డైలీ సీరియల్

దూతికా విజయం-96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లెపువ్వులు ఆరబోసినట్లుగా తెల్లని దుప్పటి పరచబడి వున్నది. సుగంధాలు వెదజల్లే రకరకాల పువ్వులు పక్కమీద విరజిమ్మబడి ఉన్నవి. ఒక మూల చిన్న బల్లమీద పాత్రలో ఇసుక పోసి అందులో గుచ్చబడిన అగరువత్తుల పొగ ఘుమఘుమలాడుతూ గదంతా అలముకుంటున్నది.
గది వాకిట అల్లిక పనిచేసిన తెర దించి ఉన్నది. ఒక చిన్న బల్లమీద తాంబూలానికి అనువైన ద్రవ్యాలూ, చందనమూ, కస్తూరీ, జవ్వాదీ మొదలైన సుగంధ ద్రవ్యాలూ అమర్చబడినవి.
ఆమె గోడలమీదకి దృష్టి సారించింది. ఇదివరకున్న భీష్ముడూ, హనుమంతుడూ మొదలుగాగల బ్రహ్మచారుల బొమ్మల స్థానాలలో రతీ మన్మథులు, శకుంతలా దుష్యంతులూ, రాధాకృష్ణులు మొదలైన శృంగార ప్రాధాన్యత వున్న చిత్రపటాలు, పుష్పమాలాంకృతాలై అత్యంత ఆకర్షణీయంగా వున్నవి.
గోడలమీది బూజు, గీజు దులిపివేయబడింది. సున్నం కొట్టటమొక్కటే లోపం.
గదిలో మరో మూలగా, చిన్న బల్లమీద తెల్లని గుడ్డ పరచబడి తళతళలాడే పళ్ళెంలో రకరకాల పూవులూ, రెండు పెద్ద పూలమాలలూ ఉన్నవి. ఆ పూవుల్లో సరస్వతిని ముఖ్యంగా ఆకర్షించినవి సంపెంగలు. తనకా పూలు ఎంతో ఇష్టమని వీరభద్రునికి ఎలా తెలిసిందో? లేక అదంతా యాదృచ్ఛికమేనేమో!
ఆ పక్కన మరో పెద్ద పళ్ళెరంలో రకరకాల పళ్ళూ, మిఠాయి పొట్లాలూ ఇతర తినుబండారాలున్నవి. ధూపదీప నైవేద్యాలన్నీ సిద్ధం చేసే ఉంచాడీ వీరభద్రుడు. తన ఇంటి శోభ మర్నాడు చూడమని గత రాత్రి అతను చెప్పిన మాటను పాటించాడు.
తన రాణి విషయం కూడా ఈనాటి చర్చలో సుముఖంగా ఫలించేందుకు అవకాశాలు అనేకమున్నవని ఆమెకో గుడ్డి నమ్మకం ఏర్పడింది.
ఒక్కమాటలో చెప్పాలంటే వీరభద్రుని తాహతుకు మించిన విధంగా ఈ గది శోభ మందిరంగా అలంకరించబడింది. రాణి ప్రసాదించిన బహుమతీ ద్రవ్యం సద్వినియోగమైనదనే సరస్వతి భావించింది.
ఇంతకూ నాయకుని జాడ తెలియరాలేదు. అనుకున్నదానికన్నా తాను చాలా ముందుగా వచ్చి ఉండాలి. బాగా చీకటిపడితే వెనుక వీధిలోని బురద గుంటల భయం, వరాహాల భీతి ఉంటుందని, మేఘావృతమైన ఆకాశం వచ్చుకొని వర్షధారల్ని విడుస్తుందేమోననీ అనుమానించటంవల్ల ముందుగా రావలసి వచ్చింది. ఇపుడు వెనక్కు వెళ్ళటం అవివేకం. ఇంత తొందరగా వచ్చినందుకు వీరభద్రుడు తన ఆత్రుతను గ్రహించటంవల్ల, తాను లోకువయ్యే అవకాశం ఉండవచ్చు. ఇతరత్రా బెట్టు చూపటం ద్వారా తాను అలుసు కాకుండా తనను తాను కాపాడుకోవటం ఉచితమనిపించిందామెకు.
తను ఒంటరిగా ఎంతసేపని ఇక్కడ ఉండగలదు? వీరభద్రుడు ఇంట్లోనే ఉన్నాడో, లేక వీధిలోకి వెళ్ళాడో? ఇది పర గృహమనే భయమైతే ఆమెకు లేదు కానీ, ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండటం చాలా ఇబ్బందిగా తోచింది.
తెర తొలగించి సావిట్లోకి తొంగి చూద్దామనిపించింది. కుడ్యదీపికను కదల్చాలా వద్దా అని ఒక్కక్షణం ఆలోచించి నాలుగడుగులు ముందుకు వేసి, తెర తొలగించి మెడ ముందుకు చాచింది.
ఘుమఘుమలాడే వంటకాల వాసన ఆమె నాసికా పుటాలను ఎదుర్కొన్నది. విపరీతమైన ఆకలి కలిగినట్లయి నోరు ఊటలూరింది. తన భోజనం సంగతేమిటి? బయలుదేరే ముందు ఆలోచించకపోలేదు. భోజన సమయం కానందున ఆ సమస్య అప్పుడు తనను పీడించలేదు. ఇప్పుడు భోజన సమయంకాకున్నా పదార్థాల ఘుమఘుమలు ఆమెలో ఆకలి మంటల్ని రేపినవి.
దీన్నిబట్టి వీరభద్రుడు వంటపనిలో నిమగ్నుడై ఉంటాడని సరస్వతి వాసనపట్టింది. తను పిలవాలా వద్దా అని క్షణం ఆలోచించింది. తన తొందరపాటును ఎందుకు బైట పెట్టాలి? అతను వచ్చినప్పుడేరానీ- తన మాత్రం ఆతృత అతనికి ఉండదా? చూద్దామనుకొని ఆమె వచ్చి మెత్తని పక్కమీద ఒక చేయి మడిచి, అరచేతిలో తల ఆనించి పడుకున్న శకుంతలవలెనే పవళించింది. ఆందుల్ల చక్కగా దువ్వుకున్న జుట్టు రేగదు; పక్కమీద పరువబడిన ధవళవస్త్రాల మడతలు ఇప్పుడే చెరగవు.
కొంచెంసేపటికి మెడ నెప్పిపుట్టి ఆమె అటు తిరిగింది గదిలో ఇంకెవరో తారాడుతున్నట్లనిపించింది. అదిరిపడి చప్పున లేచి కూర్చుంది. వెనుదిరిగి చూస్తే పెద్ద నిలువుటద్దం గోడమీద బిగించి ఉండటం గమనించింది. తన నీడను చూసే తానే భయపడేట్లు చేశాడీ వీరభద్రుడు.
ఇందాకట్నుంచీ తనెందుకీ దర్పణాన్ని గమనించలేదూ? ఇతర వస్తువుల అమరికా, ఆకర్షణా స్వాగత గీతాలు పాడుతూంటే తన దృష్టి ఇటు పోనేలేదు. వీరభద్రుడు చాలా తెలివిగా ఆలోచించే ఈ దర్పణాన్ని మంచంమీద ఉండే వ్యక్తుల ప్రతి కదలికా కనిపించే విధంగా ఏర్పాటు చేశాడు. అక్కడ రాణిది సప్త దర్పణ శయన మందిరమైతే ఇక్కడ తనది ఏకదర్పణ శయన మందిరమన్నమాట! వీరభద్రుని కళాభిరుచినీ, రసికత్వాన్నీ సరస్వతి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
రాణి పడకటింట ఆరు అద్దాలున్నప్పటకీ అరసికుడైన భర్తతో ఆమె ఆనందించగలిగేది బహు స్వల్పమే అవుతుంది. ఎంత సౌభాగ్యముంటేనేం రసికుడైన నాయకుడు లేకుంటే అది రేరాజు లేని రాత్రే కదా! ఇక ఇక్కడ ఒక్కటే అద్దం ఉన్నప్పటికీ, మహారసికుడైన నాయకుడు తోడుగా ఉండటంవల్ల తన రుూ అనుభూతి రాణి ఆనందానికి కనీసం ఆరు రెట్లన్నా వుంటుంది. అద్దాల లోపం వల్ల ఆరోభాగమైన శృంగారం- రసికులైన నాయకీ నాయకుల కారణంగా ఆరింతలవక తప్పదు!
గణితశాస్త్ర ప్రకారం చూస్తే, తన శరీరం కూడా అద్దంతో సమానమే కనుక, వీరభద్రుడు అమర్చిన దర్పణంతో కలుపుకొని రెండు అవుతున్నవి. అక్కడ రాణితో కలిసి ఏడు దర్పణాలున్నవి. అంటే రాణి ఊహించి, ఇంకా అందుబాటులోకి తెచ్చుకోలేని సౌఖ్యంతో, తన ఈ సౌఖ్యం కరతలామలకమై వున్నది కనీసం ఏడింట రెండు భాగాలు!
అసలు ఈ జన్మకే ఇలాంటి దివ్యానుభవం తనకు గగనకుసుమంగా నిశ్చయించబడితే, ఆ లెక్కన ఇది చాలా గొప్ప ఆనందానుభూతిగానే పరిగణించవలసి వుంటుంది.
సృష్టి కార్య నిర్వహణలో జంతుజాలానికీ ఈమానవునికీ ఎంత తేడా వుంది! ఋతువుననుసరించి జంతువులు సామాన్య పద్ధతిలో ప్రవర్తిస్తాయి. కాని మానవుడు తన మేధస్సునంతా కరిగించి, ఆ చిన్న అవసరానికి బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించి, తనుద్రేకాన్ని, ప్రణయ సాఫల్యతనూ కృత్రిమంగా పెంచాడు! తనకు పనికివచ్చేనాటి ప్రయోజనాలను కనిపెట్టి, వాటన్నిటినీ తనకు ఎంత అనుకూలంగా తిప్పుకున్నాడు! ఈ విధంగా జీవితాన్ని క్లిష్టమయం చేసుకొని, అందునే ఎంత గొప్ప అనుభూతిని సాధించేందుకు సిద్ధపడ్డాడో తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది! ఎంత క్లిష్టమైన జీవితాన్ని సృష్టిస్తే అంత నాగరితను నిర్మించినట్లేనేమో?
మంచానికి అటుపక్కగా కూర్చొని సరస్వతి తన ఛాయను అద్దంలో చూసుకున్నది. రాణి అన్నట్లు నిజంగానే జీవకళ- కాదు జీవ స్రవంతే ప్రవహిస్తూన్నదీ ముఖంలో. ఎక్కువ అలంకరణలు లేకపోయినా వీరభద్రుని లాంటిమహాపురుషుడు కోరదగిన కోమలే తను అనిపిచిందామెకు.
జడలో పూవులు ముడుచుకోలేదు ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు. ఇప్పుడు తన వీపు వెనుకగా పళ్ళెరాల్లో అనేక రకాల పుష్పాలున్నవి.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు