డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు.. 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
స్వార్థపరులు అమాయకులను బలి తీసుకుంటున్నారు.
సందీప్! భారుూజాన్ చనిపోయాక నీవు మా ఇంటికి వచ్చినపుడు నీ ముఖంలో సూర్యకిరణాలను చూసాను. అప్పుడు నా మనస్సు నిన్ను హంతకుడని ఒప్పుకోలేదు. అసలు ఇటువంటి పవిత్రమైన ఆత్మ, ఇతరుల సుఖ సంతోషాల కోసం ఇంతగా త్యాగం చేసే ఆత్మ హంతకురాలు కాదు, కానే కాదు. ససేమిరా కాదు. నా అంతఃకరణ పదే పదే ఇదే చెబుతోంది.
ప్చ్! ఆనాడే నేను ఈ సత్యాన్ని తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. ఇక మన పెళ్లి జరగడం అసంభవం.
ఉఫ్! సందీప్ నిన్ను ఆనాడే అర్థం చేసుకుని ఉంటే. నీ లయ, తాళాలతో, సంగీతంతో పాటు నేను మమేకం అయిపోతే ఎంత బాగుండేది. జీవిత పరమార్థం తెలుసుకుని ఉండేదాన్ని. ఈ రోజు నా కలలు కల్లలయ్యాయి. నా దురదృష్టం. చంద్రుడిని నేను పొందలేకపోయాను. నా కుటుంబాన్ని మొదలే పోగొట్టుకున్నాను. ముగ్గురి శవాల బరువును మోసాను. నా శరీరం అపవిత్రమైపోయింది. మీకు నన్ను నేను సమర్పించుకునే అదృష్టం నాకు లేదు. నా లోపల అంతటా శూన్యం. భయంకరమైన శూన్యం. సుఖ దుఃఖాలు లేవు, కలలు లేవు, అలలు లేవు, ఏ ఉద్వేగం లేదు, ఏ గతి లేదు. అసలు అంతటా చీకటి శూన్యం... అన్ని ఉద్వేగాలు చచ్చిపోయాయి. ఏవేవో కలలు కన్నాను. కాని ఏ కల పండలేదు. ఏనాటికి వసంతం రాని ఎడారి బతుకు నాది.
అందుకే.. ఇక ఈ మట్టిలో కలిసిపోవాలి.
అసలు నీవు ఎవరో అర్థం కావడంలేదు. ఖుదా (్భగవంతుడు) రూపంలో నువ్వా! లేక నీ రూపంలో ఖుదా వచ్చాడా? సరే.. ఏమైనా ఇది నా ఆఖరి ఉత్తరం. నన్ను కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. మనం కలిసి ఉన్న ఆ కొన్ని క్షణాలు నేను ఏనాటికి మరచిపోను. ఇదే మన ఇద్దరి కథ. ఇదే మన సంపద. ఇదే మన జీవనోద్యానంలో కొంచెం సేపు వచ్చిన పరిమళం.
-వీడ్కోలు స్వీకరించు
నీ రుబీనా
ఉష్! జీవితం! జీవిత పుస్తకంలోని ఉదాశీనం అయిన పుటలు.. అసలు జీవితం అంటే ఏమిటి? కేవలం స్మృతుల యాత్రా? కొన్ని ఉద్వేగాలా? బతికే క్షణాలా! దుఃఖపూరితమైన కథా? జీవనం లేని క్షణాలా? ఊహు కాదు.. జీవితం వీటన్నింటికన్నా పైమెట్టులో వుంది. సందీప్ కళ్లు మూసుకుని టేబుల్‌పై తల పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. తను జీవితాన్ని, మువ్వనె్నల జెండాని అందంగా అలంకరించాలనుకున్నాడు. ఈ రెండింటికి వసంతాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ ఏదీ జరగలేదు. మరి తప్పు ఎవరిది? అసలు పొరపాటు ఎక్కడ జరిగింది? అసలు జీవితాన్ని అర్థం చేసుకోవడంలోనే తను పొరపాటు చేసాడా? లేక రుబీనాని తన ఆలోచనలలో, కలలో తీసుకువచ్చి తప్పు చేసాడా? కాని తను ఒప్పుకోడు. రుబీనా తనంతట తనే తన ఆలోచనలలోకి, కలలోకి వచ్చింది. అసలు తను రుబీనాను పూర్తిగా అర్థం చేసుకున్నాడని ఘంటాపదంగా చెప్పగలడా? ఆ గజళ్ల పుస్తకంలోని ప్రతీ పుటని తను చదవగలిగాడా? ఉహూ.. కాని ఒకటి మాత్రం తెలుసుకున్నాడు. తన కన్నా రుబీనా ఎన్నో అడుగులు ముందు ఉంది. ఇంకా తెలియనిది ఏదో ఉంది కాని అంత ఎత్తుదాకా తను చేరలేడు. ఆమె తన దుర్గతి గురించి పూర్తిగా ఎక్కడ రాసింది. ఉహు రాయలేదు. సగం రాసింది. కానీ సగం గుప్పిట్లో పెట్టుకుంది. తన స్నేహితుడు ఆర్మీ ఆఫీసరు మేజర్ అమర్ ప్రతాప్ సింహ్ రుబీనా ఒక వారం క్రితం అనైతిక సంతానానికి జన్మనిచ్చింది, పిల్లాడు పుట్టాడు అని చెప్పగానే పిడుగు పడ్డట్లయింది.
సందీప్ కళ్ళు దించుకుని తల వంచుకుని కూర్చున్నాడు. రుబీనా కళ్ళని తను ఏనాడు మరచిపోలేదు. మొదటిసారి ఆమె కళ్ళలోకి చూసినప్పుడు, నీ సోదరుడు మిలిటెంట్ అయ్యాడని తను చెప్పగానే ఆ కళ్ళల్లో భయం, బాధ తను చూశాడు. అసలు సృష్టిలోని వేదన అంతా ఆ కళ్ళల్లో ఇమిడి పోయిందా అని అనిపించింది. ఆ కళ్ళని చూసి తను తట్టుకోలేకపోయాడు.
ఉఫ్! భగవంతుడా!
ఒక్కసారి పిడుగు నెత్తిమీద పడ్డది. కాని తాను ధైర్యాన్ని కోల్పోయాడు. రుబీనా తనకు జీవితంపైన ఆశ లేదని ఎన్ని వేల సార్లు రాసినా తను మాత్రం తనకి రుబీనాకి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చస్తే తెంపడు. ఆమెతోటే తన జీవితం ముడిపడి ఉంది. రుబీనా పిల్లవాడిని తను స్వీకరిస్తాడు. వాడికి తను తండ్రి అవుతాడు. వాడి ఆలనా పాలనా చూస్తాడు. తన తల్లి నాయనమ్మ అవుతుంది. ఆవిడ ఆనందానికి ఇక హద్దులు ఉండవు. కాని ముందు తను రుబీనా కోసం చట్టంతో యుద్ధం చేస్తాడు. రుబీనాని జైలు నుండి విడుదల చేయిస్తాడు. ఇదే తన ధ్యేయం.

సమాప్తం

టి.సి.వసంత