డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
****

కళ్లజోడు అద్దంలోంచి కర్నల్ ఆర్య అతడి కళ్లవైపు చూశాడు. సందీప్‌లో ఒణుకు వచ్చినట్లయింది. కర్నల్ కఠోరంగా జవాబు చెప్పాడు. ‘‘సౌందర్యం, సత్యం, మానవత్వం, ఓ వీర సైనికుడికి కూడా అధికార పీఠానికి ఇవే అపాయకరమైనవి. మనం అందరం ఆ అధికార పీఠం చేతిలో కీలుబొమ్మలం. అందువలన ఈ కళ్లజోళ్లను ధరించాలని ఆజ్ఞ జారీ అయింది. ఆ.. అసలు వీటివలన లాభం మాలాంటి ఆర్మీ ఆఫీసర్లకే. ఎప్పుడు పశ్చాత్తాపం, గ్లాని అనే గంపను నెత్తిమీద మోస్తూ బాధపడే మీలాంటి వారికోసమే . ఇదేమిటి? అని ఆశ్చర్యపడల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నీవు రాంచీలో పోస్టింగ్ సమయంలో ఆదివాసీల జీవితాలని అతి దగ్గరగా చూసే ఉంటావు. కొన్ని ఆదిమ జాతులవారు ఆత్మని శరీరం బయట పెట్టవచ్చని నమ్ముతారు. వాళ్లలోని వీరులు యుద్ధ్భూమికి వెళ్లేటప్పుడు ఆత్మని తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉంచి బయలుదేరుతారు. ఇట్లా అందరు చేయలేరు. అందువలన ఈ కళ్లజోళ్లు ఇవ్వబడ్డాయి. వీటిని ధరించగానే మీ ఆత్మలు మీ అంతఃకరణ శరీరం నుండి దూరం అయిపోతాయి. కళ్లజోడు తీసివేయగానే మీ ఆత్మ మీ దగ్గరికి వచ్చేస్తుంది’’.
‘‘కాని అకస్మాత్తుగా ఈ కళ్లజోళ్ల అవసరం ఎందుకు వచ్చింది’’.
‘‘ఎందుకంటే మూడు నెలల్లో నేను నిన్ను పంపించే ఆపరేషన్‌లో అసలు ఈ కళ్లజోడు లేకుండా సక్సెస్ చేయలేవు. ఈ కళ్లజోడు చమత్కారం ఏమిటో తెలుసా? దీన్ని పెట్టుకోగానే ఎముకలు- మాంసం ఉన్న రోబోట్‌లా మారిపోతారు. ఈనాడు ఈ కళ్లజోడు ధరించిన వాళ్లందరు సఫలీకృతులయ్యారు. నేతలు, మంత్రులు, కార్పొరేట్ బిజినెస్ టైకూన్స్ ఈ కళ్లజోళ్లను పెట్టుకుంటారు’’.
ఒక నిర్ణయం తీసుకున్నవాడిలా దృఢ స్వరంతో అన్నాడు సందీప్. ‘‘నేను హింస పక్షపాతిని కాను. మానవతా విలువలను మింగేసే హింస అంటే నాకు ఏ మాత్రం ఇష్టంలేదు.
కర్నల్ సందీప్ వీపు తట్టుతూ భావుకతతో అన్నాడు- ‘‘నీవు డిసిప్లిన్‌కి విరుద్ధంగా నడుస్తున్నావని నీమీద యాక్షన్ తీసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రవాహానికి విరుద్ధంగా ఈదకు. ఆజ్ఞను పాటించాలి అంతే. దాన్ని ఔన్నత్యాన్ని గురించి ఆలోచించకు. అసలు మనం ఏం చేయగలం? ఏదైనా చేయాలంటే ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వానికి శక్తిమీద నమ్మకం ఉంది. శక్తి రైఫిల్ మీద. మనిషి ఎవరి కన్‌సర్న్ కాదు. అందువలన వ్యక్తి మనస్సు, వ్యక్తి స్వాతంత్య్రానికి ఈ సైనిక రంగంలో ఏ మాత్రం స్పేస్ లేదు’.
సందీప్‌కి ఎంతో దుఃఖం కలిగింది. తన కాంప్‌లోకి వచ్చేశాడు. తన క్రోధాన్ని ఆక్రోశాన్ని, బాధను తగ్గించుకోవడానికి అతడు గోడలమీద పిడికిలితో గుద్దాడు. దిండ్లను కొట్టాడు. కాటేజ్ బయట ఉన్న కుండీలను కాళ్లతో తన్నాడు. కాని ఆ కోపం పోతేకదా! ఈ బాధ, కోపం, ఆక్రోశాలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాని తను పరిస్థితులను ఎదిరిస్తాడు. గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనలో అపారమైన శక్తిని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.
రాత్రి సందీప్ అన్నం తినలేదు. ఎన్నో రోజుల తరువాత తన దుఃఖాన్ని, క్రోధాన్ని, నిస్సహాయతను, నిరాశ నిస్పృహలను కాగితంపై పెట్టడానికి ప్రయత్నించాడు. మొదట తన తమ్ముడికి ఉత్తరం రాశాడు.
ప్రియమైన సిద్ధార్థా,
ప్రభుత్వం ఒక ఆజ్ఞను జారీ చేసింది. నేను భావుడుని, నాలో ఒక కావ్య జగత్తు ఉంది. ఎక్కువగా ఆలోచిస్తాను. అందువలన నా ఆత్మను శరీరం నుండి వేరుచేయాలి. నేను అందరిని ఎదిరించి ఏ విధంగా ఆర్మీలో వచ్చానో నీకు తెలుసు. నాలో మొదటినుండి నేను మనిషినని, భావుకుడినని అన్న భావన్నా వదిలివేయడానికా? అసలు ఇకముందు ముందు ఆర్మీ నా చేత ఎంత అమానవీయమైన పనులు చేయిస్తోందో కదా అని భయం వేస్తోంది. రాబోయే కాలం నాకు ఎంతో గడ్డుకాలం. అందుకే నాలోని సంవేదలన్నింటికీ ఆఫీమ్ తినిపించి నిద్రపుచ్చాలి. నా ఆత్మను చంపుకోవాలి. అసలు నాలో ఉండే ఆర్ద్రత, దయా దాక్షిణ్యాలను రూపుమాపెయ్యాలి. అసలు ఇక మానవుడిగా బతకకూడదు. దానవుడినైపోవాలి. ఎంత ఘోరం? చూస్తూ చూస్తూ ఉంటే ప్రపంచం మారిపోతోంది. దానికి కురూపం వస్తోంది. కాని మనం ఏం చేయలేకపోతున్నాం. పోయిన నెల నేను ఒక ఇంగ్లీషు ఫిల్మ్‌ని చూశాను. ఆ సినిమా చూడగానే నేను దిగ్భ్రాంతి చెందాను. అయినా ఇది కేవలం కథే కదా అని సరిపెట్టుకున్నాను. కాని కథలు కూడా నిజం అవుతాయి.
ఆ సినిమాలో ఒక కార్పొరేట్ కంపెనీ ఇంజనీర్ చేత ఒక ఎగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటుంది. ఈ ఎగ్రిమెంట్ ప్రకారం ఇంజనీర్ కంపెనీ కోసం ఒక విలువైన యంత్రాన్ని తయారుచేయాలి. ఈ మిషన్‌వలన కంపెనీకి బోలెడంత లాభం రావాలి. ఇంజనీర్ తయారుచేసిన యంత్రానికి ఎంత అడిగితే అంత ధనం ఇవ్వడానికి తయారుగా వుంది. కాని ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటంటే ఇంజనీరుకి మెదడు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఈ యంత్రానికి సంబంధించిన మెమరీ చిప్‌ని మైండ్‌లోంచి తీసేస్తారు. ఆ ఇంజనీరు మరే కంపెనీ కోసం ఇటువంటి మిషన్ ఇక చేయలేడు. ఇంజనీరు సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాడు. అతని కళ్ళ ఎదురుకుండా కంపెనీ తొమ్మిది అంకెలలో ఇస్తానన్న చెక్ కదలాడసాగింది. డబ్బే డబ్బు.. ఇంత ధనం.. అతడి కళ్ళు మిరుమిట్లుగొలిపాయి. ఇంజనీరు ఎగ్రిమెంటు పైన సైను చేశాడు. ఇదీ.. యుగసత్యం. సర్కార్ తన లాభం చూసుకుంటుంది. కంపెనీలు తమ లాభాలు, సామాన్య మానవుడికోసం ఎవరూ ఆలోచించరు.
ఇంకాఉంది

టి.సి.వసంత