డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోమన్ యువకుడు 28 సంవత్సరాల వయస్సువాడు. యవ్వనశోభకు తోడు ఠీవితోకూడిన ఆ సుందరాకారుణ్ణి చూచిన మరుక్షణంలోనే క్లియోపాత్రా- తానూ, తన దేశమూ రోమ్ ఆధీనంలో ఉండటాన్ని ద్వేషించిన యువతి, ఆ క్షణంలో మాత్రం రోమన్ సైన్యాధిపతికి తన ప్రణయాన్ని ధారపోసింది. తన స్ర్తి జన్మ సాఫల్యతకు ఇలాటి యువకుణ్నిగూర్చే ఆమె కలలు కన్నది. ఆ కలలు సముద్రపుటలలవలె కరిగిపోకుండా, నిజమై జీవితంలోకి వొస్తవని ఆమె ఎన్నడూ అనుకోలేదు. కాని, ఆ మధుర క్షణాలు ఆరంభమయ్యే శుభ సూచనలు కనిపిస్తూన్నవి.
క్లియోపాత్రా చూపులు కోర్కెలతో బరువెక్కినవి. తాను జగదేక సుందరినని ఎంతోమంది అంటూండగా విన్నది. తన రుూ సౌందర్యానికి మార్క్ ఏంటనీని ఆకర్షించే శక్తి వున్నదో లేదో తెలుసుకోవాలని ఆమె నిశ్చయించుకున్నది.
ఐతే దురదృష్టవశాత్తూ క్లియోపాత్రా తీక్షణమైన కాముక దృష్టిని ఏంటనీ గమనించలేదు. ఒకటి రెండుసార్లు మాత్రం యధాలాపంగా ఆమెను చూసి వుంటాడు- అంతే!.. కాని, విధి ఈ ఉభయులనూ కలిపేందుకు 14 సంవత్సరాల తరువాత వల పన్ని ఉన్నదనే సంగతి పాపం వారిద్దరికీ తెలియదు!
ఆ రాత్రి చాలా పొద్దుపొయ్యేవరకూ విందులూ, వినోదాలూ సాగినవి. గంటల తరబడి స్ర్తి ప్రదర్శించగల వయ్యారాన్నీ, శృంగారాన్నీ, కాముకత్వాన్నీ అనేక రకాలుగా క్లియోపాత్రా ప్రదర్శించినా ఏంటనీ చలించలేదు. బహుశా తనలో తాను నవ్వుకొని ఉంటాడు!
చివరకు వినోదాలు ముగిశాక బరువైన హృదయంతో క్లియోపాత్రా అంతఃపురానికి వెళ్లిపోయింది. ఆమె హృదయం తెకతెకలాడుతోంది. తన రుూ సంపద, అందచందాలు; యవ్వ నం అంతా వృథా! కనీసం తనకు నిరుపయోగాలు! ఆ కోపంలో ఆమె తన విలువైన ఆభరణాల్ని మూల మూలకు విసిరికొట్టింది. చీని చీనాంబరాలను ముక్కలు చేసింది. పిచ్చిదానివలె జుట్టంతా రేపుకుంది. తన చేతుల్లో అధికారమే ఉంటే, ఆ రోమన్ సేనానిని ఖండఖండాలుగా చేసి కాకులకూ, గ్రద్దలకూ వేయించేది.
అధికారం! అదీ- ఆ అధికారమే తనకు కావాలి! దాన్ని సంపాయించిన నాడే తన కోరికలు ఈడేరుతవి. దానికోసమే తన జీవితాన్ని వినియోగించాలి. నిజంగా తాను రాణి ఐతే, అప్పుడు ఇలాటి ఏంటనీలు అనేక వేలమంది తన కనుసన్నలకోసం కాపుకాచి ఉంటారు. అది లేనట్లయితే, తాను మాణిక్యమై కూడా మట్టిలో దొర్లవలసిందే!
ఐనా మించిపోయిందేమున్నది? ఈ ఏంటనీని మర్నాడే ఏదో మిషమీద పిలిపించి, తన పాదాక్రాంతుడుగా చేసుకోవాలి. తన అందచందాలకు లొంగని శుకుడా? అదీ చూడాలి!
పురుషుణ్ణి వశపరచుకునేందుకు అనుభవశాలి ఐన స్ర్తి చేసే ఊహలెన్నో ఆమె మనసులో కదలాడినవి. చిత్ర విచిత్రమైన సంఘటనల్తో ఆమె అనేక దృశ్యాల్ని కల్పించుకొని ఆ రాత్రంతా ఆలోచించింది.
మర్నాటి ఉదయం ముస్తాబై, రోమన్ సేనాపతి ఏంటనీని కలుసుకోగోరుతున్నట్లు యువరాణి హోదాలో కబురుచేసింది.
కాని వార్తావహుడు తిరిగివచ్చి ఏంటనీ ఓడ రేపు విడిచి ఈపాటికి చాలా దూరం వెళ్లి వుంటుందనే దుర్వార్త చెప్పాడు!
ఆ రోజంతా ఆమె పిచ్చిదానివలెనే ప్రవర్తించింది. ఆమె మొట్టమొదటి ప్రణయ పుష్పం ఎంత సహజంగా పుష్పించిందో, అంత సహజంగానూ చెట్టునే ఎండి రాలిపోయింది.
క్షణంలో నిర్మితమైన గాలి మేడలన్నీ ఆమె కళ్ళ ఎదుటనే కూలిపోయినవి. ఐతే క్లియోపాత్రా నిరాశతో కుంగిపోవటమనేది ఎరుగదు. ఈసారి దృఢంగా ఆ మేడలు నిలిచేటట్లు నిర్మించుకునే ప్రయత్నాలు చేయాలని నిశ్చయించుకుంది. తాను మహారాణి ఐన నాడే ప్రపంచం తన అందచందాల్ని కూడా ఆరాధిస్తుందనే సత్యాన్ని ఆమె గ్రహించలేకపోలేదు.
4
క్రీ.పూ.52లో క్లియోపాత్రా తండ్రి ఔలటీస్ టాలమీ మరణించాడు. ఆయన తిరిగి ఈజిప్టును పాలించిన ఈ మూడేళ్ళలోనూ చెప్పుకోదగ్గ సంఘటనలేమీ జరగలేదు. క్లియోపాత్రా తన భావి జీవితానికి సంబంధించిన ప్రణాళికలను తయారుచేసుకొని సంసిద్ధురాలిగా వున్నది. తండ్రి మరణం కోసమే ఆమె వేచి వున్నది.
టాలమీ వంశంలో మిగిలినవాళ్ళలో ఇప్పుడు రాజ్యార్హత ఉన్నవారు క్లియోపాత్రా, ఆమె 10 సంవత్సరాల తమ్ముడు ఆర్సినోయ్ టాలమీ మాత్రమే. క్లియోపాత్రా వయసిప్పుడు 17 దాటింది.
వంశాచారాల ప్రకారం క్లియోపాత్రా తన తమ్ముడైన టాలమీని వివాహమాడవలసి వుంది. ఆమె యిష్టాయిష్టాలతో పనిలేదు. వంశాచారాలను తప్పినట్లయితే రాజార్హత ఉండదు. అందుకని క్లియోపాత్రా తెలివిగా ప్రవర్తించింది. తమ్ముణ్ణి పెళ్ళాడింది. కాని ఆమె జీవితంలో ఏనాడూ అతన్ని భర్తగా స్వీకరించలేదు.
ఐతే రాజ్యాధికారమంతా ఆమె హస్తగతం కాలేదు. ఆమె తన భర్తతో కలిసి రాజ్యపాలన కొనసాగించవలసి వచ్చింది. దంపతుల మధ్య అనురాగమంటూ లేదు కనుక, సహజంగా రాజ్యంలో రెండు పక్షాలు ఏర్పడినవి.
ముఖ్యంగా క్లియోపాత్రా తన భర్తను దాపుకు రానిచ్చేది కాదు. అనేక రాత్రులు ఆమె శయ్యామందిరం బైట పడిగాపులు కాచాడు. కాని, ఆమె అతని ప్రార్థనల్ని ఏనాడూ చెవిని బెట్టలేదు. నిజానికి అతనిమీద అనురాగం లేకపోగా ఆమెకు ద్వేషం కూడాను.
ఈడూ జోడూ లేని ఈ వెధవ కాపురం ఆమెకు ఇష్టంలేదు. ఆ పాడు ఆచారాలకు కట్టుబడిందన్నమాటేకాని, ఆమెకు సంసారం చేయాలనీ, అందునా పదేళ్ళవాడితో సుఖపడాలనీ ఏనాడూ లేదు. ఐతే రాజ్యాధికారం తనకు చెందకుండా భాగం పంచుకున్నందుకు టాలమీ మీద ఆమె ద్వేషం అంతింత కాదు.
వీలైనట్లయితే అతన్ని చంపి, రాజ్యాధికారంతోపాటు స్వేచ్ఛనూ కూడా పొందుదామనే ఆమె అనుకున్నది కాని, అవతల రోమన్ ప్రభుత్వం తననొక కంట కాచి వుంది. కనుకనే వారు భార్యాభర్తలుగా వ్యవహరింపబడుతున్నప్పటికీ, ఆగర్భ శత్రువులుగానే ఉండిపోయారు. వేరొక అధికారానికి ఉభయులూ లోబడి ఉండటంవల్ల ఒకర్నొకరు హత్యచేయలేని స్థితిలో పడ్డారు.
ప్రభుత్వంలో చీలికలు ఏర్పడినవి. అధికారమనేదాన్ని ఇటు క్లియోపాత్రా, అటు ఆమె తమ్ముడు (భర్త) టాలమీ కూడా చెలాయిస్తూనే వున్నారు. ఐతే ఎవరిది పైచేయి అనేది ఎవ్వరూ తేల్చకుండా ఉన్నారు.

- ఇంకా ఉంది

-ధనికొండ హనుమంతరావు