డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిచ్చిగా ప్రలాపించే ఏంటనీని ‘‘ఆగు.. ఏంటనీ! ఈనాడు నాలుక చాలా పదునెక్కినట్లున్నది. ఇదంతా నా స్వార్థమేనా? నీవల్ల నేనేదో సుఖపడిపొయ్యానని, నేనేదో నీకు లేకుండా పుంజుకున్నానని ఎందుకనుకుంటున్నావు? నేను దెయ్యన్నా? ప్రణయమని మోసగించి, హాయిగా అలెగ్జాండ్రియాలో ఉన్నదాన్ని దేశంకాని దేశానికి తరలించుకొని వచ్చి, నన్నిక్కడ సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్న నీదా మోసం? లేక నా సర్వస్వాన్నీ నీ క్షేమం కొరకు అర్పించిన నాదా మోసం? నేను ఆక్టోవియాకు విడాకులిమ్మన్నానా? నిన్ను రోమ్ వెళ్ళొద్దన్నానా? ఏడుస్తూ ఈ యుద్ధం చేయమన్నానా?.. నిన్ను జేరనివ్వకుండా ఉంటే నేనెంత హాయిగా ఉండేదాన్నో ఆలోచించు.
ఈజిప్టుకూ రోమ్‌కూ వున్న మైత్రి చెడేదా? పూర్వం వలెనే రోమ్‌తో వ్యాపారాన్ని సాగిస్తూండేదాన్ని. ఇక రోమ్ అంటావా- అక్కడ ఎవరు సర్వాధికారైనా నాకు ఒక్కటే! ఒకళ్ళు వొరిగించేదీ, మరొకరు వొరిగించందీ ఏం ఉన్నది? ఎటూ కాకుండా అన్యాయంగా చెడిపోతున్నావని దయతలచి, లేనిపోని విరోధాన్ని ఆక్టోవియన్‌తో నేను కొనితెచ్చుకున్నాను!’’ అన్నదామె.
అమితోద్రేకంతో మాట్లాడటంవల్ల, ఆయాసంతో ఆమె రొమ్ములు సముద్ర తరంగాలను గుర్తుకుతెస్తూన్నవి.
‘‘ఎంత టెక్కులాడివి రాణీ! ఏరోటికా పాట పాడి, ఏ ఎండకా గొడుగు పట్టగల వాక్చాతుర్యంతో నన్నింకా మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నావా? నా కోసమై నీవు చెడిపోయావా? ఈనాటికీ నీవు రాణివి! నేనో- ఈ యుద్ధంలో ఓడితే, భూమిమీద నాకు నిలిచేందుకు నీడన్నా ఉండదు. నీవు మాత్రం నా శవాన్ని సముద్రంలోని చేపలకు విందుగా పారేయించి, హాయిగా ఈజిప్టు రాణిగానే వెళ్తావు. నీ రుూ ఆటలు సాగినన్నాళ్ళూ సాగినవి. ఇక సాగవు!’’
‘‘నీకు మతిపోయింది ఏంటనీ! నీ ఆలోచనలు పనిచేయటం లేదు!’’ అన్నదామె. ముందు అతన్ని వాగ్యుద్ధంలోకి దింపుతే తప్ప నచ్చచెప్పటం సాధ్యంకాదనే సత్యాన్ని గ్రహించి.
‘‘ఏనాడైతే నీ వలలో చిక్కుకున్నానో, ఆనాడే నా బుర్ర పనిచేయటం మానింది. ఆ మెదడు మళ్లీ తన ఆలోచనల్ని సాగిస్తుందేమోనని భయపడి. దానికి మధువు పోశావు. నిజానికి నా బుర్రలోని మరలు తుప్పుట్టినయ్.. రాణీ! నాకు ఆలోచనలనేవి మరి రావని పొరబడ్డావ్! ఎందుకంటే నీ ఆలోచనలే నా ఆలోచనలుగా చెలామణి కాగలవని భ్రమపడ్డావ్! సాగినంతకాలం అలాగే సాగింది. కాని..’’
మాట మధ్యలోనే అందుకున్నదామె.
‘‘ఈనాడు నీ అసమర్థతకు నన్ను ఆడిపోసుకుంటావ్ దేనికి? .. నన్ను ప్రేమించమని నిన్ను ప్రార్థించానా? రెండోసారి మనం సిరియాలో కలుసుకున్నపుడు, కుక్క తన యజమాని కాళ్ళను చుట్టుకున్న విధంగా నన్ను ప్రాధేయపడి పెళ్ళాడావు. నేనొక్కతినే సుఖపడ్డానా? నీవేమి సుఖపడలేదా? ఈనాడు చాలా చిత్రంగా మాట్లాడుతున్నావ్’’
‘‘సుఖం! అది సుఖమని భ్రమించాను. లేక నిజంగానే సుఖపడ్డానేమో? కాని, ఆ సుఖంలో నేను మాతృదేశానికే ద్రోహం చేశాను. విశ్వాసానికి కృతఘు్నడనయ్యాను. అధఃపతితుడనయ్యాను. వ్యక్తిత్వాన్ని కోల్పోయాను. ఆ వెధవ సుఖమే లేకుంటే, లోకోత్తర చరితుణ్ణయేవాణ్ణి కదా! కనీసం మానవుడుగానన్నా బతికగలిగేవాణ్ణి కదా?’’’
‘‘అలాగా! ఆనాడు దేవతా సుఖాలను అనుభవించి, ఈనాడు అంతా తీరిపొయ్యాక వాటిని ఏవగించుకుంటున్నావ్- అది సహజమే మరి! కాని, ఏంటనీ! నామీద పడి ఏడుస్తే ఏం ప్రయోజనం? ఈనాటికీ మించిపోయిందేమీ లేదు. వెళ్లి ఆక్టోవియన్ కాళ్ళమీద పడి, క్షమించమని ప్రార్థించు. తిరిగి ఆక్టోవియాను ఏలుకుంటానని రోమ్‌లో నగారా వాయించు. మాతృదేశానికి ద్రోహం చేసినందుకు అందరూ మొహాన ఉమ్మివేస్తే, తుడుచుకో. తిరిగి సర్వాధికార వర్గంలోకి ఎన్నిక అవు. ఆ తరువాత నీ చరిత్రలో తెగిపోయిన చోటునుంచి తిరిగి అల్లిక సాగించు. నా దారిన నేను పోతాను!’’
‘‘ఔను.. ఈ యమయాతనను అనుభవించటంకన్నా, అదే మేలు!’’ అన్నాడతను.
‘‘సరే అలాగే చెయ్! చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు మరికొన్ని తప్పులు చెయ్. అసలీ రోమన్‌లను నమ్మటంకన్నా పెద్ద పొరపాబాటేమిటి? సీజర్‌ను నమ్మినందుకు ఆయన శిక్షించాడు. ఇక నిన్ను నమ్మినందుకు, ఇక్కడ నన్ను ఒంటరిగా వొదిలి, తిరిగి నీ దేశం వెళ్తానని అంటున్నావు. అయినా నేను ఇంతకన్నా చెడేదేమిటి? ప్రేమడోలికల్లోని అనుభవమంతా నీకు బాధగా తోస్తోందీనాడు. కాని,, నేను ఆ అనుభవాన్ని తృణీకరించలేను. ఒకవేళ ఆ అనుభవానికి జరిమానా చెల్లించవలసి వుంటే, నవ్వుతూ చెల్లిస్తాను. నీలాగ పిరికిపందనుగాను! మరొకరిమీద పడి ఏడవను!’’ అన్నదామె.
‘‘నిన్ను కులటగా ఆక్టోవియన్ ప్రచారం చేశాడు. ఆనాడైతే నేను నమ్మలేకపొయ్యాను. కాని, ఈనాడు నీవు కులటవు మాత్రమే కాదు రాక్షసివి కూడానని నమ్ముతున్నాను’’ అన్నాడు ఏంటనీ. అశాంతితో నేలను మోదుతూ.
‘‘జాగ్రత్తగా మాట్లాడు ఏంటనీ! నీకు ప్రణయభిక్ష పెట్టింది ఎవరనుకున్నావ్! ఈజిప్టు రాణిని పట్టుకొని, నీ భార్యననే అలుసుతో నీ ఇష్టానుసారం మాట్లాడితే, నీ నాలుక చీల్పిస్తాను- వొళ్ళు దగ్గరుంచుకో!’’ అన్నదామె, అగ్నికణాలవలె ఉన్న కళ్ళతో.
ఆడది తనను ఇంతమాట అంటుందని ఏంటనీ అనుకోలేదు. తీరా తన చెవులకు వాడి ములుకుల్లాంటి ఆ మాటలు తగిలేప్పటికి, ఎదురాడేందుకు పిరికిపడిపోతున్నాడు. అయినా కూడా ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు.
‘‘నోరు మెదపకు.. నేనింకేమీ వినదలుచుకోలేదు. మరొక్కమాట అన్నావా, ఈ ఈ డేరాలోనే నీకు సమాధి జరుగుతుంది. నీ మాత్రం మానాభిమానాలూ, రోషం లేని దాన్నననుకున్నావా?... ఎటూకాకుండా చెడిపోతావని దయతలిచాను. ఆడముండలాగు దుమ్మెత్తిపోసేందుకు తప్ప, యుద్ధరంగానికి పనికొచ్చే శౌర్యం నీలో లేదని తేలిపోయింది. ఈ యుద్ధం నీవల్ల కాకపోతే, నేను సాగిస్తాను.. కాని నాకెందుకొచ్చిన బెడద! నువ్వూ ఆక్టోవియన్ కట్ట కట్టుకొని సముద్రంలోకి దూకండి. నేను నా రాజ్యానికి తిరిగి వెళ్తాను. అక్కడికీ సేనలు వచ్చినవా, వాటి భరతం పడతాను!’’ అన్నదామె.
‘‘ఈ ఆడముండల మాట వినబట్టి కదా నాకీ దుర్గతి పట్టింది? నౌకాయుద్ధమనేదానికి పురెక్కించింది నీవు కాదా? నీవు చెవుల్లో గూడు కట్టుకొని నన్ను ఉద్రిక్తపరిచి’’
‘‘నేనేమీ వినదలుచుకోలేదు. నీ తప్పుల్ని నీవు భరించలేక, ఇతరులమీదికి తోసి, తృప్తిపడాలని చూస్తున్న నీ పిరికితనానికి జాలి కలుగుతోంది. అందుకనే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను’’
‘‘క్లియోపాత్రా! నీవు నన్ను అవమానిస్తున్నావు!’’ అని ఏంటనీ హెచ్చరించాడు.
‘‘నిన్ను చంపలేదు- అందుకు సంతోషించు. నన్ను రెచ్చగొట్టి భర్త ప్రాణాల్ని తీసిన ఇల్లాలుగా, పరమ పాతకిగా తయారయే అవకాశాన్ని నాకు కలిగించకు’’ అన్నదామె.
‘‘నీవు కులటవు! జారిణివి! మహామారివి!.. అందుకనే ఈ ప్రపంచానే్న దుమ్ము చేసేందుకు పథకాన్ని వేసి, నన్ను ప్రోత్సహించావ్!
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు