డైలీ సీరియల్

దూతికా విజయం-106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నవ్వుకు మరికొన్ని శ్రావ్యమైన కంఠాలు కూడా కలిసినవి. సరస్వతి సిగ్గుతో తలవంచుకున్నది.
‘‘ఔనర్రా! నిజమే! మనమిప్పుడు సూడిదలు కూడా ఇచ్చి పంపవద్దా?’’ అన్నది రాణి.
‘‘నిజమే రాణీ!’’
ఆ వేడుకలన్నీ చాలా ఆలస్యమయ్యేట్లు తోచగానే ‘‘రాణీ! కోటమై ఆయన బండిలో నాకోసం వేచి ఉన్నారు!’’ అన్నది సరస్వతి సిగ్గుపడుతూ.
‘‘చూశారటర్రా! అప్పుడే మనందర్నీ మరిచిపోయింది!’’ అన్నది రాణి.
‘‘అరఘడియ అవలేదు.. అప్పుడే ఏం విరహమమ్మా’’ అన్నదో చెలికత్తె.
‘‘పెళ్ళయిన నెలకే ప్రియుడంటే ఇంతగా అనురాగం ఏర్పడటం కూడా ఎక్కడా వినలేదు; కనలేదు!’’ అన్నది మరో చెలికత్తె.
‘‘మా సరస్వతి మంచి ఇల్లాలు! మహా పతివ్రత! అసలే గర్భవతి. దానే్నమీ అనకండే!’’ అన్నది రాణి.
‘‘మీ ముద్దుల చెలికత్తె కదా! ఆమె మీద ఈగ వాలనిస్తారా?’’ అన్నది ఇంకో చెలికత్తె.
కాంతల నవ్వులతో ఆ ప్రదేశమంతా గలగల్లాడింది.
నెల రోజుల క్రితం సరస్వతీ వీరభద్రుల వివాహం మహా వైభవంగా జరిగినప్పుడు రాజూ, రాణీ స్వయంగా వెళ్ళలేదు. కాని, తమ ప్రతినిధుల ద్వారా అనేక విలువైన బహుమతులు పంపుతే- ఒక ప్రాణసఖి వివాహానికి రాణి ఇంత పెద్ద మొత్తాలివ్వటం చరిత్రలోనే లేదని అందరూ అనుకొని ఆశ్చర్యపడ్డారు. అది అలా ఉండగా ఇప్పుడు ఈ సూడిదల పేరు పెట్టి రాణి సరస్వతికి చేసే మర్యాదలూ, మన్ననలూ చూసి రాణివాసాన స్ర్తిలందరూ మరింతగా ఆశ్చర్యపడ్డారంటే, అన్నీ తెలిసిన మీరు ఆశ్చర్యపడవలసింది లేదు!
సరస్వతి తిరిగి తన బండి దగ్గరికి వచ్చేటప్పటికి అరజాము గడిచిపోయింది. వీరభద్రుడు నిప్పులు తొక్కుతున్నట్లు విసుగ్గా పచార్లు చేస్తున్నాడు. సరస్వతిని చూడగానే తాటి ఎత్తున లేద్దామని ప్రయత్నించి ఆమె కనుసన్నలను గమనించి, తనను తాను అతి కష్టంమీద సంభాళించుకున్నాడు. కొత్త పట్టుచీరెతో, మెడనిండా గంధంతో, మొహాన పెద్ద కుంకుమ బొట్టుతో కళకళలాడుతున్న ముతె్తైదువు సరస్వతిని చూడగానే ఆమె తన భార్యేనా అని తలపుతో వీరభద్రుని శరీరం ఒక్కసారిగా జలదరించిందది.
ఆమె వెనుకనే నలుగురు దాసీలు బుట్టలతో, పళ్ళెరాలతో తదితర సామగ్రితో వచ్చారు.
‘‘ఏమిటిదంతా?’’ అన్నాడు వీరభద్రుడు తగ్గు స్థాయిలో.
‘‘తరువాత చెపుతాను’’ అన్నది సరస్వతి రహస్యంగా.
ఆ సామానంతా బండిలో పెట్టబడింది. దాంతో బండి దాదాపు నిండిపోయింది. దాసీలు సరస్వతికి నమస్కరించి సెలవు తీసుకున్నారు.
‘‘మనిద్దరికీ చోటు ఏదీ?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘కిందా మీదా పడి ఎలాగో సర్దుకోవచ్చు లెండి!’’అన్నది సరస్వతి కొంటె చూపులతో.
‘‘ఐతే నేను నీ వళ్ళో కూర్చుంటాలే!’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘మీ పీఠానికి నా ఒడి చాలుతుందా? మీ బరువు నేను మోయగలనా?’’
‘‘ఔనౌను. సుకుమారివాయె మరి. సుఖంగా నా వొళ్ళోనే గూట్లో గువ్వల్లే హాయిగా కూర్చునేందుకు ఈ ఎత్తు వేశావు!’’
‘‘అలాగే అనుకోండి!’’ అన్నది సరస్వతి ముసిముసి నవ్వులు నవ్వుతూ.
ఇద్దరూ ఒకరిమీద మరొకరు కూర్చున్నంత ఇరుగ్గా సర్దుకున్నాక, బండి బయలుదేరింది.
‘‘ఇంత ఆలస్యం చేస్తే ఎలా? నాకు చికాకు వేసి లోపలికి జొరబడదామనుకున్నాను! అన్నాడు వీరభద్రుడు.
‘‘ఇంకా నయం- సాహసించారు కాదు!.. మీకేం మతిపోయిందా ఏమిటి రాణివాసంలో ప్రవేశించే ప్రయత్నం చేసేందుకు?’’
‘‘నీవు మరో అరఘడియ అక్కడే వుంటే సాహసం చేసి చూపేవాణ్ని!’’
సరస్వతి తన మాంగల్యాన్ని గట్టిగా హృదయానికి హత్తుకున్నది.
‘‘ఏం చేస్తున్నావ్ ఇంతసేపూ? ఆడవాళ్ళ పనులు ఎంతకూ తెమలవు!’’
‘‘లోపల రాణి వేడుకలు జరుపుతుంటే, ఆమె ఆజ్ఞ కానిదే ఎలా బైట పడేది?’’
‘‘ఇప్పుడేం వేడుకలు! రాణి మనకిచ్చిన బహుమతులు చాలకనా, మళ్లీ ఈ బండెడు ప్రసాదించింది?’’
‘‘ఇవి మీకూ, నాకూ కాదులెండి!’’
‘‘మరి ఎవరికి?’’
సరస్వతి మాట్లాడలేదు.
‘‘ఎవరికో చెప్పవా?’’ అని వీరభద్రుడు బతిమాలాడు.
సరస్వతి పొట్ట చూపినా వీరభద్రుడు గ్రహించలేదు.
‘‘ఏమీ తెలియనట్లు అన్నీ వేషాలు!’’ అన్నది సరస్వతి. ‘‘ఇదంతా సూడిదలు చేసి ఇచ్చినవండీ!’’
వీరభద్రుడు తెరలు తెరలుగా నవ్వాడు.
‘‘నేను వేసిన పథకం ఎలా పారిందో చూశావా సరూ!’’ అన్నాడు.
‘‘మీకా ఊహ ఎలా వచ్చిందీ?’’
‘‘మనిద్దరి కలయికా, స్నేహం.. అదంతా ఎంతో విచిత్రంగా కనిపించేది. ఒకరోజు ఆ దృశ్యాలన్నీ జాగ్రత్తగా తలచుకుంటుంటే.. రెండో రాత్రి మనిద్దరం భోజనం చేశాం గుర్తున్నదా?.. అప్పుడు ‘నీవు కడుపు నిండింది.. వొద్దు.. చాలు!’’ అని గోల చేశావు. నేనప్పుడు ‘అప్పుడే కడుపా?’ అన్నాను. నీకు పొల మారింది; సిగ్గుతో చుట్టలు చుట్టుకున్నావు.. ఆ జ్ఞాపకంతోనే నిజంగా నీకు గర్భప్రాప్తి అయితే ఏం జరుగుతుందో ఆలోచించి ఈ పథకాన్ని అల్లాను! రాణి ఎంత తేలిగ్గా మోసపోయిందో చూశావా మరి!’’ అన్నాడు వీరభద్రుడు రొమ్ము విరుచుకుంటూ.
‘‘మీది బ్రహ్మవాక్కు!’’
‘‘అంటే?’’
‘‘అదే నిజమైంది!’’ అన్నది సరస్వతి తలవంచుకొని.
రెండు క్షణాలపాటు వీరభద్రునికి ఏమీ అర్థం కాలేదు.
ఆ తరువాత సరస్వతి అభిప్రాయం సుస్పష్టమై ‘‘నిజమా సరూ!’’అన్నాడు వీరభద్రుడు.
నిజమేనన్నట్లు ఆమె తల ఆడించింది.
వీరభద్రుడామెను పొదివి పట్టుకొని ‘‘వంశోద్ధారకుణ్ణి కూడా ప్రసాదిస్తున్నావు.. అభినందనలు!’’ అన్నాడు.
వీరభద్రుడు ఇంకేమైనా పిచ్చి వేషాలు వేస్తాడేమోనని భయపడిన సరస్వతి కళ్ళతోనే వారించి, కోట పక్కనుంచి వెళ్ళే బండిలోంచి రాజప్రాసాదాన్నీ, రాణివాస మందిరాన్నీ, దక్షిణ ద్వారాన్నీ చూపుతూ ఆయా దృశ్యాలను వివరించసాగింది.
బండి చాలా దూరం వెళ్ళాక- దూరాన రాణి మేడ మీదినుంచి తమ బండినే చూస్తూన్నట్లు ఆమెకు లీలగా తోచి, ముఖాన్ని అటునుంచి తిప్పి వేసుకొని, వీరభద్రుని విశాల హృదయంలో దాచుకున్నది- దూతికగా విజయాన్ని సాధించిన సరస్వతి!
-సమాప్తం

-ధనికొండ హనుమంతరావు