డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ బావ ఎన్ని మాటలన్నా వేళాకోళంగానే అన్నాడు లెమ్మని నీవనుకొంటే అనుకొని ఉండొచ్చు. కానీ, నన్ను ప్రాచ్యదేశాల మహారాణిని పట్టుకొని ‘వ్యభిచారిణి’ ‘కులట’ అన్నాడు. ఏంటనీ! నేను నీ భార్యను. భార్యకు జరిగే అవమానాన్ని సైతం భరించే భర్త. ఒక పురుషుడా? ఆడదానె్నక్కడో దూరదేశాల్లో బహిరంగంగా కులట అనే సాహసం వాడికున్నదా? చివరకు తన పెంపుడు తండ్రికి ప్రాణంలో ప్రాణంగా గడిపిన నన్ను మాతృసమానను గౌరవించటం ఇదేనా? ముసలితనంలో మతి చలించి తన వంశకుడని వీణ్ని, తనకు వారసుడుగా వీలునామాలో సీజర్ పేర్కొన్నాడు. కానీ, తనకు నిజపుత్రుడైన సీజర్ టాలమీ ఆయనకా సమయంలో గుర్తు రాలేదు. మగపురుగులు ఎంత విశ్వాసహీనులో ఇంతకన్నా గొప్ప తార్కాణం అనవసరం. ఈనాడు నేను నీక్కూడా కులటగానే కనిపిస్తున్నానా? నీ భార్య గౌరవమర్యాదల్ని కూడా కాపాడలేనివాడిని ఏ అడవిలోకో పోయి తపస్సు చేసుకోక, ఇక్కడ రొమ్ములు విరుచుకొని తిరుగుతానంటావా? ఏంటనీ నీ మూతిమీద మీసమున్నదని గర్విస్తున్నావు కాబోలు! పిల్లిక్కూడా మీసాలుంటవని గుర్తుంచుకో. అయితే మగపిల్లి తన భార్య అయిన ఆడపిల్లిని, మరో మగపిల్లి కనె్నత్తి చూస్తే సహించదు! అంతే తేడా!’’
ఏంటనీ రక్తంలో కొత్తగా ప్రవేశించిన వేడికి అతను తట్టుకోలేక పోతున్నాడు. మొహమంతా ఎర్రబడింది.
‘‘బహుశా అక్కడ నీ భార్య ఆక్టోవియా మహా పతివ్రతగా ప్రసిద్ధికెక్కింది కనుక. ఆమెతో పోలుస్తే నేను కులటననే అనుకుంటున్నావా?’’ అన్నది క్లియోపాత్రా.
‘‘రాణీ!’’ అన్నాడు నిప్పులు చెరిగే కంఠస్వరంతో ఏంటని. ‘‘నేను నిన్ను పల్లెత్తుమాట అనలేదు. నా భార్యవైనందుకు గర్విస్తున్నాను....’’
‘‘నీవు అనలేదు! అదేనా నీ సంజాయిషీ? కానీ, ఇతరులు అంటూంటే విని ఊరుకుంటున్నావు? ఇతరుల అభిప్రాయాలను అందునా ఆక్టోవియన్‌లాంటి బాధ్యత గలిగిన వ్యక్తి మాటల్ని అంగీకరిస్తున్నావు?’’
‘‘నేను అంగీకరించలేదు!’’ అని అరిచాడతను.
‘‘ఆ మాటల్ని ఖండించకుండటమే అంగీకరించటం!’’ అన్నదామె.
అది సరైన అభిప్రాయం కాదనే ధైర్యం ఏంటనీలో లేదిప్పుడు.
‘‘ఏంటనీ! ఒకవేళ నేను నిజంగా కులటననే నీ అభిప్రాయం కూడా ఐతే, అందుకో బాకు- దీనితో నన్ను చంపేసేయ్!’’ అన్నదామె బాకును అందిస్తూ.
ఏంటనీ తెల్లబోతున్నాడు. క్లియోపాత్రా ఎంత మనోవేదనను అనుభవిస్తూండి ఉంటుందో అతనికి అర్థవౌతోంది. ఆమె అభిమానవతి కనుకనే ప్రాణంకన్నా మానమే ఎక్కువని రుజూచేస్తున్నది.
తొందరపడి తనను తాను పొడుచుకుంటుందేమోనని కూడా ఏంటనీ భయపడ్డాడు. చప్పున ఆమె చేతుల్లో బాకును లాక్కొని,, దూరంగా పారేశాడు.
‘‘రాణీ! నామీద ఎందుకీ నిందలన్నీ మోపుతావు? ఆక్టోవియన్ అన్నమాటలకు నేను కూడా కుమిలిపోతున్నాను..’’ అన్నాడు.
‘‘ఔనౌను. నీ ముఖకళను బట్టి నేనంతా గ్రహించగలుగుతున్నాను. ఏంటనీ! నీవు నన్ను గాఢంగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావని పొరబడ్డాను. ప్రేమకు గీటురాయి ఈర్ష్య, నీకు ప్రేమే ఉన్నట్లయితే, నీవు ప్రేమించిన వ్యక్తిని నీచపరిచేవారిని ఎందుకు అసహ్యించుకోవు? స్వాభిమానమంటూ నీలో వున్నదా! అది ఉంటేనే కాని, అవమానమనేదాన్ని గ్రహించలేవు. ఈనాడు నీవు అంతా విని కూడా శిలాప్రతిమలాగు నిలబడిపోయావంటే, నేనేమనుకోవాలి? నిన్ను భర్తగా చెప్పుకునేందుక్కూడా సిగ్గుపడవలసిన పరిస్థితిలో నేనున్నాను!’’
‘‘రాణీ! నేనంతా కనుక్కుంటాను. ప్రతీకారం చేయకుండా ఊరుకోను’’ అన్నాడు ఏంటనీ.
‘‘పాపం! నీకెందుకా శ్రమా? ఏనాటికైనా రోమ్ వేరు, ఈజిప్టు వేరూనూ. రోమ్! విలాసాలకూ, రాజకీయాలకూ, కృత్రిమ జీవనానికీ, వైరాలకూ, నీచాతినీచంగా ప్రవర్తించేందుకూ, నీతి నియమాల అతిక్రమణలకూ సుప్రసిద్ధి చెందిన రోమ్! అయితే, అక్కడ రుూ రోమన్‌లను మేపిందెవరు? ఇటలీలోని అగ్ని పర్వతాలు, గంధకమూనా? ఈజిప్టే లేనట్లయితే ధాన్యం ఎక్కడిది? ఈజిప్టునుంచి ధనమే రానట్లయితే, రోమన్ ప్రభుత్వం ఎలా నడిచేది? పాడి ఆవులాటి ఈజిప్టును పిండుకొని తిన్న రోమ్ రుూనాడు పాలు తాగి, పొదుగును గుద్దినట్లు ప్రవర్తించింది! ఈజిప్టుతో స్నేహంగా ఉంటున్నట్లే నటిస్తూ, రుూనాడు కత్తికట్టింది. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకొని తినేందుకు సిద్ధపడింది. ఇదీ రోమన్ న్యాయం.. ఈ న్యాయాన్ని రోమన్‌వైన నీవు కూడా అంగీకరిస్తున్నట్లు నమ్మవలసి వస్తోంది. ఏనాటికైనా మీరు మీరూ ఒకటే, ఈజిప్టే పరాయిది. కుక్కకున్న మాత్రం విశ్వాసం కూడా లేకుండా నన్ను అవమానించిన ఆక్టోవియన్ ఇంకా సజీవుడుగా సవాళ్ళు విసురుతూంటే, చేతకాని దద్దమ్మలాంటి మొగుణ్ని పెట్టుకొని భరిస్తూ, బాధపడుతూండాలని విధి నాకు నిర్ణయించిందా?
‘‘రాణీ! నేను ఊరికనే ఉన్నానని భ్రమపడుతున్నావ్!’’
‘‘నా కళ్ళను నేనే నమ్మకుండా ఉండాలని నీవు కోరుకుంటున్నట్లున్నావ్. ఐనా సుఖాలను మరిగినవాడివి, ఈ వయసులో నీకు యుద్ధాలు దేనికి? విరోధాలెందుకు? హాయిగా రుూ రాజ భవనంలో మధుపానం చేసిన మత్తులో రుూ పాడు ప్రపంచానే్న మరిచిపోగలిగిన వేదాంతిగా తయారైనావ్! అయితే, నేను ఆడదాన్నయినా, నాకూ మానాభిమానాలున్నవి. నీవు ఇక్కడే ఉండు, నేనే యుద్ధ్భూమికి వెళ్తాను. ఆక్టోవియన్‌ను ఎదుర్కొంటాను. గెలిచానా సరే! ఓడానా, నా ప్రాణాలను అక్కడి యుద్ధరంగానికే అర్పిస్తాను. కనీసం మానవతినన్నా అవుతాను. నా గౌరవాన్ని నీవు కాపాడలేని దుస్థితిలో ఉన్నప్పటికీ, నేను కాపాడుకొనే తీరాలి కదా!’’ అన్నదామె.
‘‘రాణీ! తొందరపడకు. నేను రోమ్ వెళ్ళి..’’
పకపకా నవ్విందామె.
‘‘రోమ్ వెళ్ళు! ఇదే మంచి సమయం! సర్వాధికార వర్గ సమావేశంలోని సభ్యుల్ని చాలామందిని ఆక్టోవియన్ లంచాలతో లోబరచుకున్నాడని విన్నావు కదా! తమరు రోమ్ జేరేలోగా, మిగతావారిని కూడా తన పక్షానికి లాక్కుంటాడతను. లేదా సమావేశం నాడు ఆయుధాలతో సిద్ధపడి, అవసరమైతే, ప్రతిపక్షీయులమీద విరుచుకుపడి, రక్తప్రవాహాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినవని వినలేదా? ఆ కత్తులు నీ కొరకు రోమ్‌లో ఎదురుచూస్తున్నవి. సర్వాధికార సమావేశ భవనంలో మహనీయుడు సీజర్ రక్తం ఇంకా పూర్తిగా ఇంకిపోలేదు. దాంతోపాటు ఆయన శిష్యుడివైనందుకు నీ రక్తం కూడా కలుస్తే నేలమీద రంగు మరికొంత కాలంపాటు కాంతివతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సీజర్‌ను చంపిన కత్తులింకా పదునుగానే ఉన్నవి. అప్పుడు నీకు ఈ యుద్ధాలు చేయవలసిన శ్రమ ఉండదు. నీ సమస్యలన్నీ తీరిపోతని.. కాని, ఒక సలహా విను! చచ్చేందుకు రోమ్‌దాకా వెళ్ళటం దేనికి? ఇక్కడ, ఈజిప్టులో కూడా అంతకన్నా హాయిగా, తేలిగ్గా ప్రాణాల్ని పోగొట్టుకొనే మార్గాలున్నవి. ఈ పని ఇక్కడే చేస్తే, నీ సమస్యల్ని నీవు తీర్చుకోవటమేగాక, మీ బావగారు ఆక్టోవియన్ సమస్యల్ని కూడా పరిష్కరించి పెట్టినవాడవౌతావు. అపుడు అతను నీ శవానికి వందనాలర్పించి, నీ అంత్యక్రియలను బ్రహ్మాండంగా జరుపుతాడు. అవమానపడి రోమ్ వెళ్లటంకన్నా సజీవిగా, దేశద్రోహిగా రోమ్‌ల సమక్షంలో నిలబడి తట్టుకోవటంకన్నా, విగతజీవిగా, వీరుడుగా, దేశభక్తుడుగా, రాజబంధువుగా సకల మర్యాదల్ని పొందటం మంచిది.. ఇంతకన్నా అడ్డతోవ మరి ఉండదు! కొత్తగా కీర్తి సంపాయించలేదని అధైర్యపడే నీవు, లోగడ ఉన్నదాన్నన్నా రక్షించుకోగలుగుతావు!’’ అన్నదామె.

- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు