డైలీ సీరియల్

దూతికా విజయం-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇ ప్పుడిక తన కన్యాత్వాన్ని కాపాడుకోవాలనే కోర్కె నశించిందామెకు. లోకువైపోకుండా, గౌరవ మర్యాదలకు లోటు రాకుండా దాన్ని ఎలా ఆర్పించటమూ అనే తికమకలో పడింది సరస్వతి.
జయపాలుడు రెండడుగులు వెనక్కు వేశాడు. బుసలు కొట్టే తాచుపాము కాటువేసే వాటం కోసం తలను వెనక్కు లాక్కున్నట్లున్నది అతని ప్రవర్తన. అతని వెనుక వున్న కుడ్యదీపిక కారణంగా అతని నీడ బ్రహ్మరాక్షసల్లే అతని ముందు చాలా స్థలాన్ని ఆక్రమించింది.
‘‘సరస్వతీ! ఈ పగలంతా నా బలానికి పదును పెడుతూనే ఉన్నాను- హెచ్చరిక!’’
నిజంగా జయపాలుడు ఉద్దేశించకపోయినా వశం తప్పుతున్న అతని ఉద్రేకం మేళవించి అతని కంఠస్వరం గంభీరంగానూ, కాస్త పెద్దగానూ ధ్వనించింది.
ఆ మాటలు వింటున్న ఇద్దరి మనసుల్లో వివిధాభిప్రాయాలూ, భావాలూ మెదిలినవి.
జయపాలుడు పదునెక్కించింది ఒక్క బల్లానికే కాదు మిగతా రెండింటికీ మెదడుకూ, నాలుకకూ కూడాను. పదును పడిన ఈ మూటి సమ్మేళనమే ఈ సంఘటనను శిఖరాగ్రాన్నుంచి జారిన కొండరాయి వలె, పోను పోను ఏ శక్తీ ఆపలేని వేగంతో దొర్లించింది. జయపాలుడు పెట్టిన ‘వాడి’ని తన చాకచక్యంతో, నేర్పుతో, వేడితో వాడేట్లుచేసి, మొక్కవోయించి, అతన్ని సామాన్య ద్వారపాలకుడుగా చేస్తే తప్ప తన పథకాలు సక్రమంగా పారే అవకాశం ఉండదని సరస్వతికి తోచింది.
ఇక లాభం లేదు. జయపాలునికి లొంగిపోవటమే సర్వోత్తమైన మార్గం. తన మానానికీ, నాలుగు మానవ ప్రాణాలకూ లంకె ఏర్పడింది. అందులో తనదీ ఒక ప్రాణమే! మానానికి ఇంత విలువ ఏర్పడినప్పుడే దాన్ని అమ్ముకోవటం మంచిది. ప్రాణంకన్నా మానం గొప్పదనేది ప్రతీతి మాత్రమేననిపించిందీ సమయంలో సరస్వతికి. మానాన్ని పోగొట్టుకున్న పాపమంటూ తనకు చుట్టుకుంటే, నాలుగు మానవ ప్రాణాల్ని కాపాడిన పుణ్యం దాన్ని హరించి మరెంతో తన ఖాతాలో జమ ఉంచదా?
దూరాన ఎవరో ‘ఎవరూ?’ అన్న మాటలు అస్పష్టంగా వినిపించినవి. జయపాలుడ్ని కూడా చీకట్లోకి లాగాలని, నోరు మెదపరాదని హెచ్చరించాలని సరస్వతి నిశ్చయించుకుని చేయి జాపబోయింది.
అసలుకే మోసం వచ్చిందని జయపాలుడు భయపడ్డాడు.
ఆ తొందరలో వెనుక ముందులు ఆలోచించక పెద్దగా ‘ఎవడ్రా నువ్వు’ అన్నాడు బల్లెం పైకెత్తి.
దివిటీ కాంతిలో తళతళా మెరిసే బల్లెపు మొన చూసేటప్పటికి వీరభద్రడు తత్తరపడ్డాడు. ప్రాణభీతి అతన్ని తికమక పెట్టింది. ఇన్ని రాత్రుల అభ్యాసం కానీ, సరస్వతి చిలక్కు చెప్పినట్లు చెప్పిన మాటలు కానీ, ఈ క్షణంలో అతనికి గుర్తులేవు. తనేం చేస్తున్నాడో తెలియకుండానే బాగా అలవాటైన ఉద్యానవనంలోని దారినపడి శరవేగంగా పరుగెత్తాడు. ఇలా జరుగుతుందని సరస్వతి కూడా అనుకోలేదు. జయపాలుడు కూడా విధి లేక వీరభద్రుని వెంట పడ్డాడు.
అంతా మించిపోయిందని సరస్వతి తెలుసుకున్నది. అత్యధికంగా నగిషీ చేస్తే, లోహమే చిల్లులు పడిపోయినట్లయింది! ఆ ప్రశాంత నిశీథిలో ఆ బరువైన కాళ్ళ చప్పుళ్ళకు మరికొన్ని పాదాల సవ్వడులు కూడా మహానదిలో పడేందుకు ఉరుకులు పరుగుల్తో వచ్చే ఉపననదులవలె కలుస్తూన్నవి.
సరస్వతి భూస్థాపితమైన శిలావిగ్రహమైపోయింది. మృత్యువు జీవితాన్ని ఎప్పుడూ వెన్నాడుతూనే వున్నది. అది మానవునికి కనిపించదు కనుక ధీమాగా ఉంటున్నాడు. అయితే మృత్యుదేవతకు అంతా కనిపిస్తూనే వుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా కలుసుకోవాలో ఆ నిర్ణయం ఆ దేవతదే!
తన అవివేకానికి నాలుగు మానవ ప్రాణాలను అర్పించిన తనను తాను క్షమించగలదా! తాను తెలివిగలదాన్ననే గర్వమంతా క్షణంలో నీరుగారిపోయింది. లేనిపోని భేషజాలకు పోయి, హాయిగా, మెత్తగా సాగిపోవలసిన సంఘటనను కలగాపులగం చేసి, దూముడిగా ఉన్న దాన్ని పీటముడిగా చేస్తే, జయపాలుడూ, వీరభద్రుడు కలిసి దాన్ని బ్రహ్మముడి చేశారు.
అంతలోనే చావుకేక వినిపించింది. చుట్టూ కొండలుండగా మధ్యలో ఏర్పడిన చిన్న సరస్సులో శిఖరాగ్రాలు విరిగిపడితే ఉద్భవించే శబ్దంవలె వున్నది ప్రశాంత నిశీధిలోని వళ్ళు జలదరించే ఆ కేక.
స్ర్తిల హాహాకారాలు స్పష్టంగా ప్రతిధ్వనించినవి. కల్లోలం జరుగుతున్నట్లు తెలుస్తూనే వున్నది. చావవలసిన నలుగురిలో ఒకరు మృత్యుదేవి కౌగిట్లోకి ఒరిగిపోతున్నట్లు కూడా సరస్వతి గ్రహించింది.
ఇపుడు తనకిక భయంలేదు. తన తెలివితక్కువను దూషించుకొని ప్రయోజనం లేదు. తను చేయవలసిందీ మరి లేదు. తనకు విధించబడే శిక్షా, దాన్ని అనుభవింపజేయటం కూడా ఇతరుల వంతు. భద్రంగా వున్న తన మానాన్ని గూర్చిన గర్వం కూడా మరి లేదు. నిశే్చతన స్థితిలో ఆమె నిలబడిన స్థలంలోనే పాతుకొనిపోయింది.
తన జీవితమంతా చేయిజారిన ఈ రెండు క్షణాలమీదనే ఆధారపడి వున్నది. భగవానుడు దయతలచి ఆ రెండు క్షణాలనూ తిరిగి సంభవింపజేస్తే! ముక్కలు ముక్కలైన దారపు తుంపులను అతికి పొడవైన దారంగా చేయటం లాటి అసంభవమది. అలాటిదాన్ని ఊహించి తన మూర్ఖత్వాన్ని మరోసారి రుజువు చేసుకోటం దేనికి?
నిలదొక్కుకోబోయి, విరగదొక్కుకున్న పరమ మూర్ఖురాలు తాను! తనకు ‘క్షమ’ కోరే హక్కు కూడా లేదు!
రాణి తన ముందుకాలుకు బంధాలు వేసింది. తాను వల వేసి వీరభద్రుణ్నీ, జయపాలుణ్నీ పట్టింది. రాణి తనను మోసం చేసిందేమో? అదే విధంగా తాను వీరభద్రుణ్ని భ్రమింపజేసింది. జయపాలుణ్ని ఇచ్చకపు మాటలతో కట్టివేసింది. వీరభద్రుడు రాణిని మభ్యపెట్టి మోసగిస్తున్నాననుకున్నాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు