డైలీ సీరియల్

దూతికా విజయం-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం! రాణి, సరస్వతులిద్దరే నిబ్బరంగా వున్నారు. రాజు విధించిన శిక్షను నవ్వుతూ కాకపోయినా, కిమ్మనకుండా అనుభవించేందుకు వారు సిద్ధమయ్యారు.
రాణి తనను ‘ప్రియసఖి’ అని పిలిచేది. ఇతరులు ‘రాణి ప్రాణసఖి’ అనేవారు. అదే నిజమైంది. తన ప్రాణానికీ, రాణి ప్రాణానికీ ఒకే విడివడని లంకె ఏర్పడింది అనుకున్నది సరస్వతి.
రాణి మనసులో కూడా సరస్వతిని పల్లెత్తుమాట అనలేదు. మరుజన్మలో కూడా ఆమె తనకు ప్రియసఖిగా ఉండాలని వేయిదేవుళ్ళను కోరుకొంది.
సరస్వతి కూడ ఆ రాణి వింత కోరికవల్లనే రుూ అనర్థమంతా వచ్చి పడిందని కానీ, రాణీ మూర్ఖత్వమే తన ప్రాణం తీసిందనీ కానీ అనుకోలేదు. మరుజన్మలో కూడా రుూ రాణికి ప్రాణసఖిగా ఉండాలనే వేయి వేల్పులకు వేడుకోలు చేసింది.
విజ్ఞులెప్పుడూ, తమ తప్పులను ఇతరులమీద రుద్దేందుకు సాహసించరు. కష్టమో సుఖమో, అదృష్టమో-దురదృష్టమో తమకు అలివితప్పి సంభవించే వాటిని స్వీకరించటమే తమ కర్తవ్యమని భావిస్తారు. విధి పన్నిన రుూ పన్నాగంలో ఇరుక్కుపోయిన వనితలు తాము. దైవ నిర్ణయం ప్రకారం సాగనిమ్మని తమకు తాము నచ్చచెప్పుకున్నారు.
‘‘గున్న ఏనుగువలె వున్న రుూ వీరభద్రుని శరీరంలోని రక్తమంతా కారిపోయి పీనుగయ్యాక తామిద్దరూ మోస్తుంటేనే ఇంత భారంగా ఉన్నాడే! ఇతను బతికి ఉండగా కుసుమ కోమలి రాణి ఒక్కతే ఎలా భరించేదో కదా!’’ అనుకున్నది సరస్వతి.
దక్షిణ ద్వారం దగ్గరికి శవవాహకులు జేరే వేళకు జయపాలుని సమాధి పూర్తయినట్లున్నది. మదపుటేనుగు మళ్లించబడింది.
మదపుటేనుగు జయపాలుడ్ని భూస్థాపితం చేసే ఘోర దృశ్యాన్ని తాము చూడాలని రాజు శాసించకపోవడం గుడ్డిలో మెల్లగానే భావించారా భామలు.
అప్పటికప్పుడు తాపీ పనివాళ్ళు వచ్చేశారు. రాజు తలచుకుంటే రానిదీ, కానిదీ ఏముంది కనుక?
రాణి, సరస్వతులు వీరభద్రుని శవాన్ని దింపారనటంకన్నా, కింద పడేశారంటేనే సబబుగా ఉంటుంది. సమాధి నిర్మించవలసిన స్థలాన్నీ ఆయా కొలతల్నీ మేస్ర్తిలు నిర్ణయించి గీతలు గీశారు. ఒకపక్క పునాదుల తవ్వకం కూడా ఆరంభమైనది.
రాణిని రాణిగా కానీ, సరస్వతిని ఆమె ఆంతరంగిక కార్యదర్శిగా కాని ఇప్పుడు ఎవ్వరూ చూడటంలేదు. ఇద్దరు వ్యభిచారిణులు, నీచులుగా ముద్రలు వేయబడి, రాజద్రోహులుగా శిక్షార్హులై ఆ శిక్షను అనుభవించేందుకు వచ్చారనీ, నేరస్థులపట్ల సజ్జనులుగా ప్రస్తుతం చెలామణిలో వున్నవారంతా చూసే ఈసడింపు చూపులే తీక్షణ వీక్షణాలై ఆ మగువలిద్దరినీ మలినపరుస్తున్నవి.
తమను పునీతం చేయగలిగిన పుడమి- భూమాత ఒడిలో ఒరిగిపోయి శాశ్వత శాంతిని సాధించేందుకు సిద్ధపడిన ఆ సరసిజాక్షుల దృష్టి నేలబారునే వున్నది. విచారం లేదు, ఆవేదన లేదు. కలకలం లేదు. నిర్లిప్తంగా రుూ శిక్ష ఏదో కథలో, ఎవరికో జరుగబోతున్నదనే భావనలో- అదీ రసహీనమైన సంఘటనలు బలాత్కారంగా వింటూన్న విధంగా ప్రవర్తిస్తున్నారిద్దరూ.
వారిద్దర్నీ కూర్చోమన్నారు. రాణి వొడిలో వీరభద్రుని తల ఉంచి సరస్వతి ఒడిలో అతని కాళ్ళు ఉంచారు.
పునాదులు పూర్తయినవి. నలుగురు మెరికల్లాంటి పనివాళ్ళు, వాళ్ళకు ఎనమండుగురు సహాయకులు కలిసి, ఇంద్రజాలంవలే ఒకేసారి నాలుగువైపులా కుడ్యాలను చకచకా కట్టుకు వస్తున్నారు. క్షణక్షణానికి గోడలు బారవుతూన్నవి.
మరణదండన బతికున్నవారికి కదా! మరి రుూ చచ్చిన వీరభద్రునిక్కూడానా? తమను జీవసమాధి చేయమన్న రాజు చావబోయే తమ మెడలకు పెద్ద రంఢోల్లాంటి రుూ శవాన్నికూడా వేలాడేయడం దేనికి? బహుశా ఆ చివరి క్షణాల్లో ఆ కటిక చీకట్లో రుూ శవాన్ని స్పర్శ ద్వారా మాత్రమే చూస్తూ, క్రమంగా ఊపిరాడక రుూ శవంలోనే లీనమైపోవటమే రాజుగారు ఉద్దేశించారేమో?
వ్యభిచరించడం ద్వారా పతితగా మారిన రాణికి, మానాన్ని కాపాడుకొని పరమ పవిత్రంగా పావని అయిన తనకూ మరణానంతరం వేరు వేరు లోకాలు కేటాయించబడుతవేమోననే అనుమానం సరస్వతికి వచ్చింది. రాణి సహచర్యాన్ని ప్రసాదించమని సర్వేశ్వరుణ్ని స్మరించి ప్రాధేయపడింది సరస్వతి.
పతిత ఐన రాణిని క్షమించి పావనిగా మార్చేటంత విశాల హృదయుడు దేవుడు కాకపోవచ్చు గాక! పోనీ, తనను కూడా పతితగా మార్చి రాణికి ప్రసాదించే నరకమే తనకూ వరంగా ఇచ్చేపాటి దయనైనా చూపలేదా సర్వేశ్వరుడు! ఇది సరస్వతి మదిలో మెదిలిన ఊహ.
ఇటుకమీద ఇటుకు పేర్చుకొనిపోతున్నది. తమ ఆశలన్నీ ఆవంలో కాలి నిర్జీవమై రుూ ఇటుకలై తమ సమాధికి ఉపయోగపడుతున్నట్లనిపించింది సరస్వతికి.
ఇంతవరకూ సరస్వతి తన జీవితంలో మనసారా దేవుణ్ని ఎన్నడూ ధ్యానించలేదు. ఇప్పుడు భూమిమీద ఏ శక్తీ తమకు సహాయపడలేని ఈ దుర్భర క్షణంలో ఒక్క క్షణం పాటు దేవునిమీద ఆమె మనసు లగ్నమైంది.
మరుక్షణంలోనే సరిగ్గా విరుద్ధమైన భావం ఆమెకు తట్టింది. ఆ దేవునికి తమను రక్షించాలనే సదుద్దేశమే ఉన్నట్లయితే, ఈ దారుణ పరిస్థితినే దాపురించనిచ్చేవాడు కాదు కదా!
అయితే దేవుడు ఇలా జరిపించినందుక్కూడా ఒక కారణం లేకపోలేదనిపించింది సరస్వతికి. మానవుణ్ని సుఖంగా ఉండనిచ్చేందుకు దేవుడు ఇబ్బందుల్ని కలిగించే శ్రమ తీసుకోకుండా ఉంటేనే సరిపోతుంది. అయితే మానవుణ్ణి మరింత సుఖపెట్టేందుకుగానూ దేవుడు క్లిష్ట సమస్యల్ని సృష్టించటం, అందులోంచి బైటపడెయ్యటం చేసి తీరాలి. ఆరోగ్యంగా వున్నవాడు సుఖంగా ఉంటాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు