డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

తనమీద తనకే అసహ్యం వేసింది. అసలు తను మనిషిగా ప్రవర్తించడం లేదు అని అతడికి అనిపించింది.
ఆ రాత్రి అతడికి నిద్రపట్టలేదు. ఓ భగవంతుడా సత్యం చెప్పగల శక్తి నాకివ్వు అని అతడు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు.
మరునాడు సాయంత్రం ఆఫీసర్ దగ్గరికి వెళ్లాడు- ‘సర్! మనం జమీల్ కుటుంబాన్ని మరీ ఎక్కువగా టార్చర్ చేస్తున్నామా అని అనిపిస్తోంది. అసలు జమీల్ ఉగ్రవాదేనా? అన్న ప్రశ్న కాదు. మనం అసలు వాడు ఉగ్రవాదిగా ఎందుకు మారాడు? దీనిని గురించి ఆలోచించాలి. ఈ ఉగ్రవాదంతో యుద్ధం చేసేటప్పుడు మనం ఆకలి, పేదరికం, గుడ్డి నమ్మకాలు, అవిద్యలతో కూడా ముందు యుద్ధం చేయాలని అనిపించడం లేదా?
‘‘చాలు.. చాలు..’’ కర్నల్ ఆర్య పెద్దగా అరిచాడు. ఆర్య సందీప్‌తో మాట్లాడేటప్పుడు తనమీద కంట్రోలు తప్పడం బహుశా ఇదే మొదటిసారి. కళ్ళు ఎరుపెక్కాయి. కంఠంలో కఠోరత్వం వచ్చింది. గదిలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ‘జెంటిల్‌మన్ నీవు నిప్పులతో మండుతున్న ఆ కాశ్మీర్‌ని చూడలేదు. ఎక్కడ చూసినా మారణహోమం. బాంబుల వర్షం. చెల్లాచెదురుగా పడి వున్న మాంసపు ముక్కలు.
ఎక్కడ చూసినా కంపు. ఇదంతా మేము చూసాం. నీవు చూడలేదు. మేం అందరం ఈ భూమి కోసం రక్తం ధారపోసాం. అప్పుడు కదా కాశ్మీర్‌లో ఈ మాత్రం శాంతి ఉంది. ఇప్పుడిప్పుడే టూరిస్టులు వస్తున్నారు. పిల్లలు స్కూళ్లకి వెళ్తున్నారు. రాత్రి ఏడు ఎనిమిది గంటలకి కూడా రోడ్లమీద మనుష సంచారం కనిస్తోంది. రాష్ట్రీయ రైఫిల్స్‌లో నాలుగోసారి నా పోస్టింగ్ అయింది. ఇవాళ్టికి కూడా నా మొదటి పోస్టింగ్ జరిగినప్పుడు నేను చూసిన ఆ భయంకర దృశ్యాన్ని మరచిపోలేను. మేం అందరం జీపులో కూర్చున్నాం. మా ఎదురుకుండా మాదే మరో జీపు వుంది. అందులో నాతో పనిచేసే కాప్టెన్ అభిషేక్ కూడా ఉన్నాడు. ఒక్కసారిగా ముందు వున్న జీపుకి మంటలంటుకున్నాయి. ఆ ఉగ్రవాదులు భూమిమీద డైనమైట్లను పెట్టారు. ఆ రోజుల్లో మా దగ్గర ఆర్‌ఒపి (రోడ్ ఓపెనింగ్ పార్టీ) లాంటి సాధనాలు కూడా లేవు. ఇప్పుడు ఆర్మీ వాళ్లు కాన్వాయ్ వెళ్ళే ముందు రోప్ క్లియరెన్స్ ఇస్తారు. అంటే భూమిలో డైనమైట్లు లేవు అని వాళ్లు చెబుతారు. అప్పుడు కన్వాయ్ ముందుకు సాగుతుంది. మావాళ్లందరూ వీరగతిని పొందారు. సరే అదంతా పాత సంగతి అనుకో. కార్గిల్ యుద్ధంలో వీరగతిని పొందిన కాప్టెన్ అనుజ్‌ని అందరు మరచిపోయారు. ఈ క్రూరులు ఎంతో ఘోరాతిఘోరంగా ఆయనని చంపారో తెలుసా? ఆయన కనుగుడ్లను పీకేసారు. ఆయన శరీర భాగాలన్నింటిని ఖండ ఖండాలుగా నరికేశారు. మనం ఇక్కడికి నాగరికతను వృద్ధి చేయాలని, గొప్ప సమాజాన్ని నిర్మించాలని రాలేదు. మిలిటెంట్లని మట్టుపెట్టాలని, ఉగ్రవాదపు వేళ్లను పెరికిపారేయాలని మనలని ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఒక్క జిహాదీనైనా సరే వదిలిపెట్టామంటే మనలని ఎటూ వాడు చంపేస్తాడు. భవిష్యత్తులో ఎంతో ఘోరంగా ప్రవర్తిస్తాడు. అసలు మానత్వం గురించి ఆలోచించకు. ఒకవేళ ఆలోచించాలంటే మనం మన దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును ఏ రకంగా ఇవ్వగలుగుతామో అన్నదానిని గురించి ఆలోచించు’’.
‘‘కాని సర్! ఎవరికో పడాల్సిన శిక్ష మరెవడికో పడుతోంది’’ అనుకోకుండా మేజర్ అన్నాడు.
ఆర్.ఆర్.పోస్టింగ్‌లో ఈ విధంగా కమాండింగ్ ఆఫీసర్‌తో చర్చించడం కూడా ఆర్మీ నియమలకి విరుద్ధమే. కాని కర్నల్ ఆర్య సందీప్ మదిలో లేస్తున్న తుపానును పసిగట్టి అతడిని శాంతింపజేయాలని మరొకసారి ప్రయత్నం చేసాడు. ‘మేజర్ సందీప్! మనం ఇక్కడికి కరుణ, దయ, మానవత్వం, సహ అస్తిత్వం గురించిన పాఠాలు చదవడానికి కాని చెప్పడానికి కాని రాలేదు. మనం ఇక్కడ ఎంతగా భయం కలిగేటట్లుగా చేయాలంటే రాబోయే కాలంలో ఏ మనిషి చస్తే మిలిటెంటు కాకూడదు. నీవు ఈ విషయం గుర్తుపెట్టుకో. అప్పుడే నీవు మంచి ఆఫీసరువి కాగలుగుతావు. యుద్ధం- బౌద్ధం రెండు కలిసి నడవలేవు. యుద్ధం హింసకు ప్రతీక. బౌద్ధం శాంతికి ప్రతీక.
ఎంతో నిరాశా నిస్పృహలకు లోనైన మేజర్ నోటి వెంట ఒక ప్రశ్న వచ్చింది. సర్! ఎంతకాలం ఈ మిలిటెన్సీ నడుస్తుంది. ఇవాళ ప్రొద్దున నేను ఒక బానర్‌ని చూశాను. లష్కర్ తోయబా కత్తి హిందుస్తాన్, అమెరికా, ఇంగ్లండ్, రష్య, ఇజ్రాయల్‌ల జెండాలలో దిగి ఉంది. ఈ రక్తపాతం ఎన్నాళ్లు? ఎనే్నళ్లు?
కర్నల్ ఆర్య అవాక్కయ్యాడు. సందీప్ వేసిన ప్రశ్నలు అతడి గుండెల్లో గునపాలై గుచ్చుకున్నాయి. ఎన్నిసార్లు ఆర్.ఆర్. పోస్టింగ్ తీసుకుంటారు? వైవాహిక జీవితంలో గత 19 సంవత్సరాలలో 19 నెలలు కూడా భార్య దగ్గర శాంతిగా గడపలేకపోయాడు. అసలు పిల్లల ఆలనా పాలనా, ఆటలు పాటలు తను చూడనే లేదు. అతడి కళ్లల్లో మేఘాలు నిండుకున్నాయి. మనస్సు బరువెక్కింది. అయినా తనని తను కంట్రోలు చేసుకుంటూ ఒక నిర్ణయానికి కట్టుబడ్డ స్వరంతో ఆయన అన్నాడు- ‘‘చూడు, ఆర్మీ మిలిటెంట్లు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఎవడైతే అలసిపోయాడో వాడే యుద్ధ్భూమి నుండి తిరుగుముఖం పడతాడు. ఆర్మీ ఎంతో బలమైన శక్తి. ఆర్మీ ఎప్పటికి అలసిపోదు’’ కొంచెంసేపు మాటలాడడం మానేసి సిగరెట్ పొగ వదలడం మొదలుపెట్టాడు. తరువాత ‘‘మన మిలిటెన్సీ జన్మ అరవై సం.ల క్రిందది. కాని పాలస్తీనాని చూడు. ఇంకా ఈరోజువరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు’’ అని అన్నాడు.

- ఇంకా ఉంది

టి.సి.వసంత