డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్షియన్ సరిహద్దుల్లోనూ, ఆర్మీనియాలోనూ తాను పడిన పాట్లన్నీ ఆమెకు విన్నవించుకొని, తన తప్పేమీ లేదని నచ్చచెప్పవలసిన దుర్భర పరిస్థితి ఉంటుందనుకున్నాడు. కాని ఆమె రుూ సంవత్సరంలోనూ గొప్ప విశేషాలేమీ జరగనట్లే, చాలా మామూలుగానే ఆనందంగానూ నవ్వుతూ ఎదురొచ్చేటప్పటికి ఏంటనీ ‘బతికా!’ననుకున్నాడు.
ఏంటనీ చాలా మారిపోయాడు. లావెక్కాడు. ఎక్కువగా తాగటంవల్ల పెద్ద పొట్ట కూడా వచ్చింది. కష్టాలు కడతేరిన సంతోషం మాత్రం అతనిలో కనిపిస్తోంది. ఏంటనీని చూడగానే ఆమెకు నిజంగా నవ్వొచ్చింది. నాటకాల్లో కేతిగాడి మొహం ఆమెకు గుర్తొచ్చింది. ఏమైతేనేం- తాను మనసారా ప్రేమంచిన ప్రియుడు, కాదు.. భర్త. తనకూ, తన పిల్లలకూ సంరక్షకుణ్ని, రోమన్ గద్ద బారినుంచి కాపాడుకున్నందుకు ఆమె మనోవేదన తగ్గి, మనసు తేలికయింది.
మరోసారి టాలమీల రాజభవనం ఆనందాతిరేకంతో మారుమ్రోగింది. ఏంటనీ పర్షియాలో ఉండగా, క్లియోపాత్రా అతనికొక మగశిశువును కన్నది. ఈ కొత్త జీవిని చూశాక, అతను రోమన్ తండ్రివలెనే సహజంగా గర్వపడ్డాడు.
ప్రపంచంలో అనేక తావుల్లో తాను పిల్లల్ని కన్నాడు. ఐతే, అటు ఏధెన్స్‌లో ఆక్టోవియా రక్షణలో వున్న సంతానమూ, ఇక్కడ క్లియోపాత్రా సంతానంమీదనే అతనికి మమత. ఈజిప్టులో ఉన్నన్నాళ్ళూ అతనికి క్లియోపాత్రాయే ఆరాధ్యదైవం, ఇలవేలుపు. ఆ కామదేవతను ఆరాధించటం మినహా తాను ప్రపంచంలో చేయదగినదంటూ లేదనే ధోరణిలో అతను ప్రవర్తిస్తున్నాడు. క్లియోపాత్రా చూపులకు ఆ శక్తి ఉన్నదనుకోవాలి!
ఇక్కడ ఈజిప్టుకు పాలనాధికారం ఏంటనీ చేతుల్లో ఉన్నది. రోమ్‌లో సర్వాధికార వర్గ సభ్యత్వమూ ఉన్నది. ఐతే, చరిత్రలో అతను పరిపూర్ణంగా ఈజిప్టుకూ అంకితమైపోలేదు. రోమన్‌గానూ నిలవలేదు. ఈ ద్వంద్వ జీవితానే్న గడుపుతున్నాడు. తాను ఏ పక్షమైపొయ్యేదీ ఇంకా నిశ్చయంగా తేలలేదు.
ఇప్పుడు క్లియోపాత్రా వయసు 34 ఏళ్ళు. నలుగురు బిడ్డల తల్లి. ఐనప్పటికీ ఆమె యవ్వనశోభ తగ్గలేదు. ఈనాటికీ పురుషత్వమంటూ వున్న పురుషణ్ణి చూపులతోనే రెచ్చగొట్టి, అతని బాధను చూసి గర్వపడే చిలిపితనం ఆమెలో కనిపిస్తుంది. ఆమెను చూస్తే వయసులో వున్న కన్య అనిపిస్తుంది.
ఏంటనీ వయస్సు యాభైకు దాపుల్లో వున్నది. అతను ముసలివాడైపోతున్నాడనుకున్నది క్లియోపాత్రా. ఐతే, సీజర్ అంత ముసలివాడు కాదు. మొత్తంమీద తమ దాంపత్యాన్ని చూసినవాళ్ళకు మాత్రం, ముసలిమొగుడూ- పడుచు పెళ్ళాం సామెత గుర్తుకురాక తప్పదు.
పూర్వంవలె ఏంటనీ విలాస జీవితాన్ని మాత్రమే కోరటం లేదు. రాత్రింబవళ్ళు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. క్లియోపాత్రా సమక్షంలో కూడా పరాకు చిత్తగిస్తున్నాడు. ఈ అన్య మనస్కతను ఆమె పసిగట్టింది. బహుశా తన భర్త పర్షియన్ దండయాత్రలో ఓడినందుకూ లోలోన కుమిలిపోతూండి ఉంటాడని ఆమె భావించింది. తన వీరత్వాన్ని రుజూ చేసుకునేందుకు ఈసారి చాలా పట్టుదలతో పర్షియా మీద దండెత్తే ఆలోచనలతోనే వేధించబడుతుండి ఉండాలని ఆమె గ్రహించింది.
అసలు ఆ విషయాన్ని ఎత్తుతే, మానుముఖం పట్టిన గాయాన్ని కెలికి, అతనికి బాధ కలిగించడవౌతుందని తాను ఊరుకున్నది. ఇప్పుడిక అతన్ని ఊరడించి, తిరిగి తగిన ప్రోత్సాహమివ్వకుంటే అంతరాత్మ బాధకు తట్టుకోలేని దుస్థితిలో పడతాడేమోనని అనుమానించిందామె.
అందుకని ఒకనాటి రాత్రి ‘‘ప్రియా! మీరెందుకో దిగులుగా ఉంటున్నారు. నేనుండగా మీకొచ్చిన కష్టమేమిటి? సగం ప్రపంచాన్ని కొనగలిగిన ధనరాశులు నా స్వాధీనంలో ఉన్నవని మీకు తెలుసు కదా! మీ విచారానికి కారణం చెప్పండి’’ అన్నదామె.
క్లియోపాత్రా తనస్థితిని గ్రహించిందని ఏంటనీ తెలుసుకున్నాడు. అతనికి నిజం చెప్పే సాహసం ఇంకా కలగలేదు.
భర్త ఏమీ మాట్లాడకుండటం చూసి ఆమె అన్నది: ‘‘నాకు తెలుసు- పర్షియన్ యుద్ధంలో అపజయాన్ని పొందానని మీరు బాధపడుతున్నారు. అంతమాత్రానికే కుంగిపోవాలా? నాకు తెలుసు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఈసారి పట్టుదలతో వెళ్లండి. విజయలక్ష్మి మిమ్ము తప్పక వరిస్తుంది’’.
క్లియోపాత్రా తన మనసులోని సంఘర్షణను అర్థం చేసుకోవవటమేకాకుండా, ఆవేదనకు ఉపశమననం కలిగించటమెలాగో కూడా తెలుసుకోగలిగినందుకు, నిజంగా ఈమె దగ్గర దైవశక్తులున్నవనే విశ్వాసం ఏంటనీలో పెంపొందింది. ఆమె తెలివికి అతను ఆశ్చర్యంతో మూగవోయాడు.
‘‘మీరింకా భయపడుతున్నది దేనికో నాకు అర్థం కావటంలేదు. నా సహాయం మీకు ఉంటుంది లేదా, అసలీ యుద్ధాలే మనకొద్దు, దురాశకు పోయి భంగపడటం కన్నా, ఉన్నదాన్ని అనుభవిస్తేనే సరిపోతుంది. మనకేం తక్కువ? చివరకు రోమ్‌ను కూడా మరిచిపోయి మనం హాయిగా బతకగలం. ఆలోచించండి’’ అన్నదామె.
తన హృదయాన్ని ఏ భాషలో ఆమెకు చెప్పాలో అర్థంగాక ఏంటనీ పిచ్చిగా ఆమె మొహంలోకి చూస్తూ ఊరుకున్నాడు.
‘‘నిజానికి మనకు సమస్యలేమున్నవి? ఒక్కటి ఆలోచించండి. మన జీవితాలకు అంత్య దశలు సమీపిస్తున్నవి. ఎంత జీవితాన్ని కళ్ళముందు తళుక్కున మెరిపించి కాలం పరువులెత్తిందో ఎన్నడన్నా ఆలోచించారా? బతికినన్నాళ్ళూ బతకబోతున్నామా? మీకెలా తోస్తూన్నదో కాని, నాకు మాత్రం ఈ ప్రపంచంలో మనం సాధించదగింది మన సుఖమేననే వేదాంతం వంటబట్టింది. మరీ మిమ్ము చూస్తుంటే, ఈ సంవత్సర కాలంలోనూ, కనీసం పది సంవత్సరాలు వయసు ముదిరిందనిపిస్తోంది. అందుకనే ఇక వున్నకొద్ది వ్యవధినీ మనం వృథా చేసుకోకూడదని తోచింది. అందుకని-’’
ఏంటనీ గ్రహించాడు. క్లియోపాత్రా తనను ఎటు మళ్లిస్తుందో? అందుకనే అతను ఆమె మాటలకు అడ్డుపడి, ‘‘ప్రియా! బతుకులు తెల్లవారే వేళ అవుతోందనే నాకూ తోస్తోంది. అందుకే కీర్తి ప్రతిష్ఠలు జీవిత చరిత్రకు మెరుగుపెట్టే పనులేమీ చేయలేకపొయ్యానేనన్న బాధ నన్ను పీడిస్తోంది’’ అన్నాడు.
‘‘మీకా ఓపిక, పట్టుదలా వుంటే ఎవరు కాదన్నారు? ఎవరు అడ్డగలరు?’’ అన్నదామె ఉత్సాహంతో.
‘‘రాణీ! తిరిగి నీ సహాయాన్ని అర్థించేందుకు సిగ్గుపడుతున్నాను. కానీ నాకు నీకన్నా ఎవరున్నారు చెప్పు! ఈ ఎండాకాలంలో తిరిగి పర్షియన్ దండయాత్రకు నాకు అనుమతివ్వు’’ అన్నాడు ఏంటనీ.
ఏంటనీ పొరపాటున విజయుడైతే తన చేతుల్లోనుంచి జారిపోతాడనే భయం ఆమెకున్నది. ఐతే, తాను నిరుత్సాహపరిచినట్లయితే అతనసలు మనిషిగా కూడా బతకలేడనీ, దుర్భర వేదనకు గురవుతాడనీ తెలుసు. కనుక ఎక్కువగా చర్చిందుకు ఇష్టపడలేదామె. అదీగాక ఇంతకుముందే, ఇప్పుడు ఏంటనీ కోరబోయే కోర్కెలు తీరుస్తానని కూడా వాగ్దానం చేసింది.
‘‘నా అనుమతేంటి ప్రభూ! ఈజిప్టు అంతా మీదనే అనేకసార్లు మనవి చేశాను. మీరు నా దగ్గర సిగ్గుపడటమేమిటి? మనిద్దరం ఒకటిగానే బతకాలని నేను వాంఛిస్తున్నాను. మీరేమో నాతో విడివడి, మీ అనుభూతులకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు కదూ?’’ అన్నదామె.
‘‘కాదు- రాణీ! కాదు! నన్ను అపార్థం చేసుకోకు. నిజానికి నాలో రాజ్యకాంక్ష లేదు. ఆ సంగతి నీకూ తెలుసు. అంతమాత్రాన కూర్చొని, సుఖపడటమే పరమావధిగా కూడా చూసుకోలేను. నేను కూడా ఒక వీరుణ్ణనీ, యుద్ధ కౌశలమనేదాన్ని నేనూ ఎరుగుదుననీ రుూ ప్రపంచానికి రుజూ చేయాలి. నేను జయించే దేశాలన్నీ నీ కొరకే కదా!’’ అన్నాడతను.
క్లియోపాత్రా తిరిగి కాస్త మైకంలో పడింది. సీజర్ స్వప్నంలో కొంత భాగమన్నా నిజవౌగాక! అనుకున్నది.

- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు