డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్వాత మరో జంటకూ అలానే చేశాడు. అలా ఒక జంట తర్వాత మరో జంట ఆ స్తంభం చుట్టూ చేతులు వేసి దాన్ని కౌగలించుకోవడాన్ని చిత్రంగా చూసి, ‘‘మనం కూడా ఆ స్తంభాన్ని కౌగిలించుకుని వద్దామా? ఇదేదో సరదాగా ఉంది’’ అంది సాహిత్య.
‘‘ఆ... మనకు పిల్లలు పుట్టాలనుకుంటే మనమూ అలా చేయొచ్చు’’ అన్నాడు సామ్రాట్ నవ్వుతూ. వెంటనే నాలిక్కరచుకున్నాడతడు.
కోపంగా చూసింది సాహిత్య, ‘‘నువ్వు మరీ హద్దుమీరుతున్నావు’’ అన్నట్టుగా.
దాన్ని కప్ప స్తంభం అంటారనీ, కొత్త దంపతులు దాన్ని కౌగిలించుకుంటే వారికి సంతానం తప్పక కలుగుతుందనీ, పెళ్లయి చాలాకాలమైనా పిల్లలు పుట్టని దంపతులు కూడా ఆ స్తంభాన్ని కౌగిలించుకుంటే వాళ్లకు కూడా తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందనీ ఆ స్తంభం మహాత్మ్యం వివరించాడు సామ్రాట్.
‘‘అలాగా.. చిత్రంగా ఉందే! ఏమోలే.. ఈలోకంలో మనం నమ్మనివెన్నో జరుగుతున్నాయి. అసలు ఒక పరాయి మగాడితో ఇలా విహార యాత్రకు వస్తానని నేనేనాడైనా కలగన్నానా?’’ అంటూ నిట్టూర్చి అతడితోపాటు గుడి బయటకు నడిచింది సాహత్య.
గుడి బయటకు వచ్చాక ‘‘దేవుణ్ణి కళ్లారా చూద్దామని వస్తే ఈ గుళ్లో ఏవిటీ.. దేవుని విగ్రహం కనిపించకుండా మొత్తమంతా చందనం పూత పూసేశారు?’’ అంది సాహిత్య.
‘‘అపచారం.. అపచారం.. లెంపలేసుకో! ఈ గుళ్లో వెలసిన ఉగ్ర నరసింహస్వామిని నేరుగా చూడడం భక్తులకే మంచిది కాదనే ఆ ఏర్పాటు.
సంవత్సరానికి ఒక్కరోజు చందనం పూతను వలిచిన రోజు మాత్రమే భక్తులకు స్వామివారి నిజరూపాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. తిరిగి మళ్లీ తాజాగా అరగదీసిన చందనాన్ని విగ్రహమంతా పూస్తారు. చాలా మహిమగల దేవుడాయన’’ అన్నాడు సామ్రాట్.
‘‘అలాగా..’’ అని తల తాటించింది సాహిత్య ముందుకు నడుస్తూ.
‘‘మెట్లు ఎక్కడంకంటే దిగడం కష్టం. కొండ క్రిందికి ట్యాక్సీలో వెళ్లిపోదామా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఊ..’’ అందామె. మరో గంటలో నగరం నడిబొడ్డున ఉన్న షాపింగ్ సెంటర్‌లో ట్యాక్సీ దిగారిద్దరూ.
‘‘నీకు బట్టలూ, బంగారమంటే ఇష్టం లేదన్నావు కనుక ఆ దుకాణాల జోలికి మనం వెళ్లొద్దులే! ఇప్పుడేం చేద్దాం! పేవ్‌మెంట్‌మీద నడుస్తూ విండో షాపింగ్ చేద్దామా? ఏదీ ఒహపట్టాన నచ్చని నీకు హఠాత్తుగా ఏదైనా నచ్చితే అప్పుడు కొందాం. సరేనా?’’
తలూపి అతడితోపాటు నడిచింది సాహిత్య. కాళ్లు నడిపించిన దారిలో, కాళ్లు అరిగేలా ఎంతసేపు నడిచినా కొనదగిన వస్తువేదీ కనబడకపోవడంతో ‘‘ఇహ కాళ్లు లాగుతున్నాయి సామ్రాట్. ఈరోజుకు బయట తిరగడం మానేసి హోటల్‌కు వెళ్లిపోదాం. భోజనానికి కూడా బయటకు రావద్దు. గదిలోనే తెప్పించుకుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను’’ అంది సాహిత్య.
రూమ్‌లోకి ప్రవేశించాక హేండ్ బ్యాగ్ డ్రెస్సింగ్ టేబుల్ మీదకు విసిరేసి అలానే మంచంమీద వాలిపోయింది సాహిత్య.
దాదాపు అరగంట తర్వాత.. మంచంమీదనుంచి లేచి కాళ్లు నులుముకుంటూ సోఫాలో కూర్చుని అంది సాహిత్య, ‘‘ఇప్పుడెంతో తాజాగా ఉంది సామ్రాట్. అలసిపోయిన దేహానికి విశ్రాంతిని మించిన ఔషధం లేదు కదూ?!’’
‘‘నువ్వు ఎలానూ కాస్సేపట్లో లేస్తావు కదా అని కాఫీ తెప్పించి ఉంచాను. ఇమ్మంటావా?’’ అంటూ ఫ్లాస్క్‌లోంచి కప్పులోకి కాఫీ వంచి ఆమె చేతికి అందించాడు సామ్రాట్.
‘‘్థ్యంక్యూ సామ్రాట్.. ఇదే.. ఇదే..ఇటువంటి ఆపేక్షనే నేను నా భర్త నుంచి కోరుకున్నాను- అలసిపోయి ఉన్నపుడు.. ఒక ఓదార్పు మాట మనిషికెంత బలాన్ని ఇస్తుందో కదా!
ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధం. నువ్వు కావాలంటే భోజనం చెయ్. నాకాకలిగా లేదు. రెండు పూటలకూ సరిపడా సాయంకాలం తినేస్తాలే! బీచ్‌కు వెళదామా నువ్వు భోజనం చేశాకా?’’ అంది సాహిత్య హుషారుగా.
‘‘ఓయ్యస్.. నాకూ ఆకలిగా లేదు. నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకో! ఈలోగా నేనలా బయటకు వెళ్లొస్తాను’’ అంటూ గది తలుపు తెరచుకుని బయటకు నడిచాడు.
సామ్రాట్ కాస్సేపు అటూ ఇటూ తిరిగి గదిలోకి వచ్చేసరికి స్నానం తెచ్చిన చురుకుదనంతో, కళకళలాడే మొహంతో, ఆడదాని పొడ గిట్టనివాడు కూడా కళ్లు ఇంతలు చేసుకుని చూసేటట్టుగా శుభ్రంగా తయారై బయటకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉంది సాహిత్య.
కళ్ళతోనే ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ, ‘‘నువ్వూ అందంగానే ఉంటావు సాహిత్యా!’’ అన్నాడతు అల్లరిగా.
‘‘నీ జోక్‌కు నేను నవ్వాలా?’’ అంటూనే నవ్వింది సాహిత్య.
ఇద్దరూ బీచ్‌కు చేరుకునేసరికి అక్కడంతా కోలాహలంగా వుంది. ప్రేమపక్షులు, కొత్తగా పెళ్లయినవాళ్లూ, పెళ్లయి పిల్లల్ని కన్నవాళ్లూ, నడి వయసు వాళ్లూ, అడుగు తీసి అడుగువేసేందుకు కష్టపడే వయసులో వున్నవాళ్లూ.. ఇలా అన్ని రకాల వాళ్ళతోనూ చాలా సందడిగా ఉందక్కడ.
గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ల మధ్యనుంచి నడుచుకుంటూ వెళ్లి కాస్త ఎత్తుగా దిబ్బలా ఉన్న ఒక ఇసుక గుట్టమీద కూర్చుని ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న కెరటాల్ని చూస్తూండడంలో మునిగిపోయారు.
‘‘నాకు సముద్రమంటే ఎంతో ఇష్టం సామ్రాట్’’ అందామె, నీటి కెరటాలు అంతెత్తున లేచి చాప చుట్టలా మారి అంతలోనే విరిగిపడుతూ మళ్లీ కాసేపట్లోనే కెరటం రూపాన్ని సంతరించుకుని మళ్లీ విరిగిపడుతోన్న ఆ దృశ్యాన్ని చూస్తూ, ‘‘సృష్టి ఎంత అద్భుతమైనదో చూడు’’ అంది సాహిత్య మళ్లీ.

-ఇంకా ఉంది

సీతాసత్య