డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీట్లోకి దిగుదామా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఉహూ నాకు భయం బాబూ.. నువ్వు కావాలంటే దిగు.. నేను ఇక్కడే నిలబడి చూస్తాను. మరీ లోపలికి వెళ్లకు. కెరటాలు నిన్ను లోపలికి లాక్కుపోతే నిన్ను రక్షించడానికి నాకు ఈత కూడా రాదని నీకు తెల్సుగా?’’ అంది సాహిత్య.
‘‘అంత అవసరం రాదులే!’’ అంటూ వంటిమీది బట్టల్ని ఒక్కొక్కటీ విడిచి, అండర్‌వేర్‌తో నిలబడి, ‘‘నువ్వు నిజంగా నీట్లోకి దిగవా?’’ అన్నాడు సామ్రాట్.
‘‘నీ ఎక్స్‌పోజింగ్ చూడలేకపోతున్నాను గానీ.. త్వరగా ఆ సరదా ఏదో తీర్చుకునిరా!’’ అంది సాహిత్య మొహాన్ని మరోవైపు తిప్పకుంటూ.
ఆమె మాటలకు సిగ్గుపడుతున్నట్టుగా ఛాతీకి రెండు చేతులూ అడ్డుపెట్టుకుని నీటివైపు అడుగులు వేశాడు సామ్రాట్.
నీటిలో ఇరవై అడుగులు లోపలికి నడిచి విరిగిపడబోతున్న ఒక కెరటానికి అడ్డుగా నిలబడి వీపును సముద్రం వైపూ, మొహం సాహిత్య వైపూ ఉంచి రెండు చేతులూ గాల్లోకి ఊపాడు సాహిత్యను చూడమన్నట్టుగా.
మరుక్షణం కెరటం విరిగిపడబోతూ వీపున ఛెళ్లున చరిచిన దెబ్బతో బోర్లాపడి ఒడ్డువరకూ కొట్టుకొచ్చి ఇసుకలో పడ్డాడు.
తెరలు తెరలుగా వస్తోన్న నవ్వును అరచేత్తో ఆపుకుంటూ అతడి దగ్గరగా వెళ్లి చేయందించి పైకి లేపుతూ, నీ ప్రతాపం చూసి నేను తరించానుగానీ ఇహ నీ విన్యాసాలు చాలించి బట్టలు వేసుకో’’ అంది సాహిత్య.
తర్వాత ఇద్దరూ బీచ్‌లో అమ్మే పిడతకింది పప్పు తిన్నారు. పిచ్చుకగూళ్లు కట్టారు తడి ఇసుకలో. అప్పటికే కను చీకటి పడి చాలాసేపు కావడానికి తోడు ఎదురుగా సముద్రపు హోరు తప్ప ఏమీ కనబడకపోవడంతో ఒంటికంటుకున్న ఇసుకను దులుపుకుని తిరిగి హోటల్‌కు బయల్దేరారు.
కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించేసరికి రాత్రి పది దాటింది. ‘‘ఇహ పడుకుందామా!’’ అంది సాహిత్య.
‘‘ఊ..’’ అన్నాడు సామ్రాట్ మంచంవైపు ఆమె వైపూ మార్చి మార్చి చూస్తూ.
‘‘ఏమిటలా చూస్తున్నావ్! ఎక్కడ పడుకోవాలా అనా?’’ అందామె మామూలుగా.
‘‘దానికింత తటపటాయింపెందుకూ? రెండో మంచం ఖాళీగానే ఉందిగా!’’ అందామె మళ్లీ, చేతిని వెనక్కిపెట్టి జుట్టుకున్న క్లిప్పును తీస్తూ.
గుండె గొంతుకలో కొట్టుకులాడుతోండగా సోఫాలోంచి లేచి నెమ్మదిగా మంచంమీదకు చేరి వెల్లకిలా పడుకుని గది పైకప్పు వైపు రెప్ప వాల్చకుండా చూడసాగాడు సామ్రాట్.
తలగడను సరిగా సర్దుకుని తనూ పడుకుంటూ కాళ్ల దగ్గర ఉన్న దుప్పటిని కప్పుకుంటూ ‘‘చలిగా ఉంది కదూ?’’ అంది సాహిత్య.
‘‘ఊ..’’ అన్నాడు సామ్రాట్ గది పైకప్పుమీదినుంచి దృష్టిని మర్చకుండా!
‘‘ఇందాకటినుంచీ ఏవిటలా కళ్లను సీలింగ్‌కు అప్పజెప్పావ్? అక్కడేవైనా కోతులాడుతున్నాయా?’’ అంది సాహిత్య.
అతడు తల తిప్పకుండానే, ‘‘అక్కడ కాదు సాహిత్య.. నా మనసులో ఆడుతున్నాయి’’ అన్నాడు.
‘‘సరే.. రాత్రంతా నీ మనసులో కోతుల్ని ఆడుకుంటూ అలానే ఉండు.. నాకు నిద్రొస్తోంది. ఇహ లైట్ ఆఫ్ చేస్తావా?’’ అంది సాహిత్య.
‘‘ఉహూ.. నాకు భయం. లైటలనా ఉండనీ!’’ అన్నాడు సామ్రాట్.
‘‘ఎవరైనా వచ్చి నినె్నత్తుకుపోతారని భయమా? ఏవిటిది చిన్న పిల్లాడిలా!’’ అంది సాహిత్య.
‘‘నా భయానికి కారణం అది కాదు సాహిత్యా.. చీకటి మనిషికి భయాన్నీ, ధైర్యాన్నీ కూడా ఇస్తుంది ఆయా పరిస్థితుల్ని బట్టి.
మనిషి వెలుతురులో ధైర్యంలో చేయలేని పనుల్ని చేయడానికి చీకటి కావలసినంత ధైర్యాన్నిస్తుంది. ముఖ్యంగా తప్పు పనులు చేయడానికి?’’ అన్నాడు సామ్రాట్.
‘‘నువ్వే తప్పు పని చేయబోతున్నావ్ ఇప్పుడు?’’ ఆశ్చర్యంగా అతడిని చూస్తూ అంది సాహిత్య.
‘‘నేను చేయాలనుకోవడం లేదు. కానీ చీకటి నా చేత ఆ పనిని చేయిస్తుందేమోనని భయంగా ఉంది’’..
‘‘అంటే.. అంటే..’’ అంది సాహిత్య, గొంతు తడారిపోతున్నట్టనిపించిందామెకు.
‘‘అవును. నా భయమదే! అందుకే నీవైపు చూడాలని ఉన్నా బలవంతంగా నిగ్రహించుకుంటున్నాను’’ అన్నాడు సామ్రాట్.
మచంమీద లేచి కూర్చుంది సాహిత్య.
అతడి పట్ల తను ఏర్పరచుకున్న నమ్మకం పేకమేడలా కుప్పకూలిపోబోతోందా? అనిపించి ఆమె చాలా ఆందోళనకు గురైంది.
‘‘ఏవిటి సామ్రాట్.. నువ్వుకూడా అందరు మగాళ్లలా..’’ ఆ తర్వాతి మాటలు పూర్తిచేయడానికి ఆమెకు ధైర్యం చాలలేదు.
‘‘నిన్ను మొదటిసారి చూసినపుడు నీలో నాకు నచ్చిన గుణాలు.. పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కొనే మనోధైర్యం, నమ్మిన దానిని సాధించుకునే ధీరత్వం, నీ చుట్టూ ఉన్నవాళ్లను ఉత్తేజపరిచే ఆవేశం, తర్వాతి రోజుల్లో.. నీ నిర్మొహమాటత్వం, నీకళ్లలోని నిర్మలత్వం, నీ మాటల్లోని హస్య ప్రియత్వం, నువ్వు చేసే పనుల్లో క్రమశిక్షణ, ఎవరికీ అతి చనువు ఇవ్వకుండా ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచడం, గతం గురించి చింతించకుండా నీకున్న పరిధుల్లోనే వర్తమానాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ క్రమేణా నీ పట్ల ఒకరకమైన ఇష్టం ఏర్పడి ఆ ఇష్టం అలా అలా నా అస్తిత్వానే్న ప్రశ్నించేంతగా పెరిగిపోయి.. చివరకు నిన్ను చూడందే నేనుండలేననే స్థితికి తీసుకొచ్చింది.
ప్రతిరోజూ, ప్రతిగంటా.. చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పనిలో మునిగి ఉన్నప్పుడు తప్ప ప్రతిక్షణమూ నీ సమక్షంలోనే గడపాలనే కోరిక నన్ను దహించేయడం ప్రారంభించింది.

-ఇంకా ఉంది

సీతాసత్య