ్యూయెట్లు పాడుతాడట. మాకుమాత్రం గంజిలోకి ఉప్పు కూడా లేదు’’
మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దు అని గోడ్బోలే ప్రార్థించినా కార్మికనాయకుడు వినలేదు. అప్పుడు గోడ్బోలే పోలీసులకు ఫోను చేశాడు. వాళ్లు వచ్చి ఈ అల్లరి చేస్తున్న నాయకుణ్ణి పట్టుకొనిపోయారు.
ఈ విషయం దీపక్‌చంద్ గమనించాడు.
‘‘అతడు తాగిన మత్తులో ఉన్నాడు. దయచేసి వదలిపెట్టండి. నేను జామీన్ (బెయిల్) ఇస్తాను’’ అన్నాడు.
దీపక్‌చంద్ మాటలను గౌరవించి పోలీసులు కార్మికనాయకుణ్ణి వదలిపెట్టారు.
‘‘నన్ను అరెస్టు చేస్తారా? మీ అంతు చూస్తాను’’ అని కార్మిక నాయకుడు బెదిరించాడు.
***
పార్థు గోడ్బోలే దగ్గరికి వచ్చి డబ్బు కావాలని అడిగాడు. గోడ్బోలే ఇవ్వడానికి నిరాకరించాడు.
‘‘నాన్నగారి అనుమతి లేదు’’
‘‘గోడ్బోలే! నీవు మేనేజరువు - నా మాట నీవు వినాలి’’
‘‘చిన్నసేటూ! నీ మాటతో బాటు మీ నాన్నగారి మాట కూడా నేను వినాలి. అంతేకాదు రాముడు పుట్టిన ఈ దేశంలో కొడుకు తండ్రి మాట వినాలి’’
‘‘ఈ పితృవాక్య పరిపాలనలూ, పాతివ్రత్యాలూ ఎప్పటివో - ఏయే పురాణ యుగాల నాటివో. అవి వర్తమాన సమాజానికి వర్తించవు’’
‘‘ఎందుకు వర్తించవు? సత్యం చెప్పాలి అనేది ముండకోపనిషత్తులో ఉందని శ్రీరామశర్మ చెప్పారు. అది నేటికీ వర్తిస్తుంది’’
‘‘ఎలా చెబుతావయ్యా? ఒక సిఐడి ఆఫీసరు ఉన్నాడు. అతను మఫ్టీలో ఉన్నాడు. నీవెవరు? అంటే నేను శ్రీ్ధర్ అనే సిఐడి ఆఫీసర్‌ను అని చెబుతాడా? ఒకేళ చెబితే అతని ఉద్యోగధర్మం నిర్వర్తించలేడు కదా!’’
‘‘పార్థూ జీ! మీ తెలివితేటలు నాకు లేవు. నేను ఈ వేదశాస్త్ర పురాణములనే నమ్మాను. అందులో ఏం చెప్పారో అదే చేస్తున్నాను. మనసా వాచా కర్మణా అదే ఆచరిస్తున్నాను’’
‘‘ఐతే డబ్బు ఇవ్వరా?’’
‘‘ఇవ్వను - మీ నాన్నతో చెప్పండి’’
‘‘నాన్నతో ఎందుకు? కర్తార్‌సింగ్‌తో చెప్తాను’’
‘‘అతడేం చేస్తాడు?’’
‘‘ఏం చేస్తాడో చూడు’’ అంటూ పార్థు కర్తార్‌సింగ్ వద్దకు వెళ్లాడు.
‘‘కర్తార్! నీవొక డ్రామా ఆడాలి’’
‘‘ఏం డ్రామా?’’
‘‘నన్ను కిడ్నాప్ చేస్తున్నట్లు నాటకం ఆడాలి. లక్ష రూపాయలు మా నాన్న ఇస్తే నన్ను వదలిపెడతా నని బెదిరించాలి. అప్పుడు మనకు లక్షరూపాయలు వస్తాయి. నీకు పాతికవేలు ఇస్తాను’’
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి