డైలీ సీరియల్

యమహాపురి -3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రోజూ బాగానే పాలిచ్చేదండి. ఎందుకో బర్రె ఈవేళ ఫెడీమని తన్నిందండి. పాలన్నీ నేలపాలయ్యాయి’’ అన్నాడా యువకుడు. వాడాయన ఇంట్లో పాలు తీసే పాలేరు.
‘‘ఎలా తన్నిందిరా, ఇలాగా’’ అంటూ వాణ్ణి ఫెడీమని తన్నాడాయన. పాలేరు ఎగిరి అంత దూరాన పడ్డాడు. లేవడానికి చేతులు నేలకానితే- అక్కడ చిల్లపెంకు ముక్కలున్నాయి. అరచేతులు గీరుకున్నాయి.
ఆ దృశ్యం చూడగానే లతికకి గుండె గుబగుబలాడింది.
పాలేరు ముఖంలో బాధ లేదు సరికదా, చిరునవ్వుంది. వాడు నెమ్మదిగా లేచి ‘‘ఇలా తన్నడానికి బర్రెకు మీ బలమెక్కడిది బాబూ!’’ అని ఆయనకు చేతులు జోడించాడు.
యమ ఇంకా ఏదో అనేవాడేమో- కానీ అప్పుడే లతికని చూశాడు. ‘‘ఇంటర్ చదువుతానంటున్న పిల్ల ఇదేనా?’’ అనడిగాడు లతిక తండ్రిని.
‘‘ఔనండి’’ అన్నాడు లతిక తండ్రి వినయంగా.
‘‘పిల్ల బాగా పెద్దదయిందే, ఏదీ చూస్తాను, ఇలారా!’’ అన్నాడు యమ.
లతిక తలొంచుకుని నెమ్మదిగా అడుగులేసి, కంటికి ఆయన పాదాలు కనపడ్డంతో ఆగి చుటుక్కున వంగి కళ్లకద్దుకుని లేచింది.
‘‘దేవుడు నిన్ను చూశాడు. నువ్వు దేవుణ్ణి చూడవా?’’ అన్నాడు యమ.
లతిక తలెత్తి ఓసారి ఆయన్ని చూసి వెంటనే తల దించుకుంది.
‘‘చిన్నపిల్ల. మీ తేజస్సుకది ఎక్కువసేపు తట్టుకోలేదు బాబూ!’’ అన్నాడు లతిక తండ్రి.
‘‘అర్థమయిందిలే- పిల్ల ముఖంలో కూడా చదువు కళ ఉంది. పట్నం పంపించు. కానీ తర్వాత పట్నంలోనే ఉండిపోతానంటే కుదరదు. మనూరి పిల్ల చదువు మనూరికి ఉపయోగపడాలి’’ అన్నాడు యమ.
‘‘తమరెలాగంటే అలాగేనండి’’ అన్నాడు లతిక తండ్రి.
‘‘ఆ మాట నువ్వు చెప్పడం కాదు, అది చెప్పాలి’’ అన్నాడు యమ.
‘‘చిన్నపిల్ల! తమరి ముందు దానికి గొంతు పెగలదు బాబూ’’ అన్నాడు లతిక తండ్రి.
‘‘పెద్దదైన పిల్లని పట్టుకుని చిన్నదంటావేమిట్రా! చిన్నబుచ్చుకుంటుంది’’ అన్నాడు యమ.
లతిక ఇబ్బంది పడలేదు. యమ ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఎవరిలోనూ ప్రతిస్పందన ఉండరాదని ఆ ఊరి నియమం.
‘‘తమరిముందు పెద్దరికమా? అందుకు తమర్నిక్కడికి పంపిన దేవుడే దిగిరావాలి బాబూ!’’ అన్నాడు లతిక తండ్రి.
ఆయన మాటల్లో తెలివుంది కానీ ఆ తెలివిని యమని మెచ్చుకుందుకే ఉపయోగిస్తాడు.
‘‘సరేలే- మాటలొద్దులే- తలూపితే చాల్లేవే, పిల్లా!’’ అన్నాడు యమ.
లతిక వెంటనే బుద్దిగా తలూపింది...
ఇదంతా గుర్తుచేసుకుంటూ సాలోచనగా అడుగులేస్తోంది లతిక. తెలిసిన దారి కాబట్టి ఆమె అడుగులు గమ్యం వైపే పడుతున్నాయి.
‘‘ఏమే లత్తీ ఇదేనా రావడం! పట్నం నీళ్లు బాగా వంటబటిటనట్లున్నాయి. ఎదురుగా ఉన్నా మనుషులు కనిపించడం లేదు’’ అన్న పలకరింపు విని ఉలిక్కిపడి అటు చూసింది లతిక.
నలభయ్యేళ్ళ భీమయ్య చంకలో కర్రతో కుంటుతూ ఆమెకు దగ్గిరౌతున్నాడు.
‘‘ఆలోచనలో పడి చూసుకోలేదు కానీ- నీ కాలుకేమయింది భీమయ్య మామా? నేనూరెళ్లినప్పుడు నిక్షేపంలా ఉన్నావ్- ఇప్పుడేమిటీ, కుంటుతున్నావ్?’’ అంది లతిక.
‘‘చిన్న తప్పు చేశానే- దేవుడు బాబు కాలు తీసేశాడు’’ అన్నాడు భీమయ్య యథాలాపంగా.
లతిక షాక్ తినలేదు. చేసిన తప్పేమిటని కూడా అనలేదు.
ఆ ఊళ్ళో తప్పొప్పుల నిర్ణయం యమ చేస్తాడు. ఎవరైనా తప్పు చేశారని యమ కనుక అంటే- తప్పేమిటని కూడా అడక్కుండా శిక్షకు సిద్ధపడాలి గ్రామ పౌరులు.
యమ శిక్షలు వినడానికి క్రూరంగా ఉంటాయి కానీ అనుభవంలో ఇబ్బందే తప్ప క్రూరత్వం వుండదు.
ఇప్పుడాయన భీమయ్యకి కాలు తీసేయాలని శిక్ష విధించాడంటే దానర్థం- భీమయ్యకి కాలు తీసేసినట్లు కాదు. తన శిక్షాకాలం పూర్తయ్యేదాకా కాలున్నా లేనట్లే నడవాలి భీమయ్య. అలా చెయ్యకపోతే గ్రామస్థులే ఊరుకోరు. అందుకని భీమయ్య శిక్షని అతిక్రమించే ప్రయత్నం చెయ్యడు.
ఇప్పుడు భీమయ్య విషయంలో జరిగిందే- ఎన్నో ఏళ్లుగా ఎందరి విషయంలోనో జరిగింది, జరుగుతోంది.
ఇదివరకు అలాంటివారిని చూసి నవ్వుకునేది లతిక. ఈ రోజామెకి నవ్వు రాలేదు.
‘‘శిక్ష కష్టంగా ఉందా?’’ అంది లతిక జాలిగా.
భీమయ్య కంగారుగా, ‘‘దేవుడు శిక్ష వేస్తే అది మనిషికి వరంలాంటిది. ఎవరికైనా వరం కష్టంగా ఉంటుందా? నీకు నిజంగానే పట్నం నీళ్లు వంటబట్టినట్లున్నాయి. ఇలా మాట్లాడుతున్నావు’’ అని అక్కణ్ణించి హడావుడిగా కుంటుకుంటూ వెళ్లిపోయాడు.
లతిక అతడు వెడుతున్నవైపే చూస్తూ నిట్టూర్చి ముందుకు నడిచింది. కొంత దూరం వెళ్లాక- దారి పక్కన ఓ బండరాతిమీద కూర్చుని కనిపించింది తన పొరుగున వుండే లచ్చమ్మ.
లచ్చమ్మకి కాస్త దూరంలో ఓ నల్ల తేలు పాకుతోంది. అది లచ్చమ్మ కాళ్లవైపే వస్తోంది. లచ్చమ్మ ఆ తేలునే చూస్తోంది. కానీ కదలడంలేదు.
లతిక ఒక్క పరుగున అట్నించి లచ్చమ్మ వద్దకు వెళ్లి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంది.
అలికిడికి తేలు మరోవైపు వెళ్లిపోయింది.
‘‘ఎవరూ?’’ అంది లచ్చమ్మ ఉలిక్కిపడి ఆమెనే చూస్తూ.
‘‘నా ముఖంలోకి చూస్తూ నేనెవరినంటావేమిటి అత్తా! నేను, లతికని’’ అంది లతిక.
‘‘ఎవరూ, లతికా- అంటే మా బచ్చమ్మొదిన కూతురు లత్తివే. పట్నంనుంచి ఎప్పుడొచ్చావే?’’ అందామె.

ఇంకా ఉంది

వసుంధర