డైలీ సీరియల్

మానవత్వమే మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటి వెలుగులు ఒకదాని తరువాత ఒకటి వచ్చినట్లే లాభనష్టాలు కూడా పక్కపక్కనే వస్తూ ఉంటాయి. ఆశావాదం నిరాశవాదం కూడా మనిషికి ఉంటూనే ఉంటాయి. అయితే ఆశావాదం చావుకు సిద్ధమయిన మనిషి బతికిస్తే నిరాశవాదం హాయిగా జీవించగలిగే స్థితిలో ఉన్న మనిషిని కూడా మృత్యువు దగ్గర చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలోను ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి.వాటిని తట్టుకొని , ఆటంకాలను ఎదుర్కొని జీవితంలో నిలబడగలిగితే మంచి మనిషిగా కీర్తినొందుతాడు. తన నూరేళ్ల ఆయుష్షును అనుభవించిన వాడు అవుతాడు.
కొందరు కష్టాలకు వెరిచి ప్రాణత్యాగాలను చేసుకొంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతికాదు. మనిషి ఆశాజీవి కనుక ఏదో పొరపాట్లు చేసి ఉండవచ్చు. అంతమాత్రానే జీవితం చాలించాలనుకోవడం బుద్ధితక్కువ. ఆ పొరపాట్లను తెలుసుకొని తిరిగి వాటిని చేయకుండా తన్ను తాను నియంత్రించుకోవడం మంచి మనిషి చేయాల్సిన పని.
ఆర్థిక కష్టాలు తట్టుకోలేకపోతుంటారు కొందరు. నిజమే తినడానికి కలోగంజో లేకపోతే ఎలా జీవించడం అనుకోవడం సహజమే.కానీ వాటిని పొందడానికి ఒక ఊరు కాకపోతే మరొక ఊరు ఒక మనిషి కాకపోతే మరో మనిషి అడగాలి. లోకంలో ఎందరో మంచివారున్నారు. వారి సలహా తీసుకోవాలి. కష్టపడైనా సరే తాను బతకాలి. తనమీద ఆధారపడిన వారిని బతికించుకోగలిగే నేర్పును పొంది తీరాలి. బతికుంటే బలుసాకునైనా తినొచ్చు అనుకోవాలి. నందో రాజా భవిష్యత్తి అని మనవారు ఊరికినే అనలేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏదో జరిగిపోతుందేమో అనుకొని జీవితాన్ని అంతం చేసుకొంటే నిజంగానే దుఃఖం తప్ప మరేదీ మిగలదు. అందుకే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా వాటిని మెల్ల మెల్లగా దూరం చేసుకోవాలి. చెడువ్యసనాలు ఉంటే వాటిని ప్రయత్నపూర్వకంగాదూరం చేసుకోవాలి. భగవంతునిపై నమ్మకంతో పనిచేస్తూ పోతే కొన్నాళ్లు కష్టపడినా ఓరోజు వెలుగు వస్తుంది. కష్టాలు తీరే మార్గం కనిపిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు చెప్పిన మాట మననం చేసుకొని కృషిని సాగించాలి.
జ్ఞానం ఉన్న చోట మార్గాలు అనేకం కనిపిస్తాయి. అందుకే మనిషి తాను తప్పటడుగు వేసినా, దాని నుంచి బయటపడే మార్గం కోసం పెద్దలను ఆశ్రయించాలి. విజ్ఞులు చూపిన మార్గంలో నడవాలి. కాస్త కష్టంగా అనిపించినా ఓర్పువహించి మంచిమార్గానే్వషణ చేయాలి. ఒకరోజు అనుకున్నట్లుగానే శుభపరిణామం ఏర్పడుతుంది. మంచిరోజులు వస్తాయి. చీదరించుకున్నవారే కీర్తించేందుకు ఎదురు వస్తారు.
ఇట్లాంటి పరిస్థితులను అధిగమించేందుకే మనకు పురణాల్లో ధ్రువోపాఖ్యనం ఉంది. ఎనిమిదేండ్ల పిల్లవాడుధ్రువుడు. తండ్రి అంకంపైన తన తమ్మునితో పాటు కూర్చుని తండ్రి ప్రేమను పొందాలనుకొంటాడు. ఇది అతి సహజమైన కోరికనే కదా. కానీ ఉత్తాన పాదుని పిరికి తనం వల్ల పినతల్లి అసహజ ప్రవృత్తివల్ల ఆమెలోని లోభత్వం వల్ల ధ్రువునికి ఆ కోరిక తీరదు. అంతేకాక పినతల్లి మాటలను జీర్ణంచేసుకోలేక వాళ్ల అమ్మ దగ్గరకు వెళతాడు.
ఆమె అంటే ఇక్కడ పెద్దవాళ్లను ఆశ్రయించాలన్న సూక్తిని ధ్రువుడు పాటించాడన్నమాట. ఆ ధ్రువుని అమ్మ మన కష్టాలకు కారణాలు దేవుడే కానీ ఇతరులు కాదు అని హితవు చెబుతుంది. భగవంతుని కరుణ తప్పిన వారిమి అయ్యేము కనుకనే నీకీ కష్టాలు అని విడమర్చి చెబుతుంది. ఆమె ఎక్కడా పినతల్లి అఘాయిత్యాలను ఏకరువు పెట్టలేదు. చిరువయస్సు ఉన్న ధ్రువుని మనస్సులో ద్వేషాన్ని నింపే పరిస్థితులున్నా ఆమె తన పుత్రుడనికి నేర్పివ్వలేదు. కష్టపడి ఆ దేవదేవుని స్మరించు, దర్శించు. ఆ పై నీకేవిధంగా అనిపిస్తే అదే చేయి అంటుంది.
చూశారా. ఇపుడు మనుష్యులు కూడా పక్కవారికి ఉంది మనకు లేదనే ఆవేదన చెందుతారు. అంతేకాదు వారికి లేకుండా చేసేస్తే చాలు కదా అనే ఆలోచన్లు కూడా చేస్తున్నారు. కానీ ధ్రువని తల్లి నారాయణుని అడుగు నీకోరిక తీరాలని అని చెప్పింది. భగవంతుని మెప్పించాడు. కేవలం తండ్రి అంకమే కాదు నక్షత్రలోకానికే అధిపతి అయ్యాడు.
ఉత్తాన పాదుడే ఎదురెళ్లి తీసుకొని వచ్చి తన అంకపీఠం పై కూర్చునబెట్టుకొని రాజ్యాన్ని కూడా ఆయనకే కట్టబెట్టాడు. అట్లాఅని ధ్రువుడు తన పినతల్లిని కానీ తన తమ్ముడిని కానీ తక్కువ గా భావించలేదు. వారిపై ద్వేషం కూడా పెట్టుకోలేదు. వారికీ తన తల్లికిచ్చిన గౌరవస్థానానే్న ఇచ్చాడు.
మనం మంచి దారిలో ఉంటే మనకు చెడు చేసేవాళ్లు కూడా వారి తప్పు తెలుసుకొని మన మంచిదారిలోకి వస్తారు. కనుక మనుష్యులందరూ నీతి న్యాయం, ధర్మం అనే వాటిని తప్పక పాటించాలి. మానవత్వాన్ని కలిగి ఉండాలి. అపుడే వారు మనుష్యులుగా కీర్తినొందుతారు.

-దామరాజు నాగలక్ష్మి