డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్న తల ఎత్తి అన్నయ్య వంక చూచాడు కాఫీ అందుకుంటూ.
‘‘కల్యాణి దిగులుపడుతోంది. భయపడుతోంది. నాకు ఇది సరైన పనిగా తోచడంలేదు’’ అన్నాడు. ‘‘కాని, రఘు, అతని తల్లిదండ్రులు..!’’ అనబోయారు నాన్న.
నాన్న మాటకు అడ్డువస్తూ అన్నాడు. ‘‘నిజమే! నాకు తెలుసు కాని, వాళ్ళకు కల్యాణి సందిగ్ధం అర్థం కావడంలేదు. దాని భయాలు, దాని సెంటిమెంట్స్ అర్థం కావు’’ అన్నాడు అన్నయ్య.
‘‘అవుననుకో..’’
‘‘ఇంకేం ఆలోచించకు నాన్న- అతనెక్కడో అమెరికాలో కూచున్నాడు. ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. మన ముందున్నది మన కల్యాణి. దాని బాగోగులు దాని ఇష్టాయిష్టాలు మనం చూడాలి. వాటికీ ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అన్నాడు అన్నయ్య స్థిరంగా.
‘‘అది కాదురా! రేపేదయినా ఈ సాకు పట్టుకు, గొడవలు లేవదీస్తే.. అంతా దాని కాపురం మీద ప్రభావం చూపిస్తే’’ అన్నారు. నాన్నకు, లోపల చాలా సందిగ్దంగా ఉంది.
‘‘కాని నాన్న, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం- ఎప్పుడో ఏదయినా జరగొచ్చని-జరుగుతుందో లేదో తెలియని వాటిని గురించి ఆలోచిస్తూ ఇవాళ పరిస్థితులకు లొంగిపోలేం కదా!’’ అన్నాడు.
నాన్న మరేం మాట్లాడలేదు. అమ్మ వౌనంగానే ఉండిపోయింది.
మామ్మ మాత్రం నాన్న పక్కన కూర్చుని ‘‘ఒరేయ్ అబ్బాయ్- చేతికందిన కొడుకు చెప్తున్నాడు. వాటి మాట విను. అడ్డుచెప్పకు’’ అంది సమర్థిస్తున్న ధోరణిలో.
ఆ విధంగా అందరి అలోచనా ప్రవాహానికి అడ్డువేశాడు అన్నయ్య. నా ఉద్దేశ్యంలో రాత్రి వదిన మా అన్నయ్యకి అన్నీ చెప్పి ఉంటుంది- ముఖ్యంగా నా ఆలోచనా స్రవంతిని గూర్చి.
ఆ తరువాత రెండు రోజులు ఎవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక కాలం గడవటం ఒక్కటే మిగిలింది.
అమ్మ నాన్నతో చెప్పింది. రఘుకు, వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు వ్రాయమని.
‘‘కల్యాణి చాలా భయపడుతున్నందువలన, మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నందువలన మీరు కోరిన విధంగా జరిపించలేకపోయినందుకు మన్నించమని’’ రాశారు నాన్న. ఆ ఉత్తరం అలా రాయడం నాకేమాత్రం నచ్చలేదు. ‘‘మన్నించమని అడగాల్సింది వాళ్ళందరూ. కాని నాన్న వాళ్ళను అడగడమేమిటి?’’
అదే అన్నాను నాన్నతో- ‘‘నీకు తెలియదులే కల్యాణీ, ఇలాగే రాయాలి’’ అన్నారు.
ఆ ఉత్తరాలకు ఏం సమాధానం రాలేదు. వస్తుందని కూడా ఇంట్లో ఎవరూ అనుకోలేదు.
రఘు మాత్రం రాశాడు. నాకు రాసిన ఉత్తరంలో ‘‘నువ్వు ఇంత పిరికిదానివి అనుకోలేదు. ఐయామ్ వెరీ డిస్‌అపాయింటెట్’’ అంటూ. ఆ తరువాత రఘు నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కాని, నా ప్రెగ్నెన్సీ గురించి కాని, ఆరోగ్యం గురించి మాత్రం రాసేవాడు కాదు. నాకు మాత్రం అతనితో ఎంతో పంచుకోవాలని అనిపించేది. రోజు రోజు నాలో ఉన్న ఆలోచనలు, శరీరంలో కలిగే మార్పులు, ఉయ్యాలల్లా ఊగిసలాడే మూడ్స్, ఒక్కటేమిటి, అన్నీ రఘుకి చెప్పాలనిపించేది. కాని ఏ ఒక్కటీ మాత్రం ఉత్తరాల్లో రాసేదాన్ని కాదు. అతనికి తెలుసుకోవాలని లేనప్పుడు నేనెందుకు చెప్పడం అనిపించేది.
నా పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నదానికంటే మంచి మార్కులతో పాస్ అయ్యాను. కాని ఆ ఏడాదంతా వెనుకబడిపోతున్నాను. మామ్మ ససేమిరా కాలేజ్‌కి వెళ్ళకూడదు అంది.
ఒక్కసారి మాత్రం నా చదువు ఈ ఏడాదంతా ఆగిపోయింది అని రాశాను. అప్పుడు మాత్రం అన్నాడు, నువ్వే అంత మూర్ఖంగా, పిరికిగా ఉండకపోతే నీ చదువుకు అంతరాయం కలిగేది కాదు అని రాశాడు. అంతే ఆ తరువాత ఏమీ రాయలేదు. ఒకసారి నిర్ణయం జరిగాక కూడా అతను సపోర్టివ్‌గా లేడు. కొంచెం కోపం అనిపించింది. అంతేకాకుండా రఘు తల్లిదండ్రులు కూడా ఎటువంటి శ్రద్ధ కనబరచలేదు.
కాని నాకు మాత్రం మా ఇంట్లో జరిగినంత గారం ఎవ్వరికీ, ఎప్పుడూ జరగదేమో!
మా మామ్మ ఆలోచనలు సమయం 24 గంటలు నాపైనే!
పొద్దున్నా, రాత్రి, నేను భోజనం చేస్తున్నంతసేపు నా పక్కనే కూచునేది. కొసరి కొసరి తినిపించేది. సాయంత్రం అయ్యేసరికి రోజూ, ఇంటి దగ్గరలో వున్న చిన్న ఆంజనేయస్వామి గుడి చుట్టూ తనతోపాటు నన్ను ప్రదక్షిణలు చేయించేది. ‘రోజూ ఏమిటి మామ్మా’ అంటే- దేవుడికోసం కాదే, నీ వంటికి మంచి వ్యాయామం అనేది. మామ్మకు ఎవరికి ఏ మాట చెప్పి వప్పించాలో క్షుణ్ణంగా తెలుసు. కడుపుతో ఉన్నప్పుడు మనసు ఎంత వంటరితనం, భయం అనుభవిస్తుందో ఆవిడకు తెలుసు. మనసు ఉల్లాసంగా ఉంచడం ఎంత ముఖ్యమో ఆవిడకు తెలుసు. ఆవిడకున్న పరిజ్ఞానానికి ఏ సైకాలజిస్ట్ పనికిరాడు.
నాకు చిన్నతనంనుంచి, పాటలు పాడటం సరదాయే- కాని ఎప్పుడూ స్కూల్ చదువులతో సాధ్యపడలేదు. ఇప్పుడు అనుకోకుండా మా ఇంటికి మూడిళ్ళ దూరంలో ఒక కొత్త కుటుంబం దిగింది. విజయవాడ మ్యూజికల్ కాలేజీలో లెక్చరర్‌గా చేరడానికి, ఆ విషయం మా మామ్మకు తెలిసింది. వెంటనే మా మనుమరాలికి సంగీతం నేర్పండి అంటూ ఏర్పాటు చేసేసింది.
ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమిటి మామ్మ అంటే-
‘‘ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు, ఇంతకంటే మంచి సమయం నీకు దొరకదు’’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. అలా మొదలయినా సంగీతం చాలా ఏళ్ళు కొనసాగుతూనే వచ్చింది’’.
మా మామ్మ నా మీద చూపించే గారాలు చూచి ఒకసారి మా అమ్మ అత్తగారితో అంది..
‘‘అరడజను మంది పిల్లలను కన్నాను. ఒక్కసారి కూడా ఇంత ప్రేమ చూపించలేదు నామీద’’ అంది నిష్ఠూరంగా.
‘‘నీకు గారాలు చేయడానికి నీ మొగుడు పక్కనే ఉన్నాడు. నా మనవడంటే దూరంగా ఉన్నాడు అందుకు’’ అని సమర్థించుకోవాలని చూసింది మామ్మ. కాని, మేమెరం అందుకు ఒప్పుకోలేదు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి