డైలీ సీరియల్

శివునిపై ప్రేమ.. భక్తి పారవశ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛమైన జలంతో స్నానం చేయించిన ఈ ఈశ్వరుని దేహం ఎందుకు నీటి చారికలు కట్టి ఉంది? ఆత్మశుద్ధి కల నీకు ఇట్టి నీచమైనవి తగునయ్యా! దేవా! ఈ కశ్మలాన్ని (అసహ్యకరమైన వస్తువు) ఎత్తిన ఈ రెండు చేతులతో నీ శరీరాన్ని తాకడానికి భయం కలుగుతూ ఉంది. ఓ పార్వతీశ్వర! దీనిని నీవెట్లు సహించావు. ఈ రీతిగా ఈ నీ ప్రదేశమంతా చెడిపోవుట నేటికి ఏడు దినాల నుండి జరుగుతున్నది. ఇది నీ మాయానాటకమా? లేక ఈ విధంగా ఎవడైనా చేస్తున్నాడా. ఓ దయానిధీ! నిన్ను వేడుకొంటున్నాను. నిజాన్ని చెప్పవయ్యా! శుద్ధమైన ఈ ఆలయాన్ని ఈ విధంగా రోతగా చేసినవాడు నీ కుమారుడా? మిత్రుడా? భార్యయా? సేవకుడా? నీకు తెలియకుండ ఎవరు మాత్రం ఈ రీతిగా చేయగలరు? నా దుఃఖం తీరే విధంగా దయతో ఈ దుష్టకార్యాన్ని ఎవరు చేసారో తెలుపవా?
భక్తవత్సలా! ఒక భక్తుడు పాత గుడ్డల్ని మీద కప్పగా దయతో వానిని స్వీకరించావు. మరొక శివభక్తుడు నీచ కులస్థుడయినా వాని ప్రక్కన కూర్చుండి భుజించావు. సుందరమూర్తి అను భక్తుడు తన భార్య పరవైయారు పొందుకొరకై దూతగా పంపగా నీవు పోయావు. శవభస్మాన్ని ఒంటికి పూసుకొన్నావు. కపాలంలో భుజిస్తావు. ఇట్టి రోతల నెన్నింటినో సహించే నీవు ఈ రోతల్ని సహింపకుంటావా? నీలగ్రీవా! అది నీకు ఇష్టమే కావచ్చు. నాకాపాపాత్ముడెవరో చెప్పు. అదే పది లక్షలు. లేకుంటే నిరాహారినై ఇచటనే నేను ప్రాణత్యాగం చేస్తాను.’ అని పలికి వౌనం వహించాడు. ఆతనిని చూచి గిరిజానాథుడు మనసున ఆదరం కలవాడై వివరంగా ఇలా చెప్పాడు.
శివుడు తిన్నని భక్తిని శివగోచరునికి చూపుట
శివగోచరా! ఏల కలత పడతావు. ఒక చెంచువాడు నన్ను వేదాచారానికి భిన్నంగా మహాభక్తితో సేవిస్తున్నాడు. ఆతనిపై దయకల్గడం చేత అతడు చేసిన పూజను నేనంగీకరించాను. నీవు కూడ ఆతని భక్తిని చూడవచ్చు. నీవు నావెనుక దాగి వుండు. త్వరలో అతడు రాగలడు.’’ అని శివుడు చెప్పగా శివబ్రాహ్మణుడు శివుని వెనుక దాగాడు. అంతలో శబరుడైన తిన్నడు వచ్చాడు. పవిత్రమైన నిర్మాల్యాన్ని (ముందు రోజు చేసిన పూజాద్రవ్యాలు) చెప్పుకాలితో తొలగించాడు. పుక్కిట పట్టి తెచ్చిన ఎంగిలి నీటిని శివునిపై ఊసి స్నానం చేయించాడు. తెచ్చిన పత్రిని లింగంపై ఉంచాడు. త్రోవ గాచి వేటాడి తెచ్చిన పంది మాంసపు ముక్కల్ని శివుడు భక్షించడానికి ముందుంచి అందించాడు. శివుడు వాని నాదినం ఆరగించలేదు. తిన్నడు ఏల తినలేదో అని విచారిస్తూ ఉండగా ఆయన తామర కన్నుల నుండి నీరు బొటబొట కారనారంభించింది. దానిని చూచి తిన్నని మనస్సు చాల ఆందోళన పడింది. అరవిరసిన ఎర్రతామరల పూరేకుల నుండి జారే తేనెలా ఒకమారు కంటె మరొకమారు క్రమంగా శివుని ముకుళిత నేత్రాల నుండి కన్నీరు అధికం కాసాగింది.
ఆ స్థితిని చూచి తిన్నడు చాల ఆందోళనకు గురియయ్యాడు. ఇప్పుడు కంటికి కలిగిన నెప్పి వల్ల శివుడు కరకుట్లను తినడు. సందేహం లేదు. ఇక మందు వేయాలి. అని తలంచాడు. ఎన్నడు లేని హానినేదో పొందిన వానివలె అతడు మనస్సులో తెరలు తెరలుగా కలుగు దుఃఖంలో కరిగిపోతూ శివుడికి వివిధ ఔషధోపచారాలు చేసాడు. వస్త్రాన్ని ఉండగ చేసి నోటితో ఆవిరిపట్టి శివుని కంటికద్దాడు. రెండు కషణోష్ణకర భాగాల్ని (చిటికెనవ్రేలు క్రిందిభాగం) రాపిడి చేసి వానిని కంటిభాగంలో పెట్టాడు. తలపై తంగేడాకు మెత్తాడు. కరక్కాయను నిమ్మపండు రసంతో నూరి కంటిపై పట్టువేసాడు. తెల్ల దింటెన పూలు తెచ్చి వాని రసాన్ని కంటిలో పోసాడు. కలివెపూలు కోసి రసాన్ని కంటిలో పిండాడు. పేరిన నెయ్యి కంటిలో ఉంచాడు. పెరుగువత్తులు వేసాడు. చనుబాలతో శంఖాన్ని నూరి దాని గంధాన్ని కంటికి పూసాడు. ఈ విధంగా తిన్నడు తాను విన్న మందులు, తనకు తెలిసిన మందులు, స్వయంగా అడిగి తెచ్చిన మందులు, అడవిలోని మందులు తెచ్చి ఉపయోగించాడు. అయినా చంద్రశేఖరుని కంటి నుండి నీరు కారడం తగ్గలేదు సరి కదా క్రమంగా రక్తమే కారసాగింది. మాటి మాటికి తిన్నడు మందుల్ని వేసాడు. ఆ వేసిన మందులన్ని ప్రవాహంలో కలిపిన చింతపండు వలె నీటి మీద వ్రాసిన వ్రాత వలె వ్యర్థమై పోయాయి. అట్లే అగుగాక. నీటికి బదులు కంటి వెంట రక్తం కారనేల? పట్టపు దేవేరి అయిన మా అమ్మ హిమగిరి తనయ అతిలోకసౌందర్యాన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యంతో చలించిపోవడం వల్ల చేత కాబోలు కన్నులు బాగా అలసిపోయాయో లేక నాకే మందుల మర్మం తెలియదో. ఏమైతేనేమి కంటికి మాత్రం చాల ప్రమాదం కలిగింది. మన్మథునే చంపి మనస్సులో ఏ మోహం లేక ఉన్న ఈ దేవదేవుని ఆ విధంగా అంటే స్వామి ద్రోహమే కదా! అయ్యో! నేనెందుకిలా అన్నాను. ఇక కంటి విషయమెట్లో కదా. జ్వరం చేత ఒళ్లు వేడెక్కితే వెచ్చని మందులతో తగ్గిపోతుంది. ఆ విధంగా కంటికి కంటి కంటె వేరొక మందు ఉందా? అని తలంచి శివలింగం వద్దకు పోయి ప్రాణమే పోతుందో ! శరరమే నశిస్తుందో ! అని తలంచకుండ అంబుల పొదిలోని బాణాన్ని చర్రున తీసి తన ఎర్రతామల వంటి కంటికొనలకు చేర్చి వేగంగా ఒక కనుగ్రుడ్డు పెకలించి దానిని రక్తపుగుంటగా అయిన దేవదేవుని కంటికి తిన్నడు అమర్చాడు.
అప్పుడు ఈశ్వరుడికి ముందుకంటె అందంగా కన్ను ఏర్పడింది. తిన్నని ఆ సాహస భక్తికి మెచ్చక రెండవ కంటి నుండి రక్తం కారేటట్లు చేసాడు శివుడు. దానిని చూచి పుళిందుడైన తిన్నడు నవ్వి ‘నీదయవలన కనుగొన్న కంటిమందుంది. అందుకనే నేను భయపడను. ఇది నా దీక్షావ్రతం. లలాటలోచనం నుండి మరల రక్తం స్రవించినా కేవలభక్తితో మనో దృష్టికి మూలమైన నా ప్రాణాల్ని నీకర్పిస్తాను.’ అని చెప్పుకాలితో రక్తంకారు ముక్కంటి కంటిని తన్ని పట్టి వాడిబాణంతో తన రెండవ కనుగ్రుడ్డును కూడ తిన్నడు పెకలింపబోయాడు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512