డైలీ సీరియల్

దూతికా విజయం-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తను అందుకోలేనంత దూరం దాకా జయపాలుడ్ని తరిమానని సరస్వతి అర్థం చేసుకున్నది. తన ప్రణయపాశంలో ఘోరంగా ఇరుక్కుపోయిన జయపాలుడ్ని చూసి, తన అందచందాలకు గర్వించాలా, లేక తను తీసుకున్న గోతిలో తానే పడేందుకు సిద్ధంగా ఉన్నందుకు విచారపడాలా!
‘‘ఇప్పుడెట్లా? రాణి వేచి ఉంటుంది!’’
‘‘ఏం? రెండు కృష్ణపక్షాలుగా నేను నీకోసం వేచి వుంటే నా మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నీకు జాలి లేదా? రాణి కాస్సేపువేచి వుంటే నీ మనస్సు కలుక్కుమన్నదా పాపం!.. అదేం వీల్లేదు. రాణి సప్తదర్పణ శయన మందిరంలో ఆయనతో సుఖిస్తూంటే, రాత్రంతా లొట్టలు వేస్తూ ఉండలేదా నీవు- అలాగే ఇప్పుడా బాధ ఆయనకు అర్థమయ్యేటట్లు చేద్దాం. కాసేపు ఆయన ఆ ఉద్యానవనంలో వుంటే, మన ప్రణయ కలాపాలకు వేడెక్కి ఎక్కుపెట్టి విడిచిన బాణమల్లేపోయి రాణిని చేరుతాడు’’ అన్నాడు జయపాలుడు.
‘‘జయపాలా! పోనీ నేను ఆయన్ని కోట దాటించాక, నీ కోర్కె తీరుస్తాను’’ అన్నది సరస్వతి.
సరస్వతి మెత్తబడుతోందని జయపాలుడు గ్రహించాడు. చిలికి చిలికి గాలివాన కాకుండా ఈ సరస్వతి త్వరగా ఏదో ఒకటి తేల్చదేమనే ఆతృతతో వీరభద్రుడు వేగిపోతున్నాడు. పోనీ వాడడిగిన లంచమేదో వాడి మొహాన పారేసి ఈ పీడ వదిలించకూడదా? కాస్సేపు తాను కాచుకొని ఉండటం తనకేమంత ఇబ్బంది కాదు.
ఈ సలహాయే ఇద్దామని వీరభద్రుడు అనుకున్నాడు కాని వారిద్దరి మధ్య తాను ప్రవేశించినందువల్ల పాకానపడిన వివాదం తీవ్రరూపం దాలుస్తుందేమోనని అనుమానించి, కేవలం ఏవౌతుందోనని కలత జెందుతున్న ప్రేక్షకునివలె నిలబడిపోయాడు వీరభద్రుడు. అదీగాక సరస్వతి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పెదవి కదల్చరాదన్నది అతనికి బాగా జ్ఞాపకం వున్నది.
‘‘అదంతా పనికిరాదు. అప్పుడు అసలు వ్యవధి ఉండదు. ఇప్పుడే ఇక్కడే’’ అన్నాడు జయపాలుడు నిశ్చయ స్వరంతో.
జయపాలునిలోని సహనాన్ని పరీక్షకు పెట్టిన తను, దానికీ ఒక పరిమితి ఉంటుందనీ అనుకోలేదు. అది అంతరించిందనీ గ్రహించలేదు. ఇప్పుడేమనుకొనీ లాభంలేదని తేల్చుకుంది సరస్వతి.
‘‘జయపాలా! విధి నిర్వహణలోనే నా మనస్సు లగ్నమైన సమయమిది’’
‘‘మంచిది- విధి ఏ విధంగా జరగాలో నిర్ణయించవలసింది నేను- నీ విధి నిర్వహణను నిరాటంకంగా జరిపేందుకు నేను అనుమతించాలి కనుక, నన్ను తృప్తిపరచటం కూడా నీ విధి నిర్వహణలో ఒక భాగం! ముఖ్యమైనది కూడాను రా!’’
అతని ఉద్రేకం స్వాధీనం తప్పుతున్నట్లు తోచింది సరస్వతికి.
‘‘నీకిచ్చే లంచం కూడా యాభై సువర్ణ ముద్రికలు పెంచాను’’ అన్నది సరస్వతి, అవసరమైతే ఇంకా పెంచుతాననే సూచన ధ్వనించేట్లు.
‘‘అట్లాగా? ఆ పెంచిన యాభై నీకిస్తాను. నా కోర్కె తీర్చు. చాలదూ వంద ఇస్తాను.. అదీ చాలదూ... నీవిచ్చిన మూట మూటా తిరిగి ఇచ్చేస్తాను.. సరేనా?’’
సరస్వతికి మండిపోతుంది.
‘‘నేనేం వేశ్యననుకున్నావా?’’ అన్నది తీవ్రంగా.
‘‘ఎలా అనుకుంటాను సరస్వతీ! వేశ్య సప్తదర్పణ శయన మందిరంలో విటుని కోసం ఎదురుచూస్తూన్నది. ఆమె వ్యభిచారంకూడా చిత్రమైనది. ఎదిరిచ్చి వలపు వొలకబోయించుకుంటోంది! ఇక నీవా- నీవు తార్పుడుకత్తెవు. ఐనప్పటికీ నాకు మనసుపడిన మగువవు. నేనే వెల చెల్లించి నీ వలపు కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. నా స్థితికి ఒక్క రాత్రి అనుభవానికి నూట యాభై సువర్ణ ముద్రికలు ఇస్తున్నానంటే నా దృష్టిలో నీ విలువ ఎంత గొప్పదో ఆలోచించు. రాణికన్న ఉన్నత స్థానాన నిన్ను ఉంచాను కదా!’’
సరస్వతికి దిమ్మ తిరిగిపోయింది. మతిపోయినట్లయి నోట మాటరాలేదు.
‘‘ఇది రాజ దూషణ’’ అన్నదామె.
‘‘రాజద్రోహంకన్నా నయమే సరస్వతీ! నీవు అంత తేలిగ్గా లొంగవని నాకు తెలుసు. కొరకరాని కొయ్యవైన నిన్ను జయించలేకుంటే నాకీ జయపాల నామధేయమే వొద్దు. ఆ రాణి చెలికత్తెవు కదా! ఇంటి కుక్క సామెత ను నిరూపిస్తున్నావ్!’’
‘‘జయపాలా! నాకు ఆలోచించుకునేందుకు వ్యవధి ఇవ్వు. మనసు లేని మగువను ఏం చేసుకుంటావు?’’
‘‘పుష్పాన్ని అడిగి, అనుమతి తీసుకొని తుమ్మెద మధువును ఆస్వాదిస్తుందా?’’ అన్నాడు జయపాలుడు.
‘‘రౌతును బట్టి కదా గుర్రం!’’ అన్నాడు జయపాలుడు.
‘‘గుర్రానికి తగిన రౌతు కాకుంటే ఏవౌతుందో రుజువు చేయవలసి వుంటుంది. నేను రాణి ప్రియసఖిని. ముందు వెనుకలు ఆలోచించకుండా నన్ను కోరటం నిప్పుతో చెలగాటాలాడటం సుమా!’’ అని సరస్వతి హెచ్చరించింది.
‘‘సరస్వతీ! నిన్ను కోరినందుకే నొచ్చుకొని బాధపడుతున్నావు. నేను రాణిని కోరినా అంగీకరించి తీరాలనే సంగతి నీకు తెలుసు! అసలా కోర్కె వెలిబుచ్చనందుకు సంతోషించు!’’
సరస్వతి నివ్వెరపోయింది. ఇతని నోటికి అడ్డులేకుండా ఉన్మాదుని వలే పేలుతున్నాడు. అందునా మదపిచ్చితో కొట్టుకుంటున్నాడు. త్వరగా తేల్చకుంటే ప్రమాదం కూడాను.
తన స్వంత ప్రియురాలైన రాణిని కోరినందుకు జయపాలునిమీద మనసులోనే కారాలు మిరియాలు నూరాడు వీరభద్రుడు. సరస్వతితో తృప్తిపడరాదా అనుకున్నాడు. అంతకుమించి ఏమీ చేయలేక స్థాణువై ఊరుకున్నాడతను.
ఒక నీచకార్యాన్ని విజయవంతంగా సాధించిన దానికి బహుమానం అంతకన్నా నీచకార్యాన్ని చేయగల సామర్థ్యాన్ని సంపాయించటమేనని జయపాలుడు రుజువు చేశాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు