డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్టోవియన్ తనను గూర్చి విమర్శించినదానికే మనసులో మంటలు మండుతూన్నవి అతనికి. ఆ అగ్నికి రుూ క్లియోపాత్రా వాయువుగా తయారైంది. పుల్వియా తనను సరిగ్గా ఏ పరిస్థితిలో ఇరుకులోకి లాగిందో, రుూమె కూడా అదేవిధంగా చేసింది. కాకపోతే ఇక్కడ తగిన కారణం ఉన్నది- అంతే తేడా!
‘‘రాణీ! నా సమర్థతను చూపుతాను గాక! అయితే, రోమ్ మీద యుద్ధాన్ని ప్రకటించమంటావా?’’ అన్నాడు ఆమె సలహాను పొందేందుకు సిద్ధపడిన ధోరణిలో.
‘‘అది నీ ఇష్టం! దేశద్రోహిగా ఇక్కడే ఉండిపోతావో, లేక నానా మాటలూ అన్న ఆక్టోవియన్‌ను శిక్షించగలుగుతావో నీవే తేల్చుకో. నీ దేశం మీద తిరగబడమని పరదేశస్థురాలిని నేను చెపితే ఏం సబబు?.. రేపు ఏదైనా తారుమారైతే, ఇదంతా నా సలహా అని నీవు సరిపెట్టుకొని, నన్ను నిందిస్తావు. రాజ్యాంగ విధానాలు తెలిసినవాడివి. ఆర్మీనియా, మెడియాలను నిన్నగాక మొన్న జయించినవాడివి. నీ సమర్థతేమిటో నేను వేరుగా చెప్పాలా? సహించి ఊరుకునేందుకు నీవు అసమర్థుడివన్నా కావాలి లేక సర్వసంగ పరిత్యాగివన్నా కావాలి. ఈ రెంటిలో నీ స్థానం ఏమిటో నీవే నిర్ణయించుకో!’’ అన్నదామె.
‘‘రాణీ! నన్నింకా అవమానించి బాధపెట్టకు. నీవు మంచి సలహా చెప్తావని నాకు ధైర్యం ఉన్నది!’’అన్నాడతను.
ఆమె మళ్లీ కోపావేశంతో అన్నది. ‘‘నేను నిన్ను అవమానించినా, మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్నట్లున్నది! ఈనాడు ఆడదాని సలహాలను తీసుకునేటంత అసమర్థుడివా ఏంటనీ? బహుశా ఈ యుద్ధం జరిగితే, ఓడిపోతాననే పిరికితనం ఉన్నట్లున్నది, ఔనా?’’
‘‘ఎప్పటికీ కాదు; నేను పిరికివాణ్నా? ఎన్ని యుద్ధాలు గెలిచానో చరిత్ర చెప్పదా? ఆక్టోవియన్‌లాగ, ప్రియురాండ్ర వెనుక దాక్కొని, యుద్ధంలో గెలిచామని సేనానులు ప్రకటించాక, ఆ గౌరవాన్ని పొందేందుకు బైటికొచ్చే దద్దమ్మనననుకున్నావా? ఏంటనీ దూరదేశాలలో ఉన్నాడని అతన్ని గూర్చి ఆక్టోవియన్ వేసిన అంచనాలు ఎంత పొరబాటైనవో చూపిస్తాను.. నా భార్యను అవమానించినందుకు వాడి నాలుకను ఖండ ఖండాలుగా తుంచివేస్తాను. రాణీ! వాడి రక్తంతో నీ శిరోజాలను ముడివేస్తాను. రోమ్ నా దేశమనే అభిమానంతో ఇంతసేపూ ఆలోచించాను.. కాని, నా దేశమే నన్ను అగౌరవిస్తే, అలాంటి దేశమే నాకు అక్కర్లేదు!’’ అన్నాడు ఏంటనీ.
ఎలాగో ఏంటనీని దారికి లాక్కొచ్చాను కదానని క్లియోపాత్రా మనస్సు తేలిక పడింది. మరికొంచెం కారం తగిలిస్తే కాని ఏంటనీ మనిషిగా ఉండేందుకు వీల్లేదని ఆమెకు తెలుసు.
‘‘ఏంటనీ! ఆక్టోవియన్ మనిద్దర్నీ ఒకటిగా చేసి, రోమ్‌కు మనను విరోధులుగా చూపిస్తున్నాడు కనుక నీ సమస్యలకు మరో సూక్ష్మమార్గం కూడా వున్నది’’ అన్నదామె.
‘‘ఏమిటది?’’
‘‘ఏంలేదు.. నన్ను బందీగా రోమ్‌కు పంపు. ఈజిప్టును ఆక్రమించుకునేందుకు ఈ ప్రణయ కలాపం జరిపాననీ, అనవసర యుద్ధాలు జరగకుండా మోసంతో సాధించాననీ చెప్పు, అప్పుడు ఆక్టోవియన్ ఆట కడుతుంది. ఈజిప్టును జయించి, రోమన్ సామ్రాజ్యంలో కలిపిన కీర్తి నీకు దక్కుతుంది. నీకన్నా దేశభక్తుడైన రోమన్ వీరుడు మరొకడు ఉండేందుకు వీలుండదు’’ అన్నదామె.
ఏంటనీ కరిగిపొయ్యాడు. మోకరించాడతను. కళ్ళ వెంట నీరుకారుతూన్నది!
‘‘రాణీ! నేనంత నీచుణ్ణనుకున్నావా? నా భార్య బిడ్డల్ని బందీలుగా చేసి కీర్తిపొందేటంత హీనుణ్ణనుకున్నవా? నీకు నా మీద నా ప్రేమ మీద నమ్మకం లేకపోతే నేను చేసేదేం లేదు.. కాని, ప్రాచ్య దేశాల పరిపాలనకు రాబోయే ముందే నేనొక వీలునామాను వ్రాసి, రోమ్‌లోని దేవాలయంలో భద్రపరిచాను. నా మరణానంతరం అది చదవబడినపుడు, ఏంటనీ హృదయమేమిటో నీకు అర్థం కాగలదు.. పోతే, నేను నీకు అంకితమైపోయాను రాణీ! నిజం చెపుతున్నాను. ఈనాడు రోమ్ నాకు పరరాజ్యంగానూ, ఈజిప్టు స్వదేశంగానూ తోస్తూన్నది. నీవు లేనిదే నేను బతకలేనని కూడా తేల్చుకున్నాను. చివరకు ఈ కష్ట సమయంలో కూడా నీవు నన్ను వివాహమాడినందుకు కృతజ్ఞుణ్ని. రాణీ! నా బొందిలో ప్రాణమున్నంవరకూ, నేను నీ వాణ్నేనని గుర్తుంచుకో!’’ అన్నాడు ఏంటనీ.
‘‘నావాడివైతే నన్నూ, నా దేశాన్ని, నా సంతానాన్ని ఆక్టోవియన్ విషవలయం నుంచి కాపాడేందుకు నడుం బిగించు’’ అన్నదామె.
ఏంటనీ మోకరించి ఉన్నవాడు, మోకాళ్ళమీద ముందుకు జరిగి తన విశ్వాసాన్ని సూచించేందుకు ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నాడు.
‘‘ఏంటనీ! విజయం మనదే అవుతుంది. నీవు వేరొక ఆలోచనకు దారి ఇవ్వొద్దు. ఆక్టోవియన్ మనిద్దర్నీ నాశనం చేసేందుకు కొత్త సైన్యాలను సమకూర్చుకుంటున్నాడని నీకు తెలుసు కదా! ఐతే, అతను తన సైన్యాలకు వేతనాలివ్వలేదు. మనమంటామా- టాలమీల కోశాగారాలు అక్షయాలు. కనుక సైనికులందరూ మననే ఆశ్రయిస్తారు. ఇక్కడ ఈజిప్షియన్ సేనలేమి, నౌకాదళమేమి, మనది. ప్రాచ్య దేశాల పరిపాలనార్థం నీ ఆధీనంలో వున్న సిరియాలోని ఈ సైన్యాలూ, ఇక్కడ ఈజిప్టులో ఉన్న రోమన్ సైన్యాలూ మనవి. ఐనప్పుడు ఆక్టోవియన్ గెలవటం ఒక లెక్కలోది కాదు. పర్షియన్ దండయాత్ర కోసం శిక్షణను పొందుతూన్న సైనిక బలాన్నంతా పశ్చిమానికి తిప్పవచ్చు’’ అన్నదామె.
‘‘రాణీ! వెంటనే యుద్ధం ప్రకటిద్దామంటావా?’’ అన్నాడు ఏంటనీ తనకింకా కొద్ది సందేహమున్నదని సూచిస్తూన్న ధోరణిలో.
‘‘కాక?.. ఈ యుద్ధాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఆక్టోవియన్ మన మీద తెలివిగా పడేశాడు. కాని, పరోక్షంగా కయ్యానికి ముందు కాలు దువ్విందెవరు? ఒకవేళ ఆక్టోవియన్ రణరంగమంటే భయం కనుక, అతను ఇంత దూరం వస్తుందని అనుమానించకపోయి ఉండొచ్చు. కాని, తాచుపామును చూడకుండా తొక్కినప్పటికీ, దానికి హాని కలిగింది కనుక, అది పగబూని, తన శత్రువును చంపక మానదు. నిజానికి మనం చేయబోయ్యే యుద్ధం సర్వరక్షణార్థం, ఆత్మాభిమానాన్ని కాపాడుకొనేందుకే కాని, రోమన్ సామ్రాజ్య దురాక్రమణకు కాదు కదా! నీకు రోమ్‌లో కూడా ఇంకా స్థానమున్నదనీ, దేశం కోసం నానా అగాచాట్లూ పడిన నిన్ను రోమ్ మరిచిపోయి, దూషించిన నేరానికిగాను, నీ గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం ఈ యుద్ధం జరుగుతోందనీ ప్రకటిద్దాం. రోమ్ పాలన కూడా మనకు అవసరం లేదు. ప్రపంచ చరిత్రలో మన వ్యక్తిత్వాలను నిలదొక్కుకుంటే అదే పదివేలు!’’ అన్నదామె.
‘‘కాని, ఈ కారణాలే చాలునంటావా రాణీ? నేను అనుకోవటం ఆక్టోవియన్ నోరుజారినందుకు ఈసరికి పశ్చాత్తాపపడి, నాతో మళ్లీ సంధి చేసుకుంటాడని. ఎందుకంటే, మన సేనల తాకిడికి తట్టుకోలేనని అతనికీ తెలుసు. రేపు చిన్నవాడైన ఆక్టోవియన్ చేసిన పొరపాట్లను సరిదిద్దవలసిన నేనే, స్వదేశం మీదికి దండయాత్ర సాగించానని నలుగురూ ఆడిపోసుకుంటారు. అంతర్యుద్ధాలు అంతమైనవనుకునే ప్రజలతో, ఈ సమరాన్ని జరిపి, వారి మీదికి వొత్తిడి తీసుకొని వచ్చినందుకు నన్ను ఏ విధంగా చూస్తారో ఆలోచించు. రోమన్ పరిపాలనలోనేమి రాజకీయాల్లోనేమి, నేనూ, ఆక్టోవియన్ ప్రధాన పాత్రధారులమే ఐనప్పటికీ, సర్వమూ మా చేతుల్లోనే లేదని, ప్రజాస్వామ్యమనేది ఇంకా ఉండడంవల్ల రోమ్ భవిష్యత్తునూ, మా భవిష్యత్తునూ నిర్ణయించేందుకు సర్వాధికార వర్గమంటూ ఉన్నదనీ గుర్తుంచుకోవాలి. ఇపుడు సర్వాధికార వర్గంలో నాకున్న మిత్రులు కూడా, నేనే యుద్ధానికి తొడ కొడితే, వారికి రోమ్ పక్షానికి మారక తప్పదు. ఈ విధంగా రోమన్ ప్రభుత్వమంతా నాకు విరోధవౌతుంది. ప్రజలందరూ నన్ను అసహ్యించుకుంటారు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు