డైలీ సీరియల్

మధురమైనది స్నేహమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురమైంది. మహనీయమైంది కీర్తిచంద్రికలను అందించేది. కడవరకు సాగేది ఏది అని అడిగితే స్నేహం అని అందరూ ఏకీభవిస్తారు. స్నేహానికి అధికము అల్పము అన్న తేడా ఉండదు. గొప్ప బీద అనే తారతమ్యాలు కూడా ఉండవు.రాజు కొడుకుకు, బిచ్చగాని కొడుకుకూ స్నేహం కుదురుతుంది. స్నేహంలో పేద ధనిక అనే భేదాలే కాదు పండితునికి పామరునికి కూడా అత్యంత సన్నిహితమైన స్నేహం ఉండచ్చు. వారిద్దరూ ఒకరికొకరు గొప్పమేలును కూడా చేసుకోవచ్చు.
అటువంటిది కనుకనే స్నేహాన్ని తీయని తేనెతో పోల్చారు. స్నేహితులు మధ్యలో పొరపొచ్చాలు ఏర్పడవు. ఒకవేళ మనస్పర్థలు వచ్చినా వారిద్దరూ ఏ అరమరికలూ లేకుండా హాయిగా మాట్లాడుకుని మనస్పర్థలు పక్కన పడేస్తారు. దానికి కారణం అహం అనే పదార్థం స్నేహంలో ఇమడలేకపోవడమే. అహం ఉంటే చాలు మంచివారి మధ్య కూడా అడ్డుగోడలు కట్టగలుగుతుంది. స్నేహితుల మధ్య అహాలు ఉండవు కనుక వారిద్దరి మధ్య గొడవలు వచ్చినా వాటిని సులభంగా దూరం చేసుకోవచ్చు.
చెడుదారిలో నడిచే స్నేహితుడిని మంచిస్నేహితుడు మంచిమాటలు చెప్పి మంచిదారిలో పెడతారు. బంధువుల వల్ల, తల్లిదండ్రుల వల్ల కూడా కానిపని కేవలం స్నేహితుడు చేసి పెట్టవచ్చు. బంధువులల్లో అహం ఉంటుంది. నేను నీకన్నా గొప్పదాన్ని అన్న అహంకారం పెరిగి మనుష్యుల మధ్య ఉండాల్సిన స్నేహతత్వాన్ని దూరం చేస్తుంది.
రామాయణంలో రామునితో ఆంజనేయుడు స్నేహంచేశాడు. వారి స్నేహం చివరకు రామునిలోని సుగుణాలు చూసి ఆయనకు దాసుడయ్యాడు ఆంజనేయుడు. సుగ్రీవుడు కూడా రాముని మైత్రిని శంకించినా చివరకు రాముని గుణగణాల వల్లే సుగ్రీవుడురామునికి మంచి స్నేహితుడు అయ్యాడు. రామునిలోని గుణాలను చూసే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుకోరి వచ్చాడు. రాముడు విభీషణుడిని స్నేహితుడుగాను, సోదరుడుగాను చూస్తానని చెప్పాడు. రాముని గుణగణాలను చూసి పడవ నడుపుకుని జీవించే గుహుడు కూడా మంచి స్నేహితుడు అయ్యాడు.
అంటే సుగుణాలే మంచిస్నేహితానికి కారణాలు అవుతాయి. కృష్ణుడి కాలంలోను కృష్ణుడికి చిన్నప్పటి నుంచి మంచిస్నేహితులు ఉండేవారు. ఆయన గురుకులంలో సాందీపుని దగ్గర విద్యను నేర్చుకునే సమయంలో సుధాముడనే స్నేహితుడు ఉండేవాడు. కృష్ణునికి సుధామునికి మంచి స్నేహం ఉండేది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు.
గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇండ్లకు వెళ్లాల్సి వచ్చింది. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలి.

మనిషి జీవనంలో అన్నీ దశలు వద్దన్నా అనుభవించి తీరాల్సినవే.
కనుక వారిద్దరూ స్నేహాన్ని మరిచిపోకుండా ఉందామని బాస చేసుకొంటూ విడిపోయారు. సుధాముడు ఆయన కులవృత్తిని చేపట్టి తనకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టాడు.
కృష్ణుడు కూడా తనను కోరిన అమ్మాయి రుక్మిణిని చేపట్టి గృహస్థుడయ్యాడు. కంసుని సంహరించి తన తల్లిదండ్రులను చెర నుంచి తప్పించారు. ఉగ్రసేనుల వారికి కూడా చెర తప్పించి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఎందరో రాక్షసులను సంహరిస్తూ మధురలో ఉండేవారికందరికీ తల్లో నాలుకలా ఉండేవాడు. తాను సంపన్నుడైనా రాజైనా కూడా ఎవరు తనను ఆర్తిగా పిలుస్తారో వారి దగ్గరకు రివ్వున వెళ్లి వాళ్ల కష్టాన్ని తీర్చి వచ్చేవాడు.
కృష్ణుడు సంపన్నుడు కనుక కాలం ఆనందంగా సంతోషంగా సాగిపోతోంది.సుధాముడు రాను రాను దారిద్య్రావస్థకు గురయ్యాడు. దానికితోడు అధిక సంతాన వంతుడయ్యాడు. అటు సంతానాన్ని, సంసారాన్ని ఈదలేక ఎన్నో బాధలు అనుభవించాడు. దినం గడవడం కష్టంగా మారిందివారికి. సుధాముడు కాస్తా కుచేలుడుగా మారాడు. ఆయన భార్య సుశీల. మంచి శీలమే కాదు మంచి గుణవతి కూడా. ఆమె ఒకరోజు కుచేలునితో మీ స్నేహితుడు ఆగర్భశ్రీమంతుడు కదా. ఆయన దగ్గరకువెళ్లి మన దీనగాథను వినిపించి రండి. ఆయన మనకు ఏదో ఒక దారిచూపిస్తాడు అని చెప్పింది.
ఏమిటీ ఎంత స్నేహం ఉన్నా నేను ఏమని అడిగేది? నేను చేయి చాచి అడుగలేను నా స్నేహితుడిని. ఆయనకు తెలిస్తేచాలు దేన్నైనా ఇవ్వడానికి ముందే ఉంటాడు కానీ నేను అడుగలేను అన్నాడు కుచేలుడు. సరే మీరు ఏమీ అడగకండి. కనీసం కృష్ణ దర్శనం చేసుకుని రండి. ఆ కృష్ణ పరంధాముడే ఏదోఒక దారి చూపిస్తాడు అని చెప్పింది.
భార్యమాటలు విని కుచేలుడు వెళ్లాడు.
అంతదూరంనుంచి తన స్నేహితుడు వస్తున్నాడన్న వార్త విని కృష్ణుడు హంసతూలికాతల్పం నుంచి దిగి పరుగెత్తుకుని వచ్చాడు. కుచేలుని చూడగానే సంతోషంగా ఆలింగనం చేసుకొన్నాడు. ఎంతో స్నేహంగా అప్యాయంగా చేయి పట్టుకుని ఇంట్లో తీసుకొని వెళ్లి అతిథి మర్యాదలన్నీ చేశాడు. అడగకుండానే మృష్టాన్న భోజనాన్ని తన భార్యచేత పెట్టించాడు. పట్టు వస్త్రాలు కట్టబెట్టి తాంబూలాదులు ఇచ్చి అవి ఇవీ మాట్లాడి చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు.
ఎంతోసేపు అలా మాట్లాడి మాట్లాడి చివరకు వీడ లేక వీడలేక వీడ్కోలు చెప్పి కుచేలుడు ఇంటికి వచ్చాడు.
కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్లేటపుడు ఆగర్భదరిద్రుడుగా ఉండేవాడు. కృష్ణుడి దగ్గర నుంచి కుచేలుడు వచ్చినపుడు సంపన్నుడైయ్యాడు. ఒక్క సంపదలోనే కాదు భగవద్విషయంలోను అధిక సంపన్నుడయ్యాడు. సుశీల కుచేలుడు రాగానే అత్యధిక సంతోషంగా ఆహ్వానం పలికింది. ఆమెను చూసిన కుచేలునికి అర్థమయ్యింది. తాను ఏమీ అడగకపోయినా తన స్నేహితుడు తన దారిద్య్రాన్ని ఆవలకు నెట్టివేశాడని, అంతలో పిల్లలూ వచ్చారు. అందరూ కలసి కృష్ణుని అపారమైన దయను గూర్చి భజన చేశారు.
చూశారా ఇదంతా కేవలం నాస్నేహితునివల్లే జరిగిందని తన కొడుకులతో కుచేలుడు చెప్పాడు. ఎప్పుడైనా ఎక్కడైనా నలుగురితో మంచిగా ఉండాలని అందులోను మంచిస్నేహితులను ఎప్పటికీ దూరం చేసుకోకూడదని మంచివారితో స్నేహం వెలుగుతున్న దీపం లాంటిదని వారికి కుచేలుడు వివరించాడు. స్నేహాన్ని మించిన సంపద ఈలోకంలో ఏదీలేదని వారంతా సంతోషించారు. వారికేకాదు కలియుగంలోనే స్నేహాన్ని మించిన సంపద ఉండదు.

- గున్న కృష్ణమూర్తి