డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతే, ఈ వీలునామాలో సీజర్‌కు కుడిభుజంగా వున్న ఏంటనీ పేరుగానీ, ఆయన ప్రణయాన్ని పంచుకుని, ప్రాణంలో ప్రాణంగా వున్న క్లియోపాత్రా పేరు కానీ లేవు!
ఏంటనీ, క్లియోపాత్రాలు నిరుత్సాహంగా, నిరాశగా ఒకర్నొకరు చూసుకున్నారు. సీజర్ తమను అన్యాయం చేశాడని అనేందుకు ఆ ఉభయుల్లోనూ ఎవరికీ సాహసం లేదు. ‘చూశావా!’ అన్నట్లు ఒకరి భావాల్ని వేరొకరు అర్థం చేసుకున్నారు.
ఐతే, వారిద్దరిలో ఏ క్షణాన తమ ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందదోననే భయం తీవ్రంగా పనిచేస్తూ వున్నది. అందుకని వీలునామాలోని ప్రతి అక్షరాన్నీ వారు అర్థం చేసుకోలేదు. లీలగా ‘ఇది కదా భావం!’ అని మాత్రం అనుకున్నారు.
ఇటు మార్క్ ఏంటనీ, అటు క్లియోపాత్రా- ఇద్దరూ కూడా సీజర్ సంపత్తిని ఆశించినవారే! కాని, వీరిద్దరికీ కాకుండా మధ్య ఆక్టోవియస్ వచ్చిపడ్డాడు. అందుకని వీరిలో వీరు పోటీపడటం మానుకొని, ఉభయులకూ విరోధిగా వున్న ఆక్టోవియస్‌ను ముందు వొదిలించుకోవాలనే ఉద్దేశ్యం, వారిద్దరిలోనూ ఒకేసారి కలిగింది. మాటలంటూ జరగకపోయినా, చూపులతోనే వారు రుూ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. తదనుగుణంగా ప్రవర్తించేందుకు అనుకోకుండానే సిద్ధపడ్డారు. నిశ్శబ్దంలోనే జరిగిన రుూ రాజీ పూర్తయ్యాక, క్లియోపాత్రా తన మందిరానికి తిరిగివెళ్లింది.
ఈ రాత్రే వారు, సీజర్ అసలు వీలునామాను తగలబెట్టి ఉండవలసింది. కాని అలా జరగలేదు. అసలు వీలునామా బదులు నకళ్ళను తయారు చేసి, సీజర్ ఆంతరంగిక కార్యదర్శి సహాయంతో, దొంగతనాలు చేసివేస్తే పీడా విరగడైపొయ్యేది. కాని ఆ రాత్రి అలాంటివేమీ జరుగలేదు, బహుశా ఏంటనీ క్లియోపాత్రాలు సీజర్ సంతకాన్ని చూసి మనసులో చాలా దుఃఖపడి, అతని పట్ల సానుభూతితో, తమకు జరిగిన కీడును కూడా గమనించి ఉండరు.
కాని, ఆ తరువాత సీజర్‌వని చెప్పబడే అనేక పత్రాలు ఫోర్జరీలు చేయబడినవి. అసలు వీలునామాను మార్చటం మాత్రం జరగలేదు. ఎందుకంటే ఏంటనీ సర్వాధికార వర్గ సభ్యుల్ని తన ఇంటికి ఆహ్వానించి, వారికి అసలు వీలునామాలోని విషయాల్ని చదివి వినిపించాడు. ఆ వీలునామాను, సీజర్ అంత్యక్రియల సందర్భంలో ప్రజలకు చదివి వినిపించేందుకు సభ్యుల అనుమతి కోరాడు. సభ్యులు కీడు శంకంచలేదు. ఒప్పుకున్నారు. తీరా తాను చేసిన పొరపాటును ఏంటనీ చాలా ఆలస్యంగా గుర్తించాడు. ఇప్పుడంతా మించిపోయింది కనుక చేసేదేమీ లేదు.
సీజర్ హత్య చేయబడిన సమయంలో అతని దత్తపుత్రుడుగా ఉదహరించబడిన మేనల్లుడు అక్టోవియస్ స్పెయిన్‌లో ఉన్నాడు. ఈ దుర్వార్త వినగానే పరుగు పరుగున రోమ్‌లో వాలాడు. ఏంటనీని దర్శించాడు. తన పెంపుడు తండ్రి వీలునామాను చూపమని కోరాడు.. కాని ఏంటనీ ఏం చేసేందుకూ అప్పటికింకా నిర్ణయించుకోని కారణాన, ఆ వీలునామా తన దగ్గిర లేదని, ఆక్టోవియస్‌ను పంపివేశాడు.
ఆక్టోవియన్ మొహం పాలిపోయింది. సీజర్ ఐశ్వర్యమంతా తనకు రావలసింది. దానికి రుూ ఏంటనీ అడ్డం పడుతున్నాడు. ఆ తరువాత అతను క్లియోపాత్రాను దర్శించాడు. కాని, ఇది ఈజిప్టే కనుక అయివుంటే, ఆక్టోవియన్ సమాధి, క్లియోపాత్రా ప్రస్తుతం నివశిస్తూన్న టైబర్ నదీ తీరాన వున్న భవనంలోనో ఏ మూలో, ఎవరికీ తెలియరాకుండా ఉండేది. అలా జరుగుతే రోమన్ చరిత్ర, ప్రపంచ చరిత్రే వేరొక దారి తొక్కి ఉండేది.
క్లియోపాత్రా, సీజర్ వీలునామాను గూర్చి తనకేమీ తెలియదని బొంకింది. మీదుమిక్కిలి ఆక్టోవియన్ సీజర్‌కు దత్తపుత్రుడు మాత్రమే! తన కొడుకు ఆయన నిజ కుమారుడు న్యాయం, ధర్మమనేవి ఉన్నట్లయితే, నిజానికి తన కుమారునికే సీజర్ ఆస్తపాస్తులు రావాలి. అలా రాని సమయంలో ఆమె బాధపడుతూ వుంటే, ‘‘నా సంగతేమిటని’’ ఆక్టోవియన్ సత్రకాయలా దాపరించాడు. ఇపుడు మూడేళ్లు నిండిన సీజర్ టాలమీకి, పందొమ్మిదేళ్ళ ఆక్టోవియన్‌కూ సీజర్ ఆస్తిపాస్తుల పట్ల పెద్ద పోటీ ఏర్పడింది. క్లియోపాత్రా సీజర్ హత్య చేయబడినందుకే సగం చచ్చింది; తన కుమారునికి ఏమీ దక్కలేదనే దుఃఖంతో మిగతా సగం ఉత్సాహం పోయింది. ఈ స్థితిలో ఆమె ఆక్టోవియన్‌ను ఆదరించలేకపోయింది. ఈ విధంగా ఏంటనీ, క్లియోపాత్రాలిద్దరికీ ఆక్టోవియన్ శత్రువే అయ్యా డు!
తనకిక రోమ్‌లో పనేమిటి? తన ఆశలన్నీ అడియాసలైనవి. తాను ప్రపంచ సామ్రాజ్యం కొరకు పన్నాననుకున్న వలల్లో తానే ఇరుక్కున్నది. నేలమట్టమైన తన పేకమేడల పునాదులు మాత్రమే మిగిలి వున్నవి. వీలుంటే తిరిగి శ్రమపడి, తాను సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. ఇక్కడ రోమ్‌లో తనకు దిక్కులేదు. తనకూ తన కుమారునికీ రక్షణ లేదు. ఆదరించేవారు కూడా లేరు. ప్రజలందరూ తనకు శత్రువుల వలెనే కన్పిస్తున్నారు. ప్రమాదకరమైన రుూ తావునుంచి ఎంత త్వరగా వీలైతే, అంత త్వరగానూ తాను స్వదేశానికి వెళ్లిపోవాలి!
స్వదేశం! భోగభాగ్యోపేతమైన ఈజిప్టు! సామ్రాజ్యకాంక్షగలవారి కన్నులకు కామధేనువు! తాను చిన్నతనం నుంచీ పుట్టి పెరిగిన నేల! తాను రోమ్ వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఈమధ్య ఈజిప్టులో తనమీద ఏమన్నా కుట్రలు జరుగుతున్నవేమో తెలియదు!
అక్కడి రాజకీయాలను వెనువెంటనే సక్రమ మార్గంలో ఉంచాలి. ఎందుకంటే, ఇంతవరకూ తనకు జగదేకవరుడైన సీజర్ రక్షణ ఉండేది. ఇప్పుడు మరి సీజర్ లేడు కనుక, తన స్వశక్తిమీదనే ఆధారపడి ఉండాలి. కనుక తక్షణం తనను రమ్మని ఈజిప్టు గొంతెత్తి పిలుస్తూన్నట్లే ఆమెకు తోచింది. తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేయమని ఆమె అనుచరులకు ఆజ్ఞలిచ్చింది.
సీజర్ అంత్యక్రియలు జరిగే సందర్భంలో ఏంటన ఆయన అసలు వీలునామాను చదివాడు. సీజర్ నియంత కాదని తేలిపోయింది. రక్తసంబంధీకులకు మాత్రమే ఆయన తన ఐశ్వర్యన్ని పంచలేదు. ప్రతి రోమన్ పౌరునికి 300 బంగారు నాణాల్ని ఆయన పంచి ఇచ్చాడు. స్వార్థరహితగా ఆయన తన యావదాస్తినీ అందరికీ పంపిణీ చేశాడు. ఆ మాట వినగానే సీజర్ హత్యకు కారకులైన వారిమీద ప్రజలు మండిపడ్డారు. సీజర్ కోసం కన్నీరు కార్చనివారు ఆనాడు లేరు!
చివరకు సీజర్ చితి మండుతూంటే, ప్రతి రోమన్ పౌరుడూ తనకున్న కొద్దో గొప్పో, ఆ చితిలో పారేశాడు. అనేకమంది స్ర్తిలు తమ తమ ఆభరణాల్ని సైతం ఆ చితిమీదకు విసిరి, తమకు సీజర్ పట్ల వున్న భక్తిశ్రద్ధల్ని వెలిబుచ్చారు. ఇంత వైభవంగా అంత్యక్రియలు జరుపుకున్నవారు రోమన్ చరిత్రలో మరెవ్వరూ లేరు!
ఇదే సమయంలో క్లియపాత్రా టైబర్ నది మీద ప్రయాణం సాగించింది. తనకు ప్రణయ పాఠాలు నేర్పిన సీజర్, సింహంలాంటి పురుషోత్తముడు మరి లేడు. దూరాన ఆయన చితి కాలుతున్నపుడు వెలువడే పొగ మాత్రం ఆమెకు కనిపిస్తోంది. సీజర్ తనకు విడిచి వెళ్ళిందేమీ లేదు, జీవితాంతం తాను జ్ఞాపకంగా ఉండేందుకుగాను ఆయన తనకీ కుమారుణ్ని ప్రసాదించాడు. ఈ బుడతడు ఆమె వొళ్లో పడుకుని, ప్రపంచ సుఖ దుఃఖాలతో తనకు సంబంధమే లేదన్నట్లు సుఖంగా నిద్రపోతున్నాడు.
సీజర్‌తో తాను గడిపిన కాలమంతా ఆమెకు జ్ఞాపకమొస్తోంది. ఆ సంఘటనల తాలూకు అనుభూతులతో ఆమె కళ్ళు అశ్రుపూరితాలైనవి. తన జన్మ తరించటమూ అయింది, చాలించటమూ అయిందేమో?
ఆమె హృదయం ఇపుడు శూన్యం. ఒక్క దుఃఖం మాత్రమే ఆమెకు మిగిలింది. జీవితమంతా ఏడ్చినా, కళ్లు పొయ్యేవరకూ భేదించినా, రుూ దుఃఖం చల్లారుతుందా?
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు