డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తర్వాత ఎంత దుర్మార్గపుటాలోచనలు నా మనసులోకి వచ్చేవంటే... నీ భర్తగానీ లేదా నా భార్యగానీ చచ్చిపోతే మనిద్దరం సంఘం ఆమోదించిన రీతిలో పెళ్లి చేసుకుని మనకు నచ్చినట్టుగా జీవించవచ్చుకదా అని కూడా అనిపించింది.
ఎందుకంటే నీ అంత అనుకూలవతియైన భార్యను నీ భర్తా, నావంటి దుర్లక్షణాలు లేని భర్తను నా భార్యా ఎప్పటికీ వదులుకోరని నా నమ్మకం. వాళ్లు మనకు విడాకులిస్తే తిరిగి పెళ్లి చేసుకుందుకు ఎవరో ఒకరు దొరకవచ్చునేమోగానీ మనలాంటివాళ్లు వాళ్లకు దొరకరు.
అందుకే నా మనసులో అటువంటి ఊహలు వచ్చి నన్ను కలవరపెట్టేవి. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు తరచూ నా మనసులోకి వచ్చేవో, అప్పటినుంచీ నాకు తెలియకుండానే మనిద్దరం భార్యాభర్తలం కాకపోయినా, భార్యాభర్తలమే అనే ఆలోచన నా మనసునిండా ఆవరించి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం ప్రారంభించింది.
తర్వాత ఎప్పుడు ఏర్పడిందో తెలియదుగానీ.. నీ మీద శారీరకపరమైన కోరిక కూడా నా మనసులోకి చొరబడి, నా మెదడును చిన్నాభిన్నం చేయడం ప్రారంభించింది.
స్వంతంగా ఆలోచించగలిగే వయసును సంతరించుకున్న ఏ స్ర్తి అయినా పురుషుడి చూపులకు అర్థాన్ని తేలిగ్గానే కనిపెట్టగలదని నా నమ్మకం. కానీ ఎంత తరచి చూద్దామన్నా నా మనసులోని ఇటువంటి ఊహలను నువ్వు గ్రహించిన దాఖలాలేమీ నాకు కనబడలేదు. దానితో నాలో సంఘర్షణ మరింతగా పెరగడం ప్రారంభించింది.
నీ నుంచి ఎప్పుడైనా ఆ ప్రసక్తి వస్తుందేమోనని ఎదురుచూసిన నాకు నిరాశ కలిగింది. కానీ ఇప్పుడు సిగ్గువిడిచి చెప్తున్నాను.
నీ సమక్షంలో నేను కప్పుకున్న సౌశీల్యపు ముసుగును ఎప్పుడు తొలగించి అందరిలాంటి మగాళ్లలా ప్రవర్తిస్తానో అనే భయం నన్ను అనుక్షణం వెంటాడుతోంది’’ అని ఆమెవైపు చూడలేక మొహాన్ని మరోవైపుకు తిప్పుకున్నాడు సామ్రాట్.
తన మనసును పుస్తకంలా విప్పి పరచినందుకు అతణ్ణి అభినందించాలో, అతని మనోగ్రంథంలోని పుటలు తనకంత హృదయావేదనను కలిగించేలా ఉంటాయని తను ఏనాడూ ఊసించనందుకు విచారపడాలో తెలియక నిశేష్ట అయింది సాహిత్య చాలాసేపు.
ఆ తరువాత ఎంతసేపటికి తేరుకుందో ఆమెకే తెలియదు.
చాలాసేపటి తర్వాత గొంతు విప్పి, ‘‘మొదట్లో నువ్వు నన్ను పలకరించినపుడు అవకాశం దొరికితే ఆడవాళ్ల వెంటపడి మాయమాటలతో వారిని తమవైపుకు తిప్పుకుందుకు ప్రయత్నించి శారీరక అవసరం తీరగానే వారినొదిలేసి మరొకరి వెంటపడే మగాడిలానే భావించాను నేను కూడా.
తరువాత్తర్వాత.. సాధారణమైన మగాడిలా ఆడదాని ఒంపు సొంపుల మీద ఏనాడూ దృష్టి సారించని నీ సభ్యతాయుతప్రవర్తనా, కల్లాకపటం లేని మాటలూ, పసిపిల్లవాణ్ణి తలపింపచేసే అమాయకత్వమూ, నన్ను నీ ఆప్తురాలిలా భావించి నీ ప్రతి చిన్న అనుభూతినీ, అనుభవాన్ని నాతో పెంచుకోవడం, నా ప్రతిస్పందనను ఒక అమూల్యమైన అనుభూతిలా నీ మనసులో పదిలపరచుకోవడం.. ఇవన్నీ గమినించాక నాకు తెలియకుండనే నీమీద ఒకరకమైన ఇష్టం ఏర్పడడం ప్రారంభించింది.
నీ భార్యను గురించి విన్నాక, ఆమెను ప్రత్యక్షంగా చూశాక నీ పరిస్థితికి నీమీద అంతులేని జాలి కలిగింది. నాలానే నువ్వు కూడా ప్రేమ రాహిత్యంతో దిగులు పడడం నిన్ను నాకు మరింత దగ్గరచేసింది.
నువ్వు నాకు ఎంతో దగ్గరవాడివనే నమ్మకంతోనే నా మనసులోని ప్రతి భావాన్నీ నీతో పంచుకున్నాను. అలా పంచుకోవడంలో ఎంతో తృప్తినీ, మానసికానందాన్నీ అనుభవించాను.
నువ్వు నా సమక్షాన్ని ఎలా కోరుకున్నావో అలానే ఏ మాత్రం వీలు చిక్కినా నీ సన్నిధిలో ఉంటే బావుంటుందని మనసా, వాచా నేనూ కోరుకున్నాను.
వారానికోసారి మావారు ఇంటికొచ్చిన సందర్భాల్లో ఆయన అవసరాలు చూస్తున్నపుడు కూడా నీ నిష్కల్మషత్వం, నాపట్ల నువ్వు చూపించే అవ్యాజమైన ప్రేమభావం, మనం విడిపోయే ప్రతిసారీ వదలలేక వదలలేక బరువెక్కిన గుండెతో నువ్వు వీడ్కోలు చెప్పే తీరూ, వీటన్నిటివల్లా నా మనసులో ఇదమిత్థంగా ‘ఇదీ’ అని నేను చెప్పలేని ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నావు.
దాన్ని ప్రేమ అంటారో, ప్రేమకు పరాకాష్ఠ అయిన శారీరక కలయిక మన మధ్య లేదు కాబట్టి అమలిన ప్రేమ అంటారో మరొకటి అంటారో నాకు తెలియదు.
ఒకటి మాత్రం నిజం. నువ్వు పుట్టుకరీత్యా మగాడివే అయినా నా దృష్టిలో నా మనసంతా నిండిన వ్యక్తివి. అంతే! ఆ వ్యక్తి పురుషుడా, స్ర్తియా అని నేనేనాడూ ఆలోచించలేదు.
బహుశః అందుకేనేమో నాకు నిన్ను చూస్తే ఏనాడూ ఎటువంటి వికారపు భావాలూ కలగలేదు. నీలో మగలక్షణాలు లేవని గానీ, ఒక ఆడదానివైన నాకు నువ్వు మగాడిలా కనబడలేదనీ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.
నీ స్నేహపు మధురిమ నువ్వు మగాడివీ, నేను ఆడదాన్నీ అనే స్పృహను నా నుంచి నాకు దూరం చేసేటంత గొప్పగా ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. కానీ మనం ఎంత కాదని చెప్పుకున్నా నువ్వు మగాడివీ నేను ఆడదాన్నీ అనేది కళ్లకు కనిపిస్తోన్న వాస్తవం.
అందుకు నిదర్శనం- కొంచెం సేపటిక్రితం నువ్వు చీకటంటే నీకెందుకు భయమో చెప్తూ వివరించిన మాటలే!
ఒక పురుషుడికీ, స్ర్తికీ మధ్య స్నేహానికీ, ప్రేమకూ- ప్రేమకూ, కామానికీ మధ్య ఉండే గీతలు కనీ కనబడనట్టుగా చాలా అస్పష్టంగా ఉంటాయి.
సునిశిత దృష్టికి మాత్రమే అని గోచరిస్తాయి. స్నేహాన్ని కలకాలం స్నేహంగా నిలుపుకోవాలనుకునే స్ర్తి, పురుషులు వారికటువంటి దృష్టిలేని పక్షంలో వీలైనంత వరకూ ఒకరికొకరు దూరంగా ఉండడమే మంచిది.

-ఇంకా ఉంది

సీతాసత్య