డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనికి అనాథనైన నాకు నాథుడనేవాడు అత్యవసరం. అటు వ్యక్తిగత జీవితానికీ, ఇటు బహిరంగ జీవితానిక్కూడా సంసిద్ధుడైన వాణ్నే ఎన్నుకోవాలి. ఈ అగ్నిపరీక్షకు నీవు నిలిచేందుకు సిద్ధపడ్డాక నా సమస్యలు సగం తీరినవి. ఇతర దేశాల మాట ఎలా వున్నా, ముందు స్వదేశంలోనన్నా నేను నా ప్రజల దృష్టిలో నీచం కాకుండా, తమ రాణి కేవలం ఒక రోమన్ ప్రియురాలిగా, ఉంపుడుకత్తెగా ఉన్నదని నాప్రజలు సిగ్గుపడకుండా ఉండేట్లు చూడవలసిన బాధ్యత నాకు ఉన్నది. పోతే నా సంతానం- ముగ్గురు పిల్లలూ- పితృప్రేమ కోసం మొహం వాచి ఉన్నారు. సహజమైన యవ్వనపు కోర్కెల్ని తీర్చుకునేందుకు నేను ప్రయత్నించాను. వాటి ఫలితంగా సంతానవతి నయ్యాను. తల్లిగా నేను నా సంతానానికి కొంతలో కొంతన్నా న్యాయాన్ని చేకూర్చాలి. తండ్రిలేని సంతానమిది అనీ, సంకరజాతిదనీ నా దేశ ప్రజలే ఏవగించుకోకుండా చూడాలి కనుక, నాకు భర్త అవసరం.. కొంచెం ఆలోచిస్తే ఎంత అథఃపాతాళంలో నేను ఉన్నానో, మనోవేదనతో నేనెంత దహించుకొనిపోతున్నానో నీకు అర్థం కాగలదు’’.
తాను చెప్పదలుచుకున్నది చాలా బాధతోనూ, వేగంతోనూ చెప్పివేయగలిగిందామె. అలసటతో నిట్టూర్చింది. క్లియోపాత్రా మనస్తత్వ పరిణామాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగాడు ఏంటనీ. ఈ క్షణంలో అతను, ఆమె హృదయాన్ని స్పష్టంగా చూడగలిగి, ఆమె అనుభూతులన్నిటినీ పంచుకున్నాడు.
‘‘రాణీ! నీవు గీచిన గీటు దాటను.. నా బిడ్డలమీద నాకు మమత లేదని నీవు అనుకుంటున్నావు. అసలు నిన్ను చూడగానే, నీ వెనుక నా చిన్నారి సంతానమెక్కడని వేయికళ్ళతో గాలించాను. కాని, నీవు వారిని వెంట తీసుకొని రాలేదు. నా బిడ్డల్ని నాకు చూపదలుచుకోలేదు. నేనేదో నీకు అన్యాయం, అక్రమం చేశాననీ, నీ పట్ల అవిశ్వాసంగా మెలిగాననీ, నీ గొంతు కోశాననీ నా మీద మండిపడ్డావు. అందుకనే నా నేరాలకు శిక్షగా, నా బిడ్డల్ని అలెగ్జాండ్రియాలోనే వదిలేసి వచ్చావు.. కాని, ఇప్పుడు నా హృదయాన్ని చీల్చి చూడు. అందులో నీవూ నా బిడ్డలు తప్ప వేరెవ్వరికీ స్థానం లేదు- నీ హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను; అదేవిధంగా నన్ను కూడా నీవు అర్థం చేసుకుంటే, మనిద్దరిమధ్య అభిప్రాయభేదాలంటూ ఉండవు కదా!’’ అన్నాడు ఏంటనీ.
ఈ సమయంలో క్లియోపాత్రా ఏంటనీని నమ్ముతోంది. అతను మాట్లాడే ప్రతి మాటలోనూ సత్యమే ఉన్నదని ఆమె విశ్వసించగలుగుతోంది. కేవలం వాద ప్రతివాదలకొరకే మాట్లాడిన మాటలైతే, వాటిలో అసహజత్వం, కారణా కారణాలూ తెలివితేటలూ మాత్రమే కనిపించేవి. కాని, సహజమైన అనురాగం అతని కంఠస్వరంలో కలిసి ఉన్నదని ఆమెకు తోచబట్టే, ఏంటనీతో రాజీ కుదురుతోంది.
‘‘ఏంటనీ! ఈజిప్టుకు రాజుగా ఉండేందుకు నీవు అంగీకరించకపోవచ్చు. కాని, రాజ్యాంగాన్ని నడిపే బాధ్యతను స్వీకరించేందుకేం?’’ అన్నదామె.
‘‘రాణీ! నేనే నీవాణ్ని కాగాలేనిది, నీ రక్షణా, నీ రాజ్య రక్షణా నాది అవదా? అసలు నీకీ సందేహాలు దేనికి?’’ అన్నాడు ఏంటనీ.
‘‘మరొక షరతు’’
‘‘చెప్పు రాణీ! సందేహమెందుకు?’’
‘‘ప్రస్తుతం రోమన్ పరిపాలనలో వున్న కొన్ని చిన్న రాజ్యాలు ఈజిప్టుకు కలపాలి. ఇది మన వివాహానికి బాసగా నిలబడాలి!’’
ఏంటనీ ఆలోచనలతో బుర్ర వేడెక్కించుకో దలచుకోలేదు. ప్రస్తుతం భూలయంలోని ఈ భాగానికి తానే పాలకుడు కనుక, ఆయా రాజ్యాలను ఈజిప్టుకు సంక్రమింపజేయటం తన చేతుల్లో పని. ఐతే, రోమన్ సర్వాధికార వర్గంలో తాను చేసిన ఈ ఘోరాన్ని గూర్చి దుమారం లేస్తుంది. కొత్త భూఖండాలను రోమన్ సామ్రాజ్యంలో కలిపేందుకని బయలుదేరి వెళ్లి, వున్నవాటిని వదిలించుకున్నందుకు రోమన్ ప్రభుత్వం తనమీద కారాలూ, మిరియాలూ నూరుతుంది.
దానికి తాను చెప్పే జవాబు కూడా సిద్ధంగానే ఉన్నది. ఈజిప్టుతో పోల్చుకుంటే, ఈ రాజ్యాలొక లెక్కా? వీటి పరిపాలనను, దూరాన వున్న రోమ్‌కన్నా, దగ్గిర్లో వున్న ఈజిప్టే సక్రమంగా జరిపించగలదు; అదంతా అలా వుంచి, పర్షియన్ దండయాత్ర నిమిత్తం ఈజిప్టు సహాయాన్ని తీసుకోక తప్పదు. ఆ సహకారం కోసమే తాను క్లియోపాత్రాను పెళ్లాడానని అంటాడు, అంటే ఇక్కడిది ప్రేమ పెళ్ళే ఐనా, రోమ్‌లో మాత్రం రాజకీయ వివాహంగా రంగు మార్చుకుంటుంది.
చివరకు పర్షియాను జయించాక, అపుడు రోమన్ సామ్రాజ్యం తాలూకు పటాలలో మార్పులు చేసుకోవటం ఎంత పని? ఈ విధంగా తనకు ప్రపంచంలోని సౌందర్యమూ, ఐశ్వర్యమూ కూడా దక్కుతవి. ఇదంతా రోమన్ సామ్రాజ్యం కోసమేనని నచ్చచెప్పగలదు.
ఇదంతా ఆలోచించే ఉన్నాడు కనుక, తడుముకోకుండానే ‘‘రాణీ! ఏయే రాజ్యాలు ఈజిప్టుకు కావాలో తెలియపరుచు’’ అన్నాడు.
ఏంటనీ రోమ్‌కు వ్యతిరేకంగా ఇంత తేలిగ్గా రాజ్యదానం చేస్తాడనీ, అంత సాహసికుడనీ క్లియోపాత్రా అనుకోలేదు. ఎప్పుడై రోమన్‌గా, రోమన్ ప్రభుత్వ ప్రవాహానికే ఎదురీదేందుకు సిద్ధపడ్డాడో, అప్పుడే ఏంటనీ తిరిగి క్లియోపాత్రాకు ప్రాణంలో ప్రాణంగా రూపొందాడు. ఇక ఇతని ప్రేమను తాను శంకించవలసిన పనిలేదు. సీజర్ స్వప్నం నిజమయ్యేందుకుగాను తిరిగి గట్టి పునాదులు కూడా పడుతున్నవనుకున్నదామె.
‘‘రేపు మన పెళ్లినాడు, ఏయే రాజ్యాలను కానుకగా కోరుతానో చెపుతాను ఏంటనీ!’’ అన్నదామె.
‘‘్ధన్యుణ్ణి’’ అని ఏంటనీ ఆమెను తన కౌగిలిలోకి లాక్కునేందుకు చేయిజాపాడు.
‘‘ఇప్పుడు కాదు- వివాహబంధానంతరమే ఈసారి ప్రణయబంధం!’’ అని మెరుపుతీగలాగ, అతని చేతికి చిక్కకుండా క్లియోపాత్రా డేరాలోకి మాయమైంది!
తన నిస్సహాయ స్థితికి ఆకాశంలోని చందమామ నవ్వుతున్నట్లు తోచింది ఏంటనీకి. బహుశా తన ముఖ కళ తెల్లని వెనె్నలలో కలిసిపోయి ఉండాలని అతను అనుకున్నాడు.
***
క్రీ.పూ.36లో సిరియా చరిత్రలో కనీ వినీ ఎరుగని సంఘటన జరిగింది. అదే ఏంటనీ, క్లియోపాత్రాల వివాహం. అంతకుపూర్వం ఏ పెళ్లీ అంత వైభవంగా జరగలేదు. ఇకముందు జరగగలదనీ ఎవరూ నమ్మలేదు.
అనేకమంది రోమన్ సేనానుల సమక్షంలో ఆలయంలో ఆ పెళ్లి జరిగింది. విందులకూ, వినోదాలకూ ఎంత ఖర్చయి ఉంటుందో ఆనాటి ప్రజ ఊహించలేకపొయ్యారు. ప్రపంచంలోకెల్లా ఖరీదైన ద్రాక్ష సారాయి అతిథులకోసం కాల్వలై ప్రవహించింది. అనేక దేశాలనుంచి సొగసుగత్తెలొచ్చి నాట్య ప్రదర్శనలిచ్చారు. మన్మథుడు పెళ్లి పందిళ్ళల్లో విశ్వవిహారం చేశాడు. ఇంత గొప్ప విజయోత్సవం ప్రణయ దేవుడిక్కూడా కొత్తగానే కనిపించి ఉండాలి. ఈ వివాహం మానవమాత్రుల మధ్య జరిగిందంటే ఎవ్వరూ నమ్మలేకుండా ఉన్నారు. రతీ మన్మథుల పెళ్ళనే అందరూ భావించారు. పూజించారు.
ఈ శుభ సందర్భంలో కొత్త నాణాలు విడుదల చేయబడినవి. నాణానికి ఒకవైపున క్లియోపాత్రా తల ముద్రించబడి, దానికింద ‘ఈజిప్టు మహారాణి’ అని ఉన్నది. రెండోవైపున మార్క్ ఏంటనీ తల, దాని కింద ‘ఈజిప్టు పాలనాధికారి’ అని ఉన్నది.
పెళ్లి కట్నం కింద ఏంటనీ మధ్యధరా సముద్ర తీరాన వున్న అనేక చిన్న చిన్న రాజ్యాలను క్లియోపాత్రాకు ఇచ్చాడు. అంటే, ఆ చిన్న భూఖండాలన్నీ ఇపుడు ఈజిప్టు పాలనలోకి వచ్చినవి. ఈ విధంగా ఏంటనీ, క్లియోపాత్రాల వివాహం దేవ మానవుల ఆనందాన్నతిశయింపజేసింది.
ఆ రాత్రి క్లియోపాత్రా నిజంగానే ప్రణయ దేవతవలె ఏంటనీకి కనపడింది. ఆమె సౌందర్యానికి అతన ముగ్ధుడయ్యాడు. ద్రాక్ష సారాయితో అసలే కైపెక్కిన అతని శరీరానికి, కామధూమాలు కూడా తోడ్పడినవి. తాను పోగొట్టుకున్నానని భయపడిన స్వర్గ సౌఖ్యం చేజిక్కినందుకు అతనెంతో సంతోషించాడు.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు