డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడరేవులోనే తన ఇద్దరు పిల్లల్ని ఏంటనీ ఎత్తుకొని ముద్దాడాడు. సీజర్ టాలమీని కావలించుకున్నాడు. సంసార తాపత్రయంతో అతని మనస్సు భారమైంది. ప్రపంచమంతా తాను ఆనందం కొరకే గాలిస్తున్నాడు. ఇప్పుడా ఆనందమేగాక, కొసరుగా రుూ సంతానం- తన ప్రణయానుభూతులకు తార్కాణంగా లభ్యమైంది.
తిరిగి టాలమీల రాజ ప్రాసాదం కళాకాంతులతో విరాజిల్లింది. ఆనందం వెల్లివిరిసింది. మన్మథుడే నాట్యమాడాడు. మానవుని ప్రేమ ఉన్నత శిఖరాలను అందుకోవటమంటే ఏమిటో ఏంటనీ, క్లియోపాత్రాలను చూసిన వారికి తేలిగ్గా అర్థమైంది.
ఆరునెలలపాటు ఆ దంపతులు బైటి ప్రపంచం వైపుకూడా చూడలేదు; తాము సృష్టించుకున్న ప్రపంచంలోనే విహరించారు. అయితే, రోమ్ నుంచి తాఖీదులు దిగుతూనే వున్నవి. పర్షియన్ దండయాత్రా సన్నాహాల కొరకు ఏంటనీ మీద వత్తిడి జరుగుతోంది. అదీగాక, వేచి ఉండేందుకు కూడా వీలు లేదు. సిరియలాని సైన్యాలు, ముందుకు సాగేందుకు ఉత్సాహపడుతూన్నవనే వార్తలు వస్తూన్నవి.
‘‘రాణీ! ఇక వెళ్ళక తప్పదు. ఈ దండయాత్ర కొరకై జూలియస్ సీజర్ తయారుచేసిన పథకాన్ని తూ.చ తప్పకుండా అనుసరిస్తాను. నాకు అనుమతి ఇవ్వు. నన్ను ఆశీర్వదించు- విజయంతో తిరిగి రావాలని..’’ అన్నాడు ఏంటనీ.
నిజంగానే ఏంటనీకి కొత్త భూభాగాలు జయించాలనే పట్టుదల వున్నదని ఆమె ఇపుడు నమ్మగలిగింది. ఎందుకంటే తనక్కూడా రాజ్యకాంక్ష ఉన్నది కాని, తనకుగాను ఎవరన్నా దాన్ని సంపాయించి ఇవ్వగల వీరుడు కావాలి. తాను భర్తగా పొందటమేగాక, అలాంటి వీరుణ్నికూడా పొందగలిగింది. అందుకని రుూసారి వియోగానికి ఆమె విచారించలేదు.
‘‘స్వామీ!’’ అన్నదామె. ‘‘మీకు తప్పక విజయం కలుగుతుంది. యుద్ధ్భూమిలో జాగ్రత్తగా ఉండండి. మీ మీద ఆధారపడిన నేనూ, పిల్లలూ ఉన్నామని గుర్తుంచుకోండి’’ అన్నదామె.
‘‘రాణీ! నిన్ను మరిచిపోతానా? ఈ ఈజిప్టు సామ్రాజ్యం ప్రపంచ సామ్రాజ్యంగా పరిణమింపజేసేందుకు వెనుకాడను!’’
ఈ మాటలకామె మురిసిపోయింది.
ఏంటనీ అసలు విషయాన్ని బైటపెట్టాడు.
‘‘ఈ దండదయాత్రకు ధనసహాయం కావాలిగా’’ అన్నాడను.
ఆమె పకపకా నవ్వింది. ఈ ప్రశ్నకు జవాబు పెళ్లినాడే ఆమె ఆలోచించి ఉంచింది.
‘‘ప్రభూ! టాలమీల కోశాగారాలు మీ సొత్తు. ఇలాంటి పర్షియన్ దండయాత్రలు నాలుగైదు ఒకేసారి జరిగినా, ఈజిప్టు భరించగలదు. నన్ను అడుగనేల? కావలసిన బంగారాన్ని ఓడలకు ఎత్తించండి’’ అన్నదామె.
మేరు పర్వతం లాంటి తన భార్యను చూసి ఏంటనీ, తాను కూడా ప్రపంచంలోకల్లా ధనవంతుడనే గర్వాన్ని పొందగలిగాడు. ఆమెను గౌరవంగా, గొప్పగా చూశాడు.
‘‘బహుశా మీరు పర్షియా నుంచి తిరిగి వచ్చేప్పటికి మీకు మరొక పుత్రుణ్ణి కంటాను’’ అన్నదామె కొంచెం సిగ్గుపడుతూ.
ఏంటనీ ఆనంద పారవశ్యంతో, క్లియోపాత్రాను బలిష్టమైన తన చేతులమీద గాల్లోకి ఎత్తాడు.
ఆమె భయపడింది.
‘‘రాణీ! నేనెంత గర్వపడుతున్నానో నీకు తెలియదు. ఒక మహావీరుణ్ణి కను.. నీ ప్రణయానుభూతిలో నన్ను నేనే మరిచిపోతున్నాను సుమా! అన్నాడు ఆమెను సున్నితంగా భూమి మీదికి దింపుతూ.
ఆ వియోగానికి ముందు రాత్రి ఉభయులూ వియోగాన్ని మరిచిపోగలిగినంత గాఢంగా తమ తమ ప్రేమలను వెలిబుచ్చుకున్నారు. అదే తమకు అంతిమ రాత్రనే ధోరణిలో సుఖించారు.
మర్నాడే అతను ధనరాశులతో సహా ఈజిప్టు విడిచాడు. సిరియాలోని సేనలు కూడా అతన్ని కలుసుకున్నవి. ఓడలమీది రోమన్ ఈజిప్షియన్ పతాకాలు ప్రపంచమే తమదన్నంత ధీమాతో నాట్యం చేస్తూండగా క్లియోపాత్రా కళ్లు మూసుకొని- సీజర్ స్వప్నాన్ని గుర్తుచేసుకోవటంలో నిమగ్నమైపోయింది.
***
అయితే, సీజర్ వేసిన పథకం తాలూకు పత్రాలు చేతుల్లో ఉన్నంత మాత్రాన ఏంటనీ సీజరవలేడు, అదీగాక ఆ పత్రాల ద్వారా సీజర్ మనస్సంతా అర్థమవదు. సీజర్ ఇది చాలా ప్రయాసతో కూడినదని ముందే గ్రహించి, ఈ దండయాత్రకు మూడేళ్ళు కేటాయించాడు. కాని ఏంటనీ చకచకా పనులు పూర్తిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
సీజర్ పథకం చూసేందుకేమీ, వినేందుకేమీ అద్భుతంగా ఉంటుంది. మానవుని ఊహలు ఎంతవరకూ ఎగబాకగలవో తెలుసుకోవచ్చు. కానీ సీజర్, ఊహలకు ఎంత తావిచ్చినా, సైన్యంలోని ప్రతి అణువునూ ఏ విధంగా ఉపయోగించాలో తెలిసినవాడు.
కీడెంచి మేలెంచే యోధుడాయన. కదనరంగంలో వేయి సూర్యుల కాంతితో ఏ మూల చూసినా తానే ఉన్నాననిపించగల సర్వ సమర్థుడు. ఆయన పతాకంకింద పోరాడటమంటేనే సైనికులకు ఉత్సాహం, ఉద్రేకం పొంగి పొర్లుతవి. తమను తాము మరచిపోయి, మృత్యుదేవతను కూడా ఆ మైకంలో ప్రియురాలనుకునేట్లు చేయగల శక్తిగలవాడు సీజర్. అందుకనే దిగ్విజయ యాత్రలు ఆయన సొత్తు అయినవి.
ఏంటనీ కూడా యోధుడే కాని, సీజరంతా ధైర్యసాహసాలూ, తెలివితేటలూ గలవాడు కాదు. కొన్ని యుద్ధాలలో సీజర్ శిక్షణనూ, ఆయన తెలివిగా శత్రువును ముట్టడించటాన్నీ నేర్చుకున్నాడు. ఐతే అంతమాత్రాన సీజర్‌వలె యుద్ధం చేయగల కౌశలం అతనిలో లేదు.
అసలు రుూ పర్షియన్ దండయాత్ర తన ప్రాణానికి ఎందుకొచ్చి పడిందా అని ఒక పక్క అతను బాధపడుతున్నాడు. చివరకు వెనుక్క వెళ్ళటం అవమానంగా భావించబట్టి ముందుకు సాగక తప్పలేదు. అతని మనస్సంతా అలెగ్జాంయ్రాలోని తన భార్యాబిడ్డలమీదా, అక్కడి స్వర్గ సౌఖ్యాలమీదనే ఉన్నది. కాళ్ళు మాత్రం బలాత్కారంగా పర్షియావైపు లాక్కువెళ్తూన్నవి. ఈ విధంగా పర్షియన్ యుద్ధంపట్ల అతని ఉత్సాహం సగం చచ్చింది.
పర్షియన్స్ యుద్ధ ప్రవీణులని విన్నాడు. మూకుమ్మడిగా రుూ సైన్యాన్ని పర్షియన్ సరిహద్దుల్లోకి లాక్కొనిపోతే, అక్కడ నలువైపులా తాను ముట్టడించబడటం- విజయం సంగతి ఎలా వున్నా- ముందు ప్రాణాలను దక్కించుకోవటమే ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే, పర్షియాను చూసినవారు కానీ, దాని నైసర్గిక స్వరూపం క్షుణ్ణంగా తెలిసినవారు కానీ తన సైన్యంలో లేరు. అదేమి తెలుసుకోకుండానే దేశం కాని దేశంలో ప్రవేశించి, బోనులో పడిన వన్యమృగంవలె దుస్థితిలో పడటం జరుగకుండా చూసుకోవాలి.
ఇందుకు పర్షియా పరిసర రాజ్యాల సహాయం అవసరం. ‘నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు’ అనే న్యాయాన్ని అనుసరించి ఏంటనీ, ఆర్మీనియా ప్రభువును ఆశ్రయించాడు. ఆర్మీనియాకు, పర్షియాకు చిరకాల శత్రుత్వమున్నది. అందుకని ఆర్మీనియా రాజు ఏంటనీ ఎటుగా వెళ్ళవలసిందీ ఏ విధంగా ముట్టడి చేయవలసిందీ చెప్పటమే గాక, కొంత సిబ్బందిని కూడా తోడు ఇచ్చాడు.
ఇంతవరకూ బాగానే వున్నది కాని- ప్రయాణం బొత్తిగా సాగటంలేదు. అంతా కొండలమయం, సరైన దారులు లేవు. కొంతదూరం వరకూ కొండ ఎక్కటం, ముందుకు దారి లేదని తెలుసుకొని వెనుక్క మళ్లటం అనేకసార్లు జరిగింది.
కొండ ప్రదేశాలు దాటితే బురద గుంటలూ, ఊబితో కూడిన అనారోగ్యకరమైన వాతావరణంలోని సరస్సుల మయమైన ప్రదేశం ఎదురైంది. దీన్ని దాటటమూ కష్టసాధ్యమే ఐంది. ఇది దాటితే చూపు మేర దూరంలో చెట్టంటూ లేని ఎడార్లు ఎదురైనవి. మంచినీళ్లకే మొహం వాచిపోయి, ఎండమావుల్తో మోసపోతూ, ఇసుక తుఫానుల్లో అనేక ప్రమాదాల్ని ఎదుర్కోవలసి వచ్చింది.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు