డైలీ సీరియల్

దూతికా విజయం-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నిజమేమిటో కక్కించగల సామర్థ్యం మాకున్నదనీ నీకు తెలుసు. సరే నీవిప్పడన్నమాటను కూడా అంగీకరిస్తున్నాను. నీకిస్తున్న ఒకో అవకాశమే నీ పాలిట యమపాశంగా మారుతుందని గుర్తుంచుకో!’’ అన్నాడు రాజు.
రాజు సరస్వతిని ఎందుకు ప్రశ్నించడం లేదో ఎవరికీ అర్థం కావటంలేదు. బహుశా జయపాలుని సాక్ష్యం ఇంకా పూర్తికాలేదని అందరూ అనుకుంటున్నారు.
హఠాత్తుగా రాజు ‘‘వీణ్ని సోదా చేయండి!’’ అన్నాడు జయపాలుణ్ని చూపుతూ.
తనను రక్షించే దైవాలు ఈ భూమిమీద ఇంకా అవతరించలేదని జయపాలునికి తోచింది. ప్రచండమైన కాంతితో, వేడితో ఉదయించిన సూర్యునికిరణాల తాకిడికి అసత్యమనే మంచు తెరలు పటాపంచలవటం జయపాలుడు కళ్ళారా చూస్తూనే ఉన్నాడు. తన బుర్ర రామకీర్తన పాడక తప్పదని నిశ్చయమవుతోంది.
జయపాలుని బొడ్డులో వున్న సువర్ణ ముద్రికల మూట పెల్లగించబడింది. ఎంచబడి నూటయాభై అని తేల్చబడింది.
‘‘నీ వేతనమెంత?’’
‘‘ఇరవై రజిత ముద్రికలు ప్రభూ!’’ అన్నాడు జయపాలుడు నీరస స్వరంతో.
‘‘అంత గొప్ప సంపాదనలో నీవీ నూట యాభై బంగారు నాణాల్నీ ఆదా చేశావా?.. చెప్పు.. ఇవి నీకు సరస్వతి ఇచ్చిందా లేదా?’’ ఆ చివరి మాటలు నిప్పులు కక్కుతూ వెలువడినవి.
ఇంతలో భటులు తిరిగి వచ్చారు.
‘‘గోడ ఎక్కి దూకిన సూచనలేమీ లేవు ప్రభూ! గోడకు ఆవల పొదల్లో రుూ మూట వున్నది!’’ అన్నారు వాళ్ళు మూటను రాజు ముందుంచుతూ.
‘‘ఎందుకుంటవి? అలాంటి ప్రయత్నమే జరుగలేదు. ఈ కోట గోడలు ఎగబాకటం మాటలా? ఆ ఎత్తు నుంచి దూకి సజీవుడై నడవటం సాధ్యమా!.. లోనికి ప్రవేశించిన వారు దక్షిణ ద్వారం గుండానే వచ్చారు. ఆ మూటలోనివి రుూ వీరభద్రుని అసలు దుస్తులై ఉండాలి!’’ అన్నాడు రాజు.
మూట విప్పబడి, వీరభద్రుని అసలు దుస్తులు వెలికితీయబడినవి. ఈ ఇంద్రజాల మహేంద్రజాలాన్ని భేదిస్తూన్న రాజు చాకచక్యానికి ప్రేక్షకులందరూ ఆశ్చర్యంతో నిశే్చష్టులవుతున్నారు.
నిజాల్నీ, అబద్ధాల్నీ కలిపేస్తే క్షీర నీర న్యాయంగా ఉండగలదని అల్పులు ఆశిస్తారు. ఐతే ‘హంస’ చాతుర్యాన్ని చూపగలవారు, వేటిని వాటిగా విడదీసి స్పష్టీకరించగల సమర్థులే అవుతారు. ఆ కలయికను ‘తిలతండుల న్యాయం’గా వారు రుజువు చేస్తారనేది ఇప్పుడు విశదీకరించబడినట్లు అందరూ అర్థం చేసుకున్నారు.జయపాలుని మొహంలో ప్రేతకళ తాండవమాడుతూన్నది. జయపాలుడు నేరం చేయలేదనే సాహసం ప్రేక్షకుల్లో ఎవ్వరికీ ఏ కోశానా లేదు.
‘‘రాజద్రోహీ!’’ అన్నాడు రాజు. ‘‘వీణ్ని ఇప్పుడే తీసుకొని వెళ్ళి వీడు విధి నిర్వర్తించవలసిన దక్షిణ ద్వారం దగ్గరే మదపుటేనుగు చేత భూమిలోకి పూర్తిగా దిగిపొయ్యేవరకూ తొక్కించండి. వేరే సమాధి అవసరం ఉండరాదు. వీడి భూతం మన బొక్కసానికి చిల్లిగవ్వ ఖర్చు లేకుండా యుగయుగాలు దక్షిణ ద్వారాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. ఊ! వీణ్ని లాగెయ్యండి..’’
భటులు జయపాలుణ్ని బరబరా ఈడ్చుకుపొయ్యారు.
‘‘మూడవ ముద్దాయి సరస్వతి! ఏమంటావు?’’ అన్నాడు రాజు క్రోధావేశాన్ని తగ్గించుకొని. రాజును మోసం చేయటం అసంభవమని సరస్వతికి తెలుసు. తనకెలాగూ మరణదండన తప్పదు. కనీసం రాణినైనా కాపాడుదామని ఆమె ప్రయత్నం. తన మానం కాపాడబడినందుకు సరస్వతి సంతోషించటంలేదు. తాను మలినమై నాలుగు మానవ ప్రాణాల్ని కాపాడలేకపోయినందుకు విచారపడుతోంది. కనీసం తన మానంతోపాటు రాణి ప్రాణమన్నా కాపాడితే, గుడ్డిలో మెల్లగా తృప్తి ఉంటుంది.
‘‘ప్రభూ! వీరభద్రుణ్ని నేనే ఆహ్వానించాను. జయపాలునికి లంచం ఇచ్చి రుూ రాత్రి ఉద్యానవనంలో వీరభద్రునితో ఆనందిద్దామనుకున్నాను!’’ అన్నది సరస్వతి.
రాజు పకపకా నవ్వాడు.
‘‘సరస్వతీ! చాలా తెలివైనదానివి నీవు. లోతైన మనిషివి. ఐతే అసత్యాలు ఆ అగాధాలను పూడ్చివేసి పైకి స్పష్టంగా కనిపించవని ఎందుకు పొరబడ్డావు? నే నీ మాటలు ఎలా నమ్మేది? జయపాలునికి నూట యాభై సువర్ణ ముద్రికలు లంచం ఇచ్చే తాహతు నీకున్నదా? ఎలానో అవస్థపడి ఆ లంచం ముట్టజెప్పావని అనుకుందాం. ఉద్యావనంలో నీ ప్రియునితో చిక్కటి గాఢాంధకారంలో సుఖించటంలో ఆనందం ఉన్నదా? సైంధవునిలాంటి రుూ ద్వారపాలకుణ్ని మభ్యపెట్టి, తృప్తిపరుస్తూనే కాని నీ ప్రియుడు లోనికి రాలేడు. కోటలో ఏ క్షణాన ఎవరి కంటబడతామోననే భయంతో వొణికిపోతూ, ప్రియుని పొందు కోరే తెలివితక్కువ దద్దమ్మవా నీవు? రాణి అనుమతితోనే సెలవు తీసుకొని పట్నంలోకి వెళ్లి, నీ ప్రియుని ఇంటికి రహస్యంగా జేరి నిర్భయంగా స్వేచ్ఛగా తెల్లవారే వరకూ సుఖించవచ్చునే! ఇంత తేలిక మార్గం నీకు అందుబాటులో ఉండగా నీ ప్రియుణ్ణి కోటలోకి తేవలసిన పనేంటి?’’ అన్నాడు రాజు.
తను మాట్లాడకుండటమే తన మూఢత్వపు లోయలను బైటపెట్టకుండటంగా భావించిందామె.
‘‘జయపాలునికి లంచమిచ్చావు కదా! మరి అతనెందుకు తిరగబడ్డాడు? చాలదనా? ఇంకేమైనా కోరాడా?’’ సరస్వతి వౌనం వహించింది. ‘‘నిన్ను కోరాడా?’’ అన్నాడు రాజు. కొరడా దెబ్బలాంటి ఆ మాటకు సరస్వతి తుళ్ళిపడి వంచిన తలనే తెలిసీ తెలియనట్లుగా లీలగా ఆడించింది.
‘‘అవివేకీ!’’ అన్నాడు రాజు.
ఆ ‘అవివేకి’ అనే పదాన్ని అర్థం చేసుకోగల వివేకం రాజుకూ సరస్వతికీ మాత్రమే వున్నవి.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు