డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ ప్రయాణం 30 ఏళ్ళ క్రితం జరగాల్సింది’’ అన్నాడు తనే తిరిగి. వౌనం వహించాను. అన్నయ్య వంక చూచాను. అన్నయ్యకి కూడా కొంచెం బాధగానే ఉంది. కాని, ఎప్పుడూలాగానే బయటపడడు.
నాకు మా అన్నయ్యలతో ఉన్న అనుబంధం అందరి ఆడ పిల్లల లాంటిదీ కాదు. అందరి ఆడపిల్లలలా నా జీవితం సాగలేదు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం, సొంత కాపురం లాంటి సామాన్యమైన అనుభవాలు నాదాకా రాలేదు.
ఒక్కసారి ఆలోచనలు ఈగల్లా చుట్టుముట్టాయి. కాని, వాటికి లొంగిపోవడం నాకిష్టంలేదు. తలను విదుల్చుకున్నాను. మూగిన ఈగలు చెయ్యతో విసరగానే, ఎగిరిపోయినంత సులువుగా నా ఆలోచనలు పోవు. కాని నేను కూడా, నా ఆలోచనలంత మొండిదానినే. చివరకు నేనే గెలిచాను. అన్నయ్య వంక చూస్తూ అన్నాను.
‘‘మందులు వేసుకోవడం మర్చిపోకు!’’’
నవ్వాడు. ‘‘నేను మరచిపోయినా మీ వదిన మరచిపోదులే! భోజనం కంటే మందులే ప్రేమగా ఇస్తుంది’’ నవ్వుతూ అన్నాడు.
నేను నవ్వాను. మా వదిన మహా మంచిది. కాని, ఆవిడకు వంట చేయడం అంటే మాత్రం మహా బద్ధకం. ‘‘పది నిమిషాలలో తిని, పావు గంటలో ఆరగించుకునే భోజనానికి ఎందుకింత శ్రమపడడం’’ అనేది ఆవిడ వాదన.
‘‘అదీ నిజమే! కాని ఆ పది నిమిషాల పనీ చేయకపోతే ప్రాణం నిలవదే’’ అంటాడు అన్నయ్య.
వదిన ఎంత వండకపోయినా, అన్నయ్య ఎంత వెటకారం చేసినా, ఇద్దరినీ డాక్టర్లు బరువు తగ్గమనే చెప్తాడు. అసలు మా వదినకు అంత బద్ధకం కలగడానికి కారణం మా అమ్మే. మా వదిన మా మామయ్య కూతురే! చిన్నప్పుడే తల్లి పోవడం, మా అన్నయ్యకు చాలా చిన్నతనంలోనే పెళ్లి చేయడం జరిగింది. అందుకని మా వదినను చిన్నప్పుడే మా ఇంటికి తీసుకువచ్చింది మా అమ్మ. కోడలయినా కూడా తల్లిలేని పిల్ల అనో, స్వంత మేనకోడలు అనో చాలా గారంగా చూసేది, స్వంత కూతురిలా!
మా అన్నయ్య, వదిన, మేము అందరం ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. మా అమ్మ ఇప్పటికీ తనే వంట చేస్తుంది. దాంతో మా వదినకు అసలు వంట అలవాటు కాలేదు.
మా అన్నయ్య మా అమ్మతో పోట్లాడుతూనే ఉండేవాడు. మా ఆవిడకు బొత్తిగా పని రాకుండా చేస్తున్నావు అని, పోనీలేరా, అవసరం మీద పడితే అదే వస్తుంది అనేది.
వెనక నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఎయిర్ ఇండియా ప్రయాణీకులకి సెక్యూరిటీ చెక్ పూర్తిచేయమని.
అన్నయ్య చెయ్యి నొక్కి వదిలాడు. కంగారు పడకు. క్షేమంగా వెళ్లిరా! అన్నయ్య డెబ్భైకు దగ్గర. నేను యాభైకి దగ్గర. నేను అన్నయ్య దృష్టిలో చిన్నపిల్లనే!
మాది పెద్ద ఫ్యామిలీ. అన్నయ్య మొదటివాడు. నేను ఆఖరు అవడంతో, మా ఇద్దరికీ వయసుతేడా చాలా ఉంది. తక్కిన అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నా, అన్నయ్య మాత్రం మా ఊళ్ళోనే ఉండిపోయాడు. దానితో నాన్నగారి తరువాత, నాన్నగారి రోల్ అందరి దృష్టిలో.
వెనక ఆస్థులు ఎక్కువ లేకుండా, ఉద్యోగం చేసి కుటుంబ పోషణ, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళు అంటే మాటలు కాదు ఏ కాలంలోనూ.
అన్నయ్య ఆసరా నాన్నకు బలంగానే ఉండేది. నాన్న ఎప్పుడూ ఒక్కటీ అడిగేవారు కాదు, చెప్పేవారు కాదు. కాని అన్నయ్య చాలా భాగం చూసుకునేవాడని నా అంచనా!
నేను కూడా కాలేజీకి రాగానే, ఆ ఇంకేముంది- నాలుగైదేళ్ళలో చదువుల బెడద వదిలిపోతుంది అనేవాడు! ‘‘వీళ్ల బెడద వదిలేవేళకు నీ కొడుకు అందుకుంటాడు’’ అనేది అమ్మ!
దురదృష్టవశాత్తు, నా బెడద వాళ్ళకు నాలుగైదేళ్లలో వదలలేదు. జీవితాంతం చుట్టుకున్నట్లైంది. అందుకు వాళ్ళు ఎవరూ బరువు అని అనుకోకపోయినా, బాధపడ్డారు.
ఎయిర్‌పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని, సూచన ప్రకారం గేటువైపు నడిచాను. గేటులోకి వెళ్లబోయి వెనక్కి తిరిగాను, అన్నయ్య అక్కడే ఉన్నాడు చెయ్యి ఊపుతూ!
ఎందుకో ధైర్యం అనిపించింది. అన్నయ్య ఎప్పుడూ నా వెనక అలా నుంచునే ఉంటాడు. చిన్నప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూనూ! తొలిసారిగా స్కూల్‌లో చేరినపుడు, కాలేజీలో దింపినప్పుడూ, అత్తారింటికి వెళ్లేటప్పుడూ, వౌళికోసం హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడూ, ఆఖరికి నేను పుట్టేముందు అమ్మకు మంచం వేసింది కూడా అన్నయ్యే! చకచకా అడుగులు వేసాను. కళ్లు ఎందుకో చమ్మగిల్లాయి!
నాకు, కళ్లల్లో నీళ్లు చాలా అరుదుగా వస్తాయి. బహుశా, చిన్నతనంలోనే వర్షించి, వర్షించి అలసిపోబట్టేమో!
మరికొద్దిమంది బాగా పెద్దవాళ్ళున్నారు. పిల్లల దగ్గరకు కాబోలు. ఈ వయసులో స్వంత దేశం విడిచి పిల్లలకోసం, పరాయి దేశం వెళ్లి సెటిల్ అవ్వాల్సి రావటం మామూలు విషయం కాదు. ఏళ్ళ తరబడి తమదీ అనుకున్నది వదలి, పిల్లల ఇళ్ళల్లో ఉండడం కూడా కష్టమే! స్నేహితులు, పరిచయస్తులు ఉండరు.. చాలామందికి భాష రాదు. అయినా తప్పదు! వార్థక్యంలో తోడు కావాలంటే పిల్లల పంచన చేరాల్సిందే! అందుకు ఇష్టపడే పిల్లలు ఉంటే!

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి