డైలీ సీరియల్

అహి, కరుల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రీతిగా శివకేశవులకు భేదంలేదని స్పష్టం చేస్తున్న విధంగా ముందున్న చీకట్లనలుపుతో కూడిన వెనె్నలల తెలుపు సమ్మిళితమై నలుపు తెలుపు కాంతుల్ని లోకమంతట వెదజల్లుతూ చంద్రోదయమయింది.
ఆ చల్లని కిరణాల చంద్రుడు లింగాకృతిగా తూర్పుదిక్కున ఉదయించాడు ఆ లింగాకృతికి ఉదయపర్వతమే పానపట్టం. సముద్రజలమే అభిషేకం చేయబడిన జలం. లోకంలో వ్యాపించిన చీకటియే ధూపధూమాలు. ప్రకాశిస్తున్న దీపకాంతి సమూహమే వెనె్నల. నింగిలోని నక్షత్రాలే అర్పింప బడిన కుసుమాలు. చీకట్ల తొలగింపే ఆనందం.
ఆ చంద్రబింబం ఆకాశమనే కొండమీద నుండే సింహంగా ప్రకాశిస్తూ ఉంది. నక్షత్రాలనే తామరల నడుమనుండే హంసలా విరాజిల్లుతూ ఉంది. రాత్రియనే వనితామణి చేతిలో వికసించే మల్లెల గుత్తియై వెలిగిపోతూ వుంది. దూరప్రాంతాలకు పోయిన భర్తలకు బాధకలిగించు మన్మద సేన యుద్ధయాత్రకు సూచకంగా ఎత్తిన ముత్యాల గొడుగుగా ఒప్పుతూ ఉంది. ఆ విధంగా నవ దంపతులకు ఆనందాన్ని కలిగిస్తూ తూర్పుదిక్కున చంద్రబింబం ఉదయించింది.
గరుత్మంతుడు తాను తెచ్చిన అమృతాన్ని దేవతలు వెంటగొనిపోగా వారివెంట సర్పాలన్ని పరుగెత్తగా వాని తలపై ప్రకాశించే మణుల కాంతిపుంజమో అనే విధంగా ప్రకాశించు నింగియందు చంద్రోదయమయ్యింది. ఆ సమయంలో సుధాఘటంలో నుండి చింది నేలబడిన అమృతబిందువుల్లా నక్షత్రాలు ప్రకాశించాయి.
ఆ రీతిగా కురిసిన వెనె్నలలు కలువల బృందానికి బలుపుగా; చక్రవాక పక్షులకు విరోధంగా, దిక్కులనే భామల ముఖానికి మైపూతగా, యువచకోర పక్షులకాహారంగా, చంద్రకాంతపు శిలలకు ద్రావకంగా, మన్మదశాస్త్రం నిరూపించే ఔషధంగా లోకమంతటా మనోహరంగా ప్రకాశించాయి.
ఆ రాత్రి పాము మరియు ఏనుగు తాము చేసే పూజా విధానానికి కలిగే ఆటంకం చేత భరింపరాని వేదనతో కన్ను మూయనే లేదు. మనస్సులో ఎప్పుడు తెల్లవారుతుందా ! ఏ విధంగా మా పగను చల్లార్చుకొంటామా అని తమలో తాము తలపోస్తూ రాత్రి గడిపాయి.
సూర్యోదయ వర్ణన
అంతలో తూర్పుకొండపై అరుణకిరణరాశి అయిన సూర్యుడు ఉదయించాడు. అతడు తూర్పుకొండపై మనో హరమై వికసించిన కడిమి పూలు అనే సముద్రపు అలవలె మనోజ్ఞమైయున్నట్టు కనిపిం చాడు. సూర్యు డనే కిరాతుని కిరణాలనే బాణాలచే భగ్నమైన చీకటి అనే ఎలుగుబంటి శరీరంనుండి స్రవించే రక్తపు బురదగా ఎఱ్ఱనై ప్రకాశించాడు. రాత్రి-చంద్రుల రతి వియో గానికి కారణమైన మన్మద ప్రతాపాగ్ని అనే అగ్నికి నివాస స్థలంగా ప్రకాశించాడు. సంధ్యా దిదేవతల అందమైన పీఠాలపై అందంగా పొదగ బడిన పద్మరాగకాంతుల సమూహమై అలరారినాడు.
కాలమనే రససిద్ధుడు బ్రహ్మాండాన్ని బంగారు మయంగా చేయదలంచి సూర్యుడనే అగ్ని మీద చల్లిన సిందూరపు పొడియేమో అనేటట్లు అరుణ కాంతులతో విరాజిల్లినాడు. ఆ రీతిగా ప్రకాశమానుడైన సూర్యుడు మహాబలవంతులైన పన్నగం - ఏనుగు ఏ విధంగా పోరుసల్పుతాయో ! ఈశ్వరుని ఏ విధంగా పొందుతాయో? చూడాలి అనే కుతూహలంతో కర్మసాక్షియై తూర్పుకొండమీదకు వచ్చాడో అన్నరీతిగా తలపించాడు.
భానుడు తూర్పుపర్వతం మీద ఉదయించక ముందే సర్పరాజు లేచి తన మనస్సునిండా ఉన్న కోపావేశంతో తన నివాసం నుండి బయలుదేరి పగసాధింప బూనివచ్చే ఒక మహావీరుని వలె ఈశ్వరసన్నిధానానికి వచ్చాడు. శివునిపై తాను ముందుచేసిన పూజ లేకపోవుట చూచాడు. చాలా బాధపడ్డాడు. ఇక ఏది ఏమైనా నాశత్రువుని నేడు చంపివేస్తాను. కానిచో నా ప్రాణాలు ఆ ఈశ్వరుడికే అర్పిస్తాను. అని తలంచి చిన్న రూపాన్ని ధరించి బిల్వశాఖల్లో నున్న తామరతూడు మధ్యలో కాళనాగం దాగింది. ఏనుగు కూడ ఆ సమయానికే వచ్చి తాను ముందు దినం చేసిన పూజ యథాప్రకారంగా ఉండటాన్ని చూచి చాల సంతోషించి ఇలా అనుకొంది. ‘సకలేశ్వరుడైన ఈ మహాశివుడు దయతో నన్ను చూసాడా? పూజను భంగపరచే శత్రువు భయపడ్డాడా? నా వ్రతం సార్థకమైనదా? పూర్వజన్మ పుణ్యం పండిందా? నేడు ఈశ్వరుని తలపైన పూజ యథారూపంగా నిలిచింది.’’ అని సంతోషించి వెంటనే ఏనుగు పూజా ద్రవ్యాలను తేవడానికి వనానికి వెళ్లింది. తామరతూడులో దాగియున్న పాము శత్రువు దగ్గరకు రాకనే దూరంగా వెళ్లిపోయాడు అని కోపాగ్ని జ్వాలలు కన్నుల నుండి రాలగా ఏనుగు రాక కొఱకై వేచియుంది.
కాళహస్తుల యుద్ధం
ఆ కీడు నెరుంగని ఏనుగు తామరలు - మారేడుదళాలను తొండంతో సంపూర్ణంగా చుట్టి పట్టుకొని రాసాగింది. అప్పుడు వీచే గాలి చేత నడకల ధ్వని రెట్టింపు కాగా భయపడి గుంపు నుండి విడిపోయి మృగాలు మోరలెత్తుకొని పారిపోయాయి. ఆ రీతిగా ఏనుగు వేగంగా దయాంతరంగుడైన శివుని వద్దకు వచ్చి సర్పహృదయం పాలిటి ములికి (బాణం) అయిన ఆ నిర్మాల్యాన్ని తుడువ దలంచి తుండాన్ని సాచింది. అంతట సర్పరాజు ‘నా పూజను ఇన్నాళ్లకు ఈశ్వరుడనుగ్రహించాడు’. అని మనస్సులో చాల సంతోషించి దాని తుండరంధ్రంలో దూరి క్రమంగా కుంభస్థలంలోకి ప్రవేశించి తిరుగసాగింది. అప్పుడు పుట్టిన బాధకు తాళలేక ఆ ఏనుగు కూలిపోయే విధంగా కొండలకు తలను బాదుకొంది. దిక్కులు పగిలేటట్లు ఘీంకారం చేసింది. సువర్ణముఖరీ నదిలో మునిగి తుండంతో నీళ్లు పీల్చుకొని ఊది వేసింది. పాము కపాలంలోకి పోయి బాధింపగా తుండాన్ని బాగా సాచి చిఱ్ఱున చీదింది. నేలపై తలమోపి ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు దొర్లుతూ అరువసాగింది. భరింపరాని బాధతో నిలిచిన చోట నిలువక అటునిటు కంగారుగా పరుగులు పెట్టింది. పెద్దపెద్ద చెట్లతో తన తలను తోముకొంటూ చెట్లమధ్యకు దూరి పోయింది.
ఇంకా ఉంది

చరవాణి: 9490620512