డైలీ సీరియల్

దూతికా విజయం-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దబ్బుమని పేడకుప్పల్లే సరస్వతి కిందపడింది. పిరుదులు నొప్పి పుట్టినవి.
‘‘చిలిపితనానిక్కడా హద్దులుండాలి.. ఏమిటి అరుస్తావా?’’ అన్నాడు వీరభద్రుడు.
తను అరుస్తానంటే భయపడి తనను వదిలేశాడని సరస్వతి తేల్చుకున్నది. శతృవు తాలూకు బలహీనత తెలిసిపోయాక సమ్మెట పోటులను ఆ లొసుగుమీదనే ప్రయోగించటం వివేకం.
‘‘ఔను.. అరుస్తాను. దూరంగా ఉండు ముందు!’’ అన్నదామె రోషాయుక్తమైన నేత్రాలను ప్రదర్శిస్తూ.
‘‘అర్ధరాత్రి వొంటరిగా వయ్యారంగా నా ఇంటికి వచ్చి ఆశ్రయం అడిగావు. ప్రణయినివి అనుకున్నాను. విరహవేదనతో గిలగిల్లాడుతున్నావనుకున్నాను. అలాగే ప్రవర్తించి నాకు ప్రోత్సాహాన్నిచ్చావు. తీరా దరిజేరితే ఈసడించావు. బెట్టుచేస్తున్నావని భ్రమించాను. నాలాటి బ్రహ్మచారికి ఆశపెట్టి, ఊరించి, ఉడికించి అందకుండా దూర దూరంగా జరుగుతూ ఆనందిద్దామనుకున్నావు కాబోలు! దేవతల్లేవచ్చి దెయ్యమల్లే రక్కావు. నిన్ను ఇంట పెట్టుకొని ఈ రాత్రి ఒక పక్క మన్మథుని నిశిత శరాలతో శరీరాన్ని గాయపరచుకుంటూ, మరోవైపు నిద్రాదేవికి దూరమై -
ఈ రెండు రకాల బాధలకూ లోను కాలేను. అదీగాక విషసర్పంలాటి విరోధిని పక్కన ఉంచుకొని సురక్షితంగానే ఉన్నానని తలపోసి పొరబడేటంత మూర్ఖుణ్ణి అనుకున్నావేమో? ఒంటరిగా నా ఇంటికి వచ్చి అరుస్తావా? ఏమని అరుస్తావు? నేను బలాత్కరించాననా? బలాత్కరించగా మాన సంరక్షణార్థం నన్ను పీకి రక్కానని చెపుతావా? చెప్పు. ఆడది అబద్ధమాడితే గోడవలె ఉంటుందనే మాటను జ్ఞాపకం పెట్టుకున్నట్లున్నావు. ఆ కుడ్యాన్ని కూల్చిపారేస్తాను చూడు.. అరిచి నలుగుర్ని ఇక్కడకు జేర్చాక నీవసలు ఇక్కడికి ఎందుకు రావలసి వచ్చిందో చెప్పు. రాణివాసపు రమణికి ఇది తగునో తగదో ప్రేక్షకులే నిర్ణయిస్తారురా.. ఇక్కడ నా ఇంట్లో అరుస్తే అందరికీ వినిపించదు. బైటకి గెంటుతాను. అక్కడ నీ ప్రజ్ఞ ప్రదర్శించు. నలుగురూ మెచ్చుకుంటారో, మొహన ఉమ్మివేస్తారో త్వరలోనే చూడొచ్చు.
వీరభద్రుడు భీకరుడైనాడు. చూస్తూండగానే కొంచెం కొంచెంగా పొడుగు పెరిగాడనిపించింది. కోపమూ, అసహ్యమూ, చిరాకు, ద్వేషమూ, ఆశించింది చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయిందనే దిగులూ, ఇంకా ఇలాంటి అనేక అనుభూతుల మేళవింపు కలగాపులగమవగా ఆమెను సమీపించాడు.
వీరభద్రుడు ఏదో పిచ్చిపని చేస్తాడనీ, తన పని బూర్లె మూకుడులోంచి సరాసరి గాడి పొయ్యిలోకే పడినట్లవుతుందేమోననే భయం సరస్వతిని ఆవరించింది.
తన ఉద్దేశం వీరభద్రుని ఆకర్షించి, అవమానించి తాను ఆనందించటం కాదనీ, కొంచెం వ్యవధి ఇస్తే అంతా విశదీకరిస్తాననీ అతన్ని ప్రాధేయపడదామనుకున్నదామె. ఏది ఎలా వివరించాలో అనే ఆలోచనలో ఉన్నది.
ఈసారి తనను బలాత్కరించే ఉద్దేశమే అతనికి లేదని ఆమె గ్రహించింది. తనను బైటికి నెట్టేసేందుకే నిశ్చయించుకున్నాడనీ తెలుసుకున్నది. ఈ ఇంటి ఆవరణ దాటితే తాను అరిచి ప్రయోజనం ఉండదనే సూక్ష్మాన్ని వీరభద్రుడు కూడా గ్రహించి బైటపెట్టాడు కనుక- ఆ ఆయుధం తనకు నిష్ప్రయోజనం; అంతేకాదు దాన్ని ఉపయోగిస్తే అది ప్రత్యర్థిని ఏమీ చేయలేదు సరికదా, బంతివలె తిరిగి వచ్చి తననే మోదుతుంది.
బైటపడితే ప్రస్తుతానికి తనకు ఈ మహోద్రేకి తాకిడి తప్పుతుంది. కాని ఈ అర్థరాత్రి వానలో తను ఎక్కడికి వెళ్లాలి? రాజవీధుల్లో ఒంటరిగా తిరుగులాడటం ఎంత ప్రమాదం! నీటినుంచి బైటపడే చేపకు, తనకూ భేదమేమీ ఉండదు.
పోనీ అని వీరభద్రుణ్నే ప్రాధేయపడితే అతని కోర్కె తీరిస్తేనే తప్ప తాను చెప్పేదాన్ని చెవి కెక్కించుకునే స్థితిలో లేదు. తన అందచందాలకు వీరభద్రుని లాటి పురుష పుంగవుడే తల్లకిందులయ్యాడని సంతోషపడలా? లేక తన కర్తవ్య నిర్వహణకు గొప్ప ప్రతిబంధకమైనదని దుఃఖపడాలా? ఆమె ఎటూ నిర్ణయించుకోక ముందే వీరభద్రుని బలమైన, బరువైన చేయి మృదువైన ఆమె మెడమీద పడింది. గోలచేసే గండుపిల్లి మెడ పట్టుకుని ఎత్తిన విధంగా ఎత్తి తన నిష్క్రమణను తొందర చేసేందుకు నెట్టుకుంటూ లాక్కువెళుతున్నాడు. తను అరుస్తానని బెదిరించింది. ఇప్పుడు అరిచి ఉరితాటిని మెడకు బిగించదలచుకోలేదు. అయితే వీరభద్రుడే అరుస్తున్నాడు.
తాను చెప్పదలచుకున్న దానికి సమాధానం కాని, వ్యవధి కాని ఇవ్వనే లేదు.
‘‘నీలాటి దానికి తగిన శాస్తి చేస్తాను. నువ్వు ఆడదానివా-రాక్షసివి! నీ గతి కుక్కలకూ, నక్కలకూ తెలుస్తుందిగాక!’’ అని తలుపు బార్లా తెరిచి బైటికి గెంటాడు. ఎలాగో బోర్లాపడకుండా తనను తాను నిలువదొక్కుకుందామె! వీడీ జిమ్మడ- ఆ చేతుల్లో ఎంత బలమున్నది!
వీరభద్రుడన్న ‘కుక్కా - నక్క’ సిద్ధంగా ఎదురుగానే ఉన్నవి.
ఇద్దరు రక్షక భటులు కరదీపికలు పట్టుకుని యమభటులల్లే నిలబడి ఉన్నారు. తను మేలిముసుగు, నగిషీపని చేసిన విలువైన పాదరక్షలూ, వీరభద్రుని ఇంటనే వదలి రావటంవల్ల తాను రాచనగరుకు సంబంధించిన మనిషిగా కనిపించటంలేదు. అది కొంతనయం!
ఆమె కాళ్ళు వొణకుతున్నవి. దుర్మార్గుడనుకున్న వీరభద్రుని పాలబడటమే ఈ పరమ దుర్మార్గుల పాలబడటం కన్నా లక్ష రెట్లు మేలు
‘‘ఏమిటీ గొడవ- ఏమైంది?’’ అన్నాడొక రక్షకభటుడు గంభీర స్వరంతో, అధికారాన్ని ధ్వనింపజేస్తూ.
మృత్యుదేవత ఇంత సామీప్యానికి వచ్చి ఇలా హుంకరిస్తుందని ఆమె కలలో కూడా తలచలేదు. ఇప్పుడు తనను తాను రక్షించుకోవటమెలా? వీరభద్రుడే దయతలచాలి. లేకుంటే తన తల తెగిపడటం తథ్యం!
ఈ అనుకోని సంఘటన వీరభద్రుణ్ణి కూడా కలవరపెట్టింది. తామిద్దరూ పడే గొడవలో సరస్వతిని జయించటం ఎలాగా అని ఆలోచన చేస్తూండగా మరో ఇద్దరు కొత్త విరోధులు ఎదురైతే- ముందా బైటి శతృవులను రూపుమాపుకోవలసిన అవసరం ఉన్నది. అందుకని వీరభద్రుడు సరస్వతిని వీళ్ళ బారిన పడకుండా రక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఆమె తనకు దక్కాలి. దక్కుతుందనే ఆశ ఉన్నది. ఒకవేళ తనకా ప్రాప్తం లేకపోయినా చూస్తూ చూస్తూ తన చేతులారా వీళ్ళకు కన్యాదానం చేసేటంత అవివేకం తనలో మచ్చుకైనా కానరాదు.
సరస్వతిని గెంటేందుకే తాను నిశ్చయించుకున్న విధంగా ప్రవర్తించి, ఆమెకు ఆ నమ్మకం ఏర్పడేందుకే ఒక నాటకం ఆడితే- వీధిలోకి నెట్టుకెళ్ళే సమయానికైనా ఆమె తన స్థితిని గ్రహించి, లొంగిపోతుందని వీరభద్రుని అంచనా. ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవటం ఇప్పుడు కాదు, ముందీ రక్షక భటుల్ని ఎలాగైనా సరే వొదించాలి. వీళ్ళ పాల పడకుండా రక్షించినందుకు కృతజ్ఞతను చూపటంగానైనా సరస్వతి తనకు లొంగుతుందనే ఆశ ఏర్పడింది.
‘‘చెప్పనా? అంతా చెప్పేయనా?’’ అన్నాడు వీరభద్రుడు సరస్వతి మొహంలోకి సూటిగా, చిలిపిగా బెదిరింపుగా చూస్తూ.
రక్షక భటుని చేతుల్లో వున్న కరదీపిక కాంతి స్పష్టంగా సరస్వతి, వీరభద్రుల మొహాలమీద నాట్యమాడుతోంది. కళ్ళతోనే తానేమైనా మాట్లాడితే పట్టుబడిపోతుంది; కనుక తెలివిగా ప్రవర్తించాలనుకున్నది సరస్వతి.
వీరభద్రుడు చెప్పేస్తానన్నాడు; అసలే ఓటమితో, పరాభవంతో శృంగభంగంతో కుమిలిపోతున్నాడు. కసిదీర్చుకునేందుకు నోరు జారాడో తనను పర్వతాగ్రం నుంచి తోసేసినవాడే అవుతాడు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు