డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా మామ్మ నాకు మంచి మామ్మే గాని, మా అమ్మకు గట్టి అత్తగారు! మా నాన్న మా మామ్మకు ఒక్కడే కొడుకు. దాంతో ఆవిడ దృష్టి అంతా మా నాన్నమీదే! చివరి రోజు వరకు నాన్న భోజనాన్ని పర్యవేక్షణ చేస్తూనే ఉండేది. అమ్మ మనసులో ఏమనుకున్నా, మామ్మను బయటకు మాత్రం ఏమీ అనేది కాదు. నా ఉద్దేశ్యంలో అమ్మా, నాన్న పెళ్లి చేసుకున్న కొత్తలో నాన్నకు అమ్మ ఇచ్చిన మాట అయి ఉంటుంది.
కాని, మామ్మ మనసులో మనుమలు, మనుమరాళ్ళు అంటే అచంచలమైన ప్రేమ అని అందరకూ తెలుసు. ఎవరికైనా కొంచెం జ్వరం లాంటిది వచ్చినా సరే దేవుడి స్తోత్రాలన్నీ వల్లెవేస్తూ వాళ్ళ మంచం పక్కనే పగలూ రాత్రి కూర్చుని ఉండేది.
నా సంగీతం మొదలుపెట్టినప్పటినుంచి రోజూ నాతోపాటు పాఠానికి వచ్చేది. ఇంట్లో సాధన చేస్తే కాని ఊరుకునేది కాదు. ఈ విషయం ఒకసారి రఘుకు ఉత్తరంలో రాశాను. చాలా సంతోషంగా సమాధానం రాశాడు. నాకు మ్యూజిక్ అంటే ఆలా ఇష్టం. నిన్ను చూడటాని వచ్చినపుడు పెళ్లికిముందే అడుగుదామని అనుకున్నాను. తీరా నీ అందం చూశాక ఆ విషయం మర్చిపోయాను. అష్టపదులు నేర్చుకో అని చాలా చక్కని ఉత్తరం రాశాడు.
దానికి బదులుగా నేనూ ఉత్తరం రాశాను. కనీసం మీకు సంతోషం కలిగించే పని ఒక్కటైనా చేయగలిగానని.
మళ్లీ అతను సమాధానం రాశాడు. నన్ను సంతోషపెట్టే పనులు నువ్వు చాలా చేశావు. అందుకే ఈ పరిస్థితిలో ఇరుక్కుపోయావు. కాని నాకు సంతోషం కలిగించనిది నీ పిరికితనం ఒక్కటే అని రాశాడు.
ఎందుకో మనసు చివుక్కుమంది. నాది పిరికితనం అనుకోవడమే గాని, దానితోపాటు నాకు సెంటిమెంట్స్ కూడా ఉన్నాయని, వాటిని అతను గౌరవించాలని ఎందుకనుకోడు? మనసు నిశ్శబ్దంగా నిట్టూర్చింది.
ప్రతి సాయంత్రం మామ్మ వరండాలో కూర్చుని సుందరకాండ పారాయణ చేస్తూ ఉండేది. ఇలాగే ఇదివరలో చిన్నక్కకు పెళ్లి సంబంధం కుదరలేదని- రుక్మిణీ కల్యాణం పారాయణ చేసేది.
‘‘ఎందుకు మామ్మ రోజూ ఈ పారాయణ’’ అని అడిగాను.
‘‘కడుపుతో ఉన్నవాళ్ళు రోజూ సుందరకాండ వింటే హనుమంతుడంత ధీమంతుడు అయిన కొడుకు పుడతాడు’’ అంది.
‘‘అబ్బా, ఏమిటి అమ్మమ్మగారు! కళ్యాణికి ఒక కోతి లాంటి కొడుకు పుడితే మాత్రం నేను ఎత్తుకుని ముద్దులాడను’’ అంది మా వదిన.
నేను పక్కున నవ్వాను. వాళ్లందరి ధ్యేయం నన్ను నవ్విస్తూ సంతోషంగా ఉంచాలనే! నిజంగా మామ్మ అన్నట్లు, నా పూర్వ జన్మ పుణ్యాలేనేమో! ఇంత మంచి కుటుంబం నా వెనక ఉండటం.
‘‘ఏం మాటలే శాంత! చెంపలేసుకో’’ మామ్మ కోప్పడింది వదినను. ‘‘పుట్టబోయే మేనల్లుడిని కోతి అంటావా?’’ అంది మామ్మ.
మామ్మకు వినిపించే అంతగా గట్టిగా చెంపలు వేసుకుంది వదిన.
మామ్మను, వదినను ఇద్దరినీ చూచి నవ్వుతున్న నేను ‘‘ఒక్కసారిగా ఎవరో తట్టినట్లు ఆగిపోయాను. భయంగా పొట్టమీద చెయ్యి వేసుకున్నాను. నా మొహంలో కలవరపాటు చూచి, మామ్మ, వదిన ఇద్దరూ కంగారుపడ్డారు ఏమయిందంటూ.. కడుపులో ఏమిటో కదిలినట్లయింది మామ్మా’’ అన్నాను భయం భయంగా.
మామ్మ మొహంలో భయం చిరునవ్వుగా మారిపోయింది. ‘‘బిడ్డ కదులుతోందే అమ్మడు. వాడికి అత్త కోతి అన్నందుకు కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు’’ అంది.
వదిన కూడా నా పొట్టమీద చెయ్యి వేసి ‘సారీ’ అంది. అందరం నవ్వుకున్నాం.
మెల్లగా రోజులు గడుస్తున్నాయి. కనిపించిన ప్రతి పుస్తకం చదివేస్తున్నాను. అన్నయ్య బ్యాంకు నుంచి వస్తూ రామ్మోహన్ లైబ్రరీ నుండి శ్రద్ధగా బుక్స్ తెచ్చేవాడు. ఇంట్లో అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూనే ఉన్నారు. రోజు రోజుకు నా శరీరాకృతి మారుతోంది. రంగు మారుతోంది. ఎప్పుడూ కంటే నా ముఖం వెలిగిపోతోంది. కాని మనసులో మాత్రం ఏదో తెలియని ఉదాసీనత. ఎవరికో దూరమయిపోయానన్న భావన. రఘు దగ్గరనుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి, చాలా క్లుప్తంగా. కొత్తదేశం, కొత్త మనుషులు చాలా బిజీగా ఉండేవాడు. మనసు దేనికోసమో ఆరాటపడేది. రాత్రిపూట మంచంమీద పడుకుంటే ఎడతెగని ఆలోచనలు వదిలేవు కావు.
ఇన్ని ఉత్తరాలలోనూ రఘు ఎప్పుడూ ఈ ప్రెగ్నెన్సీ గురించి రాసేవాడు కాదు. అసలు ఆ విషయం తన ఆలోచనలలో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ నేను రోజులో మెలకువగా ఉన్నంత సేపు నా మనసంతా బేబీ చుట్టూ తిరుగుతూనే ఉండేది. అక్కడ, అసలు రోజులో ఒక్కసారయినా తను తండ్రి కాబోతున్న ఆలోచన రఘుకు వస్తుందా? తన మనసులో ఆలోచనలు, తన పాపాయి కదలికలూ అన్నీ రఘతో చెప్పుకోవాలని అనిపించేది. కాని అంతలోనే ఏదో కోపం వచ్చేది. తనకు పట్టనప్పుడు నేను మాత్రం ఎందుకు తాపత్రయపడాలని. నేను షేర్ చెయ్యను అనిపించేది. కాని అది కొద్ది క్షణాలు మాత్రమే!
మళ్లీ మనసు పుట్టని పాపాయి చుట్టూ, పరాయివాడిలా ఉండిపోయిన రఘు చుట్టూ తిరుగుతూనే ఉంది.
7వ మాసం రాగానే అమ్మ సీమంతం చేయాలని సంకల్పించింది. మా అత్తగారింటికి లెటర్ రాయించింది. వాళ్ళు ఇన్ని నెలలలో వాళ్ళకేమీ పట్టనట్లే ఉండిపోయారు. అది మాత్రం అమ్మని, నాన్నని బాధిస్తూనే ఉంది. మా అత్తగారు వస్తాననే రాశారు. అమ్మ, మామ్మ చాలా సంతోషించారు. ఆవిడ వచ్చినపుడు పెట్టేందుకు చీర కూడా కొని వుంచుకున్నారు. ఊళ్ళో తెలిసిన వాళ్ళందరినీ పేరంటానికి పిలిచింది. మామ్మ దగ్గర కూచుని పూల జడ వేయించింది. చేతి నిండా గాజులు వేయించింది. పెళ్లినాటి నగలన్నీ పెట్టుకున్నాను. సంపెంగ రంగు చీర కట్టుకుని, మామ్మ పాదాలకు దండం పెట్టాలని వంగాను.
‘‘అంతగా వంగకే తల్లీ, నా మునిమనుమడుకు నొప్పి చేస్తుంది’’ అంది గభాల్న ఆపుతూ!
నాకు కోపం వచ్చింది. ‘‘నన్ను ఆశీర్వదించకుండా ఇంకెవరికోసమో ఆరాటపడుతున్నావు. నాకంటే ఎక్కువయిపోయింది’’ అన్నాను చిరుకోపంతో. మామ్మ నా బుగ్గలు రాస్తూనే నేను ‘‘నీకు కొత్తగా ఆశీర్వదించేదేముంది! రోజూ ఆశీర్వదిస్తూనే ఉన్నాను’’ అంది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి