డైలీ సీరియల్

దూతికా విజయం-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు నీచకార్యాలకు ఎంతో విలువ చెల్లించబడుతుందనీ అతనికి తెలుసు. అందుకనే తనను కోరాడు. తన రాణిని కోరేందుక్కూడా వెనుకాడననీ అన్నాడు. వీడికి ఇంత సాహసాన్నిచ్చింది తాము పాల్గొన్న ఈ నీచ కార్యమే కదా!
ఒక కోరిక తీరగానే, దాని పైఎత్తున వున్నదానికోసం ఆశించడం మానవ సహజం. ధనదాహం తీరుతుండగా తన పొందును ఆశించాడీ ద్వారపాలకుడు. ఇదయ్యాక రాణిని కోరినా తానేం చేయగలదు? వీరభద్రుని ప్రవేశాన్ని అనుమతించేందుకు ‘రాణి పొందు లంచం’ అని ఇతను నిర్ణయిస్తే రాణికి మాత్రం తప్పుతుందా? ఆమె కూడా అంగీకరించే తీరవలసిన దారుణ పరిస్థితి సంక్రమించినా ఆశ్చర్యపడనవసరం లేదు కదా!
అంటే తాను లొంగటమంటే ఈసారి తన రాణి లొంగటంగానే పరిగణించవచ్చు. ఈ సూచనను జయపాలుడు ఇప్పుడే చేస్తున్నాడు. కనుక తన నిర్ణయం అనాలోచితంగా ఉండరాదు.
ఆలోచించుకునే వ్యవధి లేదు. ఇప్పుడు కుత్తుకమీదికి వచ్చిన ఈ పదునైన కత్తి మెడను కత్తిరించకుండా తననూ, తన బృందాన్నీ సంరక్షించుకోవాలి. అవివేకంగా ప్రవర్తించక లొంగటమే తరుణోపాయం. అయినా మరికొంత దూరం ప్రయత్నించాలనుకున్నదామె.
ఈ వీరభద్రుడు అందవికారంగా వున్నా బాగుండిపోను. అప్పుడు ఏ దొంగతనానికో కోటదాటి వచ్చాడని చెప్పవచ్చు. తక్కువ శిక్ష అనుభవించినా ప్రాణాలతో బైటపడేవాడు. అయితే ఇతను అంత కురూపి ఐతే రాణి కోరి ఉండేదే కాదు కదా!
తనచేత అనేకసార్లు మోసపోయిన ఈ జయపాలుని బుర్రలో మరో మోసానికి తగినంత ఖాళీ లేకుండా పోయింది. అంతకన్నా అతను గణించి, గుణించకున్న అనుభవంతో ఇపుడు ఇతరుల్నే మోసం చేయగల సామర్థ్యాన్ని సాధించి ఉండాలి. అందుకనే తనలాంటి గురువుకు కూడా పంగనామాలు పెట్టగలననే ధీమాతో మాట్లాడుతున్నాడనేది సుస్పష్టం. ఈ సహజ పరిణామాన్ని తాను అంగీకరించవలసిందే కాని, కాదని తోసివేయటమెలా?
మనసంతా గందరగోళంగా తయారై ఏం చేయాలో తోచటంలేదు. ఐనప్పటికీ పదునైన ఆమె మెదడు మరో కొత్త ప్రయోగాన్ని ప్రయోగించమని ఆజ్ఞాపించింది.
‘‘ఇక్కడ ఇంతసేపు ఇలా మాట్లాడుకోవటం, తర్కించటం ఎంత ప్రమాదమో తెలుసా?’’ అన్నది సరస్వతి.
అతనిక్కూడా ప్రమాదమున్నదని ఆమె అభిప్రాయం. కాని మదించి మత్తెక్కినవాడికి ఇవేమీ తెలియటంలేదు.
‘‘అందుకనే తర్కం వద్దు. మాటలెందుకు.. చేతలే’’ అని జయపాలుడు హఠాత్తుగా సరస్వతి చెయ్యి పట్టుకున్నాడు.
ఈ దురాక్రమణను ఆమె సహించలేకపోయింది. ఆమె ఒక్క విసురు విసిరి, అతని పట్టును విడిపించుకున్నది. పగలంతా తన వగలుకు పదును పెట్టాడని ఆ స్పర్శలోని వేడే ఆమెకు చెప్పింది.
వీరభద్రుని కాళ్లు వణుకుతున్నవి. ఈ సంఘటన పరాకాష్టనందుకున్నదనీ, సరస్వతీ జయపాలులిద్దరూ ఉన్మత్తులౌతున్నారనీ, ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించి ప్రాణంమీదికి తెస్తారనీ అతను భయపడ్డాడు.
ఇలాటి క్లిష్టపరిస్థితుల్లో వీరభద్రుణ్ని ద్వారపాలకుని మీదకి ఉసిగొల్పుదామనుకున్నదామె. వీరభద్రుని బలాతిశయాలు జయపాలుణ్ని యమసదనానికి పంపగలవు. ఐతే అతను ఇనుప కడ్డీలను వంచటం, తిలల నుంచి తైలాన్ని పిండటం లాటి పనులు చేసి, నిర్జీవమైన వస్తువులను మాత్రమే ఎదుర్కోగల సామర్థ్యం వున్న వాడే కానీ, సజీవమైన వ్యక్తులు- అందునా ఆయుధాలను నేర్పుగా ఉపయోగించగల యోధుల్ని ఎదుర్కొనే రకం కాదు. ఈ విషయం మొట్టమొదటి సమావేశం నాడే అతను విశదీకరించాడు. ఇతన్ని నమ్ముకొని ప్రయోగించటం, అడుగున చిల్లులున్న పడవలో సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించటం లాటిది.
అంతేకాదు వీరభద్రుడు తనను ఎదుర్కొంటున్నాడని గ్రహించగానే జయపాలుడు ఒక్క కేక వేస్తే అనేకమంది యోధులు అతనికి సహాయపడేందుకు క్షణాల్లో ఉరుకుతారు. వీరభద్రునికి మరణం తప్పదు.
పోరాటమనేది ఆరంభమైతే శబ్దమనేది తప్పదు. ఆ శబ్దమే జనాన్ని పోగు చేస్తుంది. అసలు ఈ వ్యవహారమంతా స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. ఇక్కడి ద్వారపాలకునికి పెద్ద బహుమతులు లభ్యవౌతవి కూడాను!
తాను తప్పించుకునప్పటికీ, ఈ ద్వారం దగ్గర కాపలా ద్విగుణీకృతం చేయబడుతుంది. అంతే తానిప్పుడు ఒక్కడితో పడే అవస్థ అప్పుడు ఇద్దరితో పడవలసి వుంటుంది. తన కష్టాలు రెండింతలవుతవి. ఆ కొత్తవాళ్ళిద్దరూ ఇంకేం లంచం అడుగుతారో చెప్పటమెలా?
జరుగబొయ్యేదంతా ఇంత విపులంగా తెలుస్తుండగా దీన్ని పొడిగించి మరింత క్లిష్టం చేయటం సబబు కాదు. తాను లొంగటంకన్నా తెలివైన మార్గం మరోటి లేదు.
నాలుగేళ్ళక్రితం వచ్చిన బ్రహ్మాండమైన గాలివాన గుర్తొచ్చిందామెకు. రెండు రోజులు పీడించిన గాలివాన తెరిపి ఇచ్చాక, ఆ ప్రాంతాలను పరిశీలిస్తే, మహావృక్షాలు సైతం కూకటివేళ్ళతో నేలకూలినివి. ఎన్నో చెట్లు పడిపోయినవి. అయితే వెదురు చెట్లు మాత్రం వంగినవే కాని విరగనూలేదు; నేల కరవనూ లేదు. ఎంత వేగంగా, బలంగా, గాలి వీచినా, అవి వంగి ఆ గాలిని నిరాటంకంగా ప్రవహింపజేసినవే కాని దాన్ని ఎదుర్కోలేదు. ఆనాడు తాను గ్రహించిన ఈ ‘వంశ-వాయు’ న్యాయాన్ని అనుసరించి తానిప్పుడు లొంగకుంటే మధ్యకు విరిగిపోక తప్పదని తేల్చుకున్నది సరస్వతి.
తన విదిలింపును అదిలింపుగా భావించి బహుశా జయపాలునికి తిక్కరేగి ఉంటుంది. అందుకని అతన్ని అనునయించి దారికి లాక్కురావలసిన తన బాధ్యత కూడా సరస్వతికి గుర్తొచ్చింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు